పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
7 - అధ్యాయము
నాధా! నీవు నిజమునే చెప్పితివి. అందులో సందేహము లేదు. కాని భర్తృస్నేహమును విడిచి సవతి వలన దుఃఖాక్రాంత అయ్యినాను! నేను అభిమానముతో దుఃఖముతో మానభంగముతో మహాదుఃఖముతో సంతాపమును పొందుచున్నాను. కావున ప్రాణములను విడుతును.
‘నీకు శాంతి కలుగు విధానమును చెప్పెదను వినుము. ఎవరూ ఎవరికీ పుత్రుడు కాడు, తల్లి కాదు, తండ్రి కాడు, సోదరులు కారు, బంధువులు కారు. స్వజనులు కారు. ఈ సంసారసంబంధమంతా మాయామోహముతో కలుగునది. తానే తండ్రి, తానే తల్లి, తానే బంధువులు, తామే స్వజనము, తానే సనాతనధర్మము. మానవుడు ఆచారముతో సుఖమును పొందును. అనాచారముతో పాపముతో నశించును. పాపజాతిలో పుట్టును. సత్యహీన కర్మతో మహాపాపముతో మోహించబడి శత్రుత్వమును పెంపొందించుకొనును. అటువంటి వారికి ప్రతిచోట శత్రువులుందురు. లోకమునందు మిత్రభావముతో ప్రవర్తించినవారికి అంతటా మిత్రులు లభింతురు. రైతు భూమిలో వేసిన విత్తనముననుసరించే ఫలమును పొందును. అట్లే నీ పుత్రులు సజ్జనులతో విరోధము పెట్టుకొనిరి. అటువంటి ఫలమును అనుభవించుచున్నారు. నీ పుత్రులు తపశ్శాంతి శూన్యులు. ఆ పాపముతోనే వారంతా మహాపదవి నుండి పడిపోయిరి. ఇట్లు తెలిసి శాంతిని పొందుము, దుఃఖమును విడువుము, సుఖమును విడువుము. ఎవరికి పుత్రులు? ఎవరికి మిత్రులు? ఎవరికి స్వజనులు? ఎవరికి బంధువులు? ఆత్మకర్మానుసారముగా అందరూ సుఖజీవనమును సాగింతురు. తత్త్వజ్ఞానము కలవారు పరులకొరకు వ్యర్థముగా ఆలోచించరు. ఈ శరీరము పంచభూతములతో ఏర్పడినది. సంధిబంధములతో నుండునది. ఆత్మను మిత్రునిగా చేసుకున్నవాని బ్రతుకు సుఖమయమగును. ఆత్మ మహాపవిత్రము, అంతటా ఉంటున్నది, అన్నిటిని తెలుపునది. సర్వసిద్ధి, సర్మాత్మ సాత్త్వికము, సర్వసిద్ధి ప్రదము. ఇట్లు సర్వమయమగు ఆత్మ ఒంటిగా ఏ సంబంధమూ లేకుండగా తిరుగుచుండును. నిర్జనారణ్యమున తిరుగుచున్న ఆత్మకు మూర్తీభవించిన బ్రాహ్మణోత్తములు పుణ్యరూపులు నలుగురు కనపడిరి. ఆ నలుగురికి మిత్రుడు అయిదవవాడు శ్వసనుడుగా కనపడిరి. అంతట ఆత్మ జ్ఞానసాయముతో అచటికి వచ్చి అయిదుగురిని చూచి జ్ఞానముతో ఇట్లు పలికెను. జ్ఞానమా! తమలో తాము పరస్పరము ఆలోచించుకుంటున్న ఈ 5గురిని చూడుము. వారివద్దకు వెళ్ళి మీరెవరు? అని అడుగుము అని. ఆ మాటలను విన్న జ్ఞానము వీరితో నీకేమి పని? నీవెపుడూ పరిశుద్ధుడవే కదా! నిజము చెప్పుము అని.
ఆత్మ పలికెను.
జ్ఞానమా! ఈ అయిదుగురు అదృష్టవంతులు, రూపవంతులు, బుద్ధిమంతులు. వెళ్ళి వారిని చూచెదను. వారితో మాటలాడెదను. భవ్యులైన ఈ అయిదుగురిని అడిగెదను. నీవు వెళ్ళుము. నీవు దూతకృత్యములో నిపుణుడవు.
జ్ఞానము పలికెను.
ఆత్మా! నా మాటను వినుము. నేను నిజమును చెప్పుచున్నాను. ఎపుడూ వీరితో సంగతి చేయరాదు. శుభము కోరువారు ఈ అయిదుగురితో సంగతిని చేయరాదు. వీరి సంగతి మోహమును కలిగించును.
ఆత్మ పలికెను.
జ్ఞానమా! నీవు వీరితో కలయికను ఎందుకు వారించుచున్నావు. యధార్ధముగా కారణమును చెప్పుము.
వీరి సంగతితో గొప్ప దుఃఖము కలుగును, ఈ అయిదు దుఃఖములకు మూలములు. శోకసంతాపములను కలిగించును. అయిననూ నీ మాటను ఆచరింతును అని చెప్పి జ్ఞానము ధ్యానముతో కలిసెను.
కశ్యపమహర్షి పలికెను.
అంతలో ఆ అయిదుగురు అచట ఆత్మనుచూచిరి. బుద్దిని పిలిచి నీవు వెళ్ళి ఆత్మతో కలియుము. మా కొరకు నీవు దౌత్యమును చేయుము. మహానుభావులగు పంచతత్వములు విశ్వమునకు ఆధారభూతములు శుభప్రదములు. మీతో స్నేహమును కోరుచున్నారు అని పలికి కార్యమును సాధించుము. ఇక్కడ చేయవలసినది లేదు అని. అంతట బుద్ధి అలాగే కానిండు. మీ కార్యమును సాధించెదను అని పలికి ఆత్మవద్దకు వెళ్ళి నేను బుద్దిని. మీవద్దకు వచ్చితిని. మహానుభావుల వద్దనుండి వచ్చితిని. నా మాటను వినుడు. వారు అయిదుగురు మీతో స్నేహమును కోరుచున్నారు. వారితో మైత్రిని చేయుము. ధ్యానమును దూరముగా విడువుము.
ధ్యానము పలికెను.
ఓ ఆత్మా! నీవు వీరితో కలియరాదు. వీరితో కలిసినంతనే గొప్ప దుఃఖము కలుగును. నేను, జ్ఞానము లేకుండా నీవు పనులనెట్లు చేయగలవు? కావున వారితో కలియరాదు. నీవు వారితో కలిసినచో నీకు గర్భవాసమును కలిగింతురు. నేను, జ్ఞానము లేనిచో అజ్ఞానమును పొందెదవు. ఇది తప్పదు. ఇట్లు పలికి ధ్యానము విరమించెను. అంతట ఒక నిశ్చయమునకొచ్చిన ఆత్మ బుద్ధితో ఇట్లు పలికెను. నా మంత్రులు ఉత్తములు, మహానుభావులగు జ్ఞానధ్యానములు అచటికి వెళ్ళుట మంచిది కాదని చెప్పియున్నారు. కావున నేను అచటికి వెళ్ళుట యుక్తము కాదు. కావున నేనేమి చేయుదును? ఇట్లు ఆత్మవచనములను వినిన బుద్ది ఆ అయిదుగురివద్దకు వెళ్ళి జ్ఞానధ్యానముల మాటలను వారికి వివరించెను. అంతట ఆ అయిదుగురు ఆత్మవద్దకు వెళ్ళిరి. మేమెప్పుడూ మీతో స్నేహమునే కోరుచున్నాము. నీవు పరిశుద్దుడవు కావున నీ వద్దకు వచ్చితిమి. స్వయముగా ఆలోచించి సమాధానమును చెప్పుడు.
ఆత్మ పలికెను
మీరు అయిదుగురు వచ్చినారు. నా స్నేహమును కోరుచున్నారు. మీ మీ గుణములను ప్రభావమును నా ముందు తెలుపుడు.
నా శరీరసంస్థానము అన్ని కార్యములను నెరవేర్చునది. చర్మమాంసముతో కూడియున్నది. అస్థి మూలముగా ఎముకలతో దృఢమైనది. నఖకేశములతో కూడియున్నది. శరీరమున నాదే అధికప్రభావము. నాసిక వలన తెలియబడు గంధము నాకు సేవకుడు.
ఆకాశము పలికెను.
నా పేరు ఆకాశము. నా ప్రభావము శరీరములో ఎట్లుండునో చెప్పెదను వినుము. నేను పరబ్రహ్మ స్వరూపమును వెలుపల లోపల నుండగలవాడను. శూన్యస్తానము నా నివాసము. వినుట కొరకు చెవులు నాకు మంత్రులుగా నుందురు.
వాయువు పలికెను.
నేను వాయువును. అయిదు రూపములుగా ప్రాణ, ఆపాన, ఉదాన, సమాన, వ్యాన రూపముగా ఉందును. సర్వశుభాశుభములను ఆచరింతును. స్పర్శగుణము కొరకు చర్మమును ఆశ్రయించి ఉందును.
తేజము పలికెను.
నేను తేజస్సును. ఎపుడూ శరీరముననుందును. పాకమును చేతును. నేను బాహ్యాభ్యంతరములలోని ద్రవ్యాద్రవ్యములను చూపుచుందును. చూపుటలో నాకు నేత్రములు అమాత్యులు. ద్రవ్యమును లభింపచేతును. అలంకరింపచేతును. ఇట్లు నా వ్యాపారమును నీ ముందు చెప్పితిని.
జలము పలికెను.
నేను జలమును. శుక్రము, మజ్జ, లాల రూపములుగా శరీర చర్మసంధులలో ఉందును. శరీరమధ్యననున్న మేము రక్తమును ప్రసరింపచేతుము. శరీరమును రాత్రింబవళ్ళు అమృతముతో పోషించుచుందుము. శరీరమున ఇది నా వ్యాపారము. నాకు మంత్రి రసన. ఇది రసమును ఆస్వాదింపచేయును.
నాసిక పలికెను.
నేను నాసికను. సుగంధముతో దేహమునకు పుష్టిని ప్రసాదించుచున్నాను. శరీరమున దుర్గంధమును విడిచి సుగంధమును చూపుచుందును. నేను యజమాని ఆజ్ఞను పాలించుటకు ఈ శరీరమున నిశ్చలముగా ఉండును. నా గుణము గంధము. ఇది (సు, దుర్) మంచి చెడు అని రెండు విధములుగా ప్రవర్తించబడును.
చెవులు పలికిరి.
మేము చెవులము. చేయుట చేయకపోవుట మొదలగు శుభాశుభశబ్దములను మా శరీరమున ఉంటూ వినెదము. మా సత్యాసత్యములు ప్రియాప్రియములు అన్ని మాచే వినబడును. నా గుణము శబ్దము. బుద్ధి ప్రేరేపించినట్లుగా నా వ్యాపారము జరుగును.
చర్మము పలికెను.
ఈ శరీరమున పంచరూపాత్మకమగు వాయువు ఉన్నది. ఆ వాయువు లోపల వెలుపల చేష్టలను ప్రవర్తింపచేయుచుండును. ఆ పంచవాయువులను చేష్టలను యథాతథముగా తెలియుదును. చల్లతనము, వెచ్చతనము, ఎండవాన, గాలివీచుట ఇవి అన్నియు స్పర్శవలన, అంగాలింగనముల వలన తెలియును. నాకు స్పర్శయే గుణము. ఇది నిజము. ఇట్లు నా వ్యాపారమును చెప్పితిని.
నేత్రములు పలికినవి.
ఈ ప్రపంచమున గల సకల శుభాశుభరూపములను బుద్ది ప్రేరేపించినపుడు మాత్రమే చూడగలము. శరీర మధ్యననుందుము. మా గుణము రూపము. ఇట్లు కాయమధ్యమున వ్యాపారసంబంధముండును.
జిహ్వ పలికెను.
నేను బుద్దితో కలిసి కారము పులుపు మొదలగు రసభేదములను పరిశీలించెదను. నీరసమును నిర్ణయించెదను. నేనెపుడూ ఈ పనినే చేయుచుందును. అన్ని ఇంద్రియములకు బుద్దియే నాలుక. ఇట్లు 5 ఇంద్రియములు వచ్చి తమ తమ పనులను వివరించినవి. అంతట బుద్ది వచ్చి అతనితో ఇట్లు పలికెను. నేను లేనిచో శరీరము నశించును. కావున నీవు నన్నాశ్రయించి ప్రవర్తించుము. ఇంతలో కర్మ వచ్చి ఆత్మతో ఇట్లు పలికెను. మహానుభావా! నేను కర్మను. నీ వద్దకు వచ్చితిని. నీవు వెళ్ళదలచిన దారిలో నేను పంపుదును. ఇట్లు అందరి మాటలను విన్న ఆత్మ వారితో ఇట్లు పలికెను. మీరు అయిదు రూపాలలో సర్వసాధారణులే కదా! అయినపుడు పంచాత్మకుడనైన నాతో ఎందుకు మైత్రిని కోరుచున్నారు. నాముందు అసలు కారణమును తెలుపుడు.
పంచాత్మకులు పలికిరి.
మేమందరమూ కలిసినపుడు శరీరమేర్పడును. ఆ శరీరమున చక్కని నియమముతో నీవుందువు. నీ అనుగ్రహము వలననే మేము ఈ శరీరమున నుందుము. కావుననే మేము నీ మైత్రిని కోరుచున్నాము.
ఆత్మ పలికెను.
మహానుభావులారా! ఇట్లే కానిండు. మీకు ప్రీతిని కలిగించెదను. ప్రీతివలననే మైత్రి కలుగును అని చెప్పి జ్ఞానము వారించుచున్ననూ ధ్యానము కాదనుచున్ననూ వారితో ఆత్మ కలిసెను. అట్లు వారు రాగద్వేషాదులతో ప్రలోభించబడి పంచతత్త్వములతో కలసిన దేహమును పొంది ఆత్మ దేహి ఆయెను. ఆత్మ మలమూత్రములతో కూడియున్న గర్భమునకు వచ్చి చేరగానే అచ్చటి దుర్గంధము బురదలో పడి వారితో కలిసి శరీరముతో వ్యాకులపడి ఆ అయిదుగురితో ఇట్లు పలికెను. ఓ పంచాత్మకులారా! నా మాట వినుడు. మీ కలయికవలన మహాదుఃఖముతో మోహితుడనై ఘోరము మహాభయప్రదమగు ఈ బురదలో పడితిని. నేనిచట ఉండదలుచుట లేదు.
పంచాత్మకులు పలికిరి.
ఓ రాజా! నెలలు నిండువరకు ఈ గర్భములో నుండుడు. తరువాత బయటకు వెళ్ళుడు. మీరు మాకు ప్రభువులు. శరీరములో ఉన్నారు. మీరు మా రాజ్యమును పాలించుడు. సుఖమును అనుభవించగలరు. ఇట్లు వారి మాటలను వినిన ఆత్మ దుఃఖముతో పీడించబడి ఈ శరీరమునుండి వెడలదలచి పలాయనమునందు మనసు నిలిపెను.
ఇది శ్రీ పద్మపురాణమున ద్వితీయమగు భూమిఖండమున దేవాసురమున శరీరకథనమున ఏడ - అధ్యాయము.
