వరాహ మహా పురాణము
అధ్యాయము - 25
ప్రజాపాలుడు:
అహంకారాత్ కథం జజ్ఞే కార్తికేయో ద్విజోత్తమ,
ఏతన్మే సంశయం ఛిన్ధి పృచ్ఛతోవై మహామునే.
ప్రజాపాలుడు:
బ్రాహ్మణ ప్రవరా! మహామునీ! అహంకారము నుండి కార్తికేయుడు ఎట్లు జన్మించెను? అడుగు చున్నాను. నా సంశయమును తీర్పుము.
మహాతపుడు:
సర్వేషా మేవ తత్త్వానాం యః పరః పురుషః స్మృతః,
తస్మా దవ్యక్త ముత్పన్నం తత్త్వాది త్రివిధంతు తత్.
మహాతపుడు:
తత్త్వము లన్నింటికి చిట్ట చివరి దానిని పురుషు డందురు. ఆ పురుషుని నుండి అవ్యక్తము ఏర్పడినది. అది మూడు విధములైనది.
పురుషావ్యక్తయో ర్మధ్యే మహత్త్వం సమపద్యత,
స చాహంకార ఇత్యుక్తో యో మహాన్ సముదాహృతః
పురుషునకు అవ్యక్తమునకు నడుమ ‘మహత్తు’ అనునది యేర్పడినది. దానినే అహంకార మనియు నందురు.
పురుషో విష్ణు రిత్యుక్తః శివో వా నామతః స్మృతః,
అవ్యక్తంతు ఉమాదేవీ శ్రీర్వా పద్మనిభేక్షణా.
పురుషుడు విష్ణువు లేదా శివుడు. అవ్యక్తము పద్మముల వంటి కన్నులు లక్ష్మీ దేవి లేక ఉమాదేవి.
తత్సంయోగా దహంకారః సచ సేనాపతి ర్గుహః,
తస్యోత్పత్తిం ప్రవక్ష్యామి శృణు రాజన్ మహామతే.
వారిరువురి సంయోగము వలన అహంకారము పుట్టెను. అతడే సేనానియగు కుమారస్వామి. రాజా! బుద్ధిశాలీ! ఆతని పుట్టుకను వివరించి చెప్పెదను. వినుము.
ఆద్యో నారాయణోదేవ స్తస్మాద్ బ్రహ్మాతతోభవత్,
అతః స్వయంభువ శ్చాన్యే మరీచ్యాద్యార్క సంభవాః.
అందరకూ మూలము నారాయణ దేవుడు, అతని నుండి బ్రహ్మ పుట్టెను. అతని వలన స్వయంభు వులగు మరీచి మొదలగు బ్రహ్మలు పుట్టిరి. వారే సూర్యాదులకు కారణ మైనవారు.
తేష్వారభ్య సురా దైత్యా గంధర్వా మానుషాః ఖగాః
పశవః సర్వభూతాని సృష్టి రేషా ప్రకీర్తితా.
వారితో మొదలు కొని దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మనుష్యులు, పక్షులు, పశువులు, సర్వ భూతములు ఏర్పడెను. దీనినే సృష్టి యందురు.
సృష్ట్యాం విస్తారితాయాం తు దేవ దైత్యా మహాబలాః,
సాపత్న్యం భావ మాస్థాయ యుయుధు ర్విజిగీషనః
ఇట్లు సృష్టి క్రమక్రమముగా పెరిగి పోగా గొప్ప బలము గల దేవతలును, దానవులును ఒకరిపై నొకరు విరోధము పెట్టుకొని గెలువ వలయునను కోరికతో పోరాడిరి.
దైత్యానాం బలినః సన్తి నాయకా యుద్ధదుర్మదాః,
హిరణ్యకశిపుః పూర్వో హిరణ్యాక్షో మహాబలః,
విప్రచిత్తి ర్విచిత్తి శ్చ భీమాక్షః క్రౌంఛ ఏవచ.
ఏతేతిబలినః శూరా దేవసైన్యం మహామృధే,
అనారతం సితై ర్బాణౖ ర్జయంతేనుదినం మృధే.
దైత్యుల నాయకులు యుద్దమున మిక్కిలి పొగరు కలవారు, గొప్ప బలము కలవారుయై యుండిరి. అందు మొదటి వాడు హిరణ్య కశిపుడు. మహాబలుడగు హిరణ్యాక్షుడు, విప్రచిత్తి, విచిత్తి, భీమాక్షుడు, క్రౌంచుడు మొదలగు గొప్ప శక్తి కల శూరులు. మహా యుద్దమున ప్రతి దినము నిరంతరము పదునైన బాణములతో దేవ సేనను పరి మార్చు చుండిరి.
తేషాం పరాజయం దృష్ట్వా దేవానాంతు బృహస్పతిః,
ఉవాచ హీనం వః సైన్యం నాయకేన వినా సురాః
ఆ దేవతల ఓటమిని గాంచి బృహస్పతి యిట్లు పలికెను. దేవతలారా! నాయకుడు లేని మీ సేన హీనమై యున్నది.
ఏక నేంద్రేణ దివ్యంతు సైన్యం పాతుం న శక్యతే,
అతః సేనాపతిం కంచి దన్వేషయత మాచిరమ్.
ఒక్క యింద్రునితో ఈ దేవసేన నంతటిని రక్షింప నలవి కాదు. ఒక సేనానిని వెదకుడు. ఆలసింపకుడు.
ఏవముక్తాస్తతో దేవా జగ్ముర్లోకపితామహమ్,
సేనాపతిం చ నో దేహి వాక్యమూచుః ససంభ్రమమ్.
బృహస్పతి అట్లు పలుకగా నా దేవత లందఱు లోకముల కెల్లా తాతయగు బ్రహ్మ కడ కరిగి తొందర తనముతో ‘మాకు సేనాపతి నొసగుము’ అని పలికిరి.
తతో దధ్యౌ చతుర్వక్త్రః కిమేషాం క్రియతే మయా,
బ్రహ్మాథ చింతయామాస రుద్రం ప్రతి మనోగతమ్.
అంత నలువ వీరికి నేనేమి చేయుదునా! అని చింతించెను. అంత నతని మదిలో రుద్రుడు మెదలెను.
తతో దేవాః సగన్ధర్వా ఋషయః సిద్ధచారణాః,
బ్రహ్మాణం పురతః కృత్వా జగ్ముః కైలాస పర్వతమ్.
అంత దేవతలు, గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చారణులు, బ్రహ్మను ముందిడుకొని కైలాస పర్వతమున కరిగిరి.
తత్ర దృష్ట్వా మహాదేవం శివం పశుపతిం విభుమ్,
తుష్టువు ర్వివిధైః స్తోత్రైః శక్రాద్యా స్త్రిదివౌకసః,
అందు మహాదేవుడు, శివుడు, పశుపతియు నగు ప్రభువును గాంచి వివిధ ములగు స్తోత్రములతో దేవేంద్రుడు మొదలగు దేవత లందఱు స్తుతించిరి.
దేవతలు:
నమామి సర్వే శరణార్థినో వయం మహేశ్వరం త్య్రంబకభూతభావనమ్,
ఉమాపతే విశ్వపతే మరుత్పతేజగత్పతే శంకర పాహి నః స్వయమ్.
దేవతలు:
మేమందరము మహేశ్వరుడు, ముక్కంటి, భూతపతి యగు శంకరుని శరణు గోరిన వారమై మ్రొక్కు చున్నాము. ఉమాపతీ! విశ్వపతీ! దేవపతీ! జగత్పతీ! శంకరా! మమ్ములను నీవే కాపాడుము.
జటకలాపాగ్రశశాంకదీధితి ప్రకాశితాశేష జగత్త్రయామల,
త్రిశూలపాణే పురుషోత్తమాచ్యుత ప్రపాహిదైత్యాచ్చ జగత్త్రయోదర.
త్రిశూల పాణీ! పురుషోత్తమా! అచ్యుతా! జటల గుంపు చివర నున్న చంద్రుని కాంతితో వెలుగొందు సమస్త జగములు కల దేవరా! నిర్మలా! మూడు లోకములు గర్భమున గల స్వామీ! దైత్యుల వలన మమ్ము రక్షింపుము.
త్వమాదిదేవః పురుషోత్తమో హరి ర్భవో మహేశస్త్రిపురాంతకో విభుః,
భగాక్షిహా దైత్యరిపుః పురాతనో ఋషధ్వజః పాహి సురోత్తమోత్తమ.
నీవు ఆది దేవుడవు, పురుషోత్త ముడవు, హరివి, భవుడవు, మహేశుడవు, త్రిపురాసురులను రూపు మాపిన వాడవు. విభుడవు, భగుని కన్నులు పెరికిన వాడవు. దితి కొడుకులను చంపిన వాడవు. పురాతనుడవు. వృషభ ధ్వజుడవు. ఉత్తములగు దేవతల కెల్లా ఉత్తముడవు. మమ్ము పాలింపుము.
పృథ్వ్యాదితత్త్వేషు భవాన్ ప్రతిష్ఠితో ధ్వని స్వరూపో గగనే విశేషతః,
వాయౌ ద్విధా తేజసి చ త్రిధా జలే చతుఃక్షితౌ పఞ్చగుణః ప్రపాహినః.
భూమి మొదలగు తత్త్వము లందు ఆయా గుణముల రూపమున నీవే నెలకొని యున్నావు. విశేషించి ఆకసమున ధ్వని స్వరూపుడవు నీవే. వాయువు నందు శబ్ద స్పర్శములను రెండు లక్షణములతో, అగ్ని యందు శబ్ద స్పర్శ రూపములను మూడు లక్షణములతో, నీటి యందు శబ్ద స్పర్శ రూప రసములను నాల్గు లక్షణములతో, భూమి యందు శబ్ద స్పర్శ రూప రస గంధములను అయిదు గుణములతో నీవే యున్నావు. అట్టి నీవు మమ్ము కాపాడుము.
అగ్ని స్వరూపోసి తరౌ తథోపలే సత్త్వస్వరూపోసి తథా జలేష్వపి,
తేజః స్వరూపో భగవాన్ మహేశ్వరః ప్రపాహి నో దైత్య గుణార్దితాన్ హర.
చెట్టులలో నీవు అగ్ని స్వరూపము కల వాడవు. రాల్లలో నీవు సత్త్వ స్వరూపుడవు. (సత్త్వము – శక్తి) జలములలో విద్యుత్ స్వరూపుడవు, భగవంతుడవు. మహేశ్వరుడవు దైత్యుల గుణములు పట్టి పీడించు చున్న మమ్ము కాపాడుము.
నాసీద్యదాకాండ మిదం త్రిలోచన ప్రభాకరేంద్ర ద్రవిణాధిపాః కుతః,
తదా భవానేన విరుద్ధలోచన ప్రమాణబాధాది వివర్జితః స్థితః.
మొదట ఈ సృష్టి ఏమియు లేదు. సూర్యుడు, ఇంద్రుడు, కుబేరుడు, మొదలగు వారి సంగతి చెప్పనేల? తర్కములు మొదలగు వానితో సంబంధము లేక ఉన్న వాడవు.
కపాల మాలిన్ శశిఖండశేఖర శ్మశాన వాసిన్ సిత భస్మ గుంఠిత,
ఫణీంద్ర సంవీతతనోన్తకాపహ ప్రపాహి నో దక్షధియా సురేశ్వర.
కపాలములు మాలగా, చంద్ర రేఖ శిరో భూషణముగా, తెల్లని బూది మైపూతగా శ్మశానము గృహముగా, పాములు జందెముగా గల దేవ దేవా! యమునికి యముడైన ఓ స్వామీ! సమర్థమగు బుద్ధితో మమ్ము రక్షింపుము.
భవాన్‌పుమాన్ శక్తి రియం గిరేః సుతా సర్వాంగరూపా భగవం స్తథా త్వయి,
త్రిశూల రూపేణ జగత్త్రయం కరే స్థితం త్రినేత్రేషు మఖాగ్నయస్త్రయః.
నీవు పురుషుడవు, శక్తి స్వరూపిణి యగు ఈ గిరి సుత సర్వాంగములలో అందము గలదియై నీ యందె నిలిచి యున్నది. మూడు లోకములు నీ చేత నున్న త్రిశూల రూపముతో నున్నవి. మూడు కన్నులలో యజ్ఞపు అగ్నులు మూడును కుదురుకొని యున్నవి. (మూడు అగ్నులు – గార్హపత్యము, ఆవహనీయము, దక్షిణము)
జటాస్వరూపేణ సమస్త సాగరాః కులాచలాః సింధువహాశ్చ సర్వశః,
శశీ పరం జ్ఞాన మిదం తవ స్థితం న దేవ పశ్యంతి కుదృష్టయో జనాః.
అన్ని సముద్రములు, ఏడు కుల పర్వతములు, నదులు నీ జడల స్వరూపముతో అలరారు చున్నవి. తలపై చంద్రుడు జ్ఞాన స్వరూపముతో నిలిచి యున్నాడు. పాడు చూపులు గల జనులు నిన్ను ఇట్లు చూడ జాలరు.
నారాయణ స్త్వం జగతాం సముద్భవ స్తథా భవః సైవ చతుర్ముఖో భవాన్,
సత్త్వాది భేదేన తథాగ్నిభేదతో యుగాదిభేదేన చ సంస్థిత స్త్రిధా.
జగముల ఉత్పత్తికి కారణమగు నారాయణుడవు నీవు. అట్లే భవుడు, బ్రహ్మయు నీవే. అట్లే నీవు సత్త్వము మొదలగు గుణముల భేదముతో, గార్హపత్యము మున్నగు అగ్నుల రూపముతో, కృతము మున్నగు యుగముల భేదముతో మూడు విధములుగా నిలిచి యుంటివి.
భవంత మేతే సురనాయకాః ప్రభో భవార్ధినో న్యస్య వదంతి తోషయన్,
యత స్తతో నో భవ భూతిభూషణ ప్రపాహి విశ్వేశ్వర రుద్ర తే నమః.
ఈ దేవ నాయకు లందరు నీ మఱియొక పుట్టుకను గోరుచు సంతోషముతో స్తుతించు చున్నారు. విశ్వేశ్వరా! రుద్రా! భూతిభూషణా! మాకై మరల జన్మింపుము. మమ్ములను రక్షింపుము. నీకు నమస్సులు.
మహాతపుడు:
ఏవం స్తుత స్తదా దేవో రుద్రః పశుపతిః సురైః,
ఉవాచ దేవా నవ్యగ్రః కిం కార్యం బ్రూత మాచిరమ్.
మహాతపుడు:
ఇట్లు దేవత లందరు తన్ను స్తుతింపగా పశుపతి, చెదరని మనస్సుతో దేవతలతో ‘పనియేమి? చెప్పుడు. ఆలసింపకుడు’ అని పలికెను.
దేవతలు:
సేనాపతిం నో దేవేశ దేహి దైత్యవధాయ వై,
దేవానాం బ్రహ్మముఖ్యానా మేతదేవ హితం భవేత్.
దేవతలు:
దేవేశా! దైత్యుల నంత మొందించుటకై మాకు సేనాపతిని ప్రసాదింపుము. బ్రహ్మ మొదలగు దేవతలకు ఇదియే హితము.
రుద్రుడు:
దదామి సేనానాథం వో దేవా భవత విజ్వరాః,
భవిష్య మస్తి పౌరాణం యోగాదీనా మచింతయన్.
రుద్రుడు:
దేవతలారా! మీకు సేనాపతి నొసగుదును. చింత మానుడు. సనాతనమగు యోగాదుల భావనకు కూడ అందని తత్వము పుట్ట గలదు.
ఏవముక్త్వా హరో దేవాన్ విసృజ్య స్వాంగసంస్థితామ్,
శక్తిం సంక్షోభయామాస పుత్రహేతోః పరంతప.
ఇట్లు పలికి శివుడు దేవతలను పంపి తన దేహమున నెలకొన్న శక్తిని పుత్రుని కొరకై మథించెను.
తస్య క్షోభయతః శక్తిం జ్వలనార్కసమప్రభః,
కుమారః సహజాం శక్తిం బిభ్ర జ్జానైకశాలినీమ్.
అట్లు శక్తిని ఊపివైచిన శివుని నుండి అగ్ని సూర్యులతో సమానమగు కాంతి గలవాడగు కుమారుడు జ్ఞానముతో విరాజిల్లు సహజ శక్తితో పుట్టెను.
ఉత్పత్తి స్తస్య రాజేంద్ర బహురూపా వ్యవస్థితా,
మన్వంతరే ష్వనేకేషు దేవసేనాపతేః కిల.
పెక్కు మన్వంతరములలో దేవా సేనాపతి పుట్టుక పెక్కు రూపములతో ఉండెనట!
యోసౌ శరీరగో దేవః అహంకారేతి కీర్తితః,
ప్రయోజనవశాద్ దేవః సైవ సేనాపతి ర్విభో.
రాజా! దేహమున నున్న అహంకార మనునదియే ఒక ప్రయోజనము కొఱకు దేవుడైన సేనాపతి రూపమున అవతరించెను.
తస్మిన్ జాతే స్వయం బ్రహ్మా సర్వదేవైః సమన్వితః,
పూజయామాస దేవేశం శివం పశుపతిం తదా.
ఆతడు అట్లు జనింపగా దేవత లందరితో పాటు బ్రహ్మ దేవదేవుడు, శివుడు అగు పశుపతిని పూజించెను.
సర్వైశ్చ దేవై ఋషిభిశ్చ సిద్ధై సేనాపతి ర్వరదానేన తేన,
ఆప్యాయితః సోపి సురా నువాచ సహాయార్థం క్రీడనే కార్యమేవ.
దేవత లందరును, ఋషులును, సిద్ధులు, వరముల నొసగి ఆతనిని లాలించిరి. అంత దేవతలతో కుమారుడు నాకు ఆటకై ఒక తోడును కల్పింపుడని పలికెను.
శ్రుత్వా వచస్తస్య మహానుభావో మహాదేవో వాక్యమిదం జగాద
దదామి తే క్రీడనకం తు కుక్కుటం, తథానుగౌ శాఖ విశాఖ సంజ్ఞౌ
కుమార భూతగ్రహనాయకో భవాన్ భవస్వ దేవేశ్వర సేనాయాః పతిః
ఆతని మాట విని మహానుభావుడగు మహా దేవుడిట్లు పలికెను నీకు కోడిని అట వస్తువుగా నిత్తును. అట్లే శాఖుడు, విశాఖుడు అనునిద్దరు సేవకుల నొసగుదును. కుమారా! భూత గ్రహములకు నాయకుడు వగుము. దేవతలకు సేనాపతి వగుము.
ఏవముక్త్వా తతో దేవః సర్వే దేవాశ్చ పార్థివ,
తుష్టువు ర్వాగ్భి రిష్టాభిః స్కన్దం సేనాపతిం తథా.
ఇట్లు పలికి ఆ మహా దేవుడును, దేవత లందరును, ఆనంద పరచు వాక్కులతో స్కందుడగు ఆ సేనాపతిని స్తుతించిరి.
దేవతలు:
భవస్వ దేవసేనానీ ర్మహేశ్వరసుత ప్రభో,
షణ్ముఖ స్కంద విశ్వేశ కుక్కుటధ్వజ పావకే.
దేవతలు:
మహేశ్వరుని పుత్రుడా! ఆరు మొగముల దేవరా! స్కంధా! విశ్వేశా! కుక్కుటధ్వజా! అగ్నిపుత్రా! నీవు దేవసేనాని వగుము.
కంపితారే! కుమారేశ! స్కంధ! బాటగ్రహానుగ,
జితారే! క్రౌంచవిధ్వంస! కృత్తికాసుత! మాతృజ.
శత్రువులను వణకించిన వాడా! కుమారా! ప్రభూ! స్కంధా! బాల గ్రహముల స్వామీ! శత్రువులను జయించిన వాడా! క్రౌంచ పర్వతమును ఛేదించిన వాడా! కృత్తికల కుమారా! ఆరు మాతృకలకు ముద్దు బిడ్డా! నీకు నమస్సులు.
భూతగ్రహపతిశ్రేష్ఠ పావకి ప్రియదర్శన,
మహాభూతపతేః పుత్ర త్రిలోచన నమోస్తు తే.
భూత గ్రహముల ప్రభూ! అగ్ని తనయా! ప్రియదర్శనా! మహా భూతపతి కుమారా! ముక్కంటి స్వామీ! నీకు నమస్సు.
ఏవం స్తుత స్తదా దేవై ర్వవర్ధ భవనందనః,
ద్వాదశాదిత్య సంకాశో బభూవాద్భుత దర్శనః,
త్రైలోక్యమపి తత్తేజ స్తాపయామాస పార్థివ.
ఇట్లు దేవతలు స్తుతింపగా శివుని కుమారుడు పెరుగ జొచ్చెను. పండ్రెండుగురు సూర్యులతో దీటైన వాడై చూడ నచ్చెరువు గొలుపు చుండెను. ఆతని తేజస్సు మూడు లోకములకు తాపము కలిగించు చుండెను.
ప్రజాపాలుడు:
కథం తం కృత్తికా పుత్ర ముక్తవంతః సురాగురుమ్,
కథం చ పావకి రసౌ కథం వా మాతృనందనః.
ప్రజాపాలుడు:
ఆ గొప్ప దైవమును దేవతలు కృత్తికల కొడుకనియు, అగ్ని సుతుడనియు, మాతృకల ముద్దు బిడ్డడనియు ఎట్లు పలికిరి?
మహాతపుడు:
ఆదిమన్వంతరే దేవ ఉత్పత్తి ర్యా మయోదితా,
పరోక్షదర్శిభి ర్దేవై రేవ మేవ స్తుతః ప్రభుః.
మహాతపుడు:
నేను మొదటి మన్వంతరము నాటి స్వామి పుట్టుకను చెప్పితిని. దేవతలు పరోక్షమును గూడ జూడ గలవారు కనుక ఆ ప్రభువు నిట్లు స్తుతించిరి.
కృత్తికా పాపకస్త్వన్యమాతరో గిరిజా తథా,
ద్వితీయ జన్మని గుహస్యైతే ఉత్పత్తి హేతవః.
రెండవ జన్మమున కృత్తిక, అగ్ని, సప్త మాతృకలు, పార్వతి అనువారు ఈ గుహుని పుట్టుకకు కారణమైన వారు.
ఏవ మేతత్ తవాఖ్యాతం పృచ్ఛతః పార్థివోత్తమ,
ఆత్మవిద్యామృతం గుహ్య మహంకారస్య సంభవః.
రాజా! నీవు నన్నడిగిన దానికి సంబంధించిన విషయ మంతయు, ఆత్మవిద్య యనెడు అమృతమును, రహస్యమైన దానిని, అహంకారము యొక్క ఉత్పత్తిని, నీకు వివరించి చెప్పితిని.
స్వయంస్కందో మహాదేవః సర్వపాప ప్రణాశనః,
తస్య షష్ఠీం తిథిం ప్రాదా దభిషేకే పితామహః.
ఆ స్కందుడు సర్వ పాపములు రూపుమాపు సాక్షాత్తు మహాదేవుడే. బ్రహ్మ ఆతని అభిషేకమునకు షష్ఠి తిథిని నిర్ణయించెను.
ఏతాం ఫలాశనో యస్తు క్షయే న్నియత మానసః,
అపుత్రోపి లభేత్ పుత్రా నధనోపి ధనం లభేత్,
యం యమిచ్ఛేత్ మనసా తం తం లభతి మానవః.
పండ్లు మాత్రము భుజించుచు మనసు నదుపులో నుంచుకొని ఈ తిథిని గడపు వాడు పుత్రులు లేని వాడైనను పుత్రులను పొందును ధనము లేనివాడు ధనవంతుడగును. మనసులో ఏది కోరిన అది వానికి లభించును.
యశ్చైతత్ పఠతి స్తోత్రం కార్తికేయస్య మానవః,
తస్య గేహే కుమారాణాం క్షేమారోగ్యం భవిష్యతి.
కార్తికేయుని ఈ స్తోత్రము పఠించు వాని యింట బాలురకు క్షేమము ఆరోగ్యము కలుగును.