పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

52 - మజ్గలా పాతివ్రత్య దర్శనేన సుదేవాయా మరణమ్

శివశర్మోవాచ - శివశర్మ పలికెను.

“మంగళా! నీవడుగుచున్నావు గాన నా మాటను వినుము. నీవడిగినదేమిటో దానిని తెలియుము. ఇపుడు ఈ వంచకురాలు భిక్షురూపిణి ఇచ్చటకు వచ్చినది వుదత్తుడను బ్రాహ్మణుని పుత్రిక. ఈమెపేరు సుదేవ. నాకు భార్య, ప్రియురాలు కూడా. ఏ కారణముచేతనో తన దేశమును విడిచి వచ్చినది. నా వియోగదుఃఖముతో దహించుచున్నది. నన్ను తెలుసుకొని నీ ఇంటికి భిక్షురూపముతో వచ్చినది. ఈ విషయమును తెలుసుకొని చక్కని ఆతిథ్యమును నా ప్రియమును కోరి చేయవలయును.” ఇట్లు పలికిన భర్త మాటలను వినిన మంగళ పరమపతివ్రత ఎంతో సంతోషముతో స్వయముగా స్నానాచ్చాదన భోజనములు నాకిచ్చెను. రత్నకాంచన ఆభరణములనిచ్చెను. ఆమె భర్త కోరికచే నేను చక్కగా అలంకరించబడితిని. 'ఆదరముతో స్నానాదులతో ఆమె నన్ను చక్కగా ఆదరించినది. ఇట్లు భర్త నన్ను మన్నించగా నా హృదయమున సర్వప్రాణి వినాశకమైన తీవ్రమైన అనన్తమైన దుఃఖము కలిగెను. ఆమె ఆదరమును నాలోని దుఃఖమును రెండు చూచితిని. నాకు దారుణచింత కలిగెను. ఆ చింతతో నా ప్రాణములు పోవుచుండెను. పాపురాలనైన నేను ఎప్పుడూ నా భర్తతో మంచిగా మాటలాడలేదు. ఈ బ్రాహ్మణోత్తమునకు నేను దుష్కృతమును ఆచరించుచు పాదప్రక్షాళనమును చేయలేదు. అంగసంవాహనము చేయలేదు. ఆ మహానుభావునకు ఏకాన్తమును కూడా ఈయలేదు.

పాపనిశ్చయముకల నేను ఆమెతో లేదా నా భర్తతో ఎట్లు మాటలాడకలను. నేను ఆ రాత్రి మహాదుఃఖసాగరమున పడిపోతిని. ఇట్లు బాధపడుతున్న నా గుండె పగిలినది. వరాననా! నా శరీరమును విడిచి నా ప్రాణములు పోయినవి. అపుడు అచటికి యమధర్మరాజు దూతలు వచ్చిరి. ఆ దూతలు వీరులు. భయంకరులు, క్రూరులు. గదలను, చక్రములను, ఖడ్గములను ధరించియున్నారు. ఆ దూతలు దృఢబంధనములైన సంకెళ్ళతో నేను కట్టబడితిని. నేను చాల దుఃఖముతో ఏడ్చుచు యమపురికి గొనిపోబడితిని. ముద్గరములచే కొట్టబడుచు దుర్గమ మార్గములో పీడించబడుచు బెదిరించబడుచు వారు నన్ను యముని ముందర ప్రవేశింపచేసిరి. యమధర్మరాజు కోపముతో దుష్టురాలనైన నన్ను నిప్పులరాశిలో నరకసంచయములో పడవేసెను. ఇనుముతో పురుషవిగ్రహమును బాగుగా కాల్చి నా భర్తను వంచన చేసినందుకు నా వక్షస్థలముమీదకు విసరివేసిరి. నానాపీడలతో బాగా సంతాపమును పొందితిని. నరకాగ్నిలో పడితిని. నూనె మూకుడులో విసరివేయబడితిని. వేపిన ఇసుకలో పడవేయబడితిని. చురకత్తులతో ఛేదించబడితిని. జలయంత్రముతో తోయబడితిని. కూటశాల్మలి వృక్షములయందు ఆ మహాత్ముడు నన్ను విసరివేసెను. చీము నెత్తురు మలపంకములయందు క్రిములతో కూడియున్నదానిలో పడవేయ పడితిని. రాజపుత్రీ! ఇట్లు నేను అన్ని నరకములయందు విసరివేయబడితిని.

పీడించబడు తీవ్రమైన నరకములలో ఆ మహానుభావుడు పడవేసెను. కరపత్రములతో చీల్చబడితిని. శక్తులతో కొట్టబడితిని. ఇంకా చాలా ఇతర నరకములందు పడవేయబడితిని. దుఃఖసంకటములలో పడి చాలా యోనులలో అనగా చాలా జాతులలో పుట్టితిని. ఆ యమధర్మరాజు నన్ను నరకములలో పడవేసెను. వల్గులీయోనిలో పుట్టి భయంకరమైన దుఃఖమును పొందితిని. ఆ తరువాత నక్కగా, మరల కుక్కగా, కోడిగా, పిల్లిగా, ఎలుకగా పుట్టితిని. ఇట్లే ఆయా విశేషజాతులలో పుట్టితిని. ఆ ధర్మరాజు ఇట్లు బహుళజాతులలో పడవేసెను. ఆ తరువాత శూకరిగా పుట్టితిని రాజపుత్రీ! నీ చేతిలో అనేక తీర్థములున్నవి. ఇపుడు నన్ను నీవు ఆ తీర్థములతో చల్లితివి. సుందరీ! నీ అనుగ్రహముతో నా పాపమంతా నశించినది. నీ తేజఃపుంజముతో నాకు జ్ఞానము కలిగెను. ఇట్లు నరకసంకటమున పడిన నన్నుద్దరించుము. ఒకవేళ నీవు నన్నుద్దరించనిచో మరల భయంకరమైన నరకమునకు పోదును. దుఃఖములోనున్న నన్ను కాపాడుము. నేను పాపభావమును పొందితిని. దీనురాలను. ఆశ్రయము లేనిదానను.

సుదేవోవాచ - సుదేవ పలికెను.

మంగళప్రదురాలా! నేను పుణ్యమువలన కలుగు సుకృతమును ఏమి చేసితినో, ఆ సుకృతముతో నిన్ను ఉద్ధరించెదను. దానిని ఇపుడు నీవు నాకు తెలుపుము.

సూకర్యువాచ - శూకరి పలికెను.

మనుపుత్రుడైన ఈ ఇక్ష్వాకుమహారాజు మహాజ్ఞాని. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. నీవు లక్ష్మీదేవి. ఇంకొకటి కాదు. నీవు మహానుభావురాలవు, పతివ్రతవు. పతివ్రత పరాయణురాలవు. నీవు శుభకరురాలవు. అన్నివేళలా సతివి. సర్వతీర్థ స్వరూపురాలవు. సర్వమయివి. సర్వదేవమయి. లోకమున మహాపతివ్రతవు నీవు ఒక్కదానివే. రాజునకు ప్రియురాలవు. నీవు రాత్రింబవళ్ళు భర్తను సేవించియున్నావు. దానిలో ఒక దినము భర్త శుశ్రూష పుణ్యమును నాకు ఇమ్ము. నామీద దయ చూపదలచినచో నీ పతి శుశ్రూష ఫలమును ప్రసాదించుము. నీవే నాకు తల్లివి, తండ్రివి. గురువువు. నేను పాపురాలను. దురాచారపరురాలను. అసత్యము మాటలాడుదానను. జ్ఞానహీనురాలను. నేను యముని దెబ్బలకు భయపడుచున్నాను. మహానుభావురాలా! నన్నుద్దరించుము.

సుకలోవాచ - సుకల పలికెను.

సూకరి పలికిన మాటలను వినిన మహారాణి సుదేవ రాజును చూచి మహారాజా! పశువు ఏదో చెప్పుచున్నది. ఏమి చేతును అని అడిగెను.

ఇక్ష్వాకురువాచ - ఇక్ష్వాకువు పలికెను.

ఈమె దుఃఖితురాలు, వంచకి, పాపజాతిలో పుట్టినది. నీవు నీ పుణ్యములతో ఈమెనుద్దరించుము. నీకు గొప్ప శ్రేయస్సు లభించును. ఇట్లు ఉత్తమసీ చారుమంగళ సుదేవ భర్త చెప్పిన మాటను విని వరాననా! నీకు నా ఒక సంవత్సరకాలము నేను చేసిన ప్రతి శుశ్రూషా ఫలమును నీకు అర్పించుచున్నాను అని పలికెను. ఆ సుదేవ ఇట్లు పలికిన వెంటనే ఆ సూకరి రూపయౌవనసంపన్నురాలు, దివ్యమాలావిభూషితురాలు, దివ్యదేహముకలది, తేజోజ్వాలలచే ఆవరించబడినది, సర్వభూషణముల శోభలతో విరాజిల్లుచున్నది, నానారత్నములచే అలంకరించబడినది, దివ్యగన్గానులేపనము కలదిగా ఆయెను. దివ్యవిమానమును అధిరోహించి అంతరిక్షమునకు వెళ్ళెను. ఆమె అంతలో తలవంచి ఆ మహారాణికి నమస్కరించి మహానుభావురాలా! నీకు శుభము కలుగుగాక! సుందరీ నీ అనుగ్రహముతో పాపవిముక్తురాలనై పుణ్యతమము, శుభము అయిన స్వర్గమునకు వెళ్ళుచున్నాను. ఇట్లు మహారాణికి నమస్కరించి సుదేవ స్వర్గమునకు వెడలెను. ఇట్లు సుకల చెప్పినదంతయూ నీకు నేను చెప్పితిని.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున సుదేవా స్వర్గారోహణమను యాబది రెండ - అధ్యాయము.