పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

2 - అధ్యాయము

సూత ఉవాచ –

సూతమహర్షి పలికెను.

ధర్మశర్మ ఆ శిరమును తీసుకొని త్వరగా వెడలిపోయెను. పితృభక్తి ప్రభావముతో తపస్సుతో సత్య ఆర్జవబలముతో యమధర్మరాజును పిలిచెను. ఇట్లు తపోబలముతో పిలువగా అచటికి వచ్చిన యమధర్మరాజు ధర్మశర్మతో ఇట్లు పలికెను. ధర్మా! నేను వచ్చితిని. నన్నెందుకు పిలిచితివి? ఏమి చేయవలయునో తెలుపుము. నిస్సంశయముగా చేసెదను.

ధర్మశర్మోవాచ -

ధర్మశర్మ పలికెను.

నా గురుశుశ్రూష, నిశ్చలమైన తపస్సు, ధర్మనిష్ఠ ఉన్నచో ఆ సత్యముతో వేదశర్మ జీవించవలయును.

ధర్మ ఉవాచ –

యమధర్మరాజు పలికెను.

కాతో భవేదితి ఆ ఇంద్రియ నిగ్రహముతో, సత్యముతో, శౌచముతో, తపస్సుతో, పితృభక్తితో నీ సోదరుడు వేదశర్మ జీవించును. నీ తపస్సుకు పితృభక్తికి సంతోషించితిని. ధర్మజ్ఞులు కూడా పొందశక్యముకాని వరమును కోరుకొనుము అని. ఇట్లు యమధర్మరాజు పలికిన మాటలను వినిన ధర్మశర్మ యమునితో ఇట్లు పలికెను. పితృపాదపూజలో నాకు నిశ్చలభక్తిని, ధర్మమునందాసక్తిని, ముక్తిని ప్రసాదించుము.

అంతట యమధర్మరాజు నా అనుగ్రహమువలన నీవు కోరినదంతయు జరుగగలదు అని పలికెను. ధర్మరాజు ఇట్లు పలికిన వెంటనే మహాజ్ఞానియగు వేదశర్మ నిదురించినవాడు లేచునట్లు లేచెను. సోదరుడగు ధర్మశర్మతో ఇట్లు పలికెను. సోదరా! ఆ దేవి ఎటు వెళ్ళినది, మన తండ్రి ఎక్కడున్నాడు అని.

అంతట ధర్మశర్మ జరిగినదంతయూ సంగ్రహముగా వివరించెను. అదంతయూ తెలిసిన వేదశర్మ సంతోషించి ధర్మశర్మతో ఇట్లు పలికెను. “ఈ రోజు నా శిరస్సును జీవితమునిచ్చిన నీవు నా ఎదురుగా నిలువుము. నీలాంటివారెవరుందురు?” ఇట్లు సోదరునితో పలికి తండ్రిని చూడగోరి ధర్మశర్మతో కలిసి తండ్రివద్దకు బయలుదేరిరి. ఇట్లు ఇద్దరూ తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి వద్ద నిలిచి సంతోషముతో ధర్మశర్మ తండ్రితో ఇట్లు పలికెను. “నా తపోబలముతో బ్రతికించి వేదశర్మను గొనివచ్చితిని. స్వీకరింపుడు” అని. అంతట ధర్మశర్మ భక్తిని తెలిసిన శివశర్మ సంతోషించెను. కాని ఏమియూ మాటాడక ఆలోచించసాగెను. తనముందు వినయముతో నిలుచునియున్న బుద్ధిమంతుడగు విష్ణుశర్మతో ఇట్లు పలికెను.

‘నాయనా! నా మాటనాచరింపుము. ఇపుడు వెంటనే ఇంద్రలోకమునకు వెళ్ళి అటనుండి అమృతమును గొనితెమ్ము! ఇపుడు ఈ ప్రియురాలుతో కలిసి ఉండదలుచుచున్నాను. సముద్రమునుండి పుట్టినది, వ్యాధి నాశకమునగు అమృతమును ఈ కాంత కోరుచున్నది. నేను ఈ యువతిని పొందగలుగునట్లు నీవు త్వరగా చేయుము. లేనిచో ఈమె ఇంకొకరివద్దకు వెళ్ళును. ఈ యువతి సౌందర్యవతి నన్ను వృద్ధునిగా తలిచి అవమానించును. నేనిపుడు ఈ ప్రియురాలితో కలిసి మూడు లోకములలో వ్యాధి దోషరహితుడనై విహరించునట్లు నీవు నా భక్తుడవగుచో చేయుము.’

ఇట్లు తండ్రి మాటలను వినిన విష్ణుశర్మ తేజశ్శాలియగు తండ్రితో మీ సుఖసంతోషముల కొరకు మీరు చెప్పినదంతయూ చేయుదును. ఇట్లు ధర్మాత్ముడగు విష్ణుశర్మ పలికి తండ్రికి నమస్కరించి ప్రదక్షిణము గావించి గొప్ప బలముతో, తపోబలముతో, నియమముతో అంతరిక్షమునాశ్రయించి ఇంద్రలోకమునకు వెడల సమకట్టి వెళ్ళసాగెను.

ఇది శ్రీ పద్మపురాణమున భూమిఖండమున శివశర్మ చరితమున రెండ - అధ్యాయము ముగిసినది.