పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
24 - అధ్యాయము
సూతమహర్షి పలికెను.
బలీయుడు బలుడను పేరుగల తన పుత్రుని ఇంద్రుడు చంపేనని తెలిసిన దితి కరుణస్వరముతో ఏడిచి, అయ్యో! కష్టము! అయ్యో! కష్టము అని చాలాకాలము విలపించి ప్రియుడగు కశ్యపుని వద్దకు వెళ్ళెను. నీ పుత్రుడు మహాపాపియగు ఇంద్రుడు దేవతాధిపతి బ్రహ్మలక్షణుడు నాపుత్రుడు సముద్రతీరమునకు చేరి సంధ్యావందనము నాచరించువానిని వజ్రాయుధముతో చంపేను అని. ఆ మాటలను వినిన మరీచి పుత్రుడగు కశ్యపమహర్షి గొప్ప కోపముతో అగ్నివలె మండిపడెను. ఒక జటను లాగి పవిత్రమగు అగ్నిలో పడవేసి ఇంద్రుని వధకు నేను పుత్రుని కలిగింతును అని పలికెను. అంత ఆ అగ్నికుండములోని అగ్నినుండి ఒక మహాపురుషుడు పుట్టెను. కాటుకకొండవలెనున్నవాడు, పచ్చని కనులు భయంకరాకారము కలిగినవాడు, దంష్ట్రాకరాల వదనుడు జగత్తులను భయపెట్టువాడు, పెద్ద నాలుక కలవాడు, క్రూరుడు, ఖడ్గచర్మములు దాల్చినవాడు, సర్వావయవ తేజముతో ప్రకాశించువాడు, మహామేఘమువంటివాడు, బలవంతుడు కశ్యపప్రజాపతితో నాకాజ్ఞ నిండు, నన్నెందుకు పుట్టించితిరో కారణమును తెలుపుడు. మీ అనుగ్రహము వలననే నా కార్యమును సాధించెదను అని పలికెను.
కశ్యపమహర్షి పలికెను.
పుత్రా! ఈమె కోరికను నా కోరికను ఈడేర్చుము. ఆదిత్యుడను పేరుగల దురాత్ముడగు ఇంద్రుని సంహరించుము. అట్లు ఇంద్రుని వధించి ఇంద్రపదమును అనుభవించుము. ఇట్లు మహానుభావుడగు కశ్యపమహర్షిచే ఆజ్ఞాపించబడిన వృత్రాసురుడు ఇంద్రుని వధించుటకు ఉద్యమించెను. పౌరుషముతో ధనుర్వేదమునభ్యసించెను. బలము, వీర్యము, క్షాత్రము, ధైర్యముతో కూడిన తేజస్సును వృత్రాసురుడు కలిగియుండుటను చూచిన ఇంద్రుడు భయముతో వృత్రాసురుని వధించుటకు ఉపాయమును ఆలోచించెను. మహామునులగు సప్తర్షులను పిలిచి వృత్రాసురుని వద్దకు పంపెను. మీరు వృత్రాసురుడున్న చోటికి వెళ్ళుడు. నాకు అతనితో సంధిని చేయుడు. ఇట్లు ఇంద్రుని ఆజ్ఞను బడసిన సప్తర్షులు వృత్రాసురుని వద్దకు వెళ్లి అతనితో ఇట్లు పలికిరి. దైత్యరాజా! ఇంద్రుడు సంధికి సిద్దముగా నున్నాడు. మహాప్రాజ్ఞుడగు ఇంద్రుడు నీతో మైత్రిని కోరుచున్నాడు. నీవేల సఖ్యము చేయవు? నీవు సుఖముగా అర్ధేంద్రపదవిని అనుభవించుము. ఇట్లు నిన్ను ఇంద్రుడు అసురులు దేవతలు కూడా ఇంద్రుడనియందురు. కావున దేవతలతో వైరమును విడిచి స్నేహమును చేయుము.
వృత్రాసురుడు పలికెను.
నిజముగా ఇంద్రుడు సఖ్యమును కోరినచో సత్యముగా నేను చేయుదును. కపటముతో ఇంద్రుడు ద్రోహము చేసినచో మీరేమి చేతురో చెప్పుడు. ఈ విషయమున నమ్మకమేమి? ఈ మాటలను వినిన ఋషులు ఇంద్రునితో నమ్మకమును కలిగించుము. నీవు నిజముగా స్నేహమును కోరుచున్నావా అని అడిగిరి.
ఇంద్రుడు పలికెను.
నేను అసత్యముగా కాని, కపటముగా కాని మీతో ప్రవర్తించినచో బ్రహ్మహత్యాది పాపములతో అంటపడుదును. అంతట ఆ ఋషులందరు అతను బ్రహ్మహత్యాది పాపములతో అంటుకుందునని పలికెను. ఈ నమ్మకముతో స్నేహమును చేయుము.
వృత్రుడు పలికెను.
తమ శిష్టమార్గముతో ఇంద్రుని సత్యవచనముతో బ్రాహ్మణోత్తములారా! ఇంద్రునితో మైత్రిని ఆచరించెదను అని. అంతట సప్తర్షులు వృత్రుని ఇంద్రుని వద్దకు గొనిపోయిరి. అట్లు వచ్చిన వృత్రాసురుని చూచి ఇంద్రుడు లేచి ఎదురేగి అర్ఘ్యమునిచ్చి మహాప్రాజ్ఞా ఈ ఇంద్రుని అర్థపదమును అనుభవించుము. ఇప్పటినుండి మనము సుఖముగా నుండెదము.
సూతమహర్షి పలికెను.
ఇట్లు వృత్రాసురునికి నమ్మకమును కలిగించుచుండెను. అంతట అచట బ్రాహ్మణోత్తములు తమ తమ నెలవులకు వెడలిరి. వృత్రుడు ఎపుడు పొరబాటు చేయునా అని ఇంద్రుడు ఎదురుచూచుచుండెను. ఇంద్రుడు రాత్రింబవళ్ళు సావధానముగా నుండెను. కాని మహానుభావుడగు వృత్రాసురుని ప్రవర్తనలో లోపమును చూడజాలకపోయెను. అపుడు వృత్రాసురుని సంహరించుటకు ఉపాయమును ఆలోచించసాగెను. అపుడు ఇంద్రుడు రంభతో వృత్రాసురుని చంపీ సుఖమును పొందెదను. కళ్యాణీ! అట్లు చేయుము. దేవశత్రువును మోహింపచేయుము. అంతట ఇంద్రుని ఆజ్ఞతో రంభ బయలుదేరెను. పరమపావనమైనది, గొప్పది, దివ్యమైనది పవిత్రవృక్షములతో నిండియుండునది, చాలా చెట్లు కలది, పండ్లతో నిండిన చెట్లు కలది, మృగములు, పక్షులుతిరుగాడుచుండునది, దివ్యములగు విమానమందిరములు అంతట కలది, గంధర్వులు చేయు దివ్యగానము నిండియున్నది, అంతట తుమ్మెదలు తిరుగాడునది, పరమపావనములగు కోకిలలు అత్యంత మధురముగా గానము చేయుచున్నవి, నెమళ్ళ కేకారావములతో, తుమ్మెదల ఝుంకారములతో నిండియున్నది దివ్య చందనవృక్షములతో జలపూర్ణములగు వాపీకూప తటాకములతో, కమలములతో ఇతర పుష్పములతో అలంకరించబడినది, దేవగంధర్వసిద్ధచారణకిన్నరులచే మునులచే శోభించబడుచున్నది, దివ్యోద్యానవనములతో నిండియున్నది, అప్సరసల సమూహములతో అలరారుచున్నది, ఎన్నో శుభప్రదమగు ఉత్సవములతో మంగళసమారోహములతో బంగారు ప్రాసాదములతో నిండియున్నది, దండఛత్రచామరములతో కలశములతో పతాకములతో అంతట అలంకరించబడినది, వేదఘోషలతో గానములతో నిండియున్నది అగు నందనవనమును చేరిన రంభ అందమైన నవ్వుతో తోటి అప్సరసలతో కలసి విలాసముగా విహరించుచుండెను.
ఒకసారి కాలవశుడైన ఆ వృత్రుడు కొందరు దానవులతో కలిసి పరమానందముతో ఆ నందనవనమునకు వెళ్ళెను. ఆ మహానుభావుడగు వృత్రునికి కనపడకుండగా ఇంద్రుడు అతని ప్రక్కనే సంచరించుచు శత్రువు లోపములకై నిరీక్షించసాగెను. మహాప్రాజ్ఞుడగు ఆ వృత్రాసురుడు మాత్రము ఇంద్రునిపై నమ్మకముతో అన్ని పనులలో ఇంద్రుని ప్రాణమిత్రునిగా భావించును. అతనికి అపకారమును చేయకుండెను. ఇట్లు పరమపావనమగు నందనవనశోభను వనితాగణముతో కూడియున్నందువలన అతిరమణీయమగుదానిని చూచుచు తిరుగుచుండెను.
అంతట అచటనే చందనవృక్షపు చల్లని నీడలో చేరిన రంభ అచట క్రీడించుచుండెను. చెలికత్తెలతో కలిసి తూగుటూయల చేరి సకల ప్రపంచమును మోహింపచేయు కమ్మని పాటను పాడుచుండెను. ఆ ప్రదేశమున కొచ్చిన వృత్రాసురుడు సుందరలోచన తూగుటూయలలో నున్న రంభను చూచి కామముతో కలత చెందిన మనసు కలవాడాయెను.
ఇది శ్రీపద్మపురాణమున పంచపంచాశత్సహస్ర సంహితలో రెండవదియగు భూమిఖండమున వృత్రవంచనమను 24 - అధ్యాయము.
