పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

19 - అధ్యాయము

సూతమహర్షి పలికెను.

బ్రాహ్మణోత్తముడు మహాప్రాజ్ఞుడగు సోమశర్మ సుమనతో కలిసి పావనము కపిలాసంగమమగు రేవాతీరమున స్నానమాడి దేవతలకు పితృదేవతలకు తర్పణము గావించి, మంగళప్రదుడగు శ్రీమన్నారాయణుని ప్రశాంతమగు మనస్సుతో జపించుచు తపమాచరించసాగెను. మహాబుద్దిమంతుడగు సోమశర్మ చక్కని వ్రతముకలవాడై దేవదేవుడగు వాసుదేవుని ద్వాదశాక్షర మంత్రమును జపించసాగెను. కూర్చున్ననూ పడుకున్ననూ నిద్రించిననూ ఎపుడు శ్రీహరినే దర్శించసాగెను. నిశ్చలుడై కామక్రోధములను విడిచి తపము చేయసాగెను. ఇక పరమసాధ్వి మహానుభావురాలు పతివ్రత పరాయణురాలగు ఆ సుమన కూడా తపమాచరించుచున్న భర్తనే సేవించుచుండెను. అట్లు తపమాచరించుచున్న సోమశర్మను విఘ్నములు భయ పెట్టసాగెను. విషతీవ్రత కలిగిన కాలనాగులు అచటికి అసంఖ్యాకములుగా చేరినవి. తపమాచరించుచున్న సోమశర్మ ప్రక్కన సింహము, వ్యాఘములు, యేనుగులు భయమును కలిగించసాగినవి. అట్లే భేతాళులు, రాక్షసులు, భూతములు, కూష్మాండులు, ప్రేతలు, భైరవులు, క్రూరమగు ప్రాణహాని భయమును కలిగించసాగినవి. పలు విధములు, మహాభయంకరములగు సింహములు అచటికి వచ్చినవి. దంష్ట్రాకరాళవదనములతో అతిభయంకరముగా గర్జించసాగినవి. అయిననూ మహాబుద్దిమంతుడు ధర్మాత్ముడగు సోమశర్మ విష్ణుధ్యానమును విడువలేదు. ఇట్లు అతిభయంకరములగు మహావిఘ్నములతో సోమశర్మ చలించకపోవుటచే ఝంఝావాతముతో చల్లని గాలిలో పెద్ద వానచే పీడించబడెను. ఆ వానలో చాలా భయంకరముగా గర్జించుచు ఒక పెద్ద సింహము అచటికి వచ్చెను. ఆ సింహమును చూచి భయముతో వణుకుచు నృసింహస్వామిని స్మరించెను.

ఇంద్రనీలమణి వంటి మేని చాయగలవాడు పీతాంబరధారి, మహాముత్యముల హారము చంద్రుని వన్నెను తలపించుచుండగా, శ్రీకౌస్తుభమణితో శోభించుచున్న జనార్దనుని, దివ్యమగు శ్రీవత్సాంకముతో శోభించు వక్షస్తలముగలవానిని సర్వాభరణములతో శోభించు దివ్యావయవములు గలవానిని పుండరీకాక్షుని, చక్కని చిరునవ్వుతో శోభించు మోము కలవానిని, సుప్రసన్నుని రత్నహారములతో శోభించువానిని ప్రకాశించుచున్న హృషీకేశుని నిశ్చలముగా సోమశర్మ ధ్యానించుచుండెను. శరణాగతవత్సలా! కృష్ణా! నీవే నాకు రక్ష దేవదేవా! నీకు నమస్కారము. భయము నన్నేమి చేయగలదు. ఉదరమున మూడు లోకములు, ఇతరములగు ఏడులోకములు గల మహానుభావుని శరణుపొందితిని. ఇక నాకు భయమెక్కడుండును? కృత్య మొదలగు మహాభయములను ప్రవర్తింపచేయువానిని సర్వభయములను తొలగించువానిని శరణువేడితిని, సకలపాపములకు సకల దానవులకు భయమును కలిగించువానిని విష్ణుభక్తులను రక్షించువానిని శరణువేడితిని. సకలదేవతలకు దానవులకు కృష్ణభక్తులకు రక్షకుడగువానిని శరణువేడుచున్నాను. భయములను నశింపచేయు అభయరూపుడు, పాపముల నశింపచేయు జ్ఞానరూపుడు బ్రహ్మరూపునిగా ఉండు ఒక్కని శరణు వేడుచున్నాను. సకల వ్యాధులను నశింపచేయువాడు సకలౌషధిస్వరూపుడు, ఆనందము దుఃఖము మొదలగు వికారములు లేనివానిని శరణువేడుచున్నాను. తాను నిశ్చలుడై సకలలోకములను నడిపించువాడు తాను పాపరహితుడై జ్ఞానమును ప్రవర్తింపచేయువానిని శరణువేడితిని. ఇక నన్ను భయమేమి చేయగలదు. సకల సాధుజనులను పాలించువాడు నిరామయుడు విశ్వరూపుడై విశ్వమును పాలించువానిని శరణువేడుచున్నాను.

నా ముందు సింహరూపముతో భయమును చూపు ఆ నారసింహుని సకల భయనివారకుని శరణు వేడుచున్నాను. మదముతో మత్తెక్కిన మహాకాయముకల అడవియేనుగు వచ్చినది. శరణాగతవత్సలుడు గజలీలాగతి గలవానిని, గజవదనుని, జ్ఞానరూపుని పాశాంకుశధారిని, కాలవక్రుని గజతుండుని శరణు పొందితిని. హిరణ్యాక్షుని సంహరించిన వరాహరూపుని శరణువేడుచున్నాను. శరణాగతవత్సలుడను వామనుని శరణువేడుచున్నాను. కురుచవారు, పొట్టివారు, మూడువంకరలు కలవారు, ప్రేతములు, కూష్మాండాది. భూతములు మృత్యురూపమును ధరించిన అన్ని నన్ను భయపెట్టుచున్నవి. నేను అమృతరూపుని శరణువేడుచున్నాను. భయము నన్నేమి

చేయగలదు? బ్రాహ్మణులందు ప్రీతికలవాడు, వేదమును ఇచ్చినవాడు, బ్రహ్మరూపుడు, బ్రహ్మజ్ఞానస్వరూపుడు అగు శ్రీహరిని శరణువేడుచున్నాను. భయము నన్నేమి చేయగలదు? సకల జగత్తునకు అభయమునిచ్చువారు, భయమును తొలగించువాడు, కలిగించువాడు అగు భయరూపుని శరణువేడితిని. భయము నన్నేమి చేయగలదు? సకల లోకమును తరింపచేయువానిని, సకల పాపులను నశింపచేయువానిని, ధర్మరూపుడగు ఆ జనార్దనుని శరణువేడుచున్నాను. యుద్ధమున దేవతలను కాపాడు అద్భుతమగు రూపుదాల్చువానిని శరణువేడుచున్నాను. నాకు అన్నివేళలా అతనే దిక్కు మహాభయంకరమగు ఝంఝావాతము నా శరీరమును బాధింపచేయుచున్నది. కావున ఆ స్వామిని శరణువేడుచున్నాను. నాకెప్పుడూ ఇతనే దిక్కు ఎక్కువ చలి, ఎక్కువ వాన, ఎక్కువ ఎండ తాపమును (పీడను) కలిగించును. ఈ అన్ని రూపములోనుండు ఆ దేవుని శరణువేడుచున్నాను. కాలరూపులు అగు ఈ సింహాదులు చలింపచేయుచు నా వద్దకు వచ్చినవి. ఇట్లు శ్రీహరి రూపులగువాటిని శరణువేడుచున్నాను. సర్వదేవుడు, పరమేశ్వరుడు, కేవలుడు, జ్ఞానమయుడు, స్వయంప్రకాశుడు, ఆదిసిద్దుడు, సిద్దేశ్వరుడగు శ్రీమన్నారాయణుని శరణువేడుచున్నాను. ఇట్లు సోమశర్మ క్లేశనాశకుడగు కేశవుని ధ్యానించుచు స్తుతించుచు భక్తితో శ్రీహరిని తన హృదయమున నిలుపుకొనెను.

ఇట్లు సోమశర్మ ధ్యానమును ప్రయత్నమును చూచి శ్రీమన్నారాయణుడు సంతోషించి సాక్షాత్కరించి ఇట్లు పలికెను. 'మహాప్రాజ్ఞ! సోమశర్మా భార్యతో కలిసి వినుము. నేను వాసుదేవుడను. సువ్రతా! వరమును కోరుకొనుము.' శ్రీహరి ఇట్లు పలుకగా సోమశర్మ కనులు తెరిచి నీలమేఘశ్యాముడు మహా తేజస్వి విశ్వేశ్వరుడగు శ్రీహరిని చూచెను. శ్రీహరి సర్వాభరణముల శోభతో వెలుగొందువాడు, సర్వాయుధ సమన్వితుడు, దివ్యలక్షణసంపన్నుడు, పుండరీకాయతాక్షుడు, పీతాంబరధారి ప్రకాశించుచున్నవాడు, దేవాధిదేవుడు, గరుడవాహనారూఢుడు, శంఖచక్రగదాధరుడు, బ్రహ్మాదులను పోషించువాడు, సకల జగద్రక్షకుడు, గొప్ప కీర్తిగలవాడు, జగత్తునకందనివాడు, రూపాతీతుడు, జగద్గురువు అగు స్వామిని సాక్షాత్కరించుకొని గొప్ప ఆనందము కలవాడు దండప్రణామములాచరించెను. ఆ స్వామి అమ్మవారితో కూడి శోభించుచున్నవాడు, సూర్యకోటిసమప్రభుడుగా నున్నవానిని చూచి చేతులు జోడించి సుమనతో కలిసి జయజయధ్వానములు గావించెను. 'మాధవా! జయము, మానదా జయము. యోగేశా! యోగేంద్ర జయము యజ్ఞపతీ! యజ్ఞఘ్న! యజ్ఞేశా! శాశ్వతా! సర్వాంతర్యామీ! జయము. సర్వేశ్వరా!'అనన్త! యజ్ఞరూపా! నీకు నమస్కారము. జ్ఞానవంతులలో శ్రేష్ఠుడా! జ్ఞాననాయకా! జయము. అన్నీ ఇచ్చువాడా సర్వజ్ఞుడా! సర్వసృష్టికర్తా జయము. జీవస్వరూపా! ఈశా! మహాజీవరూపా! నీకు నమస్కారము. ప్రజ్ఞాప్రదుడా! ప్రజ్ఞాస్వరూపా! ప్రాణప్రదా జయము. పాపఘ్న! పుణ్యేశా! పుణ్యపతీ! హరీ! జయము. జ్ఞానస్వరూపా! ఈశా! జ్ఞానగమ్యా! నమస్కారము. పద్మప్రతాక్ష పద్మనాభా! నీకు నమస్సులు. గోవిందా! గోపాలా! శంఖధరా! పవిత్ర చక్రధరా! అవ్యక్తా! వ్యక్తరూపా! నీకు నమస్కారము. విక్రమముతో శోభించు దివ్యదేవా! విక్రమనాయకా! లక్ష్మీవిలాసాంగ! వేదమయా. నీకు నమస్కారములు.

జయ విక్రమ శోభాంగ! జయ ఉద్యమదాయక!

పరాక్రమముతో శోభించు దివ్యదేహముకలవాడా! జయము జయము. ఉద్యమదాయకా! ఉద్యమకాలరూపా! ఉద్యమస్వరూపా! జయము. ఉద్యమశక్తా! ఉద్యమత్రయధారకా! యుద్రోద్యమప్రవృత్తికలవాడా జయము. ధర్మరూపా నీకు నమస్కారము. హిరణ్యరేతస్కా అతితేజస్స్వరూపా! సర్వతేజోమయా! నమస్కారము. దైత్యుల తేజమును హరించువాడా! పాపుల తేజమును హరించువాడా, గోబ్రాహ్మణహితమును కూర్చువాడా! పరమాత్మా! నీకు నమస్కారము. హుతభుక్కునకు హవ్యవాహునకు, కవ్యవహునకు స్వధారూపునకు నమస్కారము. స్వాహారూపునకు, యజ్ఞునకు పావనునకు నమస్కారము. శారబ్ధహస్తునకు, హరికి, పాపహారికి నమస్కారము. సదసత్ర్పేరకునకు విజ్ఞానశాలికి, వేదస్వరూపునకు పావనునకు నమస్కారము. హరికేశునకు సర్వక్లేశహరునకు, కేశవునకు పరునకు విశ్వధారికి నమస్కారము. కృపాకరునకు హర్షమయునకు అనస్తునకు శుద్ధునకు క్లేశనాశికి నమస్కారము. ఆనందరూపునకు, దివ్యునకు, దివ్యరూపునకు, రుద్రులచే నమస్కరించబడు పాదములు కలవానికి బ్రహ్మచే నమస్కరించబడు పాదములు కలవానికి నమస్కారము. పరేశునకు ఎవరిచేత గెలువశక్యముకానివానికి అమృతస్వరూపునకు నమస్కారము. క్షీరసాగరనివాసునకు, పద్మప్రియునకు నమస్కారము. ఓంకారునకు, శుద్దునకు, అచలునకు నమస్కారము. వ్యాప్తికి, వ్యాపకునకు సర్వవ్యసనహారికి, వరాహునకు, మహాకూర్మరూపునకు నమస్కారము. వామనరూపికి, నరసింహరూపికి, మహాత్మునకు, దివ్యునకు సర్వక్షత్రవధగావించిన పరశురామునకు నమస్కారము. శ్రీకృష్ణునకు, బుద్దునకు, మేచ్ఛనాశకునకు నమస్సులు. కపిల బ్రాహ్మణునకు, హయగ్రీవభగవానునకు నమస్కారము. వ్యాసరూపునకు సర్వమయునకు నమస్కారము.”

ఇట్లు హృషీకేశుని స్తుతించి ఇట్లు పలికెను. “నీ గుణములకు అంతమును బ్రహ్మకూడా తెలియజాలడు. నిన్ను స్తుతించుటకు సర్వజ్ఞుడగు రుద్రుడు కాని, సహస్రనేత్రుడగు ఇంద్రుడుకాని సమర్థులు కారు. అసలు నిన్నెవరు స్తుతించగలరు? ప్రభూ! నా బుద్ధి ఎంత? నేను నిర్గుణునిగా సగుణునిగా నీకు స్తోత్రము గావించితిని. నా అపశబ్దములను, సామాన్య శబ్దములను క్షమించుము. నేను నీ దాసుడను. ప్రతి జన్మలోనూ నీకు దాసునిగా యుందును. నాయందు దయచూపుము. నీవు పరమపావనుడవు.?’

ఇది శ్రీపద్మపురాణమున పంచపంచాశత్సంహితలో రెండవదగు భూమిఖండమున ఇంద్రసుమనోపాఖ్యానమున 19 - అధ్యాయము.