పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

12 - అధ్యాయము

సుమనోవాచ –

సుమన పలికెను.

ఇపుడు ఋణసంబంధియగు పుత్రుని గూర్చి మీ ముందు వివరించెదను. ఎవనినుండి ఋణము తీసుకొని, తీర్చక మరణించినవాడు, అట్లే ఋణమునిచ్చువాడు పుత్రునిగా కాని, సోదరునిగా కాని, తండ్రిగా కాని, ప్రియునిగా కాని పుట్టును. అట్టివాడు అతిదుష్టస్వభావము కలవానిగా నుండియు మిత్రరూపముతో నుండును. అతను గుణమును కూడా చూడడు. క్రూరుడు, నిష్ఠురాకృతి గలవానిగా నుండును. తనవారి విషయమున కూడా నిష్ఠురముగా మాటలాడును. ఇష్టమైన మిష్టాన్నమును భుజించును. ఎల్లపుడు దూతకర్మయందు ఆసక్తికలవానిగా నుండును. చోరకర్మయందు కుతూహలము కలిగియుండును. బలప్రయోగపూర్వకముగా ఇంటిద్రవ్యమును అనుభవించును. నివారించినచో కోపించును. ప్రతిదినము తల్లిని తండ్రిని నిందించుచుండును. తలిదండ్రులను పారదోలును. భయపెట్టును. అతనిష్ఠురముగా మాటలాడును. ఇట్లు తలితండ్రుల ధనమును అనుభవించుచు సుఖముగా నుండును. బాల్యమున జాతకర్మాదులతో ద్రవ్యమును హరించును. యౌవనమున పునర్వివాహాదులతో ఇతర సంబంధములతో పలు విధములుగా ద్రవ్యమును హరించుచుండును. ద్రవ్యమిట్లు లభించును. అట్లే వ్యయమగును. ఇట్లు ఇల్లు, పొలము, ఇతర ఆస్తులు అన్నీ నావే. ఇందులో ఏ సంశయము లేదు అని పలుకుచు ప్రతిదినము తలిదండ్రులను హింసించుచుండును. రాళ్ళతో రోళ్ళతో రోకళ్ళతో అతిభయంకరమగు ఆయుధములతో కొట్టుచుండును. తండ్రి మరణించినచో తల్లి విషయమున నిష్ఠురముగా, నిస్నేహముగా ప్రవర్తించును. ఆ పుత్రుడు ఎపుడు శ్రాద్ధాదికర్మల నాచరించడు. దానములను చేయడు. భూమండలమున ఇటువంటి పుత్రులు పుట్టెదరు.

ఇపుడు నీ ముందు శత్రుభావముతో నుండు పుత్రుని గూర్చి చెప్పెదను. బాల్యమున వనమున ఎల్లపుడూ శత్రుభావముతోనే యుండును. ఆ బాలుడు ఆడుచునే తలిదండ్రులను కొట్టుచుండును. అట్లు కొట్టి నవ్వుచు వెళ్ళుచుండును. మళ్ళీ అంతలోనే భయపడుచున్నవానివలె తలిదండ్రులవద్దకు వచ్చును. ఎపుడూ తలిదండ్రులయెడ కోపముతోనే యుండును. తలిదండ్రులను నిందించుచుండును. ఇట్లు ఎపుడూ శత్రుకర్మలోనేయుండును. మాటిమాటికి తల్లిదండ్రులను కొట్టుచూ పూర్వవైరమును అనుసరించుచు వెళ్ళుచుండును. ప్రియమును కలిగించు పుత్రుని గూర్చి చెప్పెదను.  

పుట్టినవెంటనే ప్రీతిని కలిగించును. బాల్యమున లాలనక్రీడలతో ఆనందింపచేయును. యౌవనమున కూడా తలిదండ్రులకు ప్రీతినే కలిగించును. భక్తితో వారిని సంతోషింపచేయును. స్నేహముతో మంచి మాటతో ప్రియవచనములతో సంతోషింపచేయును. తండ్రి చనిపోయినచో ప్రేమతో రోదించును. అన్ని శ్రాద్ధకర్మలను పిండదానాదికమును దుఃఖార్హుడై చేయును. వారికి ఉత్తమగతులు లభించుటకై యాత్రలు చేయును. దేవపితృఋషి ఋణము మూడు ఋణములు కలవాడై వారిని ప్రతినిత్యము భుజింపచేయును. అతనినుండి రావలసిన ప్రియమునంతయూ ఇచ్చివేయును. ఏ మాత్రము సంశయముతో పనిలేదు. పుత్రునిగా పుట్టి ఈ విధిని సంతోషింపచేయును.

ఇక ఇపుడు నీ ముందు ఉదాసీనుని గూర్చి చెప్పెదను. అట్టి పుత్రుడు ఎపుడూ ఉదాసీనభావముతోనే యుండును. ఈయడు. తీసుకొనడు. కోపించడు. సంతోషించడు. మరోచోటినుండి పరిగ్రహించడు. విడిచి ఉండడు. ఉదాసీనుడు వెంట ఉండడు. మీ ముందు అంతా చెప్పితిని పుత్రుల పద్దతి ఇట్లుండును. పుత్రులవలెనే భార్య, తల్లి, తండ్రి, బాంధవులు కూడా ఈ నాలుగు విధములుగానే యుందురు. ఇట్లే భృత్యులు పశువులు అశ్వగజ మహిషములు, దాసులు కూడా ఋణసంబంధమును బట్టి వచ్చి పోవుచుందురు. మననుండి ఎవరూ ఋణము తీసుకొనలేదు. మనము ఎవరినుండి ఋణము తీసుకొనలేదు. మనము ఎవరి సొమ్మును మనవద్ద దాచుకొనలేదు. ఎవరి అప్పును మనము ధరించుట లేదు. పూర్వజన్మలో ఎవరితోనూ వైరమును చేయలేదు. అట్లే ఎవరిని మధ్యలో విడువలేదు. కావున మనకు సంతానము కలుగుటలేదు. ఇట్లు తెలుసుకొని శాంతించుము. వ్యర్థచింతను విడువుము.

పుత్రులెవరికి? భార్య ఎవరికి? ఎవరికి స్వజనులు. ఎవరికి బంధువులు. మీరు ఎవరి ధనమును హరించలేదు. ఎవరికి ఈయలేదు. అయినపుడు ధనమెట్లు లభించును. ఈ విషయమున ఆశ్చర్యమును చెందకుము. ఎచట తప్పక ధనము లభించవలసియున్నచో అతని చేతిలోనికి ఆయాసములేకనే వచ్చిపడును. అట్లు లభించిన ధనమును చాలా ప్రయత్నముతో రక్షించుచుండును. రక్షించినవాడు వెళ్ళుచునేయుండును. ధనము మాత్రము అచటనే యుండును. ఇట్లు తెలిసి శాంతించుము. అనర్థకమగు చింతను విడువుము. ఎవరికి పుత్రులు? ప్రియులు? భార్యలు. ఎవరికి స్వజనులు? ఎవరికి బంధువులు ఈ సంసారము ఎవరికి ఎవరూ లేరు. ఎవరితో ఎవరికీ సంబంధము లేదు. పాపబుద్దులగు మానవులు మహామోహగ్రస్తులై ఇది నా ఇల్లు, ఇతను నా పుత్రుడు, వీరు నా భార్యలు, వీరంతా నావారే అను భావనలన్నీ అనృతములే. సంసారబంధమే అసత్యము. ఇట్లు ప్రియురాలగు భార్య బోధించగా జ్ఞానవాదినియగు ప్రియురాలగు భార్యతో ఇట్లు పలికెను.

సోమశర్మ ఉవాచ –

సోమశర్మ పలికెను.

భద్రురాలా! నీవు సర్వసందేహములను నశింపచేయు సత్యమును చెప్పితివి. అయిననూ పండితులు, సాధువులు వంశమును కోరుదురు గదా! నాకందుకే పుత్రుని విషయమున ధనవిషయమున కూడా చింత కలుగుచున్నది. ఏదో ఒక ఉపాయముతో పుత్రుని పొందెదను.

సుమనోవాచ –

సుమన పలికెను.

పుత్రునిచేతనే అన్ని లోకములను గెలుచును. పుత్రుడే కులమను తరింపచేయును. సత్పుత్రునిచే తల్లి తండ్రి జంతువులు తరింపచేయబడుదురు. విద్వాంసుడగు ఒక పుత్రుడే చాలును. నిర్గుణులు ఎందరున్ననూ ఏమి ప్రయోజనము. ఒక్కడైననూ వంశమును తరింపచేయును. ఇతరులు అనగా నిర్గుణులు సంతాపమును మాత్రమే కలిగింతురు. ఇతరులందరూ సంబంధమును కలిగించుకొనివెళ్లాడువారే అని నేను మొదటనే చెప్పితిని. పుత్రుడు పుణ్యవశమున లభించును. పుణ్యముతోనే మంచి సంతానము లభించును. కావున పుణ్యకార్యముల నాచరించుము. పుట్టినవానికి మరణము, మరణించినవానికి పుట్టుక తప్పదు. పుణ్యములతో మంచి జన్మము లభించును. మంచి మరణము కూడా అట్లే లభించును. పుణ్యకర్మలచే సుఖము, ధనము లభించును.

సోమశర్మోవాచ –

సోమశర్మ పలికెను.

ప్రియురాలా! పుణ్యలక్షణమును మంచి జన్మలనగా ఏవియో కూడా తెలుపుము. మంచి పుణ్యము ఎట్టిది? పుణ్యమనగా నేమియో తెలుపుము.

సుమనోవాచ –

సుమన పలికెను.

మొదట నేను విన్న విధముగా పుణ్యమును గూర్చి వివరించెదను. పురుషుడు కాని, స్త్రీ కాని నిత్యమెట్లు ప్రవర్తించవలయునో తెలిపెదను. పుణ్యములతో కీర్తిని, పుత్రులను, ప్రియులను ధనమునేట్లు పొందెదరో కూడా తెలిపెదను. ప్రియా! పుణ్యలక్షణమునంతయూ చెప్పెదను. బ్రహ్మచర్యము సత్యము పంచయజ్ఞములు (దేవ ఋషి పితృ అతిథిభూత) దానములు, నియమములు, క్షమ, శౌచము, అహింస, సుశక్తి మనోవాక్కాయములతో పరద్రవ్యమును హరించకుండుట (అస్తేయము) ఈ పది అంగములతో ధర్మమును పరిపూర్ణమును గావించవలయును. ఆహారముతో ఉదరమున భోగము నిండునట్లు ధర్మము పరిపూర్ణమగును. మనోవాక్కాయకర్మములతో ధర్మబద్ధుడు ధర్మమును సృజించును. అతని ధర్మమే పుణ్యమును పొందింపచేయును. ఇట్లు ధర్మమునాచరించి పుణ్యమును పొందినవాడు కోరినది ఎంత దుర్లభమైననూ పొందును.

సోమశర్మోవాచ –

సోమశర్మ పలికెను.

ధర్మస్వరూపమేమి? ధర్మమునకు అంగములేవి? భామినీ! నాకు ప్రీతితో చెప్పుము. వినుటకు శ్రద్ద కలుగుచున్నది.

సుమనోవాచ –

సుమన పలికెను.

 ఈ లోకమును ధర్మరూపమును ఎవ్వరూ చూడలేదు. ధర్మరూపము దర్శింపశక్యము కానిది. సత్యస్వభావము కలది. దేవదానవులు కూడా చూడజాలకపోయిరి. అత్రి వంశమున పుట్టినవాడు, అనసూయా పుత్రుడగు దత్తాత్రేయునిచే ధర్మస్వరూపము చూడబడినది. దత్తాత్రేయుడు, దుర్వాసుడు అను ఈ ఇద్దరు మహానుభావులు ఉత్తమ తపమును ఆచరించుచు ధర్మముతో, తపస్సుతో, బలముతో ఇంద్రుని మించిన సౌందర్యముతో నుండిరి. అట్లు వారు పదివేల వత్సరములు వనములో నుండిరి. ఆహారమును విడిచి వాయువును భక్షించుచు చూడ చక్కనివారుగా నుండిరి. పదివేల వత్సరములు తపము నాచరించిరి. అపుడు అచట ధర్మము కనపడవలయును. పంచాగ్ని మధ్యలో తపము నాచరించిరి. త్రికాలము నిరాహారముగా తపమును ఆచరించిరి. దత్తాత్రేయుడు దుర్వాసులు జలమధ్యమున నుండి తపమాచరించిరి. మహా తేజస్వియగు దుర్వాసుడు తపస్సుచే కృశించి ధర్మబుద్దియైనను ధర్మముపై కోపించెను. అట్లు ఆ మునివర్యులు కోపించగా అంతట ధర్మము నిజరూపముతో అచటికి వచ్చెను. బ్రహ్మచర్యముతో తపస్సులతో వచ్చెను.

సత్యము బ్రహ్మచర్యము తపస్సు బ్రాహ్మణరూపముతో వచ్చినవి. దమము ప్రాజ్ఞుడగు ద్విజరూపముతో, నియమము మనోపాజ్ఞరూపముతో, దానము అగ్నిహోత్రరూపముతో, దుర్వాసుని వద్దడ వచ్చిరి. క్షమా, శాంతి, లజ్జ, అహింస స్వచ్ఛత వీరందరూ స్త్రీరూపములతో వచ్చిరి. బుద్ధి, ప్రజ్ఞ, దయ, శ్రద్ద, మేధ, సత్కృతి శాంతులు, పంచయజ్ఞములు, పవిత్రములగు సాంగవేదములు స్వస్వరూపమును దాల్చి అచటికి వచ్చిరి. పుణ్యములగు అగ్న్యాధానాదులు అశ్వమేధాదులు రూపలావణ్యము కలవై, సర్వాభరణభూషితులై దివ్యమాల్యాంబరములను ధరించి దివ్యగంధములను అందుకొని కిరీటమండలముల ధరించి దివ్యాభరణములను దాల్చి దీప్తి కలిగి చక్కని రూపము కలిగి తేజస్సు జ్వాలలతో కూడినవారైరి. ఇట్లు ధర్మము పరివారముతో కలిసి కోపముతో కాలునివలె దూర్వాసుడున్న చోటికి వచ్చెను.

ధర్మ ఉవాచ –

ధర్మము పలికెను.

తపస్సు చేయుచున్న తాము ఎందుకు కోపించుచున్నారు. కోపము శ్రేయమును, తపమును నశింపచేయును. అన్నింటిని నశింపచేయునది కోపము కావున కోపమును విడువవలయును. ద్విజశ్రేషా! స్వస్థుడవు కమ్ము! తపఃఫలము చాలా గొప్పది.

దుర్వాసా ఉవాచ –

దుర్వాసమహర్షి పలికెను.

తామెవ్వరు. ఈ బ్రాహ్మణులతో కలిసి ఏల వచ్చితిరి? చక్కని రూపము, అలంకారము కలిగిన ఏడుగురు యువతులు ఇచటున్నారు. వీరెవరు? నాకిదంతా విస్తరముగా తెలుపుము.

ధర్మ ఉవాచ –

ధర్ముడు పలికెను.

సర్వతేజస్సమన్వితుడు దండహస్తుడు ప్రసన్నరూపుడు, కమండలమును దాల్చిన ఈ బ్రాహ్మణరూపుడు బ్రహ్మచర్యము నీముందుకు వచ్చెను. చూడుము. అట్లే మరియొక తేజోవంతుని చూడుము. కపిలవర్ణుడు, పింగలాక్షుడు. ఇతను సత్యము. అట్టివాడే మరియొకడు. అగ్నివంటి తేజము కలవానిని చూడుము. ఇతనే సర్వదేవ సమాశ్రయముగా నుండునది నీవు ఆచరించు తపము. ఇట్లే నీ ప్రక్కన చేరిన ఇతనిని చూడుము. ప్రసన్నవాక్కుగలవాడు, దీప్తిమంతుడు, సర్వప్రాణులను దయజూచువాడు, ఎల్లపుడు అందరినీ పోషించు దమము ఇతనే. జటాధారి, కఠినుడు, పింగళవర్ణుడు. అతితీవ్రస్వభావుడు. మహాప్రభువు. ఇతను ఖడ్గహస్తుడు. పరమశాంతుడు. నిత్యక్రియాశీలి. ఇతను నా ప్రక్కన చేరినవాడు నియమము. కాంతిమంతుడు, అనిర్ముక్తుడు, శుద్ధస్ఫటికకాంతి కలవాడు, (నీరు) పాల కమండలమును ధరించినవాడు, దంతకాష్టధరుడగు ద్విజుడు. ఇతను శౌచము. నీ వద్దకు వచ్చెను.

పరమసాధ్వి మహాభాగ సత్యభూషణ భూషితురాలు సర్వభూషణములలో అలంకరించబడినది ఈమె శుశ్రూష వచ్చినది. ఈమె అతి ధీరురాలు, ప్రసన్నాంగి, గౌరి. నవ్వు ముఖము కలది, పద్మహస్తురాలు. ఈమె ధాత్రి. పద్మనేత్ర సుపద్మిని. దివ్యాభరణములు కలది. ఈమె క్షమ. వచ్చినది. ఈమె అతిశాంతురాలు. సుప్రతిష్టితురాలు. బహుమంగలములు కలది. దివ్యరత్నములు పొదిగిన ఆభరణములు కలది. ఈమె జ్ఞానరూపురాలు. శాంతి. ఇచటికి చేరినది. పరోపకారపరాయణురాలు. బహుసత్యసమాకులురాలు. మితభాషిణి. ప్రసన్నచిత్తురాలు. క్షమాయుక్త, సర్వాభరణభూషిత. పద్మాసనా. సురూప శ్యామవర్ణ యశస్విని. ఈమె అహింస. నీవద్దకు వచ్చినది. ఇక ఈమె తప్తకాంచన వర్ణాంగి. రక్తవస్త్రములను దాల్చినది. సుప్రసన్నురాలు. చక్కని మంత్రము కలది. మరొకవంక చూడదు. జ్ఞానభావము కలది. పుణ్యహస్తము కలది తపస్విని. ముక్తాభరణములలో శోభించునది. పరిశుద్ధురాలు. చారుహాసిని. ఈమె శ్రద్ద. మహానుభావా! చూడుము. ఇక ఈమె బహు బుద్దిసమాక్రాంతురాలు. బహు జ్ఞానము కలది. చక్కని భోగమునందు ఆసక్తి కలది. రూపవతి. సుస్థితురాలు. చారుమంగల. ఇష్టధ్యానము కలది. ఈమె లోకమాత, యశస్విని. సర్వాభరణభూషితురాలు, పీనశ్రోణి పయోధర. ఈమె గౌరవర్ణము కలది. వస్త్రమాల్యములను ధరించి వచ్చినది. ఈమె మేధ. నీ ప్రక్కనే నిలిచియున్నది. హంసవలె చంద్రునివలె తెల్లనిది ముక్తాహారములు కలది. సర్వాభరణభూషితురాలు, సుప్రసన్నురాలు మనస్విని. శ్వేతవస్త్రములతో నున్నది. పద్మమున కూర్చొనునది. పద్మమును పుస్తకమును ధరించినది. ఎల్లపుడూ శోభించునది. ఈమె ప్రజ్ఞ. భాగ్యవంతులగు తమ వద్దకు వచ్చినది. ఈమె లాక్షారసవర్ణము కలది. ప్రసన్నచిత్తురాలు. పచ్చని పూలమాలను ధరించినది. హారకేయూరభూషణములు కలది. ముద్రికలు, కంకణములు, కర్ణకుండములతో అలంకరించుకొనినది. ఈమె ఎపుడూ పీతాంబరముతో శోభించుచుండును. ఈమె మూడు లోకములను పోషించునది. ఉపకారము చేయునది. ఈమె శీలమునే ఎపుడూ అందరూ కీర్తింతురు. ఈమెను దయ అందురు. ఈమె వృద్దురాలు, తపస్విని. భావపత్ని. నా తల్లి. నేను ధర్ముడను అని తెలిసి శాంతిని పొందుము. నన్నిట్లు చూడుము.

దుర్వాసా ఉవాచ –

దుర్వాసుడు పలికెను.

ఇపుడు నావద్దకు ధర్ముడవు వచ్చినచో నీ రాకకు కారణమును తెలుపుము. నీకేమి చేయవలయునో చెప్పుము.

ధర్మ ఉవాచ –

ధర్ముడు పలికెను.

బ్రాహ్మణోత్తమా! నీవేల కోపించితివి? వీరు చేసిన అప్రియమేమి? నీకిష్టమైనచో నాకు కారణమును తెలుపుము.

దుర్వాసా ఉవాచ –

దుర్వాసుడు పలికెను.

నేను కోపించిన కారణమును వినుము. చాలా కష్టసాధ్యములగు దమ శౌచములతో నా శరీరమును పరిశుద్ది గావించుకొంటిని. ఒక లక్ష వర్షములు తపమునాచరించితిని. నన్నట్లు చూచుచుంటివి కాని నాపై నీకు దయ కలుగలేదు. కావున నేను కోపించితిని. ఇపుడు నీకు శాపమునిచ్చితిని.” ఇట్లు దుర్వాసమహర్షి మాటలను వినిన ధర్ముడు ఇట్లు పలికెను.

ధర్మ ఉవాచ –

ధర్ముడు పలికెను.

మహాప్రాజ్ఞా! నేను నశించినచో లోకము నశించును. ఓ బ్రాహ్మణోత్తమా! నీ దుఃఖమూలమును నేను తొలగించెదను. తరువాత సత్యమును వీడనిచో సుఖమును కూడా ఈయగలను. సుఖమూలము పాపము. దుఃఖముతో పుణ్యము లభించును. ఇట్లు పుణ్యములనాచరించువాడు ప్రాణములను విడుచును. ఇహపరములలో నీకు గొప్ప సౌఖ్యమును ప్రసాదించెదను.

దుర్వాసా ఉవాచః-

దుర్వాసమహర్షి పలికెను.

సుఖమును పొందువారే తరువాత గొప్ప దుఃఖమును కూడా పొందుచున్నారు. ఆ దేహమును విడిచిన మనుజుడు మరో దేహముతో కూడా పొందుచున్నాడు. ఇట్లు ఇంకొకదేహముతో పొందు సుఖమునెవడు తెలియగలడు. ఎట్లు నిశ్చయించగలడు? ఆ పరమున కలుగు శ్రేయమును నేను చూడజాలను. నీవు అన్యాయమును చేసితివి. ఏ శరీరముతో పుణ్యము చేసితిమో ఆ శరీరముతో సుఖమును పొందుట లేదు. పాపమును చేయు శరీరమొకటి. ఫలముననుభవించు శరీరమొకటి. ఆ పరలోకముననుభవించు సుఖమును ఎవరు తెలియుదురు. అది ధర్మమో, అన్యాయమో ఎవరు తెలియుదురు. ఒక శరీరముతో కష్టముననుభవింతురు. పురుషుడు అనుభవించునదంతా శ్రేయస్సుతో కూడియున్నది. ఈ శరీరముతో పుణ్యమును చేసిన ఈ శరీరముతోనే ఫలముననుభవించవలయును. పుణ్యము చేయు శరీరమొకటి. ఫలితమనుభవించు శరీరమొకటి. ఆయాసముతో లభించునది సుఖమెట్లగును? అంతట ధర్మశాస్త్రమున చెప్పినదానినే చేసితిని. వేరుగా చేయలేదు. ఏ శరీరముతో కర్మ చేసిరో ఆ శరీరముతోనే దుఃఖమును సహించెదరు. పరమున కూడా ఆ దేహముతోనే అనుభవించవలయును. ఇది కూడా అట్లే ఉండవలయును. ఇది తెలిసిన నీవు ఈ విషయమును పరిశీలించవలయును. మహాపాపస్వభావులగు చోరులు తమ దేహముతో చౌర్యాదులనాచరించి ఆ దేహముతోనే దారుణమగు దుఃఖమును అనుభవింతురు. అట్లే సుఖమును కూడా అదే రీతిలో ఎందుకుండదు?

ధర్మఉవాచ –

ధర్ముడు పలికెను.

పాపులు ఏ కాయముతో పాపము చేయుదురో ఆ కాయముతోనే బాధననుభవింతురు. అది ఆ పాపమునకు ఫలము. ధర్మశాస్త్రమున పండితులు దండమును ఉత్తమమైనదిగా చూచిరి. కావున ఈ న్యాయములతో చక్కగా చూచి దీనిని ధర్మపూర్వకముగా తెలియుము.

దుర్వాసః ఉవాచ –

దుర్వాసుడు పలికెను.

ఓ ధర్మరాజా! ఇది న్యాయమని నేను తలచుట లేదు. కావున కోపించిన నేను నీకు మూడు శాపములనిచ్చెదను.

ధర్ముడు పలికెను.

మహాప్రాజ్ఞ! ఒకవేళ నీవు కోపించినచో నన్ను క్షమించుము. ఒకవేళ క్షమించనిచో నన్ను దాసీపుత్రుని చేయుము. లేదా రాజును చేయవలయును. చండాలునినైననూ చేయుము. బ్రాహ్మణులు ప్రణతుల యెడ ఎపుడూ ప్రసన్నులుగా నుందురు గదా! అంత దుర్వాసులు కోపించి ధర్ముని శపించెను.

దుర్వాసా ఉవాచ –

దుర్వాసుడు పలికెను.

ధర్మా! నీవు రాజువు కమ్ము! దాసీపుత్రుడవు కమ్ము! చండాలుడవు కమ్ము. యధేచ్చగా వెడలుము. ఇట్లు మూడు శాపములనిచ్చి దుర్వాసుడు వెడలెను. ఈ విషయమున పూర్వము ధర్ముడు చూడబడెను.

సోమశర్మోవాచ -

సోమశర్మ పలికెను.

దుర్వాసునిచే శపించబడిన ధర్ముడు ఏమాయెను? అతను పొందిన రూపమును నీవు తెలిసినచో నాకు తెలుపుము.

సుమనోవాచ –

సుమన పలికెను.

ధర్ముడు దుర్వాసమహర్షి శాపముతో భరతవంశమున ధర్మరాజుగా పుట్టెను. దాసీపుత్రుడు విదురుడై పుట్టెను. అట్లే విశ్వామిత్రునితో హరిశ్చంద్రుడు బాధింపబడినపుడు ధర్ముడు చండాలునిగా పుట్టెను. ఇట్లు ధర్ముడు కూడా తమ కర్మఫలమును అనుభవించెను. దుర్వాసశాపముతో ఇట్లు అనుభవించెను. నీ ముందు నిజమును చెప్పితిని.

ఇది శ్రీ పద్మపురాణమున భూమి ఖండమున సోమశర్మాఖ్యానమున సోమశర్మ సుమనా సంవాదమున 12 - అధ్యాయము