పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
20 - అధ్యాయము
శ్రీహరి పలికెను.
ఓ బ్రాహ్మణోత్తమా! పవిత్రమగు ఈ తపముతో, సత్యముతో పావనమగు స్తోత్రముతో నేను సంతసించితిని. కావున వరమునుకోరుము. నీ మనసులోనున్న వరమునిచ్చెదను. నీవు కోరినదంతయూ ఇచ్చెదను.
సోమశర్మ పలికెను.
కృష్ణా! నేను బాగుగా కోరుచున్న ఒక వరమును మొదటనిమ్ము. నాయందు దయయున్నచో ప్రసన్నమగు మనస్సుతో నిమ్ము. నేనెన్ని జన్మలను పొందిననూ నీ భక్తినే చేయుదును. మోక్షదాయకము, స్థిరమగు పరమపదమును చూపుము. అట్లే నా వంశమును తరింపుచేయు పుత్రుని దివ్యలక్షణములుగలవానిని, విష్ణుభక్తిపరుని నా వంశమును ధరించువానిని, సర్వజ్ఞుని, సర్వమునిచ్చువానిని దాంతుని, తపోవంతుని, తేజోవంతుని, దేవబ్రాహ్మణపాలకుని, పూజకుని, దేవమిత్రుని, పుణ్యభావములు కలవానిని, దాతను, జ్ఞానిని, పండితుని, ఇట్టి పుత్రుని నాకిమ్ము. అట్లే నా దారిద్ర్యమును హరించుము. ఇట్లు కానిమ్ము! సందేహము లేదు. నేనీ వరమును కోరుచున్నాను.
హరిరువాచ - శ్రీహరి పలికెను.
బ్రాహ్మణోత్తమా! ఇట్లే కానిమ్ము. నీవు కోరినట్లే కాగలదు. సంశయముతో పనిలేదు. నా అనుగ్రహమువలన వంశమును తరింపచేయు మంచి పుత్రుడు కలుగును. నీవు ఉత్తమములగు దివ్యమానుష భోగములను అనుభవించగలవు. పుత్రజన్మవలన ఉత్తమ శుభసౌఖ్యమును అనుభవించెదవు. నీ బ్రతుకు మొత్తములో దుఃఖము కలుగదు. దాతవు, భోక్తవు, గుణములను గ్రహించువాడవు కాగలవు. నీవు పవిత్రతీర్థమున మరణించి ఉత్తమగతిని పొందెదవు. ఇట్లు ప్రియురాలితో కూడియున్న సోమశర్మకు శ్రీహరి ఇట్లు వరములనిచ్చి శ్రీహరి అంతర్థానమును పొందెను. స్వప్నమువలె కనపడసాగెను. అంతట బ్రాహ్మణోత్తముడు సుమనతో కలిసి సోమశర్మ, పుణ్యప్రదము పావనము అగు ఆ రేవాతీరమున అమరకంటకక్షేత్రమున దానకార్యములను పుణ్యకార్యములను చేయుచుండెను. ఇట్లు చాలాకాలము గడిచిన తరువాత కపిలా రేవాసంగమమున స్నానమాడి బయలువెడలెను. అంతట ఆ బ్రాహ్మణుడు తమముందు తెల్లనిది చక్కని కాంతిగలది, సుందరమైనది దివ్యమైనది మదించినది, చక్కని లక్షణములు కలది నానాభరణములతో అలంకరించబడినది, చాలా కాంతిగలది, చక్కని ఏనుగునుచూచెను. ఆ ఏనుగు కుంభస్థలమున సిందూరముతో, కుంకుమతో అలంకరించబడియున్నది. ఆ ఏనుగుపై ఒక దివ్యపురుషుడు కర్ణములయందు నీలోత్పలములను ధరించి పతాకాదండముతో కూడి, దివ్యుడు దృఢమైన చక్కని తేజస్సు కలవాడు ఆ పురుషుడు దివ్యలక్షణము కలవాడు సర్వాభరణభూషితుడు, దివ్యమాల్యములను, దివ్యవస్త్రములను, దివ్యగంధమును ధరించినవాడు. సౌమ్యుడు, చంద్రునివంటి తెల్లని ఛత్ర చామరములతో కూడియున్నవాడుగానున్న ఆ పురుషుని సోమశర్మ మరల చూచెను. ఆ దివ్యపురుషుడు సిద్దచారణ గంధర్వులతో స్తుతించబడుచున్నవాడు, శుభంకరుడు ఇట్లు సుందరమగు గజమును, దివ్యలక్షణములుకల పురుషుని చూచి సోమశర్మ ఆశ్చర్యమనస్కుడై ఇట్లు ఆలోచించసాగెను. దివ్యదేహధారియై ఈ మార్గమున వెళ్ళుచున్న ఈ పురుషుడెవ్వడు? ఇట్లు ఆలోచించుచున్నంతో తన ఇల్లు చేరెను. తన ఇంటి లోనికి ప్రవేశించుచున్న సుందరుడు దేవరూపుడగు ఆ పురుషుని చూచెను. అమితానందముతో బ్రాహ్మణోత్తముడగు సోమశర్మ తన ఇంటికి త్వరగా వెళ్ళసాగెను. ఇంటిద్వారమును చేరగానే ఆ దివ్యపురుషుని చూడజాలకపోయెను. కాని ఆ గృహప్రాంగణమున సుగంధభరితములగు పుష్పములను, దివ్యములను చూచెను. పావనములగు చందనములు, కుంకుమలు, సుగంధములతో పూయబడిన తన గృహప్రాంగణమును దూర్వాక్షతలతో కూడియున్నదానిని చూచి ఆశ్చర్యముచెంది కారణమును మాటిమాటికి ఆలోచించుచునే అచట దివ్యమంగళసంపదలతో కూడియున్న సుమనను చూచెను.
సోమశర్మ పలికెను.
మంగళప్రదురాలా! నీకు ఈ దివ్యాభరణములను, అలంకారమును, రూపసౌభాగ్యమును, వస్త్రభూషణములను ఎవరిచ్చిరి? ఏమాత్రము సందేహించక నీవు నాకు కారణమును తెలుపుము. ఇట్లు బ్రాహ్మణోత్తముడు ఆ భార్యతో పలికి యూరకుండెను.
సుమన పలికెను.
ప్రియతమా! వినుము. ఒక దేవవరుడు తెల్లని ఏనుగుపై నధిరోహించి దివ్యాభరణభూషితుడై దివ్యగంధానులేపనము గావించుకొని దివ్యాశ్చర్యయుతుడై వచ్చెను. ఈ గంధర్వసేవితుడగు పురుషుడెవరో తెలియనైతిని. దేవగంధర్వచారణులతో స్తుతించబడుచు వచ్చెను. పుణ్యరూపశోభితులు, రూపశృంగారవతులగు స్త్రీలు సర్వాభరణశోభలతో అలరారువారు, పరిపూర్ణమనోరధులతో కలిసి ఆ మహానుభావుడు మన గృహమును రత్నములతో నింపివేసెను. అచట దివ్యమగు సింహాసనమున నన్ను కూర్చుండబెట్టి వస్త్రాలంకారాభరణములతో శోభింపచేసి వేదమంత్రములతో మంగలగానములతో శాస్త్రగీతములతో అభిషేకించబడితిని. తరువాత వారంతర్థానమును చెందిరి. నా చుట్టూ చేరినవారు నాతో ఇట్లు పలికిరి. మేమందరమూ ఎపుడూ నీ ఇంటిలోనే నివసించెదము కావున నీవు భర్తతో కలసి ఎపుడూ పరిశుద్దురాలిగా నుండుము. ఇట్లు చెప్పి వారందరూ వెళ్ళిపోయిరి. దీనినంతటిని నేను చూచితిని. ఇట్లు సుమన చెప్పగా మహామతియగు సోమశర్మ అంతయూ విని ఇదిఅంతయూ దేవతలచే చేయబడినది. ఇదేమి? అని ఆలోచించసాగెను.
అట్లు సోమశర్మ బ్రహ్మకర్మను సాధర్యధర్మమును ఆచరించసాగెను. ప్రతశాలినియగు సుమన సోమశర్మ వలన గర్భమును ధరించెను. ఆ గర్భముతో సుమన మిక్కిలి శోభించెను. తేజోవంతుడగు పుత్రుని తేజఃపుంజములతో మరింత తేజోవంతురాలాయెను. అట్లు తపోవ్రతములతో ఆ సుమన దేవతుల్యుడగు తనయుని ప్రసవించెను. ఆ పుత్రుని జన్మకాలమున అంతరిక్షమున దేవదుందుభులు మ్రోగినవి. దేవతలు శంఖములను పూరించిరి. గంధర్వులు లలితముగా గానము చేసిరి. అప్సరసలందరు ఆ సమయమున నాట్యమును గావించిరి. అంతట బ్రహ్మదేవతలతో కలిసి అచటికి వచ్చి ఆ పుత్రునికి సువ్రతుడని నామకరణము గావించి మహాతేజోవంతులగు దేవతలందరూ బ్రహ్మ వెడలిపోయెను. ఇట్లు దేవతలందరూ వెడలగానే సోమశర్మ తన పుత్రునికి జాతకర్మాదికమునాచరించెను. ఇట్లు దేవప్రసాదరూపముగా మహానుభావుడగు పుత్రుడు కలిగిన వెంటనే సోమశర్మ ఇంటిలో ధనధాన్యయుతమగు మహాలక్ష్మీ వచ్చి చేరినది. గజములు, అశ్వములు, మహిషములు, గేదెలు, బంగారము, రత్నములు నిండిపోయెను. ధనసంచయముతో నిండిన కుబేర భవనమువలె సోమశర్మ భవనము అట్లే విరాజిల్లసాగెను. ఆ బ్రాహ్మణోత్తముడు ధ్యానపుణ్యాది కర్మలను చేయసాగెను. చాలా పుణ్యముతో ఆ బ్రాహ్మణోత్తముడు తీర్థయాత్రలకు బయలువెడలెను. ఇట్లు తీర్థయాత్రలతో ఇతర పుణ్యకార్యములను దానములను జ్ఞానముతో పరిశుద్దితో ఆచరించసాగెను.
ఇట్లు సోమశర్మ ధర్మకార్యములను పుణ్యకార్యములను ఆచరించసాగెను. పుత్రునికి జాతకర్మాదులను ఆచరించెను. తగిన సమయమున వివాహమును మహానందముతో జరిపించెను. పుత్రుడగు సువ్రతునికి కూడా గుణవంతులు, సులక్షణములుకల పుత్రులు కలిగిరి. వారందరూ సత్యధర్మ తపములు కలవారు, దానధర్మరతులుగా నుండిరి. వారికి కూడా సోమశర్మ శుభకార్యములను చేయించెను. ఇట్లు పౌత్రుల ఆనందముతో తాను ఆనందించసాగెను. తేజస్సుతో రాజరాజువలె సకల సౌఖ్యములను అనుభవించసాగెను. సోమశర్మ శరీరము కూడా 25 యేండ్ల వయసువాని శరీరమువలె విరాజిల్లెను. ఇట్లు సోమశర్మ సూర్యతేజముతో సమానమగు తేజస్సు కలవాడై మహామతియై శోభించెను. సుమనకూడా పుణ్యమంగలములతో పుత్రునితో పౌత్రులతో దానవ్రతనియమములతో శోభించసాగెను. పాతివ్రత్యాది పావనకర్మలతో శోభించసాగెను. పదునారువత్సరముల పడుచువలె వనముతో శోభించసాగెను. ఇట్లు శుభములతో సుఖములతో సౌందర్యముతో యౌవనముతో పుణ్యకార్యములతో ఆనందించుచు మహానందము కలవారై పరిశుద్దులు, గొప్ప వృద్ధికలవారుగా నుండిరి. ఇది సోమశర్మ సుమనల పుణ్యాచారసమన్వితమగు వృత్తాంతమును చెప్పితిని. ఇక ఇపుడు సువ్రతుని ప్రతచర్యను నిర్వికారుడగు శ్రీమన్నారాయణుని ఆరాధించిన విధానమును చెప్పెదను.
ఇది శ్రీపద్మపురాణమున పంచపంచాశత్సంహితలో ద్వితీయమగు భూమిఖండమున ఐంద్రమున సుమనోపాఖ్యానమున సువ్రతోత్పత్తియను ఇరవయ్య - అధ్యాయము.
