పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

31 - అధ్యాయము

         సూతమహర్షి పలికెను.

అంతట మహాతేజశ్శాలియగు అంగుడు ఇంద్రుని భోగమును విలాసమును మహానుభావుని విలాసమును చూచి నాకు ఇంద్రసముడు ధర్మాత్ముడగు పుత్రుడెట్లు కలుగును అని ఒక క్షణము ఆలోచించి సత్యపరుడగు అంగుడు తన ఇల్లును చేరుకొనెను. తరువాత తన తండ్రియగు అత్రికి తలవంచి నమస్కరించి ఇట్లడిగెను. ‘ఎలాంటి పుణ్యసమాచారము కలవాడు ఇంద్రపదవిని అనుభవించును. ఇది ఏ పుణ్యఫలము? ఎలాంటి కర్మ ఏమి కర్మ ఇంద్రుడు చేసెను. ఈ పదవికి ఎంతటి తపమునాచరించవలయును? ఎవరిని పూజించవలయును? ఎవరిని పూజించేను? సత్యవంతులలో శ్రేష్టుడా? నాకు ఈ విషయమును విస్తరముగా వివరించుము.’

              అత్రి పలికెను.

పుణ్యాత్ముడా! బాగు! బాగు. నీవిట్లు అడుగుచుంటివి కావున ఇంద్రుని చరితమును నేను చెప్పెదను వినుము. పూర్వము సువ్రతుడను మేధావి బ్రాహ్మణోత్తముడు తపమునాచరించి శ్రీమన్నారాయణుని ఆరాధించి మెప్పించెను. అతను కశ్యపుని వలన అదితియందు పుత్రునిగా జన్మించెను. శ్రీమహావిష్ణువు అనుగ్రహమువలన ఇంద్రత్వమును బొందెను.

నాకు కూడా ఇంద్రునంతటి పుత్రుడెట్లు కలుగును. నాకలాంటి పుత్రుడెట్లు కలుగును. నాకట్టి ఉపాయము తెలుపుము. మీరు జ్ఞానులలో శ్రేష్ఠులు.

మహానుభావుడగు సువ్రతుని పరిపూర్ణ చరితమును పరమపావనమును వినుము. పూర్వము మేధావియగు సువ్రతుడు హరినెట్లు ఆరాధించెనో అతని భక్తిశ్రద్ధలను, ధ్యానమును వినుము. అతని భక్తిశ్రద్దలను చూచి జగన్నాధుడు గొప్ప పదవిని ఇచ్చెను. అదియే ఇంద్రపదవి. ఇది సర్వభోగసమన్వితము. చరాచరజగత్తు మూడు లోకములు అతని పాలనలోనుండును. శ్రీమహావిష్ణువు అనుగ్రహమువలన ఇంద్రపదవిని అనుభవించుచుండెను. ఇట్లు నీకు ఇంద్రుని కథను వివరించితిని. సద్భావముతో భక్తితో గోవిందుడు సంతోషించును. ఇట్లు భక్తిచే సంతోషించిన శ్రీహరి అంతయూ ప్రసాదించును. కావున సర్వజగత్కారణభూతుడు సర్వప్రదుడు, సర్వజ్ఞుడు, సర్వబోధకుడు, పురుషోత్తముడగు శ్రీహరిని ఆరాధించి అతనినుండి నీవు కోరినదెల్లనూ పొందగలవు. ఆ జగన్నాధుడు సుఖమును, మోహమును పరమార్థమును ఇచ్చువాడు. కావున వెళ్ళి అతనిని ఆరాధించుము. ఇంద్రునంతటి పుత్రుని పొందగలవు. అట్లు అత్రిమహర్షి వాక్యమును పరమార్థమును విని అతని మాటలలోని సారమును గ్రహించి అతనికి నమస్కరించి బయలుదేరెను. బ్రహ్మపుత్రుడు, బ్రహ్మ అంతటివాడగు తండ్రి యాజ్ఞ తీసుకొని బంగారు శిఖరములతో రత్నశిఖరములతో కూడియున్న మేరుపర్వతమును చేరుకొనెను.

ఇది శ్రీపాద్మపురాణమున పంచపంచాశత్సహస్ర సంహితలో రెండవదగు భూమిఖండమున వేనోపాఖ్యానమున 31 - అధ్యాయము.