పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

6 - అధ్యాయము

            సూతమహర్షి పలికెను.

తపోమూర్తి దనుయను కశ్యపమహర్షికి మరియొక భార్య పుత్రశోకముతో పరితపించుచు దితిమందిరమునకు వచ్చెను. దితి పాదపద్మములకు నమస్కరించి గొప్ప దుఃఖముతో ఏడ్చుచుండెను. అట్టి దనువును దితి ఓదార్చసాగెను.

                   దితి పలికెను.

‘ఓ సౌభాగ్యవతీ! నీవెందుకేడ్చుచున్నావు? లోకమున స్త్రీలు ఒక పుత్రుడున్ననూ పుత్రిణిగా పేరొందుచున్నారు. నీవు గుణవంతులగు నూర్గురు పుత్రులకు తల్లివి. శుంభాది మహానుభావులకు తల్లివి. అయిననూ ఎందుకు దుఃఖించుచున్నావు? నాకు కారణమును తెలుపుము. హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు మహానుభావులు, మహాబలపరాక్రమవంతులు కుమారులుగా ఉన్న నీవు ఎందుకు దుఃఖించుచున్నావు? నీ రోదనమునకు కారణమును తెలుపుము.’ ఇట్లు మాట్లాడి విరమించెను.

            దనువు పలికెను.

‘పుణ్యాత్మురాలా! మన సపత్నియగు అదితి కోరిక పరిపూర్ణముగా శ్రీహరి నెరవేర్చెను. పూర్వము అదితికి వరమిచ్చినట్లుగానే ఇపుడు శ్రీహరి అదితి పుత్రునకు కూడా వరమిచ్చెను. కశ్యపునివలన విశ్రుతుడనువాడు కలిగెను. అతను త్రిలోకపాలకుడాయెను. నీ పుత్రునినుండి హరించి విశ్రుతునకు ఇంద్రత్వమును ప్రసాదించిరి. ఇపుడు అన్ని కోరికలు నెరవేరి అదితి సుఖసంతోషములతో నున్నది. అదితి కనిష్ఠపుత్రుడు వసుదత్తుడనువాడు ఇతరులు పొందజాలని ఇంద్రపదవిని పొందెను. దేవతలతో కలిసి త్రైలోక్యరాజ్యమును అనుభవించుచున్నారు.’

దితి పలికెను.

‘నా పుత్రుడు ఏ పదవినుండి భ్రష్టుడాయెను, ఇతర దైత్యదానవులు ఎందుకు తేజోభ్రష్టులైరి? దీనికి కారణమును విస్తరముగా నాకు తెలుపుము’ అని దితి విరమించెను.

దనువు పలికెను.

‘కోపముతో దేవదానవులు యుద్ధరంగమున చేరిరి. అచట దైత్యక్షయకారకమగు గొప్ప యుద్దము జరిగెను. దేవతలు విష్ణువు కలిసి నా పుత్రులను చంపిరి. అట్లే నీ పుత్రులను కూడా శ్రీమహావిష్ణువు సంహరించెను. అడవిలో మృగములను సింహము పారదోలునట్లు అట్లే శ్రీహరి తన తేజస్సుతో నీనా పుత్రులను పారద్రోలెను. సురాసురులు కలిసినా జయించజాలని కాలనేమి నాయకత్వములోని సైన్యమును నశింపచేసిరి. మర్ధించిరి. పారదోలిరి. చెల్లాచెదరు చేసిరి. అరణ్యమున అగ్ని తన మంటలతో తృణములను కాల్చునట్లు శ్రీహరి దైత్యసమూహములను కాల్చివేసెను. దేవీ! నా పుత్రులు చాలామంది, నీ పుత్రులు మరణించిరి. అగ్నిలో శలభములు నశించునట్లు శ్రీహరిని చేరి దానవులు నశించిరి.’ ఇట్లు జరిగిన భయంకరవృతాన్తమును దితి వినెను.

                  దితి పలికెను.

దేవీ! నాకు పిడుగుపాటులాంటి వార్తను తెలిపితివి అని దితి మూర్ఛనొంది పడినది. అంతలో తేరుకొని అయ్యో ఇది చాలా కష్టము వచ్చినది. సంతాపమును కలిగించు మహాదుఃఖము ప్రాప్తించినది. అనుచు పుత్రశోకపీడిత అయి దీనముగా రోదించెను. అట్లు ఏడ్చుచున్న దితిని చూచి కశ్యపప్రజాపతి ఓదార్చసాగెను.

‘నీకు శుభమగుగాక! నీలాంటివారు ఇట్లు విలపించరాదు. నీవు ఏడ్వరాదు. ధైర్యము కలవారు లోభమోహశూన్యులుగా నుందురు. ఈ సంసారమున ఎవరికి పుత్రులు? ఎవరికి బంధువులు? ఇచట ఎవరు ఎవరికి కారు, అదంతయూ వినుము. మీరందరూ దక్షప్రజాపతి పుత్రికలు. నాకు భార్యలు. నేను మీకు భర్తను. కామపూరకుడను, యోగక్షేమములను కూర్చువాడను. పోషించువాడను. కాపాడువాడను. నీ పుత్రులు సత్యవర్జితులు, క్రూరులు, ఇంద్రియనిగ్రహము లేనివారు. దేవతలను ద్వేషించసాగిరి. నీవు కూడా ద్వేషించుచుంటివి. ఇట్లు నీ దోషముతో, నీ పుత్రుల దోషముతో శ్రీహరి నీ పుత్రులను సంహరించెను. దేవతలు వారిని సంహరించిరి. సత్యమును మోక్షమునునశింపచేయు దుఃఖమును విడనాడుము. శోకము పుణ్యమును నశింపచేయును. పుణ్యనాశమువలన తానే నశించును. కావున అన్ని శుభములకు ఆటంకమగు శోకమును విడువుము. దానవులందరూ తమ తమ దోషములతోనే మృతిచెందిరి. అచట దేవతలు కేవలము నిమిత్తమాత్రులు. తమ కర్మతోనే దానవులు నశించిరి. ఇట్లు తెలుసుకొని సుఖమును పొందుము.’ ఇట్లు మహాయోగియగు కశ్యపప్రజాపతి పలికి వారిని ఓదార్చెను. దితి కూడా దుఃఖమును విడిచి సంతాపమును వీడెను.

ఇది శ్రీపాద్మపురాణమున ద్వితీయ భూమిఖండమున దేవాసురవివాదమున దితివిలాపమను ఆర - అధ్యాయము ముగిసినది.