పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

78 - పితురాజ్ఞాం శ్రుత్వా త్రిభిఃపుత్రైః తదాజ్ఞా ప్రతాఖ్యానే యయాతినా తాన్ప్రతి శాపదానమ్

యయాతి రువాచ - యయాతి పలికెను.

‘పుత్రులారా! ఒకరు దుఃఖమునిచ్చు నా వార్ధక్యమును తీసుకొనుడు. మీలో ధీరుడైనవారు మీ యౌవనమును నాకిండు. నా ఈ ఉత్తమమైన స్వరూపము స్త్రీయందాసక్తమైన చంచలమైన నా మానసము సంతాపమునొందినది. పాత్రలోని నీటిని నిప్పు మరగబెట్టినట్లుగా నా మనస్సును కామానలము మరగచేయుచున్నది. పుత్రులారా! దుఃఖదాయకమైన నా వార్థక్యమును ఒకరు తీసుకొనుడు. మీ యౌవనమును నాకిండు. నా ఇచ్ఛానుసారముగా సంచరించెదను. నా జరను తొలగించిన ఉత్తమపుత్రుడు నా రాజ్యమును అనుభవించును. నా వంశమును ధరించును. అతనికి సౌఖ్యము చక్కని సంపద, ధనధాన్యములు, విపులమైన సంతతి, యశస్సు కీర్తి కలుగగలవు.

పుత్రా ఊచు - పుత్రులు పలికిరి.

సత్యవంతుడవై ప్రజల పాలించు ఓ రాజా! ప్రకృతి, చాపలమగు ఇటువంటి భావము నీకేల కలిగినది అని పుత్రులు పలికిరి.

రాజోవాచ - రాజు పలికెను.

పూర్వము నా పురమునకు నర్తకులు, ప్రవర్తకులు వచ్చియుండిరి. వారితో నా కామసంమోహమున మోహము కలిగినది. మన్మధావిష్ట మానసమైన నా దేహమున జర వ్యాపించినది. నా మనస్సు కామసమాకులమైనది. నేను ఒక దివ్యరూపముగల స్త్రీని చూచితిని. నేను మాటలాడితిని. కాని ఆ స్త్రీ ఏమీ పలుకలేదు. ఆమె సఖి విశాల చక్కని విచక్షణ కలది నాకు సౌఖ్యమును కలిగించు మాటలను పలికినది. నీవు జరాహీనుడవైనచో సుప్రియ నీదగును అని. నేనా వాక్యమును అంగీకరించితిని. ఇంటికి వచ్చితిని. నా జరను తొలగించుకొనుటకు ఇట్లు మాటలాడితిని. పుత్రులారా! ఇట్లు తెలిసి నాకు సుఖమును కలిగించుడు.

తురురువాచ - తురువు పలికెను.

‘రాజా! తలిదండ్రుల అనుగ్రహముల వలన పుత్రులు శరీరమును పొందెదరు. జ్ఞాని శరీరముతో ధర్మమునాచరించును. పుత్రులు విశేషించి తలిదండ్రులను సేవించవలయును. రాజా! ఇది నీకు యౌవనమును దానము చేయు కాలము కాదు. రాజా! నరులు మొదటి వయసులో విషయములను అనుభవించవలయును. ఇపుడు తమకు విషయభోగానుభవకాలము కాదు. నాన్నగారూ! పుత్రునికి జరను ఇచ్చి ఆ తరువాత సుఖమును అనుభవించవలయును అనగా మీకు తరువాత జీవితమే ఉండదు. కావున మహారాజా! మీ మాటను నేను చేయజాలను. ఇట్లు మహారాజుతో తురువు పలికెను. తురువు మాటలను వినిన యయాతి మహారాజు కోపించెను. క్రోధముతో ఎట్టబడిన కనులు కలవాడై మహారాజు తురువును శపించెను. “పాపబుద్దీ! నీవు నా ఆదేశమును తిరస్కరించితివి. కావున నీవు పాపివి. సకల ధర్మబహిష్కృతుడవు కమ్ము! నీవు శిఖావిహీనుడవు. వేదశాస్త్రవర్జితుడవు కాగలవు. సర్వాచారహీనుడవు కాగలవు. బ్రహ్మఘాతకుడవు. దేవదూషితుడవు, సురాపానము చేయువాడవు, సత్యవర్జితుడవు, ఘోరమైన కర్మలను చేయువాడవు కాగలవు. సురాపానమత్తుడవు, ఆకలి దప్పి గోహంతకుడవు కాగలవు. చర్మవ్యాధి కలవాడవు, కచ్చావిహీనుడవు, బ్రాహ్మణులను ద్వేషించువాడవు, స్వరూపము లేనివాడవు కాగలవు. పరదారలతో రమించువాడవు, మహాక్రూరుడవు, లంపటుడవు, సర్వభక్షకుడవు, దుష్టబుద్ధివి కాగలవు. సగోత్రస్త్రీని రమించెదవు. సకల ధర్మములను నశింపచేయువాడవు, పుణ్యజ్ఞానములు లేనివాడవు, కుష్టువ్యాధి కలవాడవయ్యెదవు. నీ పుత్రులు, పౌత్రులు కూడా ఇట్టివారు, సర్వపుణ్యములను నశింపచేయువారు, మ్లేచ్ఛులు కలుషబుద్దులు అయ్యెదరు. ఇట్లు తురువును బాగా శపించి యదువను పుత్రునితో ఇట్లు పలికెను. నా జరను స్వీకరించి అకంటకమైన రాజ్యమును అనుభవించుము.

యదురువాచ - యదువు పలికెను.

రాజోవాచ - రాజు పలికెను.

యదురువాచ - యదువు పలికెను.

రాజోవాచ - రాజు పలికెను.

అంతట యదువు చేతులు జోడించి రాజుతో ఇట్లు పలికెను. నాన్నగారూ! జంభారమును సహింపజాలను. నా యందు దయచూపుడు. చలి, దారి తీసిన అన్నము వయసుమీరిన స్త్రీలు మనస్సునకు ప్రాతికూల్యము, ఈ అయిదు జరకు హేతువులు.

మహారాజా! కొత్తవయసులో జరాదుఃఖమును సహించజాలను. నేనే కాదు. ఎవరు మాత్రము జరను ధరించగలరు? ఇపుడు నన్ను క్షమించుడు. అంతట కోపించిన యయాతి మహారాజు యదువును శపించెను. “నీ వంశము ఎపుడూ రాజ్యారము కాదు. బలము, తేజస్సు, క్షమ లేనివాడవు, క్షాత్రధర్మవిహీనుడవు నా ఆజ్ఞను కాదనినందున కాగలవు. అనగా యదువు మరల ఇట్లు పలికెను. నేనే తప్పూ చేయలేదు. నన్నెందుకు శపించుచున్నారు. దీనుడనైన నాయందు దయచూపుము. అనుగ్రహసుముఖుడవు కమ్ము అనగా రాజిట్లు పలికెను. “సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వాంశతో నీ కులములో అవతరించి విసృష్టిని చేయును. అపుడు నీ కులము పరిశుద్ధమగును.” అనగా మరల యదువిట్లు పలికెను. “మహారాజా! నేను నీ పుత్రుడను. ఏ దోషమూ చేయనివాడను. తాము శపించితిరి. నాయందు దయ ఉన్నచో అనుగ్రహమును ప్రసాదించుడు అనగా రాజిట్లు పలికెను. తండ్రి దుఃఖమును నశింపచేయు జ్యేష్ఠపుత్రుడు రాజ్యభారమును వహించును. కులభారమును వహించును. నీవు ధర్మముగా ప్రవర్తించలేదు. నీతో మాట్లాడదగనివాడవు. ఇందులో సందేహము లేదు. నా ఆజ్ఞను నీవు వధించగల మహాదండముతో నశింపచేసితివి. కావున నీపై నాకు దయలేదు. నీ ఇష్టమొచ్చినరీతిలో ప్రవర్తించవచ్చును.

యదురువాచ - యదువు పలికెను.

'రాజా! నా రాజ్యమును కులమును రూపమును నశింపచేసితివి. కావున నేను దుష్టుడనై నీ వంశపతి నయ్యెదను. నీ వంశమును నానా భేదములు కల క్షత్రియులు పుట్టెదరు. వారి గ్రామములను చక్కని దేశములను స్త్రీలను రత్నములను అతిభయంకరులు, మహాబలులు అనుభవించెదరు. నా వంశములో పుట్టిన తురుష్కులు మ్లేచ్చరూపులై అనుభవించెదరు. నీవు పరమభయంకరముగా శపించి నశింపచేసిన వారందరూ అనుభవించెదరు. ఇట్లు కోపించిన యదువు పలికెను. అంతట కోపించిన యయాతి మహారాజు మరల ఇట్లు శపించెను. “నీ వంశములోని వారందరూ నా ప్రజలను నశింపచేసెదరు. బాగా వినుము. సూర్యుడు చంద్రుడు నక్షత్రుములున్నంతవరకు మ్లేచ్ఛులు కుంభీపాక గౌరవనరకముల ననుభవించెదరు. ఆ తరువాత యయాతి మహారాజు బాలుడు, ఆడుకొనుచున్న కురువును చూచి సకల లక్షణ సంపన్నుడుగానున్నను రాజు అతనిని పిలువలేదు. అతను శిశువని తెలిసి రాజు విడిచిపెట్టెను. శర్మిష్ణా పుత్రుడు పుణ్యాత్ముడు అయిన పూరువును జగదీశ్వరుడైన యయాతి పిలిచి నా జరను తీసుకొనుము నేనిచ్చిన రాజ్యమును శత్రువులు లేని పుణ్యప్రదమును అనుభవించుము అని.

పూరురువాచ - పూరువు పలికెను.

‘తమ తండ్రిగారనుభవించినట్లుగా రాజ్యమును తామే అనుభవించుడు. మీ ఆజ్ఞను పాలించెదను. మీ వృద్దాప్యమును నాకిండు. నా యౌవనముతో ఇపుడే తాము సుందరరూపమును ధరించి విషయాసక్తచేతనుడవై మంచి కర్మలనాచరించుము. భోగములననుభవించుము. ఆ సుందరితో కోరుకున్నంత కాలము విహరించుము. నేను బ్రతికున్నంత కాలము జరను ధరించెదను. పూరువిట్లు పలుకగా యయాతి మహారాజు గొప్ప సంతోషము కలవాడై పూరుతో ఇట్లు పలికెను. 'నాన్నా! నా ఆజ్ఞను భంగపరచలేదుగాన నీకు బహుసౌఖ్యప్రదమైనదానిని ఏర్పరచెదను. నా ముసలితనమును స్వీకరించి నీ యౌవనమునిచ్చితివి గాన నేనిచ్చిన రాజ్యమును అనుభవించుము.' ఇట్లు మహారాజు పలుకగా ఆ పూరువు కూడా అతనినుండి జరను తీసుకొని తన యౌవనమును అతనికి ఇచ్చెను. ఇట్లు తండ్రీకొడుకులు వయోవినిమయమును చేసుకొనిన తరువాత అపుడు పూరువు సర్వాజ్ఞములందు వృద్ధతరునిగా కనిపించెను. యయాతి మహారాజు కూడా 16 వత్సరములవానివలె కొత్తగా కనిపించెను. గొప్ప రూపసంపద కలవాడై రెండవ మన్మధుని వలె కనిపించెను. ధనువును రాజ్యమును ఛత్రమును వ్యజనమును ఆసనమును భద్రగజమును కోశమును దేశమును సకల బలమును చామరములను స్యందనమును యయాతి మహారాజు పూరువునకిచ్చెను. కామాసక్తుడై మహారాజు ఆ నారిని చింతించుచు కామమను పేరుగల సంద్రము వంటి ఆ సరస్సును అశ్రుబిందువులు ఉన్నచోటికి త్వరగా వెడలెను. విశాలాక్షి అందమైన బలిసిన చన్నులుగల ఆ యువతిని చూచి విశాలను కూడా చూచి మన్మధాకృష్టమానసుడాయెను.

రాజోవాచ - రాజు పలికెను.

విశాలోవాచ - విశాల పలికెను.

రాజోవాచ - రాజు పలికెను.

'అందమైన కన్నులుగల విశాలా! జరను విడిచి పెట్టి వనమును తీసుకొనివచ్చితిని. యువకుడనై వచ్చితిని. ఇక ఇప్పుడీమె నా సుందరి కావలయును. ఈమె కోరినవాటిని అన్నిటినీ ఇచ్చెదను' అనగా విశాల ఇట్లు పలికెను. 'దుష్టమైన జరను విడిచి మీరు వచ్చితిరి గాని తమలో ఇంకొక దోషమును చూచి ఈమె తమను అంగీకరించుట లేదు.' అనగా రాజు ఇట్లు పలికెను. 'ఒకవేళ నీకు తెలిసినచో నా దోషమును చెప్పుము. ఒకవేళ అది గుణమైననూ దోషమున్నచో విడిచిపెట్టెదను. ఇందులో సంశయము లేదు.’

 ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థ వర్ణనమున యయాతి చరితమున డెబ్బది యెనిమిద - అధ్యాయము.