వరాహ మహా పురాణము
అధ్యాయము – 2
సూతుడు:
తత స్తుష్టో హరిర్భక్త్యా ధరణ్యాత్మ శరీరగామ్,
మాయాం ప్రకాశ్య తేనైవ స్థితో వారాహమూర్తినా.
సూతుడు:
ఆ విధముగా భూదేవి భక్తితో స్తుతింపగా తన దేహము నుండి వెలువడిన మాయను వెలుగొంద జేయుచు అదే వరాహ రూపముతో నిలిచి యుండెను.
జగాద కిం తే సుశ్రోణి ప్రశ్న మేనం సుదుర్లభమ్,
కథయామి పురాణస్య విషయం సర్వశాస్త్రతః.
హరి ఇట్లు పలికెను. సుశ్రోణీ! నీ ప్రశ్న చాల యుక్త మైనది. ఇట్టి ప్రశ్న అందరకు తోచునది కాదు. ఇది పురాణమునకు సంబంధించిన విషయము. శాస్త్రము లన్నింటి జ్ఞానముతో చెప్ప దగినది. చెప్పదను.
పురాణానాం హి సర్వేషా మయం సాధారణః స్మృతః,
శ్లోకం ధరణి నిశ్చిత్య నిఃశేషం త్వం పునః శృణు.
పురాణము లన్నింటికి సాధారణమగు శ్లోక మొకటి కలదు. దాత్రీ! దాని సంపూర్ణ మగు అర్థమును నిశ్చయించి వినుము.
శ్రీవరాహ మూర్తి:
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ,
వంశానుచరితం చైవ పురాణం పంచ లక్షణమ్.
శ్రీవరాహ మూర్తి:
సృష్టి, లయము, వంశము, మన్వంతరములు, రాజ వంశముల నడవడి అను నీ అయిదు లక్షణములు గలది పురాణము.
ఆదిసర్గ మహం తావత్ కథయామి వరాననే,
యస్మా దారభ్య దేవానాం రాజ్ఞాం చరిత మేవచ,
జ్ఞాయతే చతురంశశ్చ పరమాత్మా సనాతనః.
నిండు ముఖము గల ఓ భూదేవీ! మొట్ట మొదటి సృష్టిని గూర్చి నేను నీకు తెలిపెదను. అది మొదలుకొని దేవతల యొక్కయు, రాజుల యొక్కయు చరితము, నాలుగు అంశలుగా తోచు సనాతునుడగు పరమాత్మయు నీకు తెలియ వచ్చును.
ఆదా వహం వ్యోమ మహత్ తతోణు రేకైవ మత్తః ప్రబభూవ బుద్ధిః,
త్రిధా తు సా సత్త్వరజస్తమోభిః పృథక్ పృథక్ తత్త్వ రూపై రూపేతా.
మొదట నేను మహాకాశ స్వరూపుడనై యున్నాను. పిమ్మట అణువు ఏర్పడినది. అటుపై ఒక్కటి యగు బుద్ధి నా నుండి వెలువడి నది. అదియే సత్త్వము, రజస్సు, తమస్సు అను వేరు వేరు తత్త్వములతో గూడి మూడైనది.
తస్మిం స్త్రికేహం తమసో మహాన్ స సదోచ్యతే సర్వవిదాం ప్రధానః,
తస్మా దపి క్షేత్రవి దూర్జితోభూద్ బభూవ బుద్ధిస్తు తతో బభూవ.
ఆ మూడింటి సముదాయములో నేను ‘మహత్’ అను పేరు గల వాడను. నాకు సర్వము తెలిసిన వానిలో ‘ప్రదాను’డని ఎల్లపుడు వ్యవహారము. దాని నుండి చాల గొప్ప వాడగు క్షేత్రజ్ఞుడు ఏర్పడెను. మరల అతని నుండి బుద్ధి రూపొందెను.
తస్మాత్తు తేభ్యః శ్రవణాది హేతవస్తతోక్షమాలా జగతో వ్యవస్థితా,
భూతై ర్గతై రేవ చ పిండ మూర్తిర్మయా భద్రే విహితా త్వాత్మ నైవ.
ఆ బుద్ధి నుండి శ్రవణము మొదలగు అయిదు జ్ఞానములు పుట్టినవి. అటుపై ఇంద్రియములు వరుస జగమున నెల కొనినది. పంచ భూతముల సముదాయముతో పిండ స్వరూపమును, ఓ భద్రా! నేనే చేసితిని.
శూన్యం త్వాసీత్ తత్ర శబ్దస్తు ఖం చ తస్మాద్ వాయు స్తత ఏ వాను తేజః,
తస్మా దాప స్తత ఏవాను దేవి మయ సృష్టా భవతీ భూతధాత్రీ.
మొదట శూన్యమే ఉన్నది. దాని నుండి శబ్దము గగనము, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, దాని నుండి జలమును నేను సృజించితిని. దేవీ! దాని నుండియే సర్వ ప్రాణులకు తల్లియైన నిన్ను నేను ఏర్పరచితిని.
యోగే పృథివ్యా జలవత్ తతోపి సబుద్బుదం కలలం త్వండ మేవ,
తస్మిన్ ప్రవృత్తే ద్విగతేహ మాసీదాపోమయ శ్చాత్మ నాత్మాన మాదౌ.
ఆకాశాదులకు భూమితో కలయిక కలుగగా బుడగలతో కూడిన జలమయ మైన ఒక గర్భ కోశము ఏర్పడెను. అది గ్రుడ్డుగా మారెను. అది పగిలి రెండయిన సమయమున నన్ను నేను మొదట జలమయ స్వరూపముగా రూపొందించు కొంటిని.
సృష్ట్వా నారాస్తా అథో తత్ర చాహం యేన స్యాన్మే నామ నారాయణేతి,
కల్పే కల్పే తత్ర సంయామి భూయః సుప్తస్య మే నాభిజః స్యాద్యథాద్యః.
నేను అట్లు నారములను సృజించి వానిని స్థానముగా ఏర్పరచు కొనుట చేత నాకు ‘నారాయణ’ నామము కలిగెను. ప్రతి కల్పము నందు నేను మరల దాని లోనికి పోవుదును. నిద్రించు చున్న నా బొడ్డు నుండి బ్రహ్మ తోలి సృష్టి కర్తగా పుట్టెను.
ఏవం భూతస్య మే దేవి నాభిపద్మే చతుర్ముఖః,
ఉత్తస్థౌ స మయా ప్రోక్తః ప్రజాః సృజ మహామతే.
దేవీ! ఈ విధముగా నున్న నా నాభి కమలము నుండి నలు మోముల దేవుడు పైకి వచ్చెను. నేనాతనికి ‘ఓ మహామతీ! ప్రజలను సృజింపు’మని చెప్పితిని.
ఏవ ముక్త్వా తిరోభావం గతోహం సోపి చిన్తయన్,
ఆస్తే యావ జ్జగద్ధాత్రి నాధ్యగచ్ఛత కిఞ్చన.
నేనిట్లు పలికి అతనికి కనపడ కుండ నుంటిని. అతడును ఎంతయో చింతించెను గాని అతని కేమియు తోచలేదు.
తావత్ తస్య మహారోషో బ్రహ్మణోవ్యక్తజన్మనః,
సంభూయ తేన బాలః స్యా దఙ్కే రోషాత్మ సంభవః.
అంత తన జన్మకు కారణ మెవరో యెరుగని బ్రహ్మకు మహా రోషము జనించెను. ఆ రోషము నుండి ఒక బాలుడు ఉదయించి బ్రహ్మ తొడపై కూర్చుండెను.
యో రుదన్ వారిత స్తేన బ్రహ్మణావ్యక్త మూర్తినా,
బ్రవీతి నామ మే దేహి తస్య రుద్రేతి సో దదౌ.
చక్కగా తెలియరాని రూపము గల బ్రహ్మ ఆ బాలుడేడ్చు చుండగా ఓదార్చెను. ఆ బాలుడు నా కొక పేరు పెట్టుమని యడిగెను. బ్రహ్మ ఆతనికి రుద్రుడని పేరు పెట్టెను.
సోపి తేన సృజస్వేతి ప్రోక్తో లోక మిమం శుభే,
అశక్తః సోథ సలిలే మమజ్జ తపసే ధృతః.
అతనిని కూడా ఈ లోకము సృజింపుమని బ్రహ్మ అడిగెను. అతడును శక్తి లేని వాడై నీటిలో మునిగెను. తపస్సునకై పూను కొనెను.
తస్మిన్ సలిలమగ్నే తు పున రన్యం ప్రజాపతిమ్,
బ్రహ్మా ససర్జ భూతేషు దక్షిణాఙ్గుష్ఠతో వరమ్,
వామే చైవ తథాఙ్గష్ఠే తస్య పత్నీ మధాసృజత్.
ఆ బాలుడట్లు నీట మునుగగా బ్రహ్మ కుడి బొటన వ్రేలి నుండి శ్రేష్ఠుడగు ఒక ప్రజాపతిని, ఎడమ బొటన వ్రేలి నుండి అతనికి ప్రత్నిని, భూతముల సృష్టికై సృజించెను.
స తస్యాం జనయామాస మనుం స్వాయంభువం ప్రభుః,
తస్మాత్ సంభవితా సృష్టిః ప్రజానాం బ్రహ్మణా పురా.
ఆ ప్రజాపతి పత్ని యందు స్వాయంభువ మనువును గనెను. బ్రహ్మ వలన అతని నుండి మొదట ప్రజల సృష్టి యేర్పడెను.
భూదేవి:
విస్తరేణ మమాచక్ష్వ ఆదిసర్గం సురేశ్వర,
బ్రహ్మా నారాయణోఖ్యోయం కల్పదౌ చాభవద్ యథా.
భూదేవి:
దేవదేవా! ఈ తొలి సృష్టిని గూర్చియు, నారాయణ నామము గల బ్రహ్మ కల్పము మొదట ఏర్పడిన విధానమును గూర్చియు నాకు వివరించి చెప్పుము.
శ్రీ భగవానుడు:
ససర్జ సర్వభూతాని యథా నారాయణాత్మకః,
కథ్యమానం మయాదేవి తదశేషం క్షితే శృణు.
శ్రీ భగవానుడు:
నారాయణ స్వరూపుడగు పరమాత్మ భూతము లన్నిటిని ఎట్లు సృష్టి చేసెనో చెప్పు చున్నాను. ఓ భూదేవీ! అది యంతయు వినుము.
గతకల్పావసానే తు నిశి సుప్తోత్థితః శుభే,
సత్త్వోద్రిక్త స్తథా బ్రహ్మా శూన్యం లోక మవైక్షత.
కడచిన కల్పము ముగిసిన సమయమున రాత్రి నిద్రించి లేచిన బ్రహ్మ సత్త్వ గుణము విజృంభింపగా శూన్యమైన లోకమును గాంచెను.
నారాయణః పరోచిన్త్యః పరాణా మపి పూర్వజః,
బ్రహ్మస్వరూపీ భగవా ననాదిః సర్వసంభవః.
నారాయణుడే పరముడు, ఊహ కందని వాడు. బహు పురాతనుల కంటే పూర్వముగా ఉన్నవాడు. బ్రహ్మ స్వరూపుడు. మొదలు లేని వాడు. అన్నింటికీ మూల కారణమైన వాడు.
ఇదం చోదాహర న్త్యత్ర శ్లోకం నారాయణం ప్రతి,
బ్రహ్మస్వరూపిణం దేవం జగతః ప్రభవాప్యయమ్.
బ్రహ్మ స్వరూపుడు, దేవుడు, జగత్తు సృష్టి లయములకు కారణమైన వాడు అగు నారాయణుని గూర్చి యీ శ్లోకమును చెప్పు చుందురు.
ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః,
అయనం తస్య తాః పూర్వం తేన నారాయణః స్మృతః.
నీటిని నారము లందురు. అవి నరుడను పేరుగల పరమాత్మ నుండి పుట్టినవి. అతనికవి ఆయనము (ఉండు చోటు) కావున అతనిని నారాయణుడు అందురు.
సృష్టిం చింతయత స్తస్య కల్పాదిషు యథా పురా,
అబుద్ధి పూర్వక స్తస్య ప్రాదుర్భూత స్తమోమయః.
మునుపటి కల్పముల ఆది కాలము లందు వలె అతడు సృష్టిని గూర్చి భావన చేయు చుండగా అతడు సంకల్పము చేయకయే ఒక తమస్సుతో నిండిన స్వరూపము తన ముందు తోచెను. (కాన వచ్చెను)
తమో మోహో మహామోహ స్తామిస్రో హ్యన్ధసంజ్ఞితః,
అవిద్యా పఞ్చపర్వైషా ప్రాదుర్భూతా మహాత్మనః.
ఆ చీకటియే మోహము. దానినే మహా మొహమనియు, తామిస్ర మనియు, అంధ మనియు అందురు. అట్లు అయిదు కణుపులు గల అ విద్య ఆ మహాత్ముని నుండి వెలువడెను.
పంచధావస్థితః సర్గో ధ్యాయతో ప్రతిబోధవాన్,
బహి రన్తోప్రకాశశ్చ సంవృతాత్మా నగాత్మకః,
స ముఖ్యసర్గో విజ్ఞేయః సర్గవిద్భి ర్విచక్షణౖః.
అతడు ధ్యానములో నుండగా ఆయనకు తెలియకయే అయిదు విధములుగా నెలకొన్న సృష్టి వెలువడెను. వెలుపలను లోపాలను వెలుగు లేనిది, కప్పి కొని యున్న స్వరూపము కలది, కొండ వలె, చెట్టు వలె కదలిక లేనిది అగు ఆ సృష్టిని సృష్టి రహస్య మెరిగిన వివేకులు ముఖ్య సర్గమని తెలిసి కొనిరి.
పున రన్య దభూత్ తస్య ధ్యాయతః సర్గ ముత్తమమ్,
తిర్యక్ స్రోతస్తు వై యస్మాత్ తిర్యక్ర్సోతస్తువైస్మృతః.
మరల అతడు ఉత్తమ సృష్టిని గూర్చి ధ్యానములో నుండగా మఱియొకటి యేర్పడెను. అది అడ్డముగా నున్న గమనము గలది యగుట వలన దానిని ‘తిర్యక్ర్సోతస్సు’ అని చెప్పుదురు.
పశ్వాదయ స్తే విఖ్యాతా ఉత్పథగ్రాహిణ స్తు తే
త మస్యసాధకం మత్వా తిర్యక్ర్సోతం చతుర్ముఖః.
ఈ తిర్యక్ర్సోతస్సు నందలి చెడు మార్గమును బట్టి పశువులు మొదలైనవిగా తెలియ వచ్చెను. నాలుగు మోముల వాడు దానిని కూడా పనికి మాలినదిగా తలచెను.
ఊర్ధ్వస్రోత స్త్రిధా యస్తు సాత్త్వికో ధర్మవర్తనః,
తతోర్ధ్వచారిణో దేవాః సర్వగర్భసముద్భవాః.
ఊర్ధ్వశ్రోతస్సు గల ప్రాణి జాతము సత్త్వ గుణమునకు సంబంధించినది. ధర్మమైన నడవడి గలది. గర్భము నుండి పుట్టిన దేవజాతి వారందఱు అంతకంటె పై భాగములో తిరుగు వారైరి.
తదా సృష్ట్వాన్యసర్గం తు తదా దధ్యౌ ప్రజాపతిః,
అసాధకాంస్తు తాన్ మత్వా ముఖ్యసర్గాదిసంభవాన్.
ముఖ్య సృష్టి మొదలగు వానిలో ఏర్పడిన వానిని పనికి మాలిన వానినిగా తలచిన ప్రజాపతి మరియొక సృష్టి కొఱకు ధ్యానము చేసెను.
తతః స చిన్తయామాస అర్వాక్‌స్రోతస్తు స ప్రభుః,
అర్వాక్ర్సోతసి చోత్పన్నా మనుష్యాః సాధకా మతాః.
అటుపై ఆ ప్రభువు అర్వాక్ స్రోతస్సును గూర్చి చింతించెను. అట్టి తరువాతి సృష్టి ప్రవాహము వలన మనుష్యులు పుట్టురి. వారు అతని లక్ష్యమును సాధించు వారైరి.
తే చ ప్రకాశబహులా స్తమోద్రిక్తా రజోధికాః,
తస్మాత్ తు దుఃఖబహులా భూయోభూయాశ్చ కారిణః.
వారు ప్రకాశము అధికమైన వారు. తమో గుణము పెల్లు రేగిన వారు. రజో గుణము మిక్కిలిగా గలవారు. అందు వలన పెక్కు దుఃఖములు కల వారైరి. పెక్కు కర్మములు చేయు వారైరి.
ఇత్యేతే కథితాః సర్గాః ష డేతే సుభగే తవ,
ప్రథమో మహతః సర్గ స్తన్మాత్రాణి ద్వితీయకః.
కాంతా! నీకిట్లు ఆరు సృష్టులను గూర్చి చెప్పితిని. ‘మహత్తు’ సృష్టి మొదటిది. తన్మాత్రాల సృష్టి రెండవది.
వైకారిక స్తృతీయస్తు సర్గ శ్చైన్ధ్రియకః స్మృతః,
ఇత్యేష ప్రాకృతః సర్గః సంభూతో బుద్ధిపూర్వకః.
మూడవ సృష్టికి ‘వైకారిక’ మని పేరు. (అనగా వికారము మార్పు వలన నేర్పడినది) దీనినే ఐంద్రియక మనియు నందురు. ఇది ఇంద్రియములకు సంబంధించినది. ఇది బ్రహ్మ బుద్ధి పూర్వకముగా చేసిన మూల సృష్టి.
ముఖ్యసర్గ శ్చతుర్థ స్తు ముఖ్యా వై స్థావరాః స్మృతాః,
తిర్యక్ర్సోతశ్చ యః ప్రోక్త స్తైర్యక్‌స్రోతః స ఉచ్యతే.
ముఖ్య సృష్టి నాలుగవది. ముఖ్యము లనగా స్థావరములు (కదలిక లేని కొండలు మొదలగునవి) పశువులు, పక్షులు అను వానికి సంబంధించిన ‘తైర్యక్ర్సోతస్సు’ అనునది అయిదవది. (తిర్యక్కు లనగా పశు పక్ష్యాదులు)
తథోర్ధ్వస్రోతసాం శ్రేష్ఠః సప్తమః స తు మానవః,
అష్టమోను గ్రహః సర్గః సాత్త్విక స్తామస శ్చ సః.
అటు పిమ్మట ఊర్ధ్వస్రోతస్సులకు సంబంధించిన ఆరవ సృష్టి ఉత్తమ మైనది. ఏడవది మానవ సృష్టి. ఎనిమిదవ సృష్టిని అనుగ్రహ సృష్టి యందురు. అందు సత్త్వతమో గుణముల సంబంధము కలదు.
పఞ్చైతే వైకృతాః సర్గాః ప్రాకృతా స్తు త్రయః స్మృతాః,
ప్రాకృతో వైకృత శ్చైవ కౌమారో నవమః స్మృతః.
వీనిలో ఐదు వికృతికి సంబంధించిన సృష్టులు. మూడు ప్రాకృత సృష్టులు (సహజ సృష్టులు) సహజము, వికృతి వలన నేర్పడి నదియు నగు తొమ్మిదవ సృష్టిని కౌమారమని వ్యవహరింతురు.
ఇత్యేతే వై సమాఖ్యాతా నవసర్గాః ప్రజాపతేః,
ప్రాకృతా వైకృతా శ్చైవ జగతో మూలహేతవః,
ఇత్యేతే కథితాః సర్గాః కిమన్య చ్ఛ్రోతు మిచ్ఛసి.
ప్రజాపతి చేసినవియు జగత్తునకు మూల కారణము లైనవియు, సహజములు, మార్పు వలన నేర్పదినవియు నగు తొమ్మిది సృష్టులను గూర్చి వివరించి చెప్పితిని. భూదేవీ! నీ వింక దేనిని విన గోరుదువు?
భూమి:
నవధా సృష్టి రుత్పన్నా బ్రహ్మణోవ్యక్తజన్మనః,
కథం సా వవృధే దేవ ఏతన్మే కథయాచ్యుత.
భూమి:
తెలియరాని జన్మము గల బ్రహ్మ వలన తొమ్మిది విధములగు సృష్టి ఏర్పడినది. దేవా! ఇది యెట్లు వృద్ధి పొందినది? అచ్యుతా! దీనిని నాకు చెప్పుము.
శ్రీ వరాహ దేవుడు:
ప్రథమం బ్రహ్మణా సృష్టా రుద్రాద్యాస్తు తపోధనాః,
సనకాదయ స్తతః సృష్టా మరీచ్యాదయ ఏవ చ.
శ్రీ వరాహ దేవుడు:
మొదట బ్రహ్మ రుద్రుడు మొదలగు తపోధనులను సృజించెను. ఆపై సనకుడు మొదలగు వారిని, పిమ్మట మరీచి మొదలగు వారిని సృజించెను.
మరీచి రత్రి శ్చ తథా అఙ్గిరాః పులహః క్రతుః,
పులస్త్య శ్చ మహాతేజాః ప్రచేతా భృగు రేవచ,
నారదో దశమ శ్చైవ వసిష్ఠశ్చ మహాతపాః.
మరీచి, అత్రి, అంగిరుడు, పులహుడు, క్రతువు, గొప్ప తేజము గల పులస్త్యుడు, ప్రచేతుడు, భృగువు, నారదుడు, మహా తపస్వియగు వసిష్ఠుడు. (ఈ పది మంది మరీచి మొదలగు వారు)
సనకాదయో నివృత్త్యాఖ్యే తేన ధర్మే ప్రయోజితాః,
ప్రవృత్త్యాఖ్యే మరీచ్యాద్యా ముక్త్వైకం నారదం మునిమ్.
ఆ బ్రహ్మ సనకుడు మొదలగు వారిని ‘నివృత్తి’ అను పేరు గల ధర్మము నందు నియోగించెను. నారదు నొక్కని వదలి తక్కిన మరీచి మొదలగు వారిని ‘ప్రవృత్తి’ అను పేరు గల ధర్మమున నియోగించెను. (నివృత్తి = మోక్ష మార్గము; ప్రవృత్తి = సంసార మార్గమున మనుష్యులు, పశువులు మొదలగు నవి కలవు.)
యోసౌ ప్రజాపతి స్త్వాద్యో దక్షిణాఙ్గుష్ఠ సంభవః,
తస్యాదౌ తత్ర వంశేన జగదేత చ్చరాచరమ్.
బ్రహ్మ కుడి బొటన వ్రేలి నుండి పుట్టిన మొదటి ప్రజాపతి యందునే అతని వంశమున ఈ చరా చార జగత్తంతయు పుట్టెను. (చరాచరమ్ = చరములు = కదలునవి; అచరములు = స్థిరముగా నుండునవి = కొండలు మొదలగునవి.)
దేవాశ్చ దానవాశ్చైవ గన్దర్వోరగ పక్షిణః,
సర్వే దక్షస్య కన్యాసు జాతాః పరమ ధార్మికాః.
దేవులు, దానవులు, గంధర్వులు, నాగులు, పక్షులు, అను వీరందఱు దక్షుని కన్యల యందు పుట్టిన గొప్ప ధర్మాత్ములు.
యోసౌ రుద్రేతి విఖ్యాతః పుత్రః క్రోధసముద్భవః,
భ్రుకుటీకుటిలాత్ తస్య లలాటాత్ పరమేష్ఠినః.
అర్ధనారీనరవపుః ప్రచణ్డోతి భయంకరః,
విభ జాత్మాన మిత్యుక్తో బ్రహ్మణాన్తర్దధే పునః.
బ్రహ్మ కను బొమలు ముడుచుట చేత వంకరయైన బ్రహ్మ నొసటి నుండి క్రోధము వలన పుట్టి రుద్రుడను పేరు పొందిన పుత్రుడు సగము ఆడుది, సగము పురుషుడు అయిన దేహము తాల్చి మిక్కిలి తీవ్ర స్వరూపుడై అతి భయంకరు డాయెను. బ్రహ్మ అతన్ని నిన్ను నీవు విభజించు కొనుమని పలుకగా అతడు అంతర్దానము చెందెను.
తథోక్తోసౌ ద్విధా స్త్రీత్వం పురుషత్వం చకార సః,
బిభేద పురుషత్వం చ దశధా చైకధా చ సః,
తత స్త్వేకాదశ ఖ్యాతా రుద్రా బ్రహ్మసముద్భవాః.
బ్రహ్మ అట్లు పలుకగా అతడు తన్ను సగము స్త్రీగా, సగము పురుషునిగా రెండుగా చేసి కొనెను. మరల ఆ పురుష రూపమును పదునొకండుగా విభజించు కొనెను. అట్లు బ్రహ్మ నుండి పుట్టిన వారు ఏకాదశ రుద్రు లని పేరు గాంచిరి.
అయ ముద్దేశతః ప్రోక్తో రుద్రసర్గో మయానఘే,
ఇదానీం యుగమాహాత్మ్యం కథయామి సమాసతః.
పుణ్యురాలా! ఇట్లు సూచనగా రుద్రుల సృష్టిని నీకు వివరించితిని. ఇప్పుడు సంక్షేపముగా యుగముల మహిమను చెప్పెదను.
కృతం త్రేతా ద్వాపరశ్చ కలి శ్చేతి చతుర్యుగమ్,
ఏతస్మిన్ యే మహాసత్త్వా రాజానో భూరిదక్షిణాః,
దేవాసురాశ్చ యం చక్రు ర్ధర్మం కర్మ చ తచ్ఛ్రుణు.
కృతము, త్రేతా, ద్వాపరము, కలి అను నాలుగు యుగములు. వీని యందు గొప్ప పవిత్ర కార్యములు నిర్వహించిన వారు, గొప్ప శక్తి కలవారు అగు రాజులను గూర్చియు, దేవతలను, రాక్షసులను గూర్చియు వారు నిర్వహించిన ధర్మమును కర్మమును గూర్చియు చెప్పెదను వినుము.
ఆసీత్ ప్రథమకల్పే తు మనుః స్వాయంభువః పురా,
తస్య పుత్రద్వయం జజ్ఞే అతిమానుషచేష్టితమ్,
ప్రియవ్రతోత్తానపాద నామానం ధర్మవత్సలమ్.
పూర్వము మొదటి కల్పమున స్వాయంభువు డను మనువు ఉండెడి వాడు. అతనికి మానవుల శక్తికి మించిన చేష్టలు గలవారు, ధర్మము నందు ప్రీతి గలవారు అగు ప్రియ వ్రతుడు, ఉత్తాన పాదుడు అనునిద్దరు కొడుకులు పుట్టిరి.
తత్ర ప్రియవ్రతో రాజా మహాయజ్వా తపోబలః,
స చేష్ట్వా వివిధై ర్యజ్ఞైర్విపులై ర్భూరిదక్షిణౖః.
అందు ప్రియ వ్రతుడను రాజు గొప్ప యజ్ఞములు చేసిన వాడు. తపస్సు బలముగా గలవాడు. గొప్పవియగు అనేక యజ్ఞములను గొప్ప దక్షిణ లిచ్చి చేసిన వాడు.
సప్తద్వీపేషు సంస్థాప్య భరతాదీన్ సుతాన్ నిజాన్,
స్వయం విశాలం వరదాం గత్వా తేపే మహత్ తపః.
భరతుడు మున్నగు కుమారులను ఏడు ద్వీపముల యందును రాజులుగా నిలిపి తాను వరదయగు విశాల అనుతావున కరిగి మహా తపస్సు గావించెను.
తస్మిన్ స్థితస్య తపసి రాజ్ఞో వై చక్రవర్తినః,
ఉపేయా న్నారద స్తత్ర దిదృక్షు ర్ధర్మచారిణమ్.
ఆ చక్రవర్తి యగు మహారాజు అట్లు తప మందుండగా ధర్మము నడుపుచున్న అతనిని చూచుటకై నారదు డచటికి వచ్చెను.
స దృష్ట్వా నారదం వ్యోమ్ని జ్వలద్భాస్కర తేజసమ్,
అభ్యుత్థానేన రాజేన్ద్ర ఉత్తస్థౌ హర్షిత స్తదా.
గగనమున వెలుగొందు చున్న సూర్యుని తేజము వంటి తేజస్సు గల ఆ నారదుని చూచి హృదయ ముప్పొంగిన ఆ రాజు ఎదుర్కొనుటకై లేచెను.
తస్యాసనం చ పాద్యం చ సమ్యక్ తస్య నివేద్య వై,
స్వాగతాదిభి రాలాపైః పరస్పర మవోచతామ్,
కథాన్తే నారదం రాజా పప్రచ్ఛ బ్రహ్మవాదినమ్.
అతనికి ఆసనము, కాళ్ళు కడుగు కొనుటకు నీరు మున్నగునవి సమర్పించి, స్వాగత వాక్యములు పలికెను. నారదుడును సముచితములగు పలుకులు పలికెను. అట్లు కుశల వాక్యములు ముగిసిన పిదప బ్రహ్మమును గూర్చి చెప్పెడు నారదుని రాజిట్లు అడిగెను.
ప్రియవ్రతుడు:
భగవన్ కిఞ్చి దాశ్చర్య మేతస్మిన్ కృతసంజ్ఞితే,
యుగే దృష్టం శ్రుతం వాపి తన్మే కథయ నారద.
ప్రియవ్రతుడు:
భగవానుడా! నారదా! ఈ కృతమను పేరు గల యుగమున నీవు విన్నది కాని, కన్నది కాని ఏదైనా అచ్చెరువు గొలుపు విషయమున్న నాకు చెప్పుము.
నారదుడు:
ఆశ్చర్య మేకం దృష్టం మే తచ్ఛ్రుణుష్వ ప్రియవ్రత,
హ్యస్తనేహని రాజేన్ధ్ర శ్వేతాఖ్యం గతవా నహమ్,
ద్వీపం తత్ర సరో దృష్టం పుల్లపఙ్కజ మాలినమ్.
నారదుడు:
రాజేంద్రా! ప్రియ వ్రతా! నే నొక ఆశ్చర్యమును గాంచితిని. అది వినుము. నిన్న రాత్రి శ్వేత ద్వీపమున కరిగితిని. అందు వికసించిన పద్మములు కొల్లలుగా గల సరస్సు నొకటి చూచితిని.
సరస స్తస్య తీరే తు కుమారీం పృథులోచనామ్,
దృష్ట్వాహం విస్మయాపన్నస్తాం కన్యామాయతేక్షణామ్,
పృష్టవా నస్మి రాజేన్ధ్ర తదా మధురభాషిణీమ్.
ఆ సరస్సు తీరమున వెడద కన్నులు గల ఒక కుమారిని చూచి ఆశ్చర్యపడి తీయని పలుకులు, విశాలములగు కన్నులు గల ఆమె నిట్లడిగితిని.
కాసి భద్రే కథం వాసి కిం వా కార్య మిహ త్వయా,
కర్తవ్యం చారు సర్వాఙ్గి తన్మమాచక్ష్వ శోభనే.
“అమ్మా! నీవెవరు? ఎలా ఇచట నున్నావు? నీవిట చేయు పని యేమి? అది నాకు వివరింపుము”
ఏవ ముక్తా మయా సా హి మాం దృష్ట్వా నిమిషేక్షణా,
స్మృత్వా తూష్ణీం స్థితా యావత్ తావన్మే జ్ఞానముత్తమమ్.
విస్మృతం సర్వవేదాశ్చ సర్వశాస్త్రాణి చైవ హ,
యోగశాస్త్రాణి శిక్షాశ్చ వేదానాం స్మృతయ స్తథా.
నే నిట్లు పలుకగా ఆమె రెప్ప వ్రాల్పక నన్ను చూచి ఏదో స్మరించి యూర కుండెను. అంతలో నా ఉత్తమ జ్ఞానము, సర్వ వేదములు, సకల శాస్త్రములు, యోగ విద్యలు, శబ్ద శాస్త్రములు, వేదముల స్మృతులు నాకు మరపునకు వచ్చెను.
సర్వం దృష్ట్వైవమే రాజన్ కుమార్యాపహృతం క్షణాత్,
తతోహం విస్మయావిష్ట శ్చిన్తాశోకసమన్వితః.
తా మేవ శరణం గత్వా యావత్ పశ్యామి పార్థివ,
తావద్ దివ్యః పుమాం స్తస్యాః శరీరే సమదృశ్యత.
ఆ కుమారి చూపు మాత్రముననే నా సర్వము నపహరించెను. అంత నన్ను విస్మయము, దుఃఖము ముంచి ఎత్తెను. ఆమెనే శరణు పొంది చూచు నంతలో ఒక దివ్య పురుషుడు ఆమె దేహమున కాన వచ్చెను.
తస్యాపి పుంసో హృదయే త్వపర స్తస్య చోరసి,
అన్యో రక్తేక్షణః శ్రీమాన్ ద్వాదశాదిత్య సన్నిభః.
అతని హృదయమున నొక పురుషుడు, వాని యురమున మరియొక పురుషుడు ఎరుపెక్కిన కనులు కలవాడు శ్రీమంతుడు, పండ్రెండుగురు సూర్యులకు సాటియైన వాడును కాన వచ్చిరి.
ఏవం దృష్ట్వా పుమాంసోత్ర త్రయః కన్యాశరీరగాః,
క్షణేన తత్ర కన్యైకా న తాన్ పశ్యామి సువ్రత.
ఇట్లా కన్యక శరీరమున మువ్వురు పురుషులను గాంచితిని. ఇంతలో మరల అచట ఆ కన్య యోక్కతెయే కాన వచ్చెను. ఆ పురుషులు కాన రారైరి.
తతః పృష్టా మయా దేవీ సా కుమారీ కథం మమ,
వేదా నష్టా మమాచక్ష్వ భద్రే తన్నాశ కారణమ్.
అంత నేనా కన్యను అమ్మా! నేనెరగిన విద్య లన్నియు నెట్లు నశించినవి? దానికి కారణమేమో నా కేరిగింపుమని ప్రార్థించితిని.
కన్య:
మాతాహం సర్వవేదానాం సావిత్రీ నామ నామతః,
మాం న జానాసి యేన త్వం తతో వేదా హృతా స్తవ.
కన్య:
నేను అన్ని వేదములకు తల్లిని. నా పేరు సావిత్రి. నన్నెరుగని కారణమున నీ వేదము లన్నియు నష్టము లైనవి.
ఏవ ముక్తే తయా రాజన్ విస్మయేన తపోధన,
పృష్టా క ఏతే పురుషా ఏత త్కథయ శోభనే.
తపస్సు ధనముగా గల రాజా! ఆమె యిట్లు పలుకగా విస్మయముతో “తల్లీ! ఈ పురుషు లెవ్వరు? అది చెప్పుము” అని యడిగితిని.
కన్య:
య ఏష మచ్ఛరీరస్థః సర్వాఙ్గై శ్చారులోచనః,
ఏష ఋగ్వేదనామా తు దేవో నారాయణః స్వయమ్,
వహ్నిభూతో దహత్యాశు పాపాన్యుచ్చారణా దను.
కన్య:
రమణీయములగు కనులతో అన్ని యవయవములతో నా దేహమున నున్న యితడు ఋగ్వేదమను పేరు గల నారాయణ దేవుడే. ఉచ్చరించిన వెంటనే యీతడు అగ్ని వంటి వాడై పాపముల నన్నింటిని ఒక్క పెట్టున కాల్చి వేయును.
ఏతస్య హృదయే యోయం దృష్ట ఆసీ త్త్వయాత్మజః,
స యజుర్వేదరూపేణ స్థితో బ్రహ్మా మహాబలః.
ఈతని హృదయమున నీవు చూచిన ఆతని కుమారుడు యజుర్వేద రూపముతో నెలకొన్న మహా బలుడు బ్రహ్మ.
తస్యా ప్యురసి సంవిష్టో య ఏష శుచి రుజ్జ్వలః,
స సామవేదనామా తు రుద్రరూపీ వ్యవస్థితః,
ఏశ ఆదిత్యవత్ పాపా న్యాశు నాశయతే స్మృతః.
అతని రొమ్మున నున్నవాడు, కాంతితో వెలుగొందు పవిత్రుడు, సామ వేదమను పేరు గల రుద్ర రూపుడు, తలచినంతనే యీతడు సూర్యుని వలె పాపము లన్నింటిని అప్పటి కప్పుడు పటాపంచలు చేయును.
ఏతే త్రయో మహావేదా బ్రహ్మన్ దేవా స్త్రయః స్మృతాః,
ఏతే వర్ణాఅకారాద్యాః సవనా న్యత్ర వై ద్విజ.
బ్రాహ్మణోత్తమా! ఈ మువ్వురు మహా వేదములు. ఈ మువ్వురిని దైవములుగా మనుజులు స్మరింతురు. ఇవియే ఆకారము మొదలుగా గల వర్ణములు. ఓయీ! ద్విజుడా! యజ్ఞము లన్నియు ఇందే నెలకొని యున్నవి.
ఏతత్సర్వం సమాసేన కథితం తే ద్విజోత్తమ,
గృహాణ వేదాన్ శాస్త్రాణి సర్వజ్ఞత్వం చ నారద.
బ్రాహ్మణోత్తమా! నారదా! నీకు దీని నంతటిని సంగ్రహముగా చెప్పితిని. వేదములు, శాస్త్రములను, సమస్త జ్ఞానమును, ఇదిగో కైకొనుము.
ఏతస్మిన్ వేదసరసి స్నానం కురు మహావ్రత,
కృతే స్నానేన్యజన్మీయం యేన స్మరసి సత్తమ.
ఉత్తముడా! గొప్ప వ్రతము లాచరించిన వాడా! ఈ వేదమనెడి కొలను యందు స్నానము చేయుము. అట్లు స్నాన మాడినచో నీకు పూర్వ జన్మముల జ్ఞానము గుర్తునకు వచ్చును.
ఏవ ముక్త్వా తిరోభావం గతా కన్యా నరాధిప,
అహం తత్ర కృతస్నాన స్త్వాం దిదృక్షు రిహాగతః.
రాజా! ఆయమ యిట్లు పలికి అదృశ్యు రాలయెను. నేనును అందు స్నానము గావించి నిన్ను చూడ గోరి యిట కరుదెంచితిని.