పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
49 - పద్మావతీ చరితమ్
బ్రాహ్మణ్యువాచ - బ్రాహ్మణి పలికెను.
మహాసౌభాగ్యవతియగు ఆ పద్మావతి ఒకసారి ఒక పర్వతోత్తమమునకు వెళ్ళెను. ఆ పర్వతప్రాంతమున సుందరమైనది, కదలీఖండమండితమైన వనమును చూచెను. ఆ వనము శాలవృక్షములతో, తాలవృక్షములతో, తమాల వృక్షములతో దట్టముగానున్న నారికేళ వృక్షములతో, పూగీఫలములతో, మాతులుంగ, నారంగములతో అందమైన అల్లనేరడు వృక్షములతో చంపక పాటలములతో పుష్పించిన పవిత్రమైన కుటకములతో వటవృక్షములతో కూడియున్నది. అశోక వకులాది నానా వృక్షములతో అలంకరించబడియున్నది. పవిత్రులచే కూడియున్నది. పుష్పించిన వృక్షములతో ఉత్తములైన నరులతో నానా ధాతుసమాకులమై అంతట శోభలతో నిండియున్నది. సర్వతోభద్రమైన తడాగము పవిత్రజలముతో నిండియున్నది. చక్కగా పుష్పించిన సుగంధములైన కమలములతో కలువలతో తెల్ల కలువలతో భాసించుచున్నది. చక్కగా వికసించిన రక్తాత్పలములతో, నీలోత్పలములతో, తెల్లకలువలతో, హంసలతో జలకుక్కుటములతో జలజములైన పక్షులతో నానాధాతువులతో కూడియున్నది. నానాపక్షులతో కూడియున్న అంతటా శుభమైన తడాగమును, పవిత్రములైన కోకిలారావములతో సుస్వరములతో శోభించబడియున్నది. అట్లే మధురమైన శబ్దములతో అంతట మధురముగా మారెను. తుమ్మెదల కమ్మని ఝుమ్మను నాదములతో అంతటా శోభించుచున్నది. ఇంతటి చక్కని ఆ వనమును సర్వతో భద్రమైన తడాగమును రాజపుత్రి, వైదర్భి పద్మావతి చెలులతో క్రీడించుచు చూచెను.
అంతటా పూలతో నిండిన పవిత్రమైన వనమును చూచి స్త్రీసహజమైన చాపల్యముతో రాజపుత్రి ప్రభావముతో లీలగా సరసీరమున చెలులతో కలిసి జలక్రీడలో మునిగి నవ్వుచున్నది. పాడుచున్నది. సుఖముగా రమించుచున్నది. ఆ సంధ్యలలో భామిని అచట సుఖముగా సంచరించుచుండెను. అంతలో గోభిలుడను ఒక దైత్యుడు కుబేరుని సేవకుడు దివ్యవిమానముతో సర్వభోగములతో కూడియున్నవాడై ఆకాశమార్గమున వెళ్ళుచుండెను. ఆ గోభిలుడు విశాలాక్షియైన వైదర్భిని నిర్భయముగా క్రీడించుచున్నదానిని చూచెను. ఆమె ఉగ్రసేనుని ప్రియురాలు, స్త్రీలందరిలో శ్రేష్ఠురాలు, సకలావయవ సౌందర్యముతో సాటిలేనిదిగా విరాజిల్లుచున్నది. ఈమె మన్మధుని ప్రియురాలు రతియా, శ్రీహరి ప్రియురాలు లక్ష్మీదేవియా, లేక పార్వతీదేవా? శచీదేవియో అయ్యుండును. “ఈమె కనపడుచున్న తీరు స్త్రీలందరిలో అత్యుత్తమురాలు. ఈ భూమండలమున ఇటువంటి అందాలరాశి ఇంకొక స్త్రీ లేదు. అన్ని నక్షత్రములలో చంద్రుడు సంపూర్ణముగా శోభించునట్లు ఈ సుందరి గుణరూపకలలతో శోభించుచున్నది. పుష్కరములలో హంసవలే ఈ చారుహాసిని భాసించుచున్నది. ఆహా ఏమి రూపము! ఏమి భావము! ఈమెకు కనబడుచున్నది. ఈ బాల ఎవ్వరు? ఎవ్వరికి సంబంధించినది? చక్కని గుండ్రని చన్నులు గలది’ అని గోభిలదైత్యుడు వరానన అయిన పద్మావతిని విమర్శగా పరిశీలించుచుండెను.
ఆ గోభిలుడు క్షణకాలము ఎవరు ఎవరది అని ఆలోచించి దివ్యజ్ఞానముతో వైదర్భి అని, ఉగ్రసేనుని ప్రియురాలు అని పతివ్రత పరాయణ అని ఆత్మబలముతో నివసించుచున్నది, పురుషులలో పొందరానిది అని తెలిసెను. 'ఉగ్రసేనుడు మహామూరుడు. ఇంతటి ఉత్తమస్తీని ఇట్లు తండ్రి ఇంటికి పంపునా? అతను అదృష్టహీనుడు. అతను కూటమతి కానిచో ఇంతటి సౌందర్యరాశి లేకుండా అతను ఎట్లు బతుకును? లేదా ఇట్టి సుందరిని విడిచిపెట్టినవాడు నపుంసకుడైనా అయి ఉండవలయును. ఇట్లు ఆ గోభిలుడు ఆ సుందరిని చూచి కామమోహితుడాయెను. ఈమె పతివ్రత. పరపురుషులతో పొందరానిది. నేను ఈమెను ఎట్లు అనుభవింతును, నన్ను కామము తీవ్రముగా పీడించుచున్నది. ఈమెను అనుభవించకుండా వెళ్ళినచో నాకు మృత్యువు సంభవించును. అది ఎపుడో కాదు ఈ దినమే సంభవించును. కామము అన్నిటికంటే బలవత్తరము.' ఇట్లు చింతాపరుడైన గోభిలుడు మనసులో పరిశీలించెను. నేను మాయామయమైన ఉగ్రసేనుని రూపమును ధరించి ఈమెను అనుభవించెదను. వెంటనే ఉగ్రసేనుడెట్లుండునో, అంగములు ఉపాంగములు కూడా ఆ తీరులోనే ఆయెను. నడక, స్వరము, మాట, వస్త్రధారణ, వేషము, వయస్సు అన్నీ అట్లే ఆయెను. దివ్యమాల్యాంబరములను ధరించి దివ్యగంధసులేపనములను అలది సర్వాభరణములతో శోభించుచున్న అవయవములు కలవాడై మధురానాథునివలె గోభిలదైత్యుడు రూపమును దాల్చి గొప్ప మాయతో, రూపలావణ్యసంపదతో కూడినవాడై పర్వతాగ్రమున అశోకవృక్షచ్ఛాయనాశ్రయించి ఒక శిలాతలమున నుండి ఆ దుష్టాత్ముడు వీణాదండమును ధరించి ఉండెను.
విశ్వమును మోహింపచేయు గానమును సుస్వరముగా తాలమానక్రమోపేతముగా సప్తస్వరవిభూషితముగా గానమును చేయుచుండెను. ఆ దుష్టాత్ముడు ఆమె రూపముతో మోహింపబడి మహాసంతోషముతో పర్వతాగ్రమున కూర్చొనెను. చెలుల మధ్యలోనున్న వరానన పద్మావతి తాలమానలయాన్వితముగా సుస్వరముగా నున్న గానమును వినెను. ఏ ధర్మాత్ముడు ఇంతటి గొప్ప సౌఖ్యమును కలిగించునది, స్వరభావ సమన్వితముగా సత్రియతో కూడియున్నదానిని పాడుచున్నాడు అని తలచి చెలులతో కలిసి ఔత్సుక్యముతో ఆ రాజపుత్రి అచటికి వెళ్ళేను. పరిశుద్ధమైన అశోకఛాయను ఆశ్రయించి ఉన్న సుశిలాతలమున ఉగ్రసేనమహారాజు వేషములో నున్న దానవాధముడైన గోభిలుని చూచెను. అతను పుష్పమాలాంబరధరుడు, దివ్యగంధానులేపనము కలవాడు, సర్వాభరణములతో శోభతో ప్రకాశించుచున్న శరీరము కలవాడుగానుండెను. అతనిని చూచిన పద్మావతీ పరమ పతివ్రత ధర్మపరాయణుడైన మధురానాధుడు ఎపుడు వచ్చెను, మహానుభావుడైన నా పతి రాజ్యమును విడిచి చాలాదూరము వచ్చెను. పద్మావతి ఇట్లు ఆలోచించుచుండగనే పాపాత్ముడైన ఆ గోభిలుడు తొందరగా కామాతురుడై ఆహ్వానించెను. ప్రియురాలా రమ్ము! అని. ఆ పద్మావతి శంకితురాలాయెను. నా భర్త ఎట్లు వచ్చెను అని. అందుకే సిగ్గుపడి దుఃఖితురాలాయెను. ముఖమును క్రిందికి చేసుకొనెను. నేను పాపురాలను, దురాచారురాలను. శంక వదలి ఇచట సంచరించుచున్నాను అని.
ఈ మహానుభావుడు నామీద కోపించును. ఇట్లు ఆలోచించుచుండగానే ఆ పాపాత్ముడు కామాతురుడై ఆహ్వానించి “రా! రా! నా ప్రియురాలా! వరాననా! నీవు లేకుండగా నేను నాకు ప్రియములైన ప్రాణములను కూడా ధరించజాలను. జీవితమును ధరించజాలను. నేను నీ స్నేహముతో మోహమును పొందియున్నాను. నిన్ను విడిచి ఉండజాలను” అనెను. ఇట్లు పలికిన తరువాత ఆమె సిగ్గుతో అతని ముఖమును చూచెను. పద్మావతీ సతిని చక్కగా గాఢముగా కౌగలించుకొని ఏకాన్తమునకు తీసుకొనిపోయి చక్కగా యధేచ్చగా అనుభవించెను. గోభిలదైత్యుడు సత్యకేతు పుత్రికను యధేచ్ఛగా అనుభవించెను. ఆమె ఆ రాక్షసుని ముష్కస్థానమున తన సంకేతమును చూడజాలకపోయెను. వెంటనే తన వస్త్రమును స్వీకరించి శంకతో అతి దుఃఖితురాలాయెను.
అంతట ఆ పద్మావతి కోపముతో దానవాధముడైన గోభిలునితో ఇట్లు పలికెను. “నీవు ఎవరు? పాపాచారము కలవాడవు. సిగ్గులేనివాడవు. దానవాకారముతో నున్నావు” అనుచు దుఃఖముతో కనుల నీరు నిండినదై శపించుటకు సిద్దపడెను. దుఃఖభారముతో పీడించబడి వణుకుచున్నదై “దురాత్మా! నా ప్రియుని వేషమును ధరించి ఇక్కడికి వచ్చి సాటిలేని నా పాతివ్రత్యమును ధర్మమును నశింపచేసితివి” అనుచు సుస్వరముగా రోదించి “నా బ్రతుకును హరించితివి. ఇక ఇపుడు నా బలమును చూడుము. నీకు పరమభయంకరమైన శాపమును ఇచ్చెదను.” ఇట్లు పలుకుచు దానవాధముని శపించ సమకట్టెను.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబది తొమ్మిద - అధ్యాయము.
