పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
42 - సుదేవా చరితము
సఖ్య ఊచుః - చెలులు పలికిరి.
‘మహానుభావురాలా! నీవు చెప్పిన సుదేవ ఎవరు? ఆమె ఆచారమేమిటి? మాకు తెలుపుము. నీవు చెప్పిన ఆ సుదేవ చరితములో సత్యమును నీవే తెలుపుము.’
సుకలోవాచ - సుకల పలికెను.
అయోధ్యయందు మనుపుత్రుడైన ఇక్ష్వాకు మహారాజు ధర్మకోవిదుడు, సర్వధర్మార్థతత్పరుడు. అన్నియూ తెలిసినవాడు. దేవతలను, బ్రాహ్మణులను పూజించువాడుగా నుండెను. అతని భార్య ఎల్లపుడు పవిత్రురాలు, పతివ్రతపరాయణురాలు. మహారాజు ఆ భార్యతోనే యజ్ఞములను ఆచరించుచుండెను. వివిధ తీర్ధములను పర్యటించుచుండెను. ఇదిలా ఉండగా కాశీరాజైన వేదరాజు మహానుభావుడు. అతనికి సుదేవ అను ఒక పుత్రికయుండెను. ఆమె సత్యాచారపరాయణురాలు. ఇక్ష్వాకుమహారాజు ఆ సుదేవను వివాహమాడెను. సుదేవ చక్కని సౌందర్యవతి. ఆ భార్యతోనూ పుణ్యకార్యములనాచరించు మహారాజు ఎన్నో యజ్ఞములనాచరించెను. మరెన్నో పుణ్యకార్యములనాచరించుచుండెను. ఆ ప్రియురాలితో మహారాజు నిత్యము రమించుచుండెను. ఒకసారి మహారాజు ఆ సుదేవతో కలిసి వనమునకు వెడలెను.
గంగారణ్యమును చేరి వేటతో విహరించుచుండెను. సింహములను, వరాహములను, గజములను, మహిషములను చంపసాగెను. అట్లు ఆడుచున్న ఆ మహారాజు ముందునకు ఒక వరాహము చాలా సూకరములగుంపుతో వచ్చెను. పుత్రులు, పౌత్రులు, ప్రియురాలు ఒక సూకరి అతని ప్రక్కన ఉండెను. ఎవరికి జయింపశక్యము కానివాడు, రాజరాజేన్గుడు, వేటలో ఆసక్తముగానున్న ఇక్ష్వాకుమహారాజును చూచెను. పర్వతశిఖరమును ఆశ్రయించి భార్యతో సహా ఆ సూకరము పుత్రపౌత్రులతో కూడి ఉండెను. మృగములతో మహారాజు చేయుచున్న గొప్ప యుద్దమును తెలిసి పుత్రులను, పౌత్రులను, భార్యను చూచి ఇట్లు పలికెను. 'కోశలాధిపతి మహావీరుడు, మనుపుత్రుడు, మహాబలుడైన ఇక్ష్వాకుమహారాజు వేటాడుచున్నాడు. చాలా మృగములను సంహరించుచున్నాడు. ఆ మహారాజు నన్ను చూచి తప్పక రాగలడు. ఇందులో సందేహము లేదు. ఇతర వేటగాళ్ళతో నాకు భయము లేదు. రాజు నా రూపమును చూచి క్షమను చూపజాలడు. గొప్ప సంతోషముతో ధనుర్బాణములను ధరించి వేటకుక్కలతో కూడి, వేటగాళ్ళతో కలిసి ప్రియురాలా! నన్ను చంపగలడు.
సూకర్యువాచ - సూకరి పలికెను.
చాలామంది వేటగాళ్ళను చూచినపుడల్లా వారు గొప్ప ఆయుధములను ధరించి చాలామంది వచ్చినపుడు ఈ పుత్రులతో, నా పౌత్రులతో కలిసి పారిపోవుచు చాలాదూరము వెళ్ళుచున్నావు. నీవు ఇదివరకు ఎంత పెద్ద భయము కలిగిననూ విషాదమును పొందని నీవు ఇపుడు నీ బలపౌరుషమును, ధైర్యమును విడిచి పురుషోత్తమోత్తముడైన ఈ రాజేస్టుని చూచి ఇంతగా భయమును చెందుచున్నావు! ప్రియా! కారణమును చెప్పుము. అంతట ఆ శూకరరాజు తన ప్రియురాలి మాటను విని మరల ఆమెతో ఇట్లు బదులు పలికెను. 'ప్రియురాలా! ఈ వేటగాని వలన ఎందుకు భయపడుచున్నానో, అందరిని వదిలి ఎందుకు వెళ్ళుచున్నానో వినుము. ఈ వేటగాళ్ళు మహాపాపమును అనగా వధను చేయువారు. వంచకులు. గిరిదుర్గగుహలలో వధను చేతురు. ఎల్లపుడూ దుష్టులే. చాలా విధముల పాపములను ఆలోచించువారలు, పాపము చేయువారి కులములో పుట్టినవారే. వారి చేతిలో మరణించుటకు భయపడుచున్నాను. మరణించిననూ పాపులుగాన పాపమునే పొందెదను. అపమృత్యువునకు భయమపడిన నేను దూరముగానున్న పర్వతమును లేదా పర్వతగుహకు వెడలుచున్నాను.
ప్రియురాలా! ఇతను మహాపుణ్యాత్ముడు, మహారాజు, ప్రపంచమున అందరికంటే అధికుడు, శ్రీమహావిష్ణుస్వరూపుడు ఇచటికి వచ్చి ఉన్నాడు. ఈ మహానుభావునితో సమరరంగమున యుద్దమును చేతును. నా పౌరుషవిక్రమములను చూపుదును, నా తేజస్సుతో ఈ మహారాజును గెలిచినచో ఈ భూమండలమున గొప్ప కీర్తిని అనుభవించెదను. ఆ మహావీరుని వధించబడినచో శ్రీమన్నారాయణుని లోకమైన వైకుంఠలోకమును పొందెదను. నేను వధించబడినచో ఈ మహారాజు నా అవయవముల మాంసముతో, కొవ్వుతో తృప్తిపొందును. ఇతను తృప్తిపొందినచో సకల దేవతలు తృప్తిపొందెదరు. ఇంద్రరూపుడైన ఈ రాజు ఇందుకొరకే వచ్చియున్నాడు. ఓ సుందరీ! ఇతని చేతిలో నాకు మరణము సంభవించినచో నాకు గొప్ప లాభము, ఉత్తమకీర్తి లభించును. భూలోకమున మూడులోకములలో నాకు గొప్ప కీర్తి లభించును. అట్లే శ్రీమహావిష్ణులోకము లభించును. నేను భయపడుట లేదు. కలత చెందుట లేదు. పర్వతచరియలకు వెళ్ళుచున్నాను. పాపమునకు భయపడి వెళ్ళుచుంటిని. ధర్మమును చూచి నిలిచియున్నాను. నేనితర జన్మలలో సంపాదించిన పాపమేమిటో తెలియదు. ఆ పాపమువలననే నేను శూకరయోనిలో పుట్టితిని. ఇపుడు నేను తీక్షణములైన మహాఘోరములైన బాణోదకములచే నా పూర్వజన్మ సంచిత పాపమును కడిగివేసుకొనెదను. నామీది మోహమును విడిచిపెట్టి నీవు కూడా పుత్రులను, పౌత్రులను ఉత్తమురాలైన కన్యను, బాలవృద్దులతోనున్న కుటుంబమును తీసుకొని ఈ పర్వతమునకు వెళ్ళుము. నాకొరకు శ్రీహరియే వచ్చియున్నాడు. ఇతని చేతిలో నేను శ్రీమహావిష్ణులోకమునకు వెళ్ళెదను. ఇపుడు నాకు దైవము కూడా సర్వోత్తమమైన వైకుంఠద్వారమును తలుపులు తెరిచి ఉన్నదానిని చేరెదను.
సుకలోవాచ - సుకల పలికెను.
అంతట సూకరరాజు వాక్యమును వినిన అతని ప్రియురాలు బాధపడుతున్న మనస్సు కలదై మరల ఇట్లు పలికెను.
సూర్యువాచ - సూకరి పలికెను.
మీరు ఈ యూధమునకు స్వామి. మీరు పుత్రులతో, పౌత్రులతో, మిత్రులతో, సోదరులతో, ఇతర స్వజనబాంధవులతో కూడియుంటిమి. ఈ గుంపు నీచేతనే అలంకరించబడినది. నీచేతనే శోభించుచున్నది. మహానుభావా! నీవు లేని ఈ యూధము ఎట్లు ఉండగలదు? నా తనయులైన బాలకులు తమ బలముతో గర్జించుచు ఈ పర్వతప్రాస్తమందు సంచరించుచున్నారు. నీ తేజస్సుతో, ఏ భయమూలేని వారు ఈ ప్రాన్తమున కందమూలములను భక్షించుచున్నారు. దుర్గములలో వనకుంజములలో గ్రామములలో, నగరములలో ఈ పర్వతముననున్న సింహములకు ఇచటి మానవులకు నీ తేజస్సుతో రక్షించబడుచు భయపడుట లేదు. నీచేత విడువబడిన నా పుత్రులు ఈ బాలకులు అందరు దీనులై కలతచెందెదరు. చైతన్యమును కోల్పోయెదరు. ప్రతిదినము సుఖప్రదమైన నీ దారినే నా పిల్లలు చూచుచుందురు. భర్తలేని స్త్రీ ఎన్ని దివ్యాలంకారములతో ఎన్ని వస్త్రములతో, ఎన్ని రత్నాభరణములతో అలంకరించుకొనిననూ, తల్లి తండ్రి సహోదరులతో, అత్తమామలతో, ఇతరులతో కలిసి ఉన్ననూ భర్తలేనిచో స్త్రీ శోభించదు. చంద్రుడు లేని రాత్రి, పుత్రుడు లేని కులము, దీపము లేని ఇల్లు శోభించనట్లు నీవు లేని ఈ యూధము కూడా శోభించదు.
ఆచారము లేని మానవుడు, జ్ఞానములేని యతి, ఆలోచనలేని రాజు వలె నీవులేని యూధము శోభించదు. నడుపువాడు లేని నావ నిండుసముద్రములో చుక్కాని లేనినావవలే శోభించదు. సేనాపతి లేని సైన్యము శోభించనట్లు నీవులేని యూధము కూడా శోభించదు. వేదము లేని బ్రాహ్మణునివలె నీవులేని యూధము దీనమగును. నామీద కుటుంబభారమునుంచి వెళ్ళుచున్నావు. మరణము సులభమని తెలిసి ఈ నీ ప్రతిజ్ఞ ఏమిటి? ప్రియా! ప్రభూ! నీవు లేకుండగా నేను ప్రాణములను ధరింపజాలను. స్వర్గము కాని, భూలోకము కాని, నరకము కాని నీతో కలిసి అనుభవించెదను. ఇది ముమ్మాటికీ నిజమునే చెప్పుచున్నాను. నీవు నేను పుత్రులను, పౌత్రులను, యూధమును తీసుకొని చక్కని గుహలుకల పర్వతప్రాంతమునకు వెళ్ళెదము. బ్రతుకవలసిన దానిని విడిచి మరణమునకు ఎదురువెళ్ళుచున్నావు. ఇపుడు మరణమున ఏమి లాభమున్నదో చెప్పుము.
వారాహ ఉవాచ - వరాహము పలికెను.
ప్రియురాలా! నీవు వీరుల ధర్మమును తెలియకున్నావు. ఇపుడు వినుము. యుద్దమును కోరు వీరుడు వీరుని వద్దకు వెళ్ళి నేను యుద్ధమును కోరి వచ్చి ఉన్నాను. నాకు యుద్ధమునిమ్ము! అని యాచించినపుడు యుద్ధమునీయనిచో అతను కామము వలన కాని, లోభము వలన కాని, భయమువలన కాని, మోహమువలన కాని యుద్ధమునీయనిచో కుంభీపాక నరకములో వేయియుగములు నివసించును. క్షత్రియులకు యుద్ధమునిచ్చుటే పరమధర్మము. ఆ యుద్దము నిచ్చుటకు యుద్ధభూమికి వెళ్ళినవాడు శత్రువును గెలిచినచో గొప్ప కీర్తిని, యశస్సును పొందును. పౌరుషముతో భయపడకుండగా అతను యుద్ధమున మరణించినచో వీరలోకమునకు వెళ్ళి దివ్యభోగములను అనుభవించును. అచట 20 వేల సంవత్సరములు నివసించును. పరలోకమున దేవాచారములతో ఆరాధించబడుచు నివసించును. ఈ మహావీరుడు మనుపుత్రుడు వచ్చెను. సంగ్రామమును యాచించుచున్నాడు. నేను తప్పక యుద్ధమునీయవలయును. సనాతనుడైన విష్ణురూపుడే యుద్ధాతిథిగా వచ్చెను. శుభురాలా! నేను ఇతనికి యుద్ధరూపసత్కారమును చేయవలయును.
శూకర్యువాచ - శూకరి పలికెను.
మహానుభావుడైన రాజునకు నీవు తప్పక యుద్ధమునీయవలసి ఉన్నచో ప్రియా! నీ పౌరుషమెట్టిదో నేను దగ్గర ఉండి చూచెదను.
సుకలోవాచ - సుకల పలికెను.
ఇట్లు భర్తతో పలికి ప్రీతిపాత్రులైన పుత్రులను పిలిచి త్వరకలదై ఇట్లు పలికెను. పుత్రులారా! మీరు నా మాటను వినుడు. సనాతనుడైన విష్ణురూపుడు యుద్ధాతిథిగా వచ్చెను. ఇతను వెళ్ళిన ప్రదేశమునకు నేను కూడా వెళ్ళవలయును. మీ కొరకు అనగా మీరు వెళ్ళువరకు ఎదురుచూచు మీ తండ్రి ఇక్కడ ఉన్నంతలో మీరు చాలా దూరమునకు గిరిగుహలకు దుర్గమప్రాంతమునకు వెళ్ళుడు. నా పిల్లల్లారా! మీరు వేటగాళ్ళకు దూరముగా నుండి సుఖముగా బ్రతుకుడు. నా భర్త వెళ్ళిన చోటికి నేను వెళ్ళవలయును. ఉత్తముడైన ఈ మీ అన్న మీ సమూహమును కాపాడును. ఈ మీ పినతండ్రులు మిమ్ములను రక్షించుచుందురు. మంచి బిడ్డలారా! నన్ను విడిచి దూరముగా వెళ్ళుడు.
పుత్రా ఊచుః - పుత్రులు పలికిరి.
ఈ పర్వతరాజము ఎన్నో కందమూలములు, ఫలములు, నీరు కలది. భయము ఎవరికుండదు. మనకు సుఖజీవనమున్నది. మీరు అకస్మాత్తుగా భయంకరమైన ఈ విషయమును చెప్పితిరి. తల్లీ ఇపుడు మాకు నిజమైన కారణమును చెప్పుము.
శూకర్యువాచ - శూకరి పలికెను.
ఈ ఇక్ష్వాకుమహారాజు మహాభయంకరుడు. యమరూపునిగా వచ్చెను. వేటమీది ఆశతో విహరించుచున్నాడు. ఈ వనములో చాలా మృగములను చంపుచున్నాడు. ఇతను ఇక్ష్వాకుమహారాజు. మనుపుత్రుడు మహాబలవంతుడు. ఎవరిచే ఎదిరింప శక్యముకానివాడు. ఇతను మనకు యముడు. అందరిని చంపగలడు. పుత్రులారా! మీరు దూరమునకు వెళ్ళుడు.
పుత్రా ఊచు - పుత్రులు పలికిరి.
‘తల్లిని, తండ్రిని విడిచి వెళ్ళినవాడు పాపబుద్ది. అట్టివాడు మహాభయంకరమైన ఘోరమైన నరకమునకు చేరును. పవిత్రమైన తల్లిపాలు త్రాగి దయలేనివాడై పుష్టిని పొందుచున్నాడు. అట్టివాడు బలహీనుడై తల్లిని తండ్రిని విడిచివెళ్ళువాడు క్రిములతో దుర్గంధమైన పూయనరకమును చెందును. కావున తల్లీ! మేము తండ్రిని విడిచివెళ్ళజాలము. ఇక్కడనే ఉండెదము.’ ఇట్లు వారిలో వారికి ధర్మార్థయుతమైన విషాదము ఏర్పడినది. అందరూ బలతేజస్సులతో వ్యూహమును ఏర్పరచుకొని నిలిచిరి. సాహసము, ఉత్సాహము కలవారై మనుపుత్రుని చూచుచున్నారు. గర్జించు పౌరుషముతో ఆడుచూ ఆ వనములో నివసించసాగిరి.
ఇతి శ్రీపద్మపురాణే ద్వితీయే భూమిఖండే వేనోపాఖ్యానే సుకలాచరితే ద్విచత్వారింశత్తిమోధ్యాయః ఇది శ్రీపద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబదిరెండ - అధ్యాయము.
