పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
9 - అధ్యాయము
కశ్యపమహర్షి పలికెను.
ఇట్లు ధ్యానాదికములతో బోధించబడిన ఆత్మ పంచాత్మకమగు కార్యమును (కాయమును) బుద్ధికలవాడై విడువదలచెను. ఆయా నిమిత్తములను చూచి వాటిని చేరి నిరాసక్తముగా కాయమును విడిచిపడినదానిని చూడకపోయెను. కలిసి పెరిగిన దేహప్రాణములకేసంబంధము లేదు. ఇక ధనపుత్రకలత్రములతో సంబంధమెట్లుండును? ఇది తెలిసి శాంతించుము. బాధపడకుము. ఈ శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ ఇతనే అనాదిమధ్యనిధనుడు. దేవదానవులలో ఇతనే ఆత్మగా నుండును. ఇతనే బ్రహ్మ, ఇతనే రుద్రుడు, ఇతనే విష్ణువు. ఇతనే లోకములను సృజించును, పాలించును. ధర్మస్వరూపుడగు ఈ జనార్దనుడే సంహరించును కూడా. ఇతనే దేవతలను, దానవులను సృజించెను. అధర్మములేనివారు దేవతలు, ధర్మములేనివారు నీ పుత్రులు. మాధవుని స్వరూపమగు ధర్మమును దేవతలందరూ పాలించుచున్నారు. ధర్మమునే ఆలోచించవలయును. ధర్మమునే ఆచరించవలయును. శ్రీమహావిష్ణువు ధర్మస్వరూపుడు. అనుగ్రహశీలుడు. దేవతలు ధర్మసత్యతపములతో ప్రవర్తించుచున్నారు. విష్ణువు ప్రసన్నతను పొందినవారు ధర్మమును పరిపాలించుచుందురు. శ్రీమహావిష్ణువునకు ధర్మము శరీరము, సత్యము హృదయము.
సత్యధర్మములను పాలించువాని విషయమున శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడగును. సత్యధర్మములను దూషించి పాపమును పరిపాలించువాని విషయమున విష్ణువు కోపించి నశింపచేయును. తపస్సత్యనిష్టులగు విష్ణుభక్తులు ధర్మమును పాలించుచున్నారు. శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై వారిని రక్షించుచుండును. నీ పుత్రులు, దనుపుత్రులు, సింహికాపుత్రులు పాపబుద్ధులై అధర్మముతో పాపముతో ప్రవర్తించుచున్నారు. చక్రపాణియగు వాసుదేవుడు యుద్ధమున వారిని సంహరించెను. నేను మొదట నీముందు చెప్పిన ఆత్మయే విష్ణువు. ధర్మాత్ముడు, సర్వరక్షకుడు. దైత్యదేహములందున్నవాడై పాపములనాచరించుచున్నవారిని దానవులను కోపించిన విష్ణువును సంహరించెను. బాహ్యాభ్యంతరములలో తానే వ్యాపించియున్నవాడై నీ పుత్రులను సంహరించెను. సృష్టించినవాడే సంహరించెను. కావున వీరి విషయమున మోహమును చూపరాదు. నా మాటను వినుము. పాపబుద్ది కలవాడు నశించును. కావున మోహమును విడిచి ధర్మమును ఆశ్రయించుము.
దితి పలికెను.
మహానుభావా! అట్లే కానిమ్ము! నీవు చెప్పినట్లే చేతును. ఇట్లు కశ్యపమహర్షితో మాట్లాడి దుఃఖించుచున్నదై ముని బోధవలన దుః ఖమును విడిచెను.
ఇది శ్రీపాద్మపురాణమున రెండవదగు భూమిఖండమున దేవాసురమున దితిసంబోధనమను తొమ్మిద - అధ్యాయము.
