పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
21 - అధ్యాయము
సూతమహర్షి పలికెను.
ఒకానొక సమయమున వ్యాసభగవానుడు జగత్పతియగు బ్రహ్మను అత్యాశ్చర్యముతో సువ్రతుని చరితమునంతయూ అడిగెను.
వ్యాసమహర్షి పలికెను.
లోకరూపా! లోకస్రష్టా! దేవదేవ! మహాప్రభూ! ఇపుడు నేను సువ్రతుని చరితమును వినగోరుచున్నాను.
బ్రహ్మ పలికెను.
మహానుభావా! పరాశరపుత్రా! వ్యాసా! సద్రాహ్మణుడగు సువ్రతుని తపశ్చర్యతో కూడియున్న పావనము ఉత్తమమగు చరితమును వినుము. సువ్రతుడను మేధావి గర్భములోనుండగనే పురుషోత్తముడగు శ్రీమన్నారాయణుని దర్శించెను. ఆ సంస్కారముతో బాల్యము నుండియే నారాయణుని ధ్యానించుచుండెను. పూర్వజన్మకర్మ సంస్కారముతో శ్రీహరి ధ్యానములో మునిగియుండెను. శంఖచక్రధరుడు, పద్మనాభుడు, మోక్షప్రదుడగు శ్రీహరిని స్మరించుచుండెను. గానమున జ్ఞానమున, పాఠమున, ఎల్లపుడూ ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీహరినే ధ్యానించుచుండెను. అతను తోటిపిల్లలతో ఆడుచున్ననూ బాలకులకు తనకు శ్రీహరినామమునే పెట్టుచు పిలుచుచుండెను. ఓ కేశవా! రమ్ము! రమ్ము! మాధవా! చక్రధారీ! రమ్ము! ఓ పురుషోత్తమా! నీవు నాతో కలిసి ఆడుము. ఓ మధుసూదనా! మనము ఒకేతీరుగా కలిసి నడువవలయును. ఇట్లు ఆ బ్రాహ్మణుడు శ్రీహరినామముతోనే పిలుచుచుండెను. ఆటలో, చదువులో, నవ్వులాటలో, శయనమున, గానములో, చూచుటలో, యానమున, కూర్చునుటలో, ధ్యానమున, మంత్రమున, జ్ఞానమున, మంచిపనులలో జనార్దనుని జగన్నాధుని చూచుచుండెను. చెప్పుచుండెను. అతను విశ్వనాధుడు మహేశ్వరుడగు శ్రీమన్నారాయణుని ఒక్కని మాత్రమే ధ్యానించుచుండెను. గడ్డిపరకలో, కట్టెలో, రాయిలో, ఎండినదానిలో, తడిసినదానిలో అన్నింటా పుండరీకాక్షుని గోవిందుని, కేశవుని చూచుచుండెను. ఆకాశమున, భూమిమధ్యమున పర్వతములలో, వనములలో, జలములో, స్థలములో, పాషాణములో జీవులలో మహామతియగు సువ్రతుడు నారసింహుని చూచుచుండెను. ఇట్లు బాలక్రీడలో సుమనాపుత్రుడు ప్రతిదినము ఆనందించుచుండెను. చక్కని రాగములతో తీయని అక్షరములతో మంచి పాటలతో శ్రీకృష్ణుని లయతో కూడిన తాలములతో మూర్చనాదులలో సుస్వరములతో గానము చేయుచుండెను.
సువ్రతుడు పలికెను.
వేదజ్ఞులు ఎల్లపుడూ తన శరీరమున సకల ప్రపంచమును నిలుపుకొనిన యోగేశ్వరుని సకల పాపవినాశకుని ధ్యానము చేయుచుందురు. అట్టి మధుసూదనుని పాదమును రక్షకముగా స్వీకరించుచున్నాను. అఖిలలోకములందనుండువాడు, అఖిలలోకములను తనలో నిలుపుకొనువాడు, సకలదోషరహితుడు అగు పరమేశ్వరుని పాదములకు ఎపుడూ నమస్కరించెదను. సకలగుణములకు ఆటపట్టు, అనంతవీర్యుడు, ఉపనిషత్తులచే పరిశుద్ధి చేయబడిన బుద్ధి కలవారు నిత్యము స్తుతింతురు. అనంతము అగాధము దుర్గమము అగు సంసారసాగరమును తరించుటకు శరణువేడుచున్నాను. యోగీంద్రుల మానససరోవరమున రాజహంస, పరిశుద్దుడు, సకల విధముల ప్రభావము కలవాడు అగు శ్రీహరి పరిశుద్దములు విశాలములగు పాదయుగలమును శరణుపొందుచున్నాను. రాక్షస రిపూ! నాకు రక్షనిడుము. సకల జగన్నివాసుని, సకల జగత్పతిని అఖిలదుఃఖాంధకారములను నశింపచేయు చంద్రుని, లోకపాలన కొరకు ధర్మనిర్మాణమును గావించినవానిని, సత్యసమేతులు, సకలలోకగురువును, సురేశుని శరణువేడుచున్నాను. చక్కని రసముకల తాలము. రాగములుకల గానములతో సకల భువనక్రీడనమని శ్రీరంగని ఒక్కని మాత్రమే కీర్తించెదను. అజ్ఞాననాశకుని, జ్ఞానపద్మమునకు సూర్యునివంటివానిని ఆనందని ధానమును సకలుని మహిమాసమేతుని కీర్తించెదను. అమృతనిధనుని, సకలకలానిధానుని గీతకుశలుని అనన్యరసములతో గానము చేసెదను. స్వయోగకరణములతో కూడియున్నవానిని, పరమార్ధదృష్టిని సకల చరాచర జగమును నిత్యము కటాక్షించువానిని స్మరించెదను. పాపులచే చూడజాలనివానిని ఆ కేశవుని శరణువేడుచున్నాను. ఇట్లు రెండు చేతులతో తాళము కొట్టుచు గానము చేయుచు బాలకులతో కలిసి ఆనందించుచుండెను.
ఇట్లు సుమనాపుత్రుడగు సువ్రతుడు బాలభావముతో క్రీడారతుడైననూ సర్వకాలములందు విష్ణుధ్యానపరాయణునిగా నుండెను. ఇట్లు ఆడుచున్న సువ్రతుని తల్లి యడిగెను. ఆకలి నిన్ను బాధించును. కావున నాయనా! భోజనము చేయుము అని. ప్రాజ్ఞుడగు సువ్రతుడు తల్లితో ఇట్లు పలికెను. హరిధ్యానరసమను మహామృతముతో తృప్తిపొందియున్నాను. భోజనాసనమును అధిష్ఠించినవాడు మిష్టాన్నమును చూచును. ఈ అన్నము స్వయముగా విష్ణువే. ఆత్మ అన్నమును ఆశ్రయించును. ఆత్మరూపమున నున్న విష్ణువు ఈ అన్నముతో తృప్తిని పొందించును. క్షీరసాగరమున శయనించియున్న స్వామి ఈ పుణ్యమగు జలముతో తృప్తిని పొందుగాక. ఈ తాంబూలచందనములతో, అందమైన పూవులతో ఆత్మస్వరూపముతో కేశవుడు తృప్తిని పొందుగాక. ధర్మాత్ముడు శయ్యను చేరినపుడు శ్రీకృష్ణభగవానుని ధ్యానించవలయును. అదికూడా యోగనిద్రిరతుడగు శ్రీకృష్ణభగవానుని ధ్యానించవలయును. ఇట్లే భోజనమునందు, వస్త్రధారణయందు ఆసనమున, శయనమున బ్రాహ్మణుడు వాసుదేవుని ధ్యానించవలయును. ఈ ఉపచారములన్నింటిని వాసుదేవునికి ఏర్పరచవలయును. ధర్మాత్ముడు యౌవనసమయమున కామభోగములను విడిచి కేశవధ్యానమున మునిగి, వైడూర్యపర్వతోత్తమున పాపనాశకమగు శ్రీవైష్ణవలింగమును ఓంకారసంజ్ఞమగు రుద్రుని ధ్యానించవలయును. ఈ లింగమే నర్మదాతీరమున బ్రహ్మచే వృద్ధిచేయబడినది. ఇట్లు సిద్దేశ్వరుని ఆశ్రయించి తపమునాచరించవలయును.
ఇది శ్రీపద్మపురాణమున పంచపంచాశత్సంహితలో రెండవదగు భూమిఖండమున ఐంద్ర సుమనోపాఖ్యానమున ఇరువదొకట - అధ్యాయము.
