వరాహ మహా పురాణము
అధ్యాయము – 18
ప్రజాపాలుడు:
కథ మగ్నేః సముత్పత్తి రశ్వినోర్వా మహామునే,
గౌర్యా గణపతే ర్వాపి నాగానాం వా గుహస్యచ.
ప్రజాపాలుడు:
మహామునీ అగ్ని, అశ్వులు, గౌరి, గణపతి, నాగులు, కుమారస్వామి అనువారి పుట్టుక యెట్టిది?
ఆదిత్య చంద్ర మాతౄణాం దుర్గాయా వా దిశాం తథా,
ధనదస్య చ విష్ణో ర్వా ధర్మస్య పరమేష్ఠినః.
శంభో ర్వాపి వితౄణాంచ తథా చంద్రమసో మునే,
శరీర దేవతాః సర్వాః కథం మూర్తిత్వ మాగతాః.
ఆదిత్యుడు, చంద్రుడు, మాతృకలు, దుర్గ, దిక్కులు, కుబేరుడు, విష్ణువు, ధర్ముడు, పరమేష్ఠి, శంభువు, పితృదేవతలు, సోముడు ~ అను వీరి జన్మము లెట్లు సంభవించినవి? శరీరము నందలి యీ దేవత లందరు ఆకార మెట్లు పొందిరి?
కించ తాసాం మునే భోజ్యం కావా సంజ్ఞా తిథి శ్చ కా,
యస్యాం యష్టాస్త్వమీ పుంసాం ఫలం యచ్ఛంత్యనామయమ్,
ఏతన్మే సరహస్యంతు మునే త్వం వక్తు మర్హసి.
ఓ మునీ! మరియు వారికి ఆహారమేది? పేరేమి? ఏ తిథి యందు వారి నర్చించినచో చెడని ఫలము మానవులకు లభించును? దీనిని రహస్యములతో పాటు నాకు చెప్ప వలయును.
మహాతపుడు:
యోగసాధ్య స్వరూపేణ ఆత్మా నారాయణాత్మకః,
సర్వజ్ఞః క్రీడత స్తస్య భోగేచ్ఛా చాత్మనాత్మని.
మహాతపుడు:
నారాయణ స్వరూపము గల ఆత్మ యోగముతో సాధింపదగు స్వరూపముతో సర్వజ్ఞమై క్రీడించుచు తాను తనలో భోగము నందు కోరిక పొందెను.
క్షోభితేస్మిన్ మహాభూతే ఏతచ్ఛబ్దం తదద్భుతమ్,
తమద్య ప్రీతిమత్తోయం వికారం సమరోచయత్.
అంత నాతడు ఈ మహా భూతమగు భూమిని కలచి వైవగా ఒక అద్భుతమగు పదార్థ మేర్పడెను. అట్లేర్పడిన ఆ పదార్థమును తనకు ప్రీతికరమైన జలముగా నాతడు సంభావించెను.
వికుర్వత స్తస్య తదా మహానగ్నిః సముత్థితః,
కోటిజ్వాలా పరీవారః శబ్దవాన్ దహనాత్మకః.
ఆజలము, నాతడు త్రచ్చు చుండగా కోటి జ్వాలలతో కూడినదియు, పెను ధ్వని కలదియు, కాల్చి వేయునదియునగు గొప్ప అగ్ని పుట్టెను.
అసా వ వ్యతితేజస్వీ వికారం సమరోచయత్,
వికుర్వతో బభౌ వహ్నే ర్వాయుః పరమ దారుణః.
మహా తేజస్సు గల ఆ నారాయణుడు దానిని కూడ ఒక వికారముగా భావించెను. మరల దానిని కుదిపి వేయగా ఆవహ్ని నుండి పరమ దారుణమగు వాయువు ఏర్పడెను.
తస్మాదపి వికార స్థా దాకాశం సమపద్యత,
వికారము నందున్న ఆ వాయువు నుండి ఆకాశ మేర్పడెను.
తచ్ఛబ్ద లక్షణం వ్యోమ సచ వాయుః ప్రతాపవాన్,
తచ్చ తేజో మ్భసా యుక్తం శ్లిష్ట మన్యోన్యత స్తథా.
శబ్దము గురుతుగా గల ఆకాశము, గొప్ప ప్రతాపము గల ఆ వాయువు, ఆ జలముతో కూడిన అగ్నియు ఒక దానితో నొకటి పెనవైచు కొనెను.
తేజసా శోషితం తోయం వాయునా ఉగ్రగామినా.
బాధితేన తథావ్యోమ్నా మార్గే దత్తేతు తత్షణాత్,
పిండీ భూతం తథాసర్వం కాఠిన్యం సమపద్యత.
అగ్ని నీటిని ఎండించెను. పెను వేగము గల వాయువు ఆకాశమునకు ఒత్తిడి కలిగించెను. అంత దానిలో కొంత దారి ఏర్పడెను. ఆక్షణమున అది అంతయు ముద్దగట్టెను. గట్టితన మేర్పడెను.
సేయం పృథ్వీ మహాభాగ తేషాం వృద్ధతరం భవత్,
చతుర్ణాం యోగకాఠిన్యా దేకైకం గుణవృద్ధితః.
నాలుగు భూతముల కలయిక వలన నేర్పడిన గట్టి తనము వలనను, ఒకదాని కంటె మరియొక దాని గుణములు పెరుగుట వలనను భూమి యేర్పడెను. తక్కిన భూతముల కంటె పెద్దది ఆయెను.
పృథ్వీ పంచగుణా జ్ఞేయా తేప్యేతస్యాం వ్యవస్థితాః,
స చ కాఠిన్యకం కుర్వన్ బ్రహ్మాండం సమపద్యత.
పృథివి యిట్లు అయిదు గుణములు కలది యాయెను. తక్కిన భూతము లన్నియు వీని యందు నెలకొని యుండెను. ఆ మహా విష్ణువు ఇట్లు గట్టితనము నేర్పరచుచు బ్రహ్మాండమును నిర్మించెను.
తస్మి న్నారాయణో దేవ శ్చతు ర్మూర్తి శ్చతుర్భుజః,
ప్రాజాపత్యేన రూపేణ సిసృక్షు ర్వివిధాః ప్రజాః.
ఆ బ్రహ్మాండము నందు నాలుగు మూర్తులు గల వాడును, నాలుగు భుజములు గల వాడును అగు నారాయణుడు ప్రాజాపత్య రూపముతో వేరువేరు ప్రజలను సృజింప గోరెను. (నాలుగుమూర్తులు ~1. సంకర్షణ, 2. వాసుదేవ, 3. ప్రద్యుమ్న, 4. అనిరుద్ధ నామకమలు.)
చింతయన్నధిగచ్ఛేత సృష్టిం లోకపితామహః,
తతోస్య సుమహాన్ కోపో జజ్ఞే పరమదారుణః.
ఆ లోక పితా మహుడట్లు భావన చేయుచు సృష్టి నేర్పరచెను. అంతలో ఆతనికి మిక్కిలి తీవ్రమగు కోపము పుట్టెను.
తస్మాత్కోపా త్సహస్రార్చి రుత్తస్థౌ దహనాత్మకః,
స తం దిధక్షు ర్బ్రహ్మాణం బ్రహ్మణోక్త స్తదా నృప.
ఆ కోపము వలన వేయి జ్వాలలు గలదియు, కాల్చి వేయునదియు నగు అగ్ని పైకి లేచెను. అది బ్రహ్మను గాల్చి వేయు నుంకింపగా బ్రహ్మ యిట్లు పలికెను.
హవ్యం కవ్యం వహస్వేతి తతోసౌ హవ్యవాహనః
బ్రహ్మాణం క్షుధితః ప్రాయాత్ కింకరోమి ప్రశాధి మామ్,
స బ్రహ్మా ప్రత్యువాచైనం త్రిధా తృప్తి మవాప్స్యసి.
“అగ్నీ! నీవు హవ్యమును కవ్యమును మోయు చుండుము”. బ్రహ్మ చెప్పినట్లుగా ఆతడు హవ్య వాహను డాయెను. ఆ అగ్ని ఆకలి పొంది బ్రహ్మ కడ కరిగి నా కానతిమ్ము. నేనేమి చేయ వలయును? అని యడిగెను. అంత బ్రహ్మ నీవు మూడు విధములుగా తృప్తి పొందు దువని పలికెను.
దత్తాసు దక్షిణా స్వాదౌ తృప్తి ర్భూత్వా యతోమరాన్,
నయసే దక్షిణాభాగం దక్షిణాగ్ని స్తతో భవత్.
యజ్ఞములలో దక్షిణ లొసగగా ఆ దక్షిణల భాగములను దేవతలకు చేర్చుచు తృప్తి నొందుము. ఇట్లు నీకు దక్షిణాగ్ని అను పేరేర్పడును.
ఆసమంతాద్ధుతం కించిద్యత్త్రిలోకే విభావసో,
త ద్వహస్వ సురార్థాయ తతస్త్వం హవ్యవాహనః.
ఓయి విభావసూ! మూడు లోకములలో ఎల్ల యెడల హోమము చేసిన పదార్థములను దేవతల కడకు కొనిపోవు చుండుము. ఆ కారణమున నీవు హవ్య వాహనుడ వగుదువు.
గృహం శరీర మిత్యుక్తం తత్పతి స్త్వం యతోధునా,
అతో వై గర్హపత్య స్త్వం భవ సర్వగతో విభో.
శరీరమును గృహ మందురు. నీవు దానికి పాలకుడవు. కావున నీకు గార్హపత్యుడను పేరు కలుగును. దీనితో నీవు ఎల్ల యెడల నున్న వాడ వగుదువు.
విశ్వాన్నరాన్ హుతో యేన నయసే సద్గతిం ప్రభో,
అతో వైశ్వానరో నామ తవ వాక్యం భవిష్యతి.
విశ్వము నందలి నరులందరు నీకు హోమము లర్పింతురు. వారికి నీవు సద్గతి నొసగుదువు. ఆ కారణమున నీకు వైశ్వానరుడను పేరు కలుగును.
ద్రవిణం బల మిత్యుక్తం ధనంచ ద్రవిణం తతః,
దదాతి తద్భవానేవ ద్రవిణోదా స్తతో భవత్.
ద్రవిణమనగా బలము. ధనమును కూడ ద్రవిణ మందురు. నిన్నర్చించు వారికి నీవు దాని నిత్తువు కనుక నీవు ద్రవిణోదుడవయితివి.
తనుం పాస్యతనుం పాసి యేన త్వం సర్వదా విభో,
తత స్తనూనపా న్నామ తవ వత్స భవిష్యతి.
నీవు తనువును (దేహము గల ప్రాణులను) తనువు కాని దానిని (దేహము లేని వానిని) రక్షింతువు. కావున నాయనా! నీవు ‘తనూనపాత్తు’ అను పేరు గలవాడ వగుదువు.
భవాన్ జాతాని వై వేద అజాతాని చ యేన వై,
అతస్తే నామ భవతు జాతవేదా ఇతి ప్రభో.
ఇంత వరకు రూపొందిన వియు, ఇంకను రూపొంద వలసిన వియు నగు వేదములను ఎరిగిన వాడవు కనుక నిన్ను జాతవేదు డందురు.
నారాః సామాన్యతః పుంసో విశేషేణ ద్విజాతయః,
తే శంసంతి యత స్త్వాం తు నారాశంస స్తతో భవ.
సామాన్యముగా పురుషులను ‘నారు’ లందురు. విశేషించి ద్విజన్ములు నారులు. వారు నిన్ను కొని యాడుదురు కావున నారాశంసుడని నీకు పేరైనది.
అగస్తిరోభవేన్నిత్యం నిః శబ్దో నిశ్చయాత్మకః,
అతస్త్వం సర్వగత్వాచ్చ తేనాగ్నిస్త్వం భవిష్యసి.
‘అగస్సు’ అనగా పాపము. వానిని నీవు రూపు మాపుదువు. ‘నిస్’ ‘శబ్దము’ ‘నిశ్చయముగా’ అను నర్థమును తెలుపును. ‘అగస్ + నిస్’ ~అనునది కలియగా ‘అగ్ని’ అను శబ్దము నీకు అర్థవంతము. అన్నింటి యందున్న వాడవు కనుకను నీకు అగ్ని అను పేరు ఏర్పడును.
ధ్మాప్రపూరణశబ్దోయ ఇధ్మానామప్రకీర్త్యతే,
పూరితస్య గతి ర్యేన తేవేధ్మస్త్వం భవిష్యసి.
‘ధ్మా’ ధాతువునకు నింపుట యని అర్థము. ఇధ్మములను నీ కొరకు నింపుదురు గావున నీకు ‘ఇద్మ’ నామము కలుగు చున్నది.
యాజ్యాన్యేతాని నామాని తవ పుత్ర మహామఖే,
యజంత స్త్వాం నరాః కామై స్తర్పయిష్యంత్య సంశయః.
కుమారా! నీయీ పేరు లన్నియు యజ్ఞమునకు సంబంధించినవి మహా యజ్ఞము లందు నరులాయా కోరికలతో నిన్ను అర్చింతురు. నిన్ను తృప్తి పరతురు. నిక్కము.
అధ్యాయము - 19
మహాతపుడు:
విష్ణో ర్విభూతి మాహాత్మ్యం కథితం తే ప్రసంగతః,
తథీనాం శృణు మహాత్మ్యం కథ్యమానం మయా నృప.
మహాతపుడు:
రాజా! ప్రసంగమును బట్టి నీకు విష్ణు మాహాత్మ్యమును చెప్పితిని. ఇప్పుడు తిథుల మహిమను చెప్పు చున్నాను. వినుము.
ఇత్థంభూతో మహానగ్ని ర్బ్రహ్మక్రోధ సముద్భవః,
ఉవాచ దేవం బ్రహ్మాణం తిథి ర్మే దీయతాం విభో,
యస్యామహం సమస్తస్య జగతః ఖ్యాతి మాప్నుయామ్.
బ్రహ్మ కోపము వలన పుట్టిన ఆ మహాగ్ని బ్రహ్మతో ‘ప్రభూ! నాకొక తిథిని ప్రసాదింపుము. దాని యందు నేను సమస్త లోకమున ఖ్యాతి పొందుదును’. అని పలికెను.
బ్రహ్మ:
దేవానా మథ యక్షాణాం గంధర్వాణా ఞ్చ సత్తమ,
ఆదౌ ప్రతిపదా యేన త్వముత్పన్నోసి పావక.
త్వత్పదాత్ర్పాతిపదికం సంభవిష్యంతి దేవతాః,
ఆతస్తే ప్రతిపన్నామ తిథి రేషా భవిష్యతి.
బ్రహ్మ:
ఓయి పాపకా! దేవతలలో, యక్షులలో, గంధర్వులలో, ఉత్తముడవగు నీవు మొదట ప్రతిపత్తున జన్మించితివి. నిన్న నుసరించి తక్కిన దేవత లందరు పట్టుదురు. కావున నీకు తిథి ప్రతిపత్తే యగును. (ప్రతిపత్తు - పాడ్యమి)
తస్యాం తిథౌ హవిష్యేణ ప్రాజాపత్యేన మూర్తినా,
హోష్యంతి తేషాం ప్రీతాః స్యుః పితరః సర్వదేవతాః.
ప్రజాపతి నిర్మించిన హవిస్సులో ఆ తిథినాడు హోమము చేయువారి పితృ దేవతలు, ఇతర దేవత లందరు తృప్తుల గుదురు.
చతుర్విధాని భూతాని మనుష్యాః పశవోసురాః,
దేవాః సర్వే సగంధర్వాః ప్రీతా స్యుస్తర్పితా స్త్వయి.
పశువులు, అసురులు, గంధర్వు లతోపాటు దేవతలు అనునీ నాలుగు విధములైన భూతములు నీయందు ఉంచిన హోమాదులతో తృప్తి పొంది ప్రీతు లగుదురు.
యచ్చోపవాసం కుర్వీత త్వద్భక్తః ప్రతిపద్దినే,
క్షీరాశనో వా వర్తేత శృణు తస్య ఫలం మహత్,
చతుర్యుగాని షడ్వింశం స్వర్గలోకే మహీయతే.
నీ భక్తుడు పాడ్యమి నాడు ఉపవాసము చేసెనేని, లేదా పాలు మాత్రము త్రావి యుండు నేని దాని ఫలము మిక్కిలి దొడ్డది. అట్టివాడు ఇరువది యారు మహా యుగములు స్వర్గమున సుఖముగా నుండును. (కొన్ని ప్రతులలో షట్త్రింశత్, ముప్పది యారు మహా యుగముల కాలము అని యున్నది.)
తేజస్వీ రూపసంపన్నో ద్రవ్యవాఞ్ జాయతే నరః,
ఇహ జన్మన్యసౌ రాజా ప్రేత్య స్వర్గే మహీయతే.
అట్టి వ్రతము చేసిన వాడు గొప్ప తేజస్సు కలిగి, చక్కని రూప సంపద కలిగి, మహా ధనవంతుడై, రాజై యీ లోకమున విలసిల్లును. మరణించిన పిదప స్వర్గ సుఖములతో అలరారును.
తూష్ణీంబభూవ సోప్యగ్ని ర్బ్రహ్మదత్తాశ్రమం యయౌ,
అగ్నియు అదివి ని యూర కుండెను. బ్రహ్మతన కొసగిన ఆశ్రమ మున కరిగెను.
య ఇదం శృణుయా న్నిత్యం ప్రాత రుత్థాయ మానవః,
అగ్నే ర్జన్మ స పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః.
మానవుడు ప్రతి దినము ఉదయమున లేచిన వెంటనే యీ అగ్ని జన్మమును గూర్చి విన్నచో ఆతడు పాపముల నుండి ముక్తి పొందును. ఇందు సందియము లేదు.