పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

71 - దేవలోకసంస్థాన వర్ణనమ్

యయాతిరువాచ - యయాతి పలికెను.

మాతలిరువాచ - మాతలి పలికెను.

సకల శ్రేష్ఠమైన ధర్మాధర్మ స్వరూపమును సమగ్రముగా తాము చెప్పియున్నాము. తమ వాక్యములను వినుచున్న నాకు ఇంకా వినవలయునని శ్రద్ద కలుగుచున్నది. ఆయాలోకపాలకుల దేవతల సంఖ్యలను నాకు తెలుపుడు. యేయే పుణ్యప్రసజ్ఞములో ఎవరెవరు దేనిని దేనిని ఎట్లు పొందిరో తెలుపుడు అని అడుగగా మాతలి ఇట్లు పలికెను. “తపసుచే సంపాదించినదానిని యోగయుక్తమును ఇపుడు చెప్పెదను. ఈ దేవతల లోకసంస్థానము సుఖభోగప్రదాయకము. విడివిడిగా ఆయా కర్మలచే సంపాదించిన ధర్మభావమును చెప్పెదను. ఇదీగాక పైపై లోకముల స్వరూపమును కూడా యధాక్రమముగా తెలిపెదను. మాంస భక్షకులైన రాక్షసులకు పార్థివైశ్వర్యము అష్టగుణము. అపుడే అచటకి చేరిన నరులకు దానితో సమానభాగమేయుండును. రాక్షసులకు 16 గుణములు పార్థివులకు కూడా అట్లే ఉండును. ఇట్లు కులతేజస్సులకు మిగిలిన దంతయు ఉండును. గంధర్వులకు వాయవ్యభాగము యక్షులకు సకలభాగము ఇంద్రునికి పాంచభౌతికము ఇదియే చత్వారింశద్గుణము. ఇక సోమునిది మానస భాగము. విశ్వేశునాది దివ్యమైన పాంచభౌతికము. ప్రజాపతులకు అధిపతులకు అహంకార గుణాధికమైన సౌమ్యభాగము. బ్రహ్మాది అభిగుణములు కలది. బుధునిది ఉత్తమైశ్వర్యము. శ్రీమహావిష్ణువునది ప్రాధానిక భాగము. బ్రహ్మాది ఐశ్వర్యపదము. ఇక దివ్యమైన శ్రీమచ్ఛివపురమున సార్వకామికైశ్వర్యము. శివునికి గొప్పదైన ఆత్మగుణము అయిన ఐశ్వర్యము అనత్తగుణము.

ఆదిమధ్యాన్తరహితము విశుద్దము తత్త్వలక్షణము సర్వమును అవభాసింపచేయునది సూక్ష్మము సాటిలేనిది పరమునకంటే పరము. ఇది సుసంపూర్ణము జగద్రూపము పశుపాశములను విడిపించునది. యే స్థానము పొందినవారికి ఆ స్థానానుగుణముగానే భోగముండును. ఈశ్వరానుగ్రహము వలన విమానము కూడా ఆ స్థానానుగుణముగనే లభించును. తారల రూపములు నానావిధములు. ఇవి కోట్లుగా కనపడుచున్నవి. ఇట్లు పుణ్యాత్ముల లోకములు 28గా ప్రకాశించుచున్నవి. ఈశ్వరునికి అపుడు అపుడు నమస్కరించువారికి వారి వారి సంపర్కమును బట్టి కౌతుకమును బట్టి లోభమువలన ఆయా విమానము లభించును. శివుని ప్రసజ్ఞముతో నామసంకీర్తనమును కాని నమస్కారము కాని చేయువారికి నాశముండదు. ఇట్లు శివకర్మలో ఉత్తమగతులివి. ఈశ్వరుని భావముతో ఆభ్యన్తర కర్మవలన కూడా ప్రసజ్ఞవశమున శఙ్కరస్మరణ చేసిననూ వారికి అతుల సౌఖ్యము లభించును. ఇక తత్పరులకేమి చెప్పవలయును. ధ్యానముతో ఏకాగ్ర మనస్సుతో విష్ణువును చింతించువారు పరమస్థానము అయిన ఆ విష్ణుపరమపదమును పొందును. శివునిది విష్ణువుది ఒకే రూపము. ఇద్దరికీ భేదము లేదు. మహానుభావులది ఇద్దరిదీ ఒకే రూపము. శివుడు విష్ణురూపుడు. విష్ణువు శివరూపుడు. శివుని హృదయము విష్ణువు. విష్ణువు హృదయము శివుడు. ఇట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిన త్రిమూర్తులు ఒకే రూపులు.

 సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

ఈ ముగ్గురిలో భేదము లేదు. కేవలము గుణభేదము మాత్రమే చెప్పబడుచున్నది. రాజేంద్ర! నీవు శివభక్తుడవు. అట్లే భాగవతోత్తముడవు కూడా. కావుననే నీ విషయమున బ్రహ్మవిష్ణు మహేశ్వరులైన దేవులు ప్రసన్నులైరి. నీ కర్మలవలన వారు చక్కగా ప్రసన్నులైరి. వరదులు కూడా. నేను ఇంద్రుని ఆజ్ఞవలన నీ సన్నిధికి వచ్చితిని. మొదటి ఐస్ధలోకమును వెడలుము. తరువాత బ్రహ్మలోకమును ఆ తరువాత శివలోకమును వెళ్ళుము. ఆ తరువాత విష్ణులోకమును వెళ్ళుము. విష్ణులోకము దాహప్రలయములు లేనిది. ఈ విమానము దివ్యము. అన్నిచోట్లకు వెడలును. నీవు కూడా దివ్యరూపమును ధరించి నీ మనసునకు నచ్చిన దివ్యభోగములను అనుభవించుము. సుఖముగా వెళ్ళునది పుష్పక విమానమును అధిరోహించి అనుభవించుము.

సుకర్మ పలికెను.

 బ్రాహ్మణోత్తమా! మాతలి నహుషాత్మజుడు ధర్మతత్త్వములు తెలిసినవాడు అయిన యయాతి మహారాజుతో ఇట్లు పలికి మౌనమును వహించెను.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థమున యయాతి చరితమున డెబ్బది యొకట - అధ్యాయము.