పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

34 - అధ్యాయము

సూత ఉవాచ –

సూతమహర్షి పలికెను.

అంతట సునీధ పూర్వము వనమున తన చెలులతో కలిసి తాను చేసిన దుశ్చేష్టను సుశంఖుడు శపించిన విధానమును దుః ఖించుచు చెలులకు తెలిపెను.

సునీధోవాచ –

సునీధ పలికెను.

చెలులారా! ఇపుడు ఇంకొక విషయమును కూడా చెప్పుచున్నాను వినుడు. నా సౌందర్యము యౌవనము గుణములను చూచి నా కొరకు మా నాన్నగారు చింతతో నున్నారు. ఇట్లు చింతించుచు దేవతలకు మునులకు నన్ను చూపి ఇట్లు పలికెను. ఈ సునేత్రి నా పుత్రిక. మీలో ఒకనికి మహానుభావునికి గుణవంతునికి ఈయదలిచితిని. ఇట్లు పలికిన మృత్యు వాక్యమును వినిన దేవతలు ఋషులు ఇంద్రాదులు అతనితో ఇట్లనిరి. ఈ నీ పుత్రిక గుణశోభితురాలు, శీలసంపన్నురాలు. కాని ఒక ఋషి శాపదోషము కలిగియున్నది. ఈమెయందు ఎవనివలన పుత్రుడు కలిగిననూ అతను మహాపాపి పుణ్యవంశమును నశింపచేయువాడగును. కుండనిండుగా గంగాజలమున్ననూ అందులో ఒక్క సురాబిందువు పడిన అది మద్యకుంభమేయగును. పాపుల పాపసంసర్గము వలన కులమే పాపి యగును. పాలలో జిల్లేడుపాలచుక్క పడినచో క్షీరరూపమును నశింపచేసి తన రూపునే ప్రకాశింపచేయును. అట్లే ఒక పాపియైన పుత్రుడు వంశమునేనశింపచేయును. కావున ఈ దోషముతో కూడియున్న నీ పుత్రిక పాపభాగిని కావున ఇతరులకెవ్వరికైననూ ఇమ్ము. వెళ్ళుము అని. ఇట్లు దేవతలు ఋషులు గంధర్వులు మహానుభావులు అందరూ పరిత్యజించగా నా తండ్రి దుఃఖభారముతో క్రుంగిపోయెను. నన్ను సజ్జనులెవ్వరూ స్వీకరించరు. నేను పూర్వము ఇంతటి పాపమును చేసితిని. ఆ దుఃఖతాపముతో నేను వనమునే చేరితిని. శరీరమును శుష్కింపచేయు తపమునే ఆచరించెదను. మీరడిగితిరి కావున నేను జరిగినదంతయూ మీకు వివరించితిని. ఇట్లు మృత్యుపుత్రికయగు సునీధ ఇట్లు చెప్పి దుఃఖపీడితురాలై నోటమాట పెగలక మౌనము దాల్చెను. మరి పలుకలేదు.

సఖ్య ఊచుః –

చెలులు పలికిరి.

మహానుభావురాలా! శరీరమును శుష్కింపచేయు దుఃఖమును విడువుము. ఎవరి కులమున దోషము లేదు? దేవతలు పాపమును చేయలేదా? పూర్వము శంకరుని ముందు వారు కపటముగా పలికిరి. దేవతలు కావున బ్రహ్మ పూజ్యుడాయెను. ఇంద్రుడుకూడా బ్రహ్మ హత్యను కావించెను. అట్టి ఇంద్రుడు దేవతలతో కలిసి త్రైలోక్య రాజ్యమును అనుభవించుచున్నాడు. గౌతముని భార్యయగు అహల్యను పొందిన పరదారాభిగామి అయిన ఇంద్రుడు దేవతగానేయున్నాడు. శంకరుడు పరమదారుణమగు బ్రహ్మహత్యను గావించి ఇపుడు కూడా బ్రహ్మకపాలముతోనే తిరుగుచున్నాడు. ఆ శంకరునికి దేవతలు వేదవిదులగు ఋషులు నమస్కరించుచున్నారు. కుష్టువ్యాధితోనున్న సూర్యుడు మూడు లోకములను వెలిగించుచున్నాడు. (ప్రకాశింపచేయుచున్నాడు) దేవాది సకల చరాచరజగములు సూర్యునికి నమస్కరించుచున్నవి. పూర్వము భార్గవ శాపమును కృష్ణుడు అనుభవించుచున్నాడు. గురుభార్యగామి అయిన చంద్రుడు క్షీణించుచుండును. ఇక తరువాతి కాలమున మహాతేజస్వి రాజరాజు ప్రతాపవంతుడు, మహాప్రాజ్ఞుడు, ధర్మాత్ముడు పాండుమహారాజునకు యుధిష్ఠిరుడు పుత్రుడుగా కలుగును. గురువు వధ కొరకు అనృతమును చెప్పును. ఇంతటి మహానుభావులలోనే మహాపాపమున్నది. దోషములు ఎవరికి లేవు. మచ్చలేనిదెవరికి? నీవు చాలా చిన్నదోసము కలిగున్నావు. ఇపుడు నీకు ఉపకారమును చేతుము. నీ శరీరమున నున్న ఉత్తమగుణములు సత్యస్త్రీలలో నున్నట్లున్నవి. ఆ గుణములను ఇతరులలో కనపడుట లేదు. స్త్రీలకు మొదటి అలంకారము రూపమే. రెండవ ఆభరణము శీలము. మూడవది సత్యము. నిజాయితి (ఆర్జవము) నాలుగవది. అయిదవది ధర్మము. ఆరవది మాధుర్యము, బాహ్యాంతశుద్ది ఏడవది. ఎనిమిదవది పితృభావానుసరణము. శుశ్రూష తొమ్మిదవది, సహనము పదవది. రతి పదకొండవది. 12వది పాతివ్రత్యము. ఈ పన్నెండు గుణములతో నీవు అలంకరించబడియున్నావు. కావున భయపడకు. నీకు భర్త లభించు ఉపాయమును మేము ఆలోచించెదము. నీవుస్వస్థురాలవు కమ్ము. ఇంతటి సాహసమును చేయకుము.

సూత ఉవాచ –

సూతమహర్షి పలికెను.

చెలులు ఇట్లు పలుకగా సునీధ మరల వారితో ఇట్లు పలికెను. నాకు భర్త లభించు ఉపాయమును చెప్పుడు. అంతట రంభాది. చారులోచనలు ఆమెతో ఇట్లు పలికిరి. నీవు రూపమాధుర్యములు కలదానవు. ఎదుటివారికి ఐశ్వర్యమును పెంచుదానవు. బ్రహ్మశాపముతో భయపడిన మేము ఇచట చేరితిమి. పురుషులను మోహింపచేయు ఒక విద్యను నీకిచ్చెదము. అని ఆమెకు వారు అన్ని మాయలను తెలియుదానిని సకల శుభములను కలిగించు విద్యాబలమును ఇచ్చిరి. ఇపుడు నీవు దేవాదులలో ఎవరిని మోహింపదలచితివో వారిని వెంటనే మోహింప చేసెదము అని. ఇట్లు ఆ విద్యాసిద్ధిని పొందిన సునీధ ఆనందముతో చెలులతో కలిసి తిరుగుచు పురుషులను చూచుచుండెను. అట్లు తిరుగుచు పావనమగు నందనవనమునకు వెళ్ళెను. అచట గంగాతీరమున రూపవంతుడగు బ్రాహ్మణుని చూచెను. అతను సర్వలక్షణ సంపన్నుడు. సూర్యునితో తులతూగు తేజోవంతుడు. రూపములో రెండవ మన్మధునివలె నుండెను. దేవరూపుడు, మహానుభావుడు, భాగ్యవంతుడు, సౌభాగ్యప్రదుడు సాటిలేని మహాత్ములు విష్ణువునంతటి కాంతివంతుడు. విష్ణుభక్తుడు. సర్వపాపనాశకుడు. విష్ణుతుల్యపరాక్రముడు, కామక్రోధరహితుడు. అత్రివంశభూషణుడు. చక్కని రూపసి తపస్సు మూర్తీభవించినట్లుగా నున్నవాడు, దివ్యప్రభావసంపన్నుడు. తేజస్సుతో పరితపింపచేయుచున్నవానిని చూచి తన ఉత్తమ చెలియగు రంభను ఈ మహానుభావుడు దేవతలలో శ్రేష్ఠుడు ఎవరు? అని అడిగెను.

ఇది పద్మపురాణమున రెండవదగు భూమిఖండమున వేనోపాఖ్యానమున 34 - అధ్యాయము.