పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

48 - ఉగ్రసేన సతీపద్మావతీ చరితమ్

 బ్రాహ్మణ్యువాచ - బ్రాహ్మణి పలికెను.

మాధురరాజ్యమున మధురానగరమున యదువంశవీరుడు, శత్రువీరసంహర్త ఉగ్రసేనుడను ప్రసిద్ధుడైన రాజు కలడు. అతను సర్వధర్మార్థతత్వజ్ఞుడు, వేదములు తెలిసినవాడు, శాస్త్రములను చదివినవాడు, బలవంతుడు, దాత, భోక్త గుణములను గ్రహించినవాడు. సద్గుణములను తెలిసినవాడు. మేధావి. ప్రజలను ధర్మముగా పాలించుచు రాజ్యమును చేయుచుండెను. ఇట్లు మహాతేజస్వి, ప్రతాపవంతుడైన ఉగ్రసేనుడు విదర్భరాజైన ప్రతాపవంతుడైన సత్యకేతు మహారాజు పుత్రిక పద్మాక్షీ, కమలానన పద్మావతి అను పేరు కలది, సత్యధర్మపరాయణురాలు, ఆమె రెండవ లక్ష్మివలె సకల స్త్రీగుణసంపన్నురాలు, సత్యకారణములైన స్వగుణములతో శోభించుచుండెను. ఆ కన్యను మధురారాజైన ఉగ్రసేనుడు వివాహమాడెను. ప్రతాపవంతుడైన ఉగ్రసేనుడు ఆమెతో సుఖముగా రమించెను. ఆమె గుణములతో చాలా ప్రసన్నుడాయెను. ఆమెతో సుఖముగా నుండెను. ఆమె స్నేహముతో ప్రీతితో మధురేశ్వరుడు ముగ్ధుడాయెను. మహాభాగ్యము కల పద్మావతీదేవి అతనికి ప్రాణాధికప్రియురాలాయెను.

పద్మావతి లేకుండా భుజించలేదు. ఆమెతోనే క్రీడించుచుండెను. ఆమె లేకుండగా సుఖమును, భోగములను కూడా సేవించకుండెను. ఇట్లు ఆ దంపతులు పరస్పరము పరమోత్తములుగా ఒకరికొకరు ప్రీతిని కలిగించువారలుగా నుండిరి. స్నేహము కలవారు సుఖసంప్రీతిదాయకులుగా నుండిరి. అంతలో ఒకసారి సత్యకేతువు రాజేన్లుడు తన పుత్రికయైన పద్మావతిని స్మరించెను. అతని భార్య కూడా పద్మావతి తల్లి పుత్రిక కొరకు దుఃఖించుచుండెను. అపుడు విదర్భరాజు మధురానగరమునకు దూతను పం పెను. ఉగ్రసేనుడు నరవీరులలో శ్రేష్ఠుడు. అతనితో ఆదరముగా ఆ దూత ఇట్లుపలికెను. “విదర్బాధిపతి వీరుడు భక్తితో, స్నేహముతో, సంతోషింపచేయుచు తన క్షేమమును తెలుపుచు తమ కుశలమును అడుగుచున్నాడు. సత్యకేతు మహారాజు తమను ఇట్లు ప్రశ్నించుచున్నాడు. అతని పుత్రికయైన పద్మావతిని ఒకసారి దర్శించుటకు పంపుడు. మీరు ఆ రాజుగారి ప్రీతి, స్నేహములను తలచుచున్నచో పంపుడు. తమకు ప్రీతి కలిగించు ప్రియురాలగు పద్మావతిని పంపుడు. వాత్సల్యముతో ఉత్కంఠతో మహారాజు శోకముతో అనువర్తించుచున్నాడు.’

            అంతట ప్రతాపవంతుడైన ఉగ్రసేనమహారాజు దూత వాక్యములను విని మహానుభావుడైన సత్యకేతువుపై స్నేహముతో, ప్రీతితో సౌహార్ధముతో ప్రియభార్యను పద్మావతిని తండ్రి ఇంటికి పం పెను. భర్త పంపగా పద్మావతి తన మొదటి ఇంటికి వెళ్ళేను. గొప్ప సంతోషము నిండినదాయెను. తండ్రిగారి పూర్వకుటుంబమును చూచెను. సత్యతత్పరురాలైన పద్మావతి వినయముతో తండ్రి పాదములకు నమస్కరించెను. పద్మావతి రాగానే మహారాజు విదర్భాధిపతి మహాసంతోషమును పొందెను. ఆమె దానములతో, గౌరవములతో వస్త్రాలంకారభూషణములతో చక్కగా లాలించబడి తండ్రిగారింట్లో సుఖసంతోషములతో నుండసాగెను. చెలులతో కలసి బిడియము లేకుండా బాల్యములోనున్నట్లే తండ్రిగారింట్లో రమించుచుండెను. ఇంటిలో, తోటలలో, తడాగములలో, భవనములో మరల చిన్నపిల్ల అయినట్లు బిడియము, సంకోచము లేకుండగా ప్రవర్తించసాగెను. ఆమె పతివ్రత. మహానుభావురాలు. మహాసంతోషముతో కూడినదాయెను. తండ్రి ఇంట్లో లభించు సంతోషము మామగారింట్లో ఎట్లు లభించును. ఇంతటి సంతోషము ఎపుడు లభించును అని భావించి తండ్రి ఇంట్లో రమించుచుండెను. ఈ మోహభావముతో క్రీడలమీది వ్యామోహముతో ఆ వరానన పద్మావతి చెలులతో కలిసి వనములలో ఉపవనములలో ఆడుచుండెను.

            ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబదియెనిమిద - అధ్యాయము.