పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

76 - ఇంద్రాయ యయాతి కర్మనివేదన పురస్సరం యయాతే స్వర్గానయనాయ ప్రార్థనమ్

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

యమధర్మరాజు దూతలందరితో కలిసి దేవబృన్దములతో కూడియున్న ఇంద్రుని చూచుటకు వెళ్ళేను. వచ్చుచున్న ధర్మరాజును సురరాజు చూచెను. త్వరగా లేచి ఉత్తమమైన అర్ఘ్యమునిచ్చెను. రాక కారణమును అడిగెను. నా ముందు అంతయూ చెప్పుమనెను. దేవరాజు మాటలాడినదంతయూ వినిన యమధర్మరాజు యయాతి గొప్ప చరితమునంతయూ వివరించెను. 'దేవదేవేశా! నా ఆగమన కారణమును వినుము. విష్ణుభక్తుడైన నహుషపుత్రుడైన యయాతి మహానుభావుడు భూలోకమున నున్న మానవులందరూ వైష్ణవులుగా చేయబడిరి. భూలోకమునకు వైకుంఠముతో సమానరూపమును ఏర్పరిచెను. అచటి మానవులు మరణ వృద్దాప్యము రోగములు లేనివారైరి. వారు పాపమునే చేయుట లేదు. అబద్దమునాడుట లేదు. కామక్రోధలోభ మోహములు లేనివారైరి. అందరూ మహానుభావులే. అందరూ దానశీలులే. అందరూ ధర్మపరాయణులే. అనామయుడైన శ్రీమన్నారాయణుని అన్ని ధర్మములతో వైష్ణవధర్మములతో భూమండలమున మానవులు అర్చించుచున్నారు. రోగములు శోకములు లేనివారు అందరూ స్థిరమౌవనులు. గరిక వటవృక్షముల వలె విస్తరించుచున్నారు.

ఇట్లు యయాతి రాజ్యములోని ప్రజలందరూ పుత్రులతో పౌత్రులతో ప్రపౌత్రులతో మరల వారి పుత్ర పౌత్రప్రపౌత్రులతో ఒక వంశమునుండి ఇంకొక వంశమునకు ఇట్లు విస్తారమును పొందిరి. ఇట్లు నహుష పుత్రుడు యయాతి మర్త్యలోకమంతయూ విష్ణుభక్తి ప్రపూర్ణము జరామృత్యు వివర్జితముగా చేయబడినది. నేను నా పదమునుండి భ్రష్టుడనైతిని. నా వ్యాపారము శూన్యమైనది. ఇట్లు నా కర్మ వినాశనమును నీకు చెప్పితిని. ఈ విషయమును తెలుసుకొని ఈ లోకమునకు హితమును చేయుము. నీవు అడిగిన విధముగా అంతయూ చెప్పితిని. ఈ కారణము వలననే నీ వద్దకు వచ్చితిని.”

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను.

ధర్మ ఉవాచ - ధర్మరాజు పలికెను.

‘ధర్మరాజేంద్ర నేను మొదటనే మహాత్ముడైన యయాతిని స్వర్గమునకు రప్పించుటకు దూతను పంపితిని. దూత కూడా అతనితో మాటలాడెను. నేను స్వర్గమును కోరుట లేదు. నేను స్వర్గమునకు రాబోను. ఈ భూమండలమునే స్వర్గరూపముగా చేతును అని యయాతి మహారాజు పలికెను. అదే రీతిలో ప్రజాపాలనను చేయుచున్నాడు. అతని ధర్మప్రభావముచే భయపడుచూ అన్నివేళలా ఉన్నాను.” ఇట్లు ఇంద్రుడు పలుకగా యమధర్మరాజు మరల ఇట్లు పలికెను. 'దేవరాజా! మహానుభావా! నాకు ప్రియమును చేయగోరినచో ఏదో ఒక ఉపాయముతో ఆ రాజశ్రేష్ఠుని స్వర్గమునకు తీసుకొని రమ్ము!' ఇట్లు యమధర్మరాజు మాటలను వినిన సురాధిపుడింద్రుడు అన్నివిధములుగా ఆ మేధావి ఆలోచించసాగెను. అంతట ఇంద్రుడు మన్మధుని గంధర్వులను వసంతుని రతిని పిలిచి మహామనస్వి తమ ముందుకు రప్పించెను. నాచేత ఆజ్ఞాపించబడిన మీరు సంశయించుకుండగా భూలోకమునకు వెడలి యయాతి మహారాజు స్వర్గమునకు వచ్చునట్లు చేయుడు అని పలికెను. అంతట ఇంద్రుని పలుకులను విని మన్మధుడు ఇట్లు పలికెను.

కామ ఉవాచ - మన్మధుడు పలికెను.

'నేను మీ ఇద్దరికి ప్రియమును పుణ్యమును చేయుదును. ఇందులో సందేహము లేదు. యుద్దములో సమానముగానున్న రాజును నన్ను చూడుము.' ఇట్లు పలికి వారందరు యయాతి మహారాజున్న చోటికి వెళ్ళిరి. కామాదులందరూ నటరూపముతో నాటకకర్మతో వెడలిరి. ఆశీస్సులతో రాజును అభినందించి నాటకమును గూర్చి పలికిరి. యయాతి మహారాజు వారి మాటలు విని పండితులతో కలిసి దేవరూపమైన సభను ఏర్పరచెను. జ్ఞానవిజ్ఞాన కోవిదుడైన యయాతి మహారాజు కూడా స్వయముగా ఆ సభకు వచ్చెను. వారి ఆ నాటకమును చూచుచున్న యయాతి మహారాజు వామనుని చరితము విప్రునిగా ఉత్పత్తి వామన రూపములో సాటిలేని విధము, చక్కని స్వరముతో ఉత్తమగానము ఆర్యారూపముతో గానము చేయుచుండిరి. ఆమె గీతవిలాసముతో, లలిత హాస్యముతో, మధురాలాపములతో మన్మధుని మాయతో వారి భావముతో దివ్యచరితముతో బలిరూపమును వింధ్యావతీరూపమును ఉన్నదున్నట్లుగా వామనరూపమును మన్మధుడు వేసెను. సూత్రధారుడు స్వయముగా మన్మధుడు. వసత్తుడు పారిపార్శ్వకుడు. నటీవేషమును రతి వేసెను. నృత్యకర్మలో నేపధ్యాన్తశ్చరముగా ప్రవర్తించేను. మహాప్రాజ్ఞుడైన మకరందుడు మహారాజును క్షోభింపచేసెను. ఆ యయాతి మహారాజు నృత్యమును చూచుచు గానమును వినుచుండగా నటీవిలాసముతో మహానుభావుడు మోహమును చెందెను.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థ వర్ణనమున యయాతి చరితమున డెబ్బది యార - అధ్యాయము.