పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

26 - అధ్యాయము

సూతమహర్షి పలికెను.

అంతట దితి తన పుత్రుడు నిహతుడైన విషయమును విని దుఃఖపీడితురాలై ఆ పుత్రశోకముతో దహించబడినదై మునిపుంగవుడు మహాత్ముడైన కశ్యపునితో దుష్టుడైన ఇంద్రుని వధ కొరకు ఇట్లు పలికెను. ప్రభూ! నేను నీకు అత్యంత ప్రియురాలనగుచో దేవతలందరిచే సహింపశక్యముకాని, తీవ్రమగు బ్రహ్మతేజోరూపమగు ఒక పుత్రుని ప్రసాదింపుము.

కశ్యప ఉవాచ –

కశ్యప మహర్షి పలికెను.

నా పుత్రులు మహాబలులైన బలవృత్రులను దురాత్ముడగు ఇంద్రుడు కపటోపాయముతో చం పెను. అట్టి ఇంద్రుని చంపుటకు నీకు ఒక పుత్రుని ఇచ్చెదను. కాని నీవు నూరు సంవత్సరములు శుచిగా నుండుము. ఇట్లు పలికి యోగీశ్రుడగు కశ్యపుడు దీతి శిరమున హస్తమునుంచి దితితో కలిసి మేరుపర్వతముననున్న తపోవనమునకు వెళ్ళెను. అంతట ఆ దితి తపోవనమున నివసించుచు శుచియై పుత్రునికొరకు తపము నాచరించుచుండెను. అంతట ఇంద్రుడు దితి ప్రయత్నమును తెలిసి అవకాశమును నిరీక్షించసాగెను. దేవతను పోలు దేవరాజగు ఇంద్రుడు 25 సంవత్సరముల బ్రాహ్మణరూపముతో దితి సమీపమునకు వచ్చెను. తపస్సు చేయుచున్న ఆ తల్లికి నమస్కరించెను. అంతట దితి నీవెవరవని అడిగెను.

అంతట ఇంద్రుడు శుభంకరురాలా! నేను నీకు పుత్రుడను. బ్రాహ్మణుడను. వేదవిద్వాంసుడను. ధర్మమును తెలిసినవాడను. నీవు చేయు తపమునకు సాయము చేయువాడను, అని పలికి తపము చేయుచున్న దితిని సేవించుచుండెను. ఆ దితి అతనిని ఇంద్రునిగా తెలియకపోయెను. అతను దుష్టసంకల్పముతో వచ్చినాడని కూడా తెలియదు. ప్రతిదినము సేవించుచున్న అతనిని ధర్మముగా పుత్రునిగా మాత్రమే భావించుచుండెను. అలసిన శరీరమును వత్తుచుండెడివాడు. పాదములను ప్రక్షాలన చేయుచుండెను. పత్రములను, కందమూలములను, ఫలములను, నారవస్త్రములను, జింకచర్మమును దితికి ఎల్లపుడూ అందించుచుండెడివాడు. ఇట్లు ఇంద్రుడు భక్తిచే దితిని సంతోషింపచేసెను. అట్లు సంతసించిన దితి ఇంద్రునితో ఇట్లు పలికెను.

మహాపుణ్యాత్ముడగు పుత్రుడు నాకు కలిగి ఇంద్రుడు సంహరించబడిన తరువాత నా పుత్రునితో కలిసి దేవరాజ్యమును పాలించుము. అంతట ఇంద్రుడు కూడా మహానుభావురాలా! నీ అనుగ్రహమువలన అట్లే అగును అని పలికి దితి ఎపుడు పొరబాటు చేయునో పరీక్షించుచుండెను. ఇట్లు నూరుసంవత్సరములు నిండిన తరువాత ఆమె ప్రతభంగము జరిపెను. కాళ్ళు కడుగకుండా శయ్యను చేరెను. మరియు శయ్య చివర అనగా పాదములుంచు ప్రదేశమున శిరమునుంచి, కేశములు ముడివేయక విరియబోసుకొని పరుండెను. నిద్రించెను. అపుడు ఇంద్రుడు ఆమె కుక్షిలో ప్రవేశించి వజ్రాయుధముతో ఆ గర్భమును ఏడుగా ఖండించెను. అట్లు ఖండించుచుండగా కడుపులోని ఆ శిశువు ఏడ్చెను. అట్లు రోదించుచున్న గర్భమును ఇంద్రుడు మహాతేజస్వి రోదించకుము (మారుద) అని పలికెను. ఆ గర్భమును మరల ఏడుగా ఖండించెను. అనగా ఏడు భాగములలో ఒక్కొక్కదానిని మరల ఏడుగా ఖండించెను. ఇంద్రుడు (మారుద) అని అన్నందున వారికి మరుత్తులు (మారుతములు) అని నామమేర్పడెను. వారందరు మహాకాయులు తీవ్రతేజస్వులు, పరాక్రమవంతులుగా నుండిరి. ఇట్లు వారు 49 మందైరి. వారందరు మరుత్తులుగా ఇంద్రునే ఆశ్రయించిరి.

అన్ని భూతములలో ఈ మహా మరుద్గణమును అందరూ ఇష్టపడుదురు. ప్రజాపతియగు హరి ఆయా అవసరములలో రాజ్యమును . ప్రసాదించెను. క్రమక్రమముగా ఆ రాజ్యములన్నియూ పృధుచక్రవర్తిచే పాలించబడినవి. ఆ శ్రీహరి కృష్ణుడు, సర్వవ్యాపి, జగద్గురు, తపశ్శీలి, జయశీలి, మహాతేజస్వి, అతడు ఒక్కడే ప్రజాపతి. ఇతనే పర్జన్యుడు, పావకుడు, పావనుడు, అంతటా వ్యాపించియుండువాడు, అందరూ ఇతనే, పరమపావనమగు స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతయూ అతనిదే. సకల ప్రాణిసృష్టిని చక్కగా తెలిసినవానికి పునర్జన్మ భయమే లేనపుడు ఇక పరలోక భయమెక్కడిది? ఈ సృష్టి మహాపుణ్యము సర్వపాపహరము శుభము. దీనిని భక్తితో వినువారు అన్ని పాపములనుండి విముక్తుడగుదురు. అతనే ధన్యుడు. అతనేపుణ్యుడు. అతనే సత్యవంతుడు. ఈ మరుత్తుల సృష్టిని వినువాడు పరమగతిని పొందును. అన్ని పాపములనుండి విడివడి పరిశుద్ధుడై విష్ణులోకమును చేరును.