పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
73 - యయాతినా స్వరాజ్యే విష్ణుసేవాజ్ఞోద్ఘోషణమ్
పిప్పల ఉవాచ - పిప్పలుడు చెప్పుచున్నాడు.
సుకర్మోవాచ - సుకర్మ పలికెను.
ఇంద్రుని దూత స్వర్గమునకు వెళ్ళిన తరువాత ధర్మాత్ముడు నహుషపుత్రుడైన ఆ యయాతి ఏమి చేసెను? ఇట్లు పిప్పలుడడుగగా సుకర్మ ఇట్లు పలికెను. ఆ దేవేన్దుని దూత వెడలిన తరువాత ఆ యయాతి ఆలోచించసాగెను. వెంటనే అతను ఉత్తములైన దూతలను పిలిచి ధర్మార్థయుక్తమైన వాక్యమును ఆదేశించెను. ఉత్తమ దూతలారా! త్వరగా వెళ్ళుడు. పురవరమున దేశములందు ద్వీపములందు అఖిలలోకమున ధర్మయుక్తమైన నా మాటను ఆచరించుడు. మంచిమార్గముతో శ్రీహరిలోకములకు వెళ్ళుడు. పరమపుణ్యభావములతో అమృతము వంటి ధ్యానములతో జ్ఞానములతో యజ్ఞములతో తపస్సులతో యాజనములతో దానములతో మధుసూదనుని మాత్రమే పూజించుడు. ఇతర లౌకిక విషయములను విడిచి పెట్టుడు. అంతట ఒక శ్రీమన్నారాయణునే చూడుడు. ఎండినవాటిలో తడిసినవాటిలో స్థావరములలో మేఘములలో భూమియందు చరాచరములందు చివరకు తమ శరీరములందు కూడా జీవస్వరూపుడు ఆ శ్రీహరియే అని చూడుడు. ఆ శ్రీహరిని ఉద్దేశించియే దానము చేయుడు. ఆతిథ్యమును పితృశ్రాద్దములను శ్రీహరి భావనతోనే చేయుడు. దేవవరుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించుడు. త్వరలో సకల దోషవిముక్తులు కండు. ఈ నా మాటను లోభముతో కాని, మోహముతో కాని ఆచరించనివానిని సిగ్గులేనివానిని కఠినముగా దండించుడు. అపుడు అతను నికృష్టుడైన చోరునివలె నికృష్టలోకమునకు వెడలును. ఇట్లు యయాతి మహారాజు వాక్యమును వినిన దూతలు సంతోషభావముతో సకల భూమండలమును వెళ్ళి మహారాజుగారి ఆజ్ఞను మొత్తమును ప్రజలకు తెలియజేసిరి.
బ్రాహ్మణాది మానవులారా! ఈ భూమండలమున యయాతి మహారాజు పరమపావనమైన అమృతమును గొనివచ్చినాడు. అది వైష్ణవామృతము. ఇది ఏ దోషములు లేనిది. ఇష్టపరిణామమును కలిగించునది. ఆ అమృతమును పానము చేయుడు. శ్రీ కేశవుడు క్లేశహరుడు. సర్వశ్రేష్ఠుడు. ఆనందరూపుడు. పరమార్థరూపుడు. అతని నామామృతమును పరమపావనమును మహారాజు తెచ్చినదానిని పానము చేయుడు. ఆ శ్రీహరి ఖడ్గపాణి మధుసూదనుడు శ్రీనివాసుడు సగుణుడు సురాధిపతి. అతని నామామృతము అఖిల దోషహరము. పరమపావనము. చక్కని రాజు తెచ్చినది సిద్దముగానున్నది. పానము చేయుడు. శ్రీపద్మనాభుడు కమలాక్షుడు జగత్తులకు ఆధారరూపుడు మహేశుడు పాపాపహారి వ్యాధి వినాశరూపుడు ఆనన్దమునిచ్చువాడు. దానవదైత్య నాశకుడు యజ్ఞాజ్ఞరూపుడు చక్రపాణి పుణ్యాకరుడు అనన్తసౌఖ్యరూపుడు విశ్వాధివాసుడు విమలుడు విరామరూపుడు రామాభిధుడు రమణుడు మురారి ఆదిత్యరూపుడు తమోవినాశకుడు బంధనాశకుడు బుద్ది అను పద్మబంధనాశకుడు. ఇది పరమాత్మ యొక్క నామామృతము. సత్యము. పరమపావనము. ఇట్టి నామామృతమును ప్రభాతకాలమున నియమబద్దముగా గానము చేయు మహానుభావుడు సంసారమును విడిచి ముక్తిని పొందును.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థ వర్ణనలో యయాతి చరితమున డెబ్బది మూడ - అధ్యాయము.
