పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
69 - వివిధ శివధర్మకథనమ్
మాతలిరువాచ - మాతలి పలికెను.
ఇక ఇపుడు శివధర్మాగమమున ఉత్తమములైన శివధర్మములు తెలియవలయును. ఆ శివధర్మములను కర్మభేదముననుసరించి కర్మయోగరూపములుగా బహువిధములుగా శివభగవానుడే చెప్పియున్నాడు. హింసాది దోషములు లేనివి క్లేశాయాసములు లేనివి సర్వప్రాణులకు హితకరములు శుద్దములు కొద్ది ఆయాసముతో గొప్ప ఫలమును ప్రసాదించునవి అనన్తశాఖలు కలిగియున్నవి శివమూలమును మాత్రమే ఆశ్రయించినవి జ్ఞానధ్యానములను చక్కని పుష్పములతో శోభించుచున్నవి శివధర్మములు సనాతనములు. శివుని ధరించుచున్నందున శివభాషితములచే ధరించబడుచున్నవి గాన శివధర్మములనబడుచున్నవి. సంసారసాగరమును దాటించునవి. అహింసా క్షమా సత్యము వినయము శ్రద్ధ ఇంద్రియనిగ్రహము దానము యజ్ఞము తపస్సు దానము ఈ పది ధర్మసాధనములు. విడిగా కాని కలిపి కాని శివధర్మములను అనుష్ఠించినవారికి శివునియందే భక్తిరసము కలవారికి ఒకటే ఉత్తమగతి నియమించబడినది. సర్వప్రాణులకు భూమి సాధారణ స్థానముగా ఏర్పరచబడినట్లుగా శివభక్తులందరికి శివపురము సాధారణ స్థానముగా ఏర్పరచబడినది. సకల ప్రాణులకు భోగములు అత్యున్నతముగా చెప్పబడినట్లు శివపురమున కూడా నానాపుణ్య విశేషానుగుణముగా భోగములు ఏర్పరచబడినవి. సకల ప్రాణులు శుభాశుభ ఫలములననుభవించుచుందురు. కాని శివపురమున ఒక్క శివధర్మఫలము మాత్రమే అనుభవించబడును. శ్రద్ధాపాత్ర విశేసానుగుణముగా ఏర్పడు పుణ్యానుగుణముగా శివపురమున కలుగు భోగములు అత్యున్నతములని, శుభప్రదములని తెలియవలయును. శివపురమున స్థానప్రాప్తియే అతిశయము. అచటి భోగములు శక్తిమయములు. కావున మహాభోగమును పొందదలచినచో మహాపుణ్యమును ఆచరించవలయును.
దేవతోత్తములు ఒకటే సర్వాతిశయమని చెప్పియున్నారు. అది ఆత్మభోగాధిపత్యము ఒక శివననికే. శివుడొక్కడే సర్వజగత్పతి. జ్ఞానయోగరతులైన కొందరు నరులు ఆ శివలోకముననే ముక్తిని పొందెదరు. మరికొందరు భోగతత్పరులు సంసారమునకు తిరిగివత్తురు. కావున విముక్తిని కోరువారు భోగాసక్తిని విడువవలయును. విరక్తుడు శాన్తచిత్తుడు శివజ్ఞానమును పొందును. ఈశానునియందు మనసును నిలిపినవారు. కొన్ని కొన్ని సందర్భములలో ఈశుని సేవించుచుందురు. వారికి కూడా వారి భావానుగుణముగా ఈశ్వరుడు స్థానమును ప్రసాదించును. అన్ని కల్మషములను తొలగించుకొని రుద్రుని అర్చించువారికి ఈశ్వరుడు పిశాచలోకములలో భోగములను ప్రసాదించును. సంతాపదుఃఖభారముతో సర్వప్రాణులు మరణించుచుందురు. అన్నదానము చేసినవాడు పుణ్యప్రదుడు. ప్రాణదానము చేసినవాడు సర్వమునిచ్చినవాడగును. కావున అన్నదానముతో సర్వదాన ఫలము లభించును. మూడు లోకములలో భోగస్తీవాహన శ్రేష్ఠములను అన్నదానమును చేసినవాడు ఇహపరములను పొందును. ఎవరి అన్నదానముతో అజ్ఞ పుష్టిని పొంది పుణ్యసంచయమును చేయునో ఆ పుణ్యములో సగము పుణ్యము అన్నదాతకు, మిగిలిన సగము కర్తకు లభించును. ఇందులో సందేహము లేదు. ధర్మార్థ కామమోక్షములకు పరమసాధనము దేహమే కదా! ఈ దేహము అన్నపానములతోనే నిలుచును. కావున అన్నము సర్వసాధనము. అన్నమే ప్రజాపతి. అన్నమే విష్ణువు. అన్నమే స్వయముగా శివుడు కావున అన్నముతో సమానమైన దానము ఇంతకుమునుపు లేదు. ఇకముందు ఉండబోదు. మూడు లోకములకు జీవనము ఉదకమే. జలమే పవిత్రము. శుద్ధము. సర్వరసాయనము. అన్నము జలము అశ్వము గోవులు వస్త్రములు శయ్య సూత్ర ఆసనములు అను 8 దానములు పర (యమ) లోకమున ప్రశస్తములు. ఇట్టి దానవిశేషముతో నరుడు ధర్మరాజపురమును సుఖముగా చేరును. కావున ధర్మమును ఆచరించవలయును.
ఇక క్రూరకర్మలనాచరించువారు పాపులు దానములను చేయనివారు నరకమున భయంకర దుఃఖమును అనుభవించెదరు. అట్లే దానము చేసినవారు సుఖమును అనుభవించెదరు. అట్టివారికి కర్మయోగమునందు ఆసక్తులైనవారికి సౌఖ్యము లభించును. వారు ఇంత అని కొలత చేయలేని గుణములు కల దివ్య విమానములు సకల కోరికలను తీర్చునది అవికూడా లెక్కలేనన్నిటితో అచటి ప్రాణులకు ఉపకారమును చేయువాటితో ఆ పురము వ్యాపించబడియున్నది. వేయిమంది చంద్రుల కాప్తి కలది, సూర్యభగవానుని తేజస్సుతో సమానమైన ప్రభావము గలది రుద్రలోకమని చెప్పబడినది. ఈ రుద్రలోకము అశేషగుణములు కలది. ఆ పురము శివభక్తులందరిది. రుద్రక్షేత్రమున మరణించిన జంగమస్థావరరూపులైన జీవులది. ఒక దినమైనను భక్తితో శంకరుని పూజించినవాడు కూడా శివస్థానమును చేరును. ఇక బాగా అర్చించువాడు వేళ్ళుదురని ఏమి చెప్పవలయును. విష్ణుభక్తులు విష్ణుధర్మములను ఆచరించువారు విష్ణుధ్యానపరాయణులు కూడా వైకుంఠమున శ్రీమన్నారాయణుని సమీపమునకు చేరెదరు. బ్రహ్మవాదియైన ధర్మాత్ముడు బ్రహ్మలోకమునకు చేరును. పుణ్యమును ఆచరించినవాడు తాము ఆచరించిన పుణ్యముతో పుణ్యలోకములకు వెళ్ళును. కావున ఎల్లపుడు మనసుతో మనసులో ఈశ్వరునియందు భక్తిని చేయవలయును. యోగ్యమైన మనస్సు కలవాడు జ్ఞానము కలవాడు స్వయముగా శ్రీహరియందు భక్తి చేసినచో అది కూడా అన్ని విధములైన ఆలోచనలతో భావదోషములు లేకుండగా విశిష్టమైన కర్మలతో 'ఆయా దేశభావానుగుణముగా శ్రీమహావిష్ణు ప్రభావముతో ఉత్తమ స్థానమును పొందును. ఇట్లు ఇది ఇంకొక శివపురముగా శ్రీమత్తుగా గొప్ప శివపురమును చెప్పితిని. కర్మనిష్ఠులైన దేహులకు ఇది పునరావర్తనముగా చెప్పబడినది. శివపురమునకు పైన ఉండునది ఉత్తమమైన వైష్ణవలోకము. విష్ణుధ్యానపరాయణులైన వైష్ణవమానవులు ఈ విష్ణులోకమును పొందెదరు. సదాచార పరాయణులైన ఉత్తమ నరులు బ్రాహ్మణులు యాగమును చేయువారు తత్త్వకోవిదులైనవారు బ్రహ్మలోకమును పొందెదరు. యుద్ధము చేయు క్షత్రియులు ఇన్తలోకమునకు వెళ్ళేదరు. పుణ్యమును చేయు ఇతరులు పుణ్యలోకములకు వెళ్ళేదరు.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున పితృతీర్థమున యయాతి చరితమున అరువది తొమ్మిద - అధ్యాయము.
