పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

3 - అధ్యాయము

            సూతమహర్షి పలికెను.

అట్లు బయలుదేరిన విష్ణుశర్మ అంతరిక్షమున ప్రవేశించి బుద్ధిమంతుడగు ఇంద్రునితో చూడబడెను. విష్ణుశర్మ ప్రయత్నమును తెలిసిన ఇంద్రుడు విఘ్నము నేర్పరచదలిచెను. మేనకతో “నీవు నా ఆజ్ఞతో త్వరగా బయలుదేరి విఘ్నమును కల్పించుము. శివశర్మ పుత్రుడు నా వద్దకు రాకుండునట్లు చేయుము” అని పల్కెను. ఇంద్రుని మాటలను విన్న మేనక త్వరగా సర్వాభరణములను అలంకరించుకొని రూప ఔదార్యములతో బయలుదేరి నందనవన సమీపమున చక్కగా వీణ మీటునట్లుగా పాడుచు పల్లకిలో కూర్చొని విష్ణుశర్మ కంటపడెను. విశాలములు, సుందరములగు నేత్రములు కల మేనకను చూచిన విష్ణుశర్మ ఆమె ప్రయత్నమును తనకు కల్పించదలచిన విఘ్నమును తెలిసి ఇంద్రుడు పంపెను ఈమె నాకు మేలు కలిగించదు అని తలచి త్వరగా వెడలసాగెను. అంతట విష్ణుశర్మను చూచిన మేనక ఓ బుద్ధిశాలీ! ఎచటికి వెళ్ళుచున్నావు? అని అడిగెను.

అంతట విష్ణుశర్మ కామచారిణియగు మేనకతో ఇట్లు పలికెను. ‘తండ్రి కార్యమునకై త్వరగా ఇంద్రలోకమునకు వెడలుచున్నాను.’ అంతట మరల మేనక విష్ణుశర్మతో ఇట్లు పలికెను. ‘నేనిపుడు కామబాణపీడితనై నిన్ను శరణువేడుచున్నాను. ధర్మము తెలిసియున్నచో నన్ను రక్షించుము. నిన్ను చూచిన వెంటనే నా మనసు కోరికతో కలత చెందుచున్నది. కామాగ్ని నన్ను దహింపచేయుచున్నది. సంభ్రమము కామసంతాపము నన్ను కాల్చులోపు ప్రసన్నుడవు కమ్ము.’

విష్ణుశర్మ పలికెను.

‘నాకు నీ చరిత్ర, ఇంద్రుని చరిత్ర బాగుగా తెలియును. నేను అటువంటివాడను కాను. నీ సౌందర్యమునకు కాంతికి విశ్వామిత్రాది మహర్షులు ఇతరులు మోహమును చెందెదరు. కాని నేను శివశర్మ పుత్రుడను. యోగసిద్దిని తపసిద్ధిని పొందిన నేను కామాద్యరిషడ్వర్గమును మొదటనే జయించితిని. నీవు ఇతరుని ఆశ్రయించుము. నేను ఇంద్రలోకమునకు వెళ్ళుచున్నాను.’ ఇట్లు పలికి ఆ బ్రాహ్మణోత్తముడు త్వరగా వెడలసాగెను. ఇంద్రుడడుగగా మేనక నా ప్రయత్నము వ్యర్ధమైనదని తెలిపెను. అంతట మేనక విష్ణుశర్మను భయపెట్టుటకు బహురూపములను భయంకరాకారములను చూపెను. ఆ భయంకరాకారములు విష్ణుశర్మ తపఃప్రభావము వలన అగ్నిలో పడి కాలిపోవు గడ్డిమోపులవలె బూడిదగా మారెను. ఇట్లు అన్ని ఆకారములు అంతర్థానము చెందిన తరువాత ఇంద్రుడు ఎన్నో విఘ్నముల నేర్పరిచెను. ఆ విఘ్నములను కూడా విష్ణుశర్మ తన తేజస్సుతో భస్మము గావించెను. ఇట్లు తన తపోబలముతో తేజస్సుతో అనంత విఘ్నములను నశింపచేసెను. ఇంద్రుడు కల్పించిన విఘ్నములను కూడా నశింపచేయగలిగెను. ఇట్లు ఇంద్రుడు కల్పించిన అన్ని విఘ్నములను నశింపచేసి ఇవి ఇంద్రకృతములని తెలిసి ఇంద్రునిపై కోపించి ఎర్రబారిన కనులతో ఇంద్రలోకమునుండి ఇంద్రుని పడవేయుదును. స్వధర్మము నాచరించువానికి విఘ్నములను కల్పించువానిని దండించెదను. చంపువాడు తానే మరణించును. దేవతలకు ఇంకొక పాలకుని ఏర్పరిచెదను.’

ఇట్లు ఇంద్రుని నశింపచేయుటకు సిద్ధపడిన విప్రుని చూచి పాకశాసనుడగు ఇంద్రుడు విష్ణుశర్మ వద్దకు వచ్చెను. ‘ఓ జ్ఞాననిధీ! బ్రాహ్మణోత్తమా! తపస్సులో, నియమములో, నిగ్రహములో, సత్యశౌచములో నీకు సాటి మరియొకరు లేరు. నీ పితృభక్తితో నన్ను గెలిచితివి. నా అపరాధమును క్షమించుము. నీకు కావలసిన వరమును కోరుము. ఎంత దుర్లభమైననూ ఇచ్చెదను.’ అంతట విష్ణుశర్మ ఇంద్రునితో ఇట్లు పలికెను. ‘మహేన్దా! బ్రాహ్మణతేజము దేవాధిదేవులకు కూడా సహింపశక్యము కానిది. పితృభక్తుల తేజము మరీ దుస్సహము. మహానుభావులగు బ్రాహ్మణుల తేజోభంగమునకు ప్రయత్నించరాదు. పుత్రపౌత్ర పరివారముతో బ్రహ్మవిష్ణురుద్రులను కూడా నశింపచేయుదురు. విప్రులను కోపింపచేయరాదు. నీవు ఇపుడు రానిచో కోపించిన నేను నా తపఃప్రభావముతో నీ రాజ్యమును ఇతరులకు ఇచ్చియుందును. ఇపుడొచ్చి వరమునీయదలచితివి. నాకు అమృతమును నిశ్చలమగు పితృభక్తిని ప్రసాదింపుము. శత్రునాశకుడా! నా యెడల సంతోషించినచో ఇట్టి వరమునిమ్ము.’

అంతట ఇంద్రుడు ఇట్లు నీకు వరమును అమృతమునిచ్చుచున్నాను. ఇట్లు పలికి స్వయముగా అమృతభాండమును సంతోషముతో విష్ణుశర్మకిచ్చెను. నీకు నీ తండ్రియందు నిశ్చలమగు భక్తి ఉండును. ఇట్లు పలికి విష్ణుశర్మను పంపి ఇంద్రుడు ప్రసన్నుడాయెను. బ్రాహ్మణ తేజస్సును చూచి ఆశ్చర్యమును చెందెను. అంతట విష్ణుశర్మ తండ్రివద్దకు వెళ్ళి ఇట్లు పలికెను.

‘ఓ తండ్రీ! వ్యాధి నాశకమగు అమృతమును ఇంద్రుని నుండి తెచ్చితిని. ఈ అమృతముతో తాము రోగరహితులు కండు. అమృతముతో ఉత్తమ తృప్తిని పొందుడు.’

ఇట్లు విష్ణుశర్మ పలుకులను వినిన శివశర్మ పుత్రులందరిని పిలిచి ప్రసన్న చిత్తముతో ‘మీరందరూ పితృభక్తులు. నా ఆజ్ఞను పాలించువారు. ఈ భూమండలమున ఇతరులు పొందలేని వరమును కోరుకొనుడు.’ ఇట్లు తండ్రి మాటలను వినిన ఆ పుత్రులు తమలో తాము చక్కగా ఆలోచించుకొని తండ్రితో ఇట్లు పలకిరి. ‘మరణించిన మా తల్లి బ్రతుకవలయును. పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు కావలయును. మీ అనుగ్రహమున అన్ని జన్మలలోనూ తాము తండ్రిగా, ఈమె తల్లిగా మేమే పుత్రులముగా ఉండునట్లు అనుగ్రహించుడు.’

            శివశర్మ పలికెను.

ఈరోజే పుత్రులయందు అధికప్రేమగల మీ తల్లి బ్రతికి సంతోషముతో రాగలదు. సందేహించవలసిన పనిలేదు. ఇట్లు శివశర్మ పలికిన వెంటనే వారి తల్లి సంతోషముతో అచటికి వచ్చి ఇట్లు పలికెను. ‘పరాక్రమవంతుడగు పుత్రుడు అదియు సుపుత్రుడు కులదీపకుడు కావలయునని కోరుచుందురు. సౌభాగ్యవంతులు పుణ్యమతులు, పుణ్యకార్యముల నాచరించు స్త్రీలు పవిత్రదేహుడు పుణ్యకార్యసాధకుడగు పుత్రుని కోరుచుందురు.

పుణ్యాత్ముడు గర్భమునందు తిరుగుచున్నచో పవిత్రులగు పుత్రులను ప్రసవించును. కులాచారపరుడు, కులాధారుడు, తలిదండ్రులను తరింపచేయువాడు పుత్రునిగా పుణ్యములు చేయనిదే స్త్రీ పొందజాలదు. నేను పూర్వజన్మమున ఎంతటి పుణ్యమును చేసితినో ఇలాంటి ధర్మవత్సలుడు, ధర్మవీరుడు, ధర్మాత్ముడు భర్తగా పొందగలిగితిని. భర్త అనుగ్రహము వలననే నేను భర్తను మించిన గుణరాశులగు పుత్రులను పొందగలిగితిని. ఇతను పుణ్యప్రభావుడు. మీరు పుణ్యవత్సలులు. నా పుత్రులందరూ పితృభక్తిపరాయణులు. లోకమున పుణ్యములనాచరించినపుడు మాత్రమే సత్పుత్రులు కలుగుదురు. ఒకరిని మించినవారు ఇంకొకరుగా నాకు అయిదుగురు మహానుభావులు పుత్రులనుగా పొందగలిగితిని. యజ్ఞశీలులు, పుణ్యస్వభావులు, తపస్సు, తేజస్సు, పరాక్రమము కలవారుగా ఉన్నారు.’ ఇట్లు తల్లి మెప్పును పొందిన పుత్రులు సంతోషముతో తల్లికి నమస్కరించిరి.

            పుత్రులు పలికిరి.

ఎన్ని పుణ్యములవల్లనో సన్మాత సత్పిత లభించును. మీవంటి పుణ్యాత్మురాలు తల్లిగా అదృష్టములేనిదే లభించదు. మీ గర్భమున ప్రవేశించి పుణ్యములతో పెంచబడితిమి. ప్రతి జన్మలోనూ మీరే తల్లిదండ్రులుగా కావలయును.

            తండ్రి పలికెను.

కుమారులారా! చక్కని వరమును కోరుడు. నేను సంతోషించినపుడు అక్షయభోగములను అనుభవించుడు.

            పుత్రులు పలికిరి.

ఓ తండ్రీ! మా యెడ ప్రసన్నుడవగుచో వరమునీయ తలచినచో సంతాపములు లేని, విష్ణుసంబంధియగు గోలోకమునకు మమ్ములను నంపుము.

                  తండ్రి పలికెను.

పాపరహితులగు మీరు నా అనుగ్రహమువలన మీ తపఃప్రభావము వలన మీ పితృభక్తి వలన విష్ణులోకమునకు వెళ్ళుడు. శివశర్మ ఇట్లు పలికిన వెంటనే శంఖ చక్ర గదాపాణియగు శ్రీమన్నారాయణుడు గరుడవాహనారూఢుడై అటకు వచ్చి పుత్రులతో కూడియున్న శివశర్మతో ఇట్లు పలికెను. నీ పుత్రులు నీవు భక్తితో నన్ను గెలిచితిరి. నలుగురు పుత్రులతో కలిసి పతివ్రత పుణ్యాత్మురాలగు భార్యతో నా లోకమునకు రమ్ము.

                శివశర్మ పలికెను.

నా ఈ నల్గురు పుత్రులు పరమోత్తమమగు విష్ణులోకమును వెళ్ళేదరు. నేను మాత్రము కొంతకాలము ఈ భార్యతో సుపుత్రుడగు ఈ సోమశర్మతో ఇచటనే గడి పెదను. సత్యభాషియగు శివశర్మ ఇట్లు శుభవాక్యమును పలికిన వెంటనే శ్రీమహావిష్ణువు శివశర్మ పుత్రులతో ఇట్లు పలికెను. దాహము (బాధ) ప్రలయములు లేని మోక్షమునకు వెళ్ళుడు. ఇట్లు శ్రీమహావిష్ణువు పలుకగానే సత్యబుద్ధులగు ఆ నల్వురు పుత్రులు ఆ క్షణములోనే విష్ణుసారూప్యమును పొందిరి. ఇంద్రనీల వర్ణదేహులు, శంఖచక్రగదాధారులు సర్వాభరణాలంకృతులు మహాతేజశ్శాలులు హారకంకణ శోభతో విరాజిల్లువారు రత్నమాలాలంకృతులు సూర్యతేజస్సుకు దీటగు తేజోవంతులు తేజోజ్వాలలు చుట్టూ ఆవరించియున్నవారు శివశర్మ చూచుచుండగా విష్ణుదేహమును ప్రవేశించిరి. దీపము మరియొక దీపమున లీనమగునట్లు విష్ణుదేహమున లీనమయ్యిం . ఆ బ్రాహ్మణోత్తములు పితృభక్తితో విష్ణులోకమునకు వెడలిరి. ఇక ఇపుడు సుసత్యమగు సోమశర్మ ప్రభావమును వివరించెదను.

ఇది శ్రీ పద్మపురాణమున భూమిఖండమున శివశర్మోపాఖ్యానమున మూడ - అధ్యాయము ముగిసినది.