పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
14 - అధ్యాయము
సోమశర్మ పలికెను.
పరమపావనమగు ఈ ధర్మవ్యాఖ్యానము నీకెట్లు తెలిసినది. నీవు ఎవరివలన వింటివి?
సుమనోవాచ –
సుమన పలికెను.
మహామతీ! నా తండ్రి భార్గవకులసంజాతుడు సుప్రసిద్దుడు సర్వజ్ఞాన విశారదుడగు చ్యవనమహర్షి, నేనతనికి ప్రాణములకంటే అధికప్రీతిపాత్రురాలను. ఆ చ్యవనమహర్షి వెళ్ళుచున్న తీర్థములకు, మునుల సభలకు, దేవాలయములకు వారితో కలసి వెళ్ళుచుండెడిదానను. నేను ఆటపాటలలోనున్ననూ వెళ్ళేడిదానను. కౌశికాన్వయమున పుట్టినవాడు, మహామతియగు వేదశర్మ యనునాతడు నాన్నగారి మిత్రుడు అంతటా పర్యటించుచు అచటికి వచ్చెను. అతను గొప్ప దుఃఖము కలవాడై మాటిమాటికి చింతించుచు అట్లు వచ్చిన ఆ మహాత్మునితో మా నాన్న ఇట్లు మాట్లాడెను. ఓ సువ్రతా! నీవు దుఃఖసంతప్తునిగా ఉన్నావని తెలియుదును. నీవు దుఃఖించుటకు గల కారణమును తెలియగోరుచున్నాను. మహానుభావుడగు మా తండ్రిగారి మాటలను వినిన వేదశర్మ మా నాన్నగారితో ఇట్లు పలికెను.
వేదశర్మ తన దుఃఖకారణమును ఇట్లు చెప్పసాగెను. నా భార్య పరమసాధ్వి, పాతివ్రత్యపరాయణురాలు. ఆమె పుత్రహీనురాలాయెను. నాకు వంశము లేకుండగా ఆయెను. మీరడుగుటవలన తమకు కారణమును తెలిపితిని. ఇంతలో అచటికి ఒక సిద్ధులు వచ్చిరి. మా నాన్నగారు వేదశర్మ ఆ సిద్ధునికి ప్రత్యుత్థానము (లేచి ఎదురేగుట) గావించి ఇద్దరూ భక్తిపూర్వకముగా ఆ సిద్ధుని పూజించిరి. ఉపచారములతో భోజ్యాన్నములతో తీయని మాటలతో సన్మానించిరి. వారి రాకకు కారణమునడిగిరి. ఆ సిద్దులు వారి కలయికకు కారణమడిగిరి. అంతట మీరు చెప్పినట్లే కారణమును సిద్దునకు వివరించిరి. అంతట సిద్దుడు మిత్రునితో కూడియున్న మా నాన్నగారితో ఇట్లు పలికెను. నీకు నేను చెప్పినట్లుగా అన్నిటికీ ధర్మమే కారణమని చెప్పెను. పుత్రులు, ధనము, ధాన్యము, స్త్రీలు అన్నియూ ధర్మము వలననే లభించును. అంతట వేదశర్మ పరిపూర్ణముగా ధర్మమునాచరించెను. ఆ ధర్మమువలన అతనికి పుత్రాది సుఖములు ఇతర సుఖములన్నియూ లభించినవి. ఆ విషయమును బాగుగా ఎరిగియున్నందున నా నిశ్చితాభిప్రాయము కూడా ఇదియే. నేను నీకు చెప్పినదంతయూ ఆ మహాసిద్దునివలన వినినదే కావున నీవు కూడా ధర్మమును అన్నివేళలా అనువర్తించుము.
సోమశర్మ పలికెను.
ధర్మమును లభించునో నాకు తెలుపుము. జన్మ మరణముల లక్షణమంతయూ నాకు చెప్పుము.
సుమన పలికెను.
సత్యశౌచ క్షమాశాంతి తీర్ధ పుణ్యాదికములతో ధర్మము నాచరించినవానికి మృత్యువు లభించు విధానమును తెలుపుచున్నాను. అతని శరీరమున రోగములు కలుగవు. పీడలు కలుగవు. అలసట కాని, ఆయాసము కాని, చెమట కాని, భ్రమ కాని కలుగవు. గంధర్వులు, బ్రాహ్మణులు దివ్యరూపమును ధరించి వేదపాఠము కలవారై గీతజ్ఞాననిపుణులై చనిపోవువానివద్దకు వచ్చెదరు. స్తోత్రము చేయుదురు. స్వస్థుడై ఆసనమున కూర్చుండి దేవపూజాగతుడైయుండును. ధర్మతత్పరుడగువానికి స్థానమునకు తీర్థము లభించును. అగ్నిశాలలో కాని, గోస్థానమున కాని, దేవాలయములలో కాని, ఆరామమున లేదా తటాకమున రాగిచెట్టువద్ద, మర్రిచెట్టువద్ద, మేడిచెట్టువద్ద, మారేడు చెట్టువద్ద, అశ్వస్థానమున లేదా గజస్థానమున, అశోకవృక్షము వద్ద, మామిడి చెట్టువద్ద, బ్రాహ్మణుల సమీపమున, రాజమందిరమున, యుద్ధభూమిలో కాని మృతిచెందును. తాము ఆచరించిన ధర్మమును అనుసరించియే పావనములగు మృత్యుస్థానములు లభించును. గోగ్రహమునో, అమరకంటకమునో చేరి ధర్మపూర్వకముగా ధర్మమునందు ప్రీతితో ప్రతినిత్యము ధర్మము నాచరించువాడు మృత్యుసమయమున ఇట్టి స్థానములను పొందును.
పుణ్యాత్ములగు తల్లిదండ్రులను చూడగలడు. అన్నను చూడగలడు. ఇతరులను తనవారిని పవిత్రులను చూడగలడు. అట్లే పవిత్రులగు వంటిజనముతో మాటి మాటికి స్తుతించబడుచుండును. ఒకవేళ మాతాపిత్రాదులు పాపులైనచో చూడజాలడు. గంధర్వులు గానము చేయుదురు. స్తుతులతో సవకాలు స్తుతించుచుందురు. బ్రాహ్మణులు మంత్రపాఠముతో తల్లి స్నేహముతో అభినందించును. ఇట్టి ధర్మాత్ముడగువానిని తండ్రి, స్వజనము, బంధువులు పూజింతురు. ఇట్లు మరణించువాని వద్దకు వచ్చు దూతలను మరణించువాడు వెళ్ళు పుణ్యప్రదేశములను నీకు చెప్పితిని. హాస్య స్నేహములతో నిండియున్న దూతలను ప్రత్యక్షముగా చూడగలుగును. ఇట్టి ధర్మాత్ముడు స్వప్నమోహక్షేదములను అనుభవించజాలడు. మహానుభావుడగు ధర్మరాజు అతనిని సాదరముగా ఆహ్వానించును. మహానుభావా! తాము ధర్మమువద్దకు రండు అని పిలుచును. ధర్మమున్నచోట మోహము, గ్లాని, స్మృతివిభ్రమములుండవు. అతను ప్రసన్నమనస్కుడైయుండును. అతను జ్ఞానవిజ్ఞాన సంపన్నుడై జనార్దనుని స్మరించుచు వారందరితో కలిసి సంతుష్టాంతరంగుడై చనును. అచట స్వకలేవరమును విడిచి ఐక్యము చెందును. అతని ఆత్మ దశమద్వారమునుండి వెడలును. అతనిని గొనిపోవుటకు హంసలతో కూడి అందమగు పల్లకి వచ్చును. లేదా విమానమే వచ్చును. అశ్వము కాని గజము కాని వచ్చును. ఛత్రచామరముల వ్యజనములతో వీచబడుచు ఆ పుణ్యాత్ముడు పుణ్యులతో కలిసి గానము చేయబడుచు స్తోత్రము చేయబడుచు మందులతో చారణులతో దివ్యులతో వేదపారంగతులగు బ్రాహ్మణులతో సాధుజనులతో స్తుతించబడుచు సర్వసౌఖ్యములు కలవాడై తాను చేసిన దానప్రభావానుగుణముగా ఫలమును పొందును.
ఆ ధర్మాత్ముడు ఆరామవాటికల మధ్యలో సుఖముగా సంచరించును. అప్పరసలతో కలిసి శుభప్రదములగు వస్తువులతో చుట్టుముట్టబడి దేవతలతో స్తుతించబడుచు ధర్మరాజును చూచును. ధర్మయుక్తులగు దేవతలు అతనికి ఎదురేగుదురు. మహానుభావా! రమ్ము! రమ్ము! నీ మనసు కోరిన భోగములను అనుభవించుము. ఇట్లు అతను సౌమ్యరూపునిగా మహామతియగు ధర్మరాజును చూచును. తన పుణ్యప్రభావముతో స్వర్గమునే అనుభవించును. భోగక్షయముతో ఆ ధర్మాత్ముడు మరల పుట్టును. తాను ఆచరించిన ధర్మము అనుగ్రహమువలన పుణ్యకులమున పుట్టును. పవిత్రుడగు బ్రాహ్మణుని కులమునకాని, క్షత్రియుని వంశమున కాని, పవిత్రుడు ధనవంతుడగు వైశ్యుని ఇంటిలో కాని పుట్టును. అచట ధర్మముగా ఆనందించును. మరల ధర్మము నాచరించును.
ఇది శ్రీ పద్మపురాణమున పంచపంచాశత్సంహితలో భూమిఖండమున ఐంద్రసుమనోపాఖ్యానమున పదునాలుగ - అధ్యాయము.
