పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
30 - వేనచరిత్ర వర్ణనము
ఋషులు పలికిరి.
పాపాచారునిగా తాము వర్ణించిన వేనుని పాపప్రవృత్తి ఎలాంటిది, దానికెలాంటి ఫలమును పొందెను. పూర్వము జరిగిన ఆ వేనుని చరితమును విస్తారముగా మాకు తెలుపుము.
సూతమహర్షి పలికెను.
వేనుని చరితమును పరమపావనము మహానుభావుడగు వేనపుత్రుడగు పృధుచక్రవర్తి చరితమును న్యాయానుగుణముగా నేను వినిన రీతిని వివరించెదను. మహానుభావుడు మహాత్ముడగు పృధువు పుత్రునిగా పుట్టగా వేనుడు పరిశుద్ధిని ధర్మమును కూడా పొందెను. నరాధములు ఆచరించిన పాపములు సజ్జనసాంగత్యముతో పరిహరించబడును. సజ్జన సంగతితో పుణ్యము సమకూరును. దుర్జనసంగతితో పాపము చేకూరును. ఈ విషయమున ఎట్టి సంశయము లేదు. పాపులతో మాటలాడుటవలన, దర్శనము వలన స్పర్శవలన, కలిసి కూర్చొనుటవలన, కలిసి భుజించుటవలన, పుట్టుకవలన పాపము కలుగును. ఇట్లే పుణ్యుల విషయమున పుణ్యము కలుగును. పరమపావనుల సాంగత్యముతో పాపములు పరిశుద్ది పొందును. ఇతర సాధనములచే చెందవు. ఇట్లు సజ్జన సంగతిని పొందినవారు మహాతీర్థములలో మునిగినవారు సకలపాపములు నశించి పుణ్యలోకములకు చేరెదరు.
ఋషులు పలికిరి.
ఓ బ్రాహ్మణోత్తమా! ఆ పాపులు ఉత్తమసిద్దిని ఎట్లు పొందగలరు? ఈ విషయమును వినుటకు మాకు శ్రద్ధ కలుగుచున్నది. కావున మాకు విస్తారముగా తెలుపుడు.
సూతమహర్షి పలికెను.
మహాపాపులగు వేటాడువారు, బెస్తవారు, కసాయివారు రేవా యమునా గంగాతీరమున నివసించువారు తెలిసియో తెలియకనో స్నానమాడి జలక్రీడలాడుచు మహానదీ సంగతివలన పరమగతిని పొందుచున్నారు. వారి జాతిని వృత్తిని ఆచరించిన పాపమును కూడా విడిచి ఉత్తమగతిని పొందుచున్నారు. పవిత్ర జలస్పర్శవలన వారికి అన్ని దోషములు తొలగుచున్నవి. మహానదీ సంగతివలన మహాపుణ్యుల సంగతివలన పాపుల పాపము నశించును. ఇతర సంగతితో ఇతరులకు నశించదు. సంగతి వలన, దర్శనము వలన, స్పర్శవలన పాపము నశించును. ఈ విషయమున విచారించవలసిన పనియే లేదు. ఈ విషయమున ఒక ఇతిహాసము కలుగదు. అది సకల పాపనాశకము.
అట్టి ఇతిహాసమును బహుపుణ్యప్రదమును ఇపుడు నీకు చెప్పెదను. ఒక మహావనమున సులోభుడను ఒక గొప్ప వేటగాడుండెను. వేటకుక్కలతో వలలతో ధనుర్బాణములతో ప్రతిదినము మృగములను చంపుచు మృగమాంసమును తినుటలో అధికరుచి కలవానిగా నుండెను. దుష్టాత్ముడగు ఆ వేటగాడు ఒకనాడు ధనుర్బాణములను ధరించి వేటకుక్కలను తీసుకొని వింధ్యపర్వతవనమునకు వెళ్ళెను. అచట భయపడి పారిపోవుచున్న లేళ్ళను, దుప్పులను, ఎనుబోతులను చాలావాటిని చంపెను. ఇంతలో ఒక బెస్తవాడు రేవాతీరమును చేరి అచట చాలా చేపలను చంపి నీటినుండి బయటకు వచ్చెను. ఇంతలో మృగము వేటగానిని చూచి భయముతో ప్రాణములను దక్కించుకొనదలిచి ఆర్తితో బెదురుచూపులతో వేగముగా పరుగెత్తుచు రేవాతీరమునకు చేరినది. వేటకుక్కలు వెంటాడగా బాణపు దెబ్బకు బాధపడుచు పరుగెత్తసాగెను. సులభుడుకూడా వాయువేగముతో వెంట పరుగెత్తసాగెను. ఇంతలో బెస్తవాడు కూడా ఆ మృగములను చూచెను. అతను కూడా వింటినెక్కుపెట్టి బాణమును విడుచునంతలో సులోభుడు ఇది నా వేటలోని లేడి. దీనిని నీవు చంపరాదు అనెను. ఆ మాటలను వింటూనే ఆ బెస్తవాడు బాణమును విడిచెను. ఇట్లు ఇద్దరి బాణములు తాకి ఆ లేడి చనిపోయెను. వేటకుక్కలు కూడా నోటితో కరిచినవి. ఆ దెబ్బలకు బాధకు వివశురాలై మృగము పర్వతశిఖరమునుండి రేవానదీ ప్రవాహములో పడిపోయెను. వేటకుక్కలు కూడా దానివెంట ఆ నదిలో పడినవి. అంతట వేటగాడు బెస్తవానితో కోపముతో ఇది నా మృగము. దుష్టుడా నీవెందుకు చంపితివి అని పలికెను. అంత ఆ బెస్తవాడు కూడా ఇది నా మృగము. సందేహము లేదు. నీవు గర్వముతో మాటలాడుచున్నావు. ఇట్లు మాటలాడుచు ఆ ఇద్దరు పరస్పరము యుద్ధము చేయుచు క్రోధముతో లోభముతో ఆ రేవానదీప్రవాహములో పడిపోయిరి.
ఆ సమయము ఉత్తమగతిని ప్రసాదించు అమావాస్యాయోగము. ఇది మహాపుణ్యఫలప్రదము. అంతటి గొప్ప పర్వసమయమున వారందరు ఆ రేవానదిలో పడిపోయిరి. వారందరూ జపము ధ్యానము సద్భావము సత్యము లేనివారు అయిననూ అంతటి ఉత్తమతీర్థమున స్నానము వలన ఆలేడి వేటగాడు అందరు అన్ని పాపములను తొలగించుకొని ఉత్తమగతిని పొందిరి. తీర్థ ప్రసంగమువలన సత్సంగమువలన అగ్ని కట్టెలను కాల్చునట్లు పాపుల పాపములు రాలిపోవును. ఇట్లు మహానుభావుల ఋషుల సంసర్గమువలన, సంభాషణవలన, దర్శనము వలన స్పర్శవలన వేనరాజు పాపము కూడా నశించినది. మహాపుణ్యుల సంసర్గమువలన పాపుల పాపము నశించును. మహాపాపుల సంసర్గమువలన పాపము మనకంటును. మాతామహుడగు మృత్యువు దోషమువలన వేనుడు పాపబుద్ది ఆయెను కదా.
ఋషులు పలికిరి.
ఇచట మాతామహుని (తాత) దోషమేమిటో మాకు వివరముగా తెలుపుడు. అతనే మృత్యువు, కాలుడు, యముడు, ధర్ముడు. అతను ఎవరినీ హింసించువాడు కాదు. ఆ పదవిలో నియమించబడినవాడు. సకల చరాచరలోకములు తమ తమ కర్మలకు వశమైయుందురు. బ్రతుకుచుందురు. చనిపోవుచుందురు. తమతమ కర్మానుగుణముగా ఫలములను అనుభవింతురు. పాపులు వారీ కర్మానుగుణముగా భయంకరరూపుడగు మృత్యువును చూతురు. పరమపుణ్యాత్ముడగు యముడు అన్ని రకములలో వారాచరించిన కర్మలకు తగిన విధముగా శిక్షలు కల్పించును. కొట్టును. ఇది అతని నిత్యకృత్యము. పుణ్యాత్ములకు పుణ్యఫలములను కూర్చును. కావున అతని దోషము ఏదియూ లేదు కదా. అయినపుడు మృత్యువు ఏ దోషమువలన వేనుడు పాపి ఆయెనో వివరించుడు.
సూతమహర్షి పలికెను.
ఆ మృత్యువు దుష్టబుద్ధికల పాపులకు శాసకుడు, కాలరూపునిగా ఉండును. వారు వారాచరించు కర్మలను పరిశీలించుచుండును. చెడుపని చేసినచో శిక్షించును. వారి వారి పాపమును తెలిసి గొనిపోవును. పుణ్యముల నాచరించినవాడు వాని పుణ్యముతో స్వర్గమునకు గొనిపోవును. అట్లు వారి వారికి మృత్యువే తమ దూతలతో ఆయా ఫలములను కూర్చును. పుణ్యములనాచరించినవారికి గొప్ప సుఖములను గీతమంగళవాద్యములతో దానభోగాదులను కూర్చును. పాపములనాచరించినవారిని భయంకరములగు కష్టములతో బాధలతో కూర్చును. భయపెట్టును. కొట్టును. ఇట్టి పనిలో హితమునకై వారిలో మార్పు వచ్చును. మృత్యువునకు కూడా లోభము పుణ్యము మొదలగువాటివలన కర్మఫలము కలుగుచుండును. అట్టి మహానుభావుడగు మృత్యువునకు సునీధా అను ఒక కూతురు కలిగెను. ప్రజలాచరించు పుణ్యపాపములకు తగిన ఫలములనిచ్చుచున్న తండ్రి చేయుచున్న పనిని ఆ కూతురు పరిశీలించుచుండెను. అట్లు ఆటలాడుచూ ఒకనాడు చెలులతో కలిసి వనమునకు చేరెను. ఆ వనమున ఒక మహానుభావుని గంధర్వతనయుని ఉత్తముని సుశంఖుడనువానిని చూచెను. అతను చక్కనివాడు. గొప్ప తపమునాచరించుచున్నవాడు. గానవిద్యలో సిద్ధిని పొందుటకు సరస్వతిని ధ్యానించుచుండెను. ఆ సునీధ ప్రతిదినము అచటికి వచ్చి అతనిని కొట్టుచుండెను. సుశంఖుడు ఆ పనిని సహించుచు ఇటనుండి వెళ్ళమని చెప్పుచుండెను. అట్లు పంపుచున్ననూ వెళ్ళకుండగా అతని తపమునకు విఘ్నమునే చేయుచుండెను. అతనిట్లు చెప్పుచుండగా కోపించి ఆమె తపస్సు చేయుచున్న సుశంఖుని కొట్టుచుండెను. అంతట కోపించిన సుశంఖుడు దుష్టురాలా, పాపసమాచరురాలా! నీవెందుకు విఘ్నము చేయుచున్నావు, మహానుభావులు కొట్టినవారిని మరల కొట్టరు. లాగిననూ హింసించిననూ కోపించరు. ఇది ధర్మస్థితి. ఏ దోషము లేని నన్ను తపమునాచరించుచున్నవానిని నీవు కొట్టుచున్నావు. ఇట్లు పలికి స్త్రీ అని దయతలచి క్రోధమును ఉపసంహరింపచేసుకొనెను. అంతట సునీధ పాపమువలన కలిగిన మోహమువలన బాల్యమువలన సుశంఖునితో ఇట్లు పలికెను. మా నాన్నగారు మూడు లోకములలోనున్నవారిని కొట్టుచున్నాడు. దుష్టులను దండించుచున్నాడు. సజ్జనులను పరిపాలించుచున్నాడు. అతనికే దోషము అంటలేదు. ఇట్లు పలికి ఆమె తండ్రివద్దకు వెళ్ళి ఇట్లు పలికెను. తండ్రీ! నేను వనమున ఒక గంధర్వతనయుని కొట్టితిని. అతను ఏకాంతమున కామక్రోధములను విడిచి తపమును చేయుచుండెను. ఆ గంధర్వతనయుడు కోపము కలవాడై నాతో నిట్లనెను. కొట్టుచున్నవానిని కూడా మరల కొట్టరాదు. నిందించుచున్నవానిని మరల నిందించరాదు అని. నీవు దానికి కారణమును తెలుపుము. సునీధ ఇట్లు అడిగిననూ ధర్మాత్ముడగు మృత్యువు ఏమీ బదులు పలుకలేదు. తరువాత సునీధ మరల అడవికి వెళ్ళి తపస్విశ్రేష్ఠుడగు సుశంఖుని మరల కొరడాలతో కొట్టసాగెను.
ఇట్లు మృత్యుపుత్రికచేత కొట్టబడి కోపించిన సుశంఖుడు ఇట్లు శపించెను. ‘ఈ అరణ్యములో ఉండి తపము చేయుచున్న నిర్దోషియైన నన్ను కొట్టినందున శపించుచున్నాను. నీవు వివాహము చేసుకొనిన తరువాత భర్తతో కలిసి గృహస్థధర్మములో నుండగా నీకు పాపాచారపరాయణుడు దేవబ్రాహ్మణ నిందకుడు అన్ని విధముల పాపములయందు ఆసక్తికలవాడు దుష్టుడు నీకు పుత్రునిగా కలుగును.’ ఇట్లు శపించి అతను వెళ్ళి తపమునాచరించుచుండెను. సుశంఖుడు వెళ్ళిన తరువాత సునీధ కూడా ఇంటికి వెళ్ళి పరితాపముతో సుశంఖుడు శపించిన విషయమును తండ్రికి తెలిపెను. దానినంతనూ వినిన మృత్యువు ఇట్లు పలికెను. దోషములేని తపస్విని నీవు ఎందుకు కొట్టితివి. తపస్సు చేయుచున్నవానిని కొట్టుట తగనిపని. ఇట్లు పలికిన మృత్యువు అతిదుఃఖముతో ఆమె భాగ్యమును (అదృష్టమును) ఆలోచించుచుండెను.
సూతమహర్షి పలికెను.
అత్రిపుత్రుడు మహాతేజస్వియగు అంగుడు పరమప్రతాపవంతుడు ఒకప్పుడు నందనవనమునకు వెళ్ళెను. అచట అప్సరోగణములతో గంధర్వులతో కిన్నరులతో పాడుచు ఆడుచు కూడియున్నవానిని సుగంధభూయిష్టములగు చామరములతో వీయబడుచున్నవానిని, హంసయానలగు స్త్రీలతో చామరములు వీచుచున్నవానిని, చంద్రబింబమును పోలిన హంసవంటి రంగుకల ఛత్రముతో శోభించుచున్నవానిని, సర్వాభరణభూషితుని సహస్రాక్షుని కామక్రీడలోనున్న మహాతేజస్వియగు ఇంద్రుని చూచెను. అతని ప్రక్కన మహానుభావురాలు, రూపవంతురాలు, తేజముతో రూపముతో యశోవంతురాలు సౌభాగ్యముతో పాతివ్రత్యముతో శోభించుచున్నదానిని శచీదేవిని చూచెను. ఆ శచీదేవితో నందనవనమున విహరించుచున్నవానిని చూచెను. ఇంద్రుని ఆ లీలను భోగమును చూచిన అంగుడు ఇట్టి పరివారముతో కూడియున్న ఈ ఇంద్రుడు ధన్యుడు. ఇంతటి పదవిని పొందిన ఇతని తపఃప్రభావము ఎంతటిదో కదా. నాకు ఇంతటి పుత్రుడు సర్వలోకనాయకుడుగా ఉండువాడు కలిగినచో చాలా ఆనందమును పొందుదును. ఇట్లు ఆలోచించుచు త్వరగా ఇంటికి వెళ్ళేను.
ఇది శ్రీ పద్మపురాణమున భూమిఖండమున వేనోపాఖ్యానమున 30 - అధ్యాయము.
