పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

36 - అధ్యాయము

సునీధోవాచ –

సునీధ పలికెను.

శుభురాలా! నీవు సత్యమునే చెప్పితివి. నేనిట్లే చేసెదను. ఈ విద్యతో ఈ విప్రుని మోహింపచేతును. ఇంకొకదారి లేదు. కాని నాకు నీవు సాయము చేయుము. నేను నీ సాయముతో అతని వద్దకు వెళ్ళేదను. ఇట్లు సునీధ పలుకగా రంభ ఇట్లనెను. నీకెటువంటి సాయము కావలయును? ఆ నిజమును తెలుపుము అని. అంత సునీధ నీవు నాకు దూతవు కమ్ము అని పలికెను. రంభ అట్లే చేసెదనని ప్రతిజ్ఞ చేసెను. నీకు సాయము చేసెదను. నన్నాజ్ఞాపింపుము అని పలికెను. అంత ఆ సుందరి సద్భావముతో విశాలనేత్రములు కలదై రూపయౌవనశాలిని, మాయచే దివ్యరూపము కలదాయెను. రూపమున సాటిలేనిది ముల్లోకములను మోహింపచేయుచున్నదై పరమపావనము సుందరగుహలు కలది నానాధాతుసమాకీర్ణము నానారత్నోపశోభితము, దేవవృక్షములతో నిండియున్నదై బహుపుష్పశోభితము దేవతా బృందములు కలది గంధర్వులచే అప్సరసలచే సేవించబడుచున్నది, మనోహరము రమ్యము, శీతచ్చాయతో కూడినది మేరుశిఖరమున చందన వృక్షములను అశోకవృక్షములకు ఏర్పరిచిన ఊయలను అధిరోహించి సకలాలంకారభూషితయై శృంగార శోభితయై నీలమగు పట్టువస్త్రముతో అలరారుచు, బంధూకపుష్పవర్ణముగల కంచుకముతో సర్వాంగసుందరియగు బాల వీణా తాలములు చేతులలో ధరించి చక్కని గానమును మధురస్వరముతో విశ్వమోహనముగా ఆలపించుచు ఆ ఇష్టసఖులతో కూడియుండెను.

అంగుడు ఆ మేరుపర్వతగుహలోఏకాంతమున ధ్యానముద్రలో నుండెను. కామక్రోధములను విడిచి జనార్ధనుని ధ్యానించుచుండెను. అతిమనోహరము మధురమగు గానమును రాగతాలయుక్తమును సకలప్రాణులను ఆకర్షించుదానిని విని ధ్యానమునుండి చలించెను. ఈ మాయాగీతముతో మోహమును పొందెను. వెంటనే ఆసనమునుండి లేచి మాటిమాటికి అంతటా చూచుచు మాయతో ఆవరించబడిన మనసు కలవాడై అచటికి వెళ్ళేను. వీణను ధరించి ఊయలలో ఊగుచున్న దానిని నవ్వులు వెదజల్లుచు చక్కగా గానము చేయుచున్నదానిని నిండుచంద్రుని బోలిన మోము కలదానిని చూచెను. ఆ గానముతో ఆమె సౌందర్యముతో మోహమును చెందిన మహాయశస్వియగు అంగుడు ఆమె లావణ్యమునుపరికించి మన్మధుని బాణములచే కొట్టబడి జ్ఞానము కలతచెందగా ఋషిపుత్రుడు ఉత్తమ బ్రాహ్మణుడు మాటిమాటికి ఆవలించుచుండెను. ఏవియో ప్రలాపములు కావించుచుండెను. చెమట పట్టెను. వణుకుపుట్టెను. సంతాపము కలిగెను. మహామోహముతో మోహించుచున్నవానివలె గ్లానిని పొంది మనసు చలించి వణకుచు బాధతో అచటికి చేరెను. మృత్యుకన్యను విశాలాక్షిని యశస్వినిని చూచి చారుహాసినియగు సునీధను చూచి ఇట్లు పలికెను. నీవెవరవు? ఎవరిదానవు? చెలులతో కలిసి ఏ పనికై ఇచటికి చేరితివి. లేక నిన్నెవరైననూ పంపిరా? నీ శరీరము అతిసుందరముగా భాసించుచున్నది. నాకిపుడే తెలుపుము. ప్రసన్నవదనముతో నుండుము. మాయామోహముతో మోహితుడైన అంగుడు ఆమే పనిని తెలియకపోయెను. దానికి అతడు మన్మధబాణములతో కొట్టబడినవాడు కదా!

ఇంతటి మాటను వినిన సునీధ బదులు పలకక చెలి ముఖమును చూచెను. ఆ సన్నను గుర్తించిన రంభ ఇట్లు బదులు పలికెను.

ఓ మహానుభావా! ఈ కన్య మహాత్ముడగు మృత్యు పుత్రిక. ఈమె పేరు సునీధగా ప్రసిద్ధురాలు. సకల శుభలక్షణములు కలది. ధర్మాత్ముడు తపోనిధి శాంతుడు దాంతుడు మహాప్రాజ్ఞుడు, వేదవిద్యావిశారదుడు అగు భర్తను వెతకుచున్నది అని. ఇట్లు సఖీ వాక్యమును వినిన ఆ మహాముని అంగుడు అప్సరస శ్రేష్ఠురాలగు రంభతో ఇట్లు పలికెను. సర్వజగన్మయుడగు విష్ణువును నేనారాధించితిని. అతను నాకు సర్వసిద్ధిప్రదుడగు పుత్రుని వరరూపముగా నిచ్చెను. అందువలన నేను పుత్రుని కొరకు ఒక పుణ్యవీర్యుడగు మహానుభావుని కన్యను వెతుకుచున్నాను. ఇంతవరకు ఇటువంటి ఉత్తమయువతిని చూడలేదు. ఇది నిజము. ఈమె ధర్ముని కన్య ధర్మాచార. వరానన. ఈమె నన్ను భర్తగా కోరినచో సేవించనా ఈమె కోరినదల్లా ఈయగలను. సంశయముతో పనిలేదు. ఈమె సంగమము కొరకు ఈయదగనిది కూడా ఈయవచ్చును అని. అంతట రంభ ఇట్లు పలికెను.

‘ద్విజోత్తమా! నీవీయవలసినదొకటి. బ్రాహ్మణశ్రేష్టా! తాము జాగ్రత్తగా వినుడు. ప్రతిజ్ఞను చెప్పుచున్నాను. ఈమెను నీవు ఎపుడూ విడువరాదు. ఈమె నీకే ధర్మపత్నిగా నుండును. ఈమె తప్పులను ఒప్పులుగానే స్వీకరించవలయును. ఈ విషయమున మాకు ప్రత్యక్షనిదర్శనమును చూపుము. నిజమని నమ్మకమును కలిగించు మీ హస్తమును ఇండు అని.

అంత అంగుడు అట్లే కానిమ్ము. నా హస్తమును ఇచ్చితిని. అనుమానము లేదు.

సూత ఉవాచ –

సూతమహర్షి పలికెను.

ఇట్లు సత్యమును నమ్మించు సంబంధమును ఏర్పరచుకొని గాంధర్వవిధితో సునీధను వివాహమాడెను. అంత రంభ సంతోషము నిండిన మనస్సుతో అతనికి సునీధను ఇచ్చి సునీధతో వీడ్కోలు పలికి తన ఇంటికి వెళ్ళేను. మిగిలిన చెలులు కూడా సంతోషము నిండిన మనసుతో తమ ఇళ్ళకు చేరిరి. ఆ చెలులందరు వెళ్ళిన తరువాత అంగుడు ప్రియురాలగు భార్యతోరమించెను. ఆమెయందు సర్వలక్షణసమన్వితుడగు పుత్రుని పొందెను. ఆ తనయునికి వేనుడని పేరు పెట్టెను. అతను మహాతేజోవంతునిగా పెరుగసాగెను. ఆ మేధావి వేదములను శాస్త్రములను ధనుర్వేదమును అధ్యయనముగావించి అన్ని విద్యలలో చివరి హద్దును చేరెను. అట్టి అంగుని తనయుడగు వేనుడు శిష్టాచారపరాయణునిగా ఉండెను. కాని బ్రాహ్మణశ్రేష్ఠుడగు వేనుడు క్షత్రియాచారపరాయణుడు కాసాగెను. స్వర్గమున సర్వతేజోరూపునిగా ఇంద్రుడు భాసించునట్లు వేనుడు కూడా స్వబలపరాక్రమములతో అట్లు భాసించెను. చాక్షుషమన్వంతరము రాగా ప్రజలను చక్కగా పరిపాలించు రాజు లేక ప్రజలు చింతించసాగిరి. అంతట ధర్మతత్త్వమును చక్కగా తెలిసిన ఋషులు తపోధనులు ప్రజాక్షేమము కొరకు ధర్మజ్ఞుడు సత్యజ్ఞుడగు రాజు కొరకు ఆలోచించసాగిరి. అంతట వారందరు అన్ని లక్షణములు గల వేనుని చూడగలిగిరి. అట్లు వేనుని ప్రజాపాలకునిగా ఆ బ్రాహ్మణోత్తములు అభిషేకించిరి. అట్లు వేనుని పట్టాభిషేకము జరిగిన తరువాత ఆ ప్రజాపతులందరు తమ తమ తపోవనమునకు వెడలిరి. వారందరు వెళ్ళిన తరువాత వేనుడు రాజ్యపాలన గావించెను. సునీధ మాత్రము రాజ్యపరిపాలన గావించుచున్న పుత్రుని చూచి మహానుభావుని శాపమును తలచుచు నా పుత్రుడు మహానుభావునిగా ధర్మరక్షకుడగునా అని సందేహించుచుండెను. ఇట్లు తాను పూర్వము ఆచరించిన పాపమును తలచి ఆ శంకతో పుత్రుని ముందు పరమపావనములగు ధర్మతత్త్వములను బోధించుచుండెను. సత్యభావముతో నిండిన పుణ్యగుణములను ప్రకాశింప చేయుచుండెను. మరల ఇట్లు పలికెను. నేను ధర్ముని పుత్రికను. నీ తండ్రి ధర్మతత్త్వజ్ఞుడు. కావున నీవు ధర్మమును ఆచరించుము అని బోధించుచుండెను. ఇట్లు తల్లిదండ్రుల ధర్మబోధలను వినుచు భూమండలమునకు వేనుడు ప్రజాపాలకుడాయెను. ధర్మముతో ప్రజలను రంజింపచేసెను. లోకమంతయు సుఖముగా జీవించసాగెను. ఇట్లు వేనుని రాజ్యమున వేనుని ధర్మపాలనలో సత్యధర్మభావనలు చక్కగా ప్రవర్తించుచుండెను.

ఇది శ్రీపద్మపురాణమున రెండవదగు భూమిఖండమున వేనోపాఖ్యానమున 36 - అధ్యాయము.