పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
80 - శర్మిష్ఠి దేవయా న్యోర్వర్తన వర్ణనమ్
పిప్పల ఉవాచ - పిప్పలుడు పలికెను.
బ్రాహ్మణోత్తమా! యయాతి మహారాజు కామకన్యను వివాహమాడిన తరువాత అతనికి పూర్వభార్యలైన పరమపావనులు దేవయాని వృషపర్వుని పుత్రిక శర్మిష్ట ఏమి చేసిరి? నా ముందు వారి చరితమునంతను తెలుపుడు.
యయాతి మహారాజు కామకన్యను తన ఇంటికి తీసుకొని రాగా అభిమానవతి అయిన దేవయాని అధికముగా అసూయ చెందినది. ఆ కామకన్య కోసమే కోపముచే కలత చెందిన మనసు కలవాడై మహారాజు కొడుకులను శపించెను. శర్మిష్ఠను పిలిచి పెద్దగా అరచెను. శర్మిష్ణా దేవయానులిద్దరు రూపముతో తేజస్సుతో దానములతో సత్యపుణ్యవ్రతములతో కామకన్యతో పోటీపడిరి. ఆ కామకన్య శర్మిష్ణా దేవయానుల దుష్టభావమును తెలిసెను. వెంటనే దానినంతయూ రాజునకు చెప్పెను. అంతట కోపించిన యయాతి మహారాజు యదువును పిలిచి శర్మిష్ణా దేవయానులను వధించమని నాకు శ్రేయమును చేయదలచినచో ఈ పనిని చేయుమని పలికెను. ఇట్లు యయాతి మహారాజు మాటలను వినిన యదువు తండ్రితో ఇట్లు బదులు పలికెను. 'ఏ దోషమూ లేని తల్లులను నేను చంపజాలను. వేదపండితులు మాతృహత్య మహాపాపమని చెప్పియున్నారు. కావున నేను ఆ ఇద్దరిని చంపలేను. తల్లి వేయి తప్పులను చేసిననూ చెల్లెలు పుత్రిక తప్పులు చేసిననూ పుత్రులు సోదరులు చంపరాదు. ఈ విషయమును తెలిసిన నేను తల్లులను చంపజాలను.”
యదువు వాక్యమును వినిన యయాతి మహారాజు కోపించెను. తరువాత పుత్రుని శపించెను. నా శాపముతో కలుసితుడవై తల్లి అంశను పొందుము. ఇట్లుయదువును శపించిన యయాతి మహారాజు అశ్రుబిందుమతితో కలిసి విష్ణువు ధ్యానముతో సుఖభోగముతో రమించుచుండెను. ఆ అశ్రుబినుమతి కూడా అతనితో కలిసి మనసునకు నచ్చిన పుణ్యభోగములను రమించుచుండెను. యయాతి మహారాజునకిట్లు కాలము గడుచుచుండెను. యయాతి రాజ్యములోని ఇతర ప్రజలు కూడా నాశము జర లేనివారుగా నుండిరి. అన్ని లోకములు లోకులందరూ విష్ణుధ్యానపరాయణులుగా నుండిరి. పిప్పలా! తపస్సుతో సత్యభావముతో విష్ణుధ్యానముతో ప్రజలందరు మహానుభావులుగా సాధుసేవకులుగా సుఖవంతులుగా నుండిరి.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థ వర్ణనమున యయాతి చరితమున ఎనుబదియ - అధ్యాయము.
