పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
28 - అధ్యాయము
ఋషయ ఊచుః –
ఋషులు పలికిరి.
మహానుభావా! మహానుభావుడగు పృథుచక్రవర్తి చరితమును విస్తరముగా తెలుపుము. మేము ఇంకనూ వినగోరుచున్నాము. మహాత్ముడగు పృథచక్రవర్తి ఈ భూమి ఎట్లు పితుకబడినది? అట్లే దేవతలు, పితృదేవతలు, తత్త్వవేత్తలగు మునులు, దైత్యులు, నాగులు, యక్షులు, వృక్షములు, పర్వతములు, పిశాచములు, గంధర్వులు, బ్రాహ్మణులు, సిద్దులు, రాక్షసులు ఇంకా ఇతరులు మొదట ఎట్లు పితికిరి? అట్లే వారివారి పాత్ర విశేషమును, పాలలోని విశేషమును కూడా వివరించుము. ఇంతకు పూర్వము ఋషులు వేనమహారాజు పాణిని ఎందుకు మధించిరి? ఆ ఋషులెందుకు కోపించిరి. సూతపుత్రా! దీనినంతయూ నాకు వివరించుము. ఈ కథ పరమవిచిత్రము, పరమపావనము, సర్వపాపనాశకము. మేము వినగోరుచున్నాము. మాకు తృప్తి కలుగుట లేదు.
సూత ఉవాచ –
సూతమహర్షి పలికెను.
వేనుని పుత్రుడగు పృధు చక్రవర్తి చరితమును విస్తారముగా పుట్టుకను పరాక్రమమును, రాజ్యమును, పౌరుషమును అంతయూ వివరించెదను. బ్రాహ్మణోత్తములారా! నన్నిట్లే చేరి సేవించుడు. విను కోరికను తెలుపుడు. ఈ పృధు చరితమును భక్తుడు కానివానికి శ్రద్ధలేనివానికి, శరునికి, పరమమూర్ఖునికి, మోహితునికి, దుష్టశిష్యునికి, అబద్దసాక్ష్యము చెప్పువానికి, అన్నిటిని భుజించువానికి, సర్వనాశము చేయువానికి చెప్పరాదు. ఇట్లు విధిహీనముగా పఠించువారు నరకమును పొందుదురు. మీరందరూ సద్భావము కలవారు. సత్యధర్మపరాయణులు. మీముందు సకలపాపనాశకమగు పృధుచరిత్రమును సమగ్రముగా వివరించేదను. మీరు వినుడు. ఈ చరితము స్వర్గప్రదము, కీర్తిప్రదము, ఆయుఃప్రదము, ధన్యము, వేదసమ్మతము, పరమరహస్యము. ఋషులు చెప్పినదానిని తెలిపెదను. వేనపుత్రుడగు పృధుచరితమును విస్తరముగా నిత్యము కీర్తించువారు, బ్రాహ్మణులకు నమస్కరించువాడు ఎప్పటికి ఈ చరితమును వినినంతనే ఏడుజన్మలలో సంపాదించిన పాపము నశించును. బ్రాహ్మణుడు వేదవిదుడగును. క్షత్రియులు విజయమునందుదురు. వైశ్యుడు ధనసమృద్ధిని పొందును. శూద్రుడు సుఖమును పొందును. ఇట్లు పృధుచరితమును చదివిననూ వినిననూ ఇట్టి ఫలమును పొందును. పృధు పుట్టుక, చరితముపవిత్రము పాపనాశనము.
పూర్వము అత్రివంశమున పుట్టినవాడు అత్రితో సమానుడు ధర్మరక్షకుడు మహాజ్ఞాని వేదశాస్త్రార్థములు బాగుగా తెలిసినవాడు అన్ని ధర్మములను సృజించువాడు అంగుడను వాడుండెను. అతని పుత్రుడు వేనుడను ప్రజాపతి కలడు. ఇతను అన్నివేళలా ధర్మమును విడిచి ప్రవర్తించెడివాడు. మృత్యువు పుత్రిక సునీధ అను పేరు కలది మహానుభావురాలు. ఆమెను అంగుడు పెండ్లియాడెను. ఆమెయందు అంగునికి వేనుడు కలిగెను. ఇతను ధర్మప్రణాశకుడు. మృత్యువు పుత్రికకు పుత్రుడగు వేనుడు మాతామహుని దోషమువలన స్వధర్మమును 'విడిచి అధర్మపరాయణుడాయెను. కామముతో లోభముతో మహామోహముతో పాపమునే ఆచరించుచుండెను. వేనరాజు వేదాచారమయమగు ధర్మమును విడిచి మదమాత్సర్యమోహములతో పాపమునే అనుసరించుచుండెను. అతని రాజ్యమున ప్రజలు వేదాధ్యయనము లేకనే ప్రవర్తించెడివారు. అతను రాజుగానుండగా ప్రజలు స్వాహాస్వధా వషట్కారములు లేకుండనే యుండిరి. కావున యజ్ఞములందు దేవతలు సోమమును పానము చేయకుండిరి.
వేనమహారాజు బ్రాహ్మణులతో ప్రతినిత్యము ఇట్లు పలుకుచుండెడివాడు. 'అధ్యయనము చేయరాదు. హోమము చేయరాదు. దానము చేయరాదు. యాగము చేయరాదు. హవనము చేయరాదు.' ఇది ఆ క్రూరునికి ప్రతిజ్ఞగా ఉండెను. దానివలన వినాశము సంభవించినది. 'నేనే యజ్ఞమును. నేనే యజ్ఞమును చేయువాడను. నేనే ఆరాధనను. నాకొరకే యజ్ఞములను చేయవలయును. నాకే హోమమును చేయవలయును. నేనే విష్ణువును. నేనే బ్రహ్మను. నేనే రుద్రుడను. నేనే ఇంద్రుడను, సూర్యుడను. నేనే వాయువును, నేనే భోక్తను. నేనే హవ్యమును, నేనే కవ్యమును. ఇందు సంశయము లేదు.' ఇట్లు పలుకగా కోపించిన మునులు పాపబుద్దిగల రాజుతో ఇట్లు పలికిరి.
ఋషయ ఊచుః –
ఋషులు పలికిరి.
భూభర్తయగు రాజు ఎల్లపుడూ ప్రజలను పాలించుచుండును. రాజు అనగా ధర్మస్వరూపుడు. కావున రాజు ధర్మమును కాపాడవలయును. మేము యజ్ఞమును ప్రారంభించి 12 సంవత్సరములు దీక్షలో ప్రవేశింతుము. యాగమున అధర్మము నాచరించకుము. ఇది ధర్మము కాదు. సజ్జనులు నడుచు మార్గమూ కాదు. ధర్మమును ఆచరించుము. సత్యమును పుణ్యమును ఆచరించుము. నేను రాజును. ప్రజలను కాపాడుదును అని తాము ప్రమాణమును చేసితిరి అని. ఇట్లు పలుకుచున్న మహర్షులను చూచి బిగ్గరగా నవ్వి దుర్బుద్ధియైన వేనుడు, అనర్థమైన ఈ అర్థమును పలికెను.
వేన ఉవాచ –
వేనుడు పలికెను.
నాకంటే ఇతరుడెవడు ధర్మమును సృజించును. నేనెవరి మాటను వినవలయును. శాస్త్రము బలము తపస్సు సత్యములలో నాతో సాటి ఎవరు? అన్ని ప్రాణులకు అన్ని ధర్మములకు మూలము నేనని మూర్ఖులగు మీకు తెలియదు. నేను తలచినచో భూమిని కాల్చగలను. నీటితో ముంచగలను. ఆకాశమును భూమిని అరికట్టగలను. ఈ విషయమున వేరు ఆలోచన లేదు. ఇట్లు పలుకగా ఆ రాజు మోహముతో గర్వముతో కూడి మార్చుటకు వీలుకానందున ఋషులు కోపించిరి. ఇట్లు పేలుచున్న వేనుని కోపముతో బలముతో నిగ్రహించి వడిసి పట్టుకొని వేనుని ఎడమ తొడను చిలికిరి. అటునుండి నల్లని కాటుకముద్దవలే మరుగుజ్జు విచిత్రరూపుగలవాడు పొడవు మోము, బెదరు కనులు, నల్లని కంచుక వర్ణముగలవాడు, లంబోదరుడు,, నిక్కపొడిచిన చెవులు కలవాడు, బాగా భయముచెందినవాడు, కపటి అయిన ఒక పురుషుని చూచిరి. నిషీద కూర్చొనుము అని పలికిరి. వారి ఆ మాటను విని భయపీడితుడై కూర్చునెను. అప్పటినుండి వారి వంశము (నిషాద) పర్వతములలో, అడవులలోనే ఉండినది. నిషాదులు, కిరాతులు, బిల్లులు, ఆహలకులు, భ్రమరలు, పులిందులు ఇంక ఇతర మ్లేచ్చజాతులు. వీరంతా పాపాచారులు అందరూ అతని ఊరువునుండి జనించిరి. అంతట ఆ ఋషులందరు ప్రసన్నమనస్కులై పాపము తొలగి పరిశుద్దుడగు వేనుని దక్షిణబాహువును మధించిరి. ఇట్లు మధించిన అతని బాహువునుండి స్వేదము పుట్టెను. ఆ ఋషులు అతని దక్షిణ బాహువును మరల మధించిరి.
అతని శోభన బాహువునుండి ద్వాదశాదిత్యుల కాంతి గలవాడై, బాగుగా కాల్చి వన్నె తీర్చిన బంగారు మేని ఛాయగలవాడు దివ్యమాల్య వస్త్ర సహితుడు, దివ్యాభరణభూషితాంగుడు, దివ్యగంధములనందికొనినవాడు, సూర్యకాంతిగల కిరీటముతో కుండలములతో శోభించువాడు పురుషుడు కలిగెను. మహాకాయుడు ఆజానుబాహువు సాటిలేని రూపసి ఖడ్గమును బాణములను ధనువును ధరించినవాడు, సర్వశుభలక్షణములు గలవాడు, సర్వాలంకారభూషితుడు, తేజస్సుతో సౌందర్యముతో చక్కని రంగుతో మహాబుద్దితో స్వర్గమున ఇంద్రునివలె భూమిపై వేనపుత్రుడు శోభించెను. ఆ మహానుభావుడు పుట్టగా దేవతలు పవిత్రులగు ఋషులు పెద్ద పండుగ చేసుకొనిరి. వేనపుత్రుడు తన దేహకాంతితో చక్కగా జ్వలించు అగ్నివలె భాసించుచుండెను. గొప్పది ఉత్తమము ఆర్యము అగు ఆజగవమను ధనువును ధరించి దివ్యములగు శరములను రక్షణకుకవచమును ధరించిన పృథువు మహావీరుడు మహానుభావుడు మహాభాగ్యవంతుడు పుట్టగా అన్ని ప్రాణులు మురిసినవి. అన్ని తీర్థములు జలములు వివిధములు పరమపావనములు అన్నియూ పృథుచక్రవర్తి రాజ్యాభిషేక సమయమున వచ్చి నిలిచినవి. బ్రహ్మ మొదలగు దేవతలు సకలప్రాణులు స్థావరజంగమములు అన్నీ కలిగిన పృథుచక్రవర్తిని రాజ్యాభిషిక్తుని చేసిరి. పృథుచక్రవర్తి మహావీరుడు ప్రజాపాలకుడు. పృథుని రాజుగా పొంది సకలచరాచర జీవరాశులు దేవతలు విప్రులు అందరూ ఆనందమున ఓలలాడిరి. అందరూ పృథువును అభిషేకించిరి. ప్రతాపవంతుడగు వేనపుత్రుడను పృథుచక్రవర్తి రాజాయెను. పృథుచక్రవర్తి తండ్రియగు వేనుడు ప్రజలను ఎపుడూ రంజింపచేయలేదు. కాని పృథువు రంజింపచేయగా సుఖముతో మురిసిపోయిరి.
పృథుచక్రవర్తి ప్రజలను రంజింపచేయుటవలన రాజని పేరొచ్చెను. పృథుచక్రవర్తి సముద్రమువైపు బయలుదేరినచో అతని భయముతో జలము స్తంభించెడిది. పర్వతములు కూడా అతనికి దుర్గమ మార్గమును కాదని మంచిమార్గమును ఇచ్చినవి. అన్ని పర్వతములు పృథుచక్రవర్తి ఆజ్ఞను జవదాటలేదు. భూమి దున్నకనే పండుచుండెను. ఆవులు కోరగానే పాలిచ్చెడివి. కోరినంతనే వర్షించెడి పర్జన్యుడు, బ్రాహ్మణులు క్షత్రియులు ఇతరులు వేదములను యజ్ఞములను ఉత్సవములను జరుపుచుండిరి. పృథురాజ్యపాలనలో వృక్షములు కూడా కోరిన ఫలములనిచ్చెడివి. కరువు కాటకములు వ్యాధులు అకాలమరణములు అతని పాలనలో లేవు. అందరూ సుఖముగా జీవించుచుండిరి. ప్రజలందరూ ధర్మపరులుగా నుండిరి. ఈ కాలములోనే బ్రహ్మ యజ్ఞమున మంచిదినమున మహాబుద్ధిశాలియగు సూతుడు యజ్ఞకుండమున ఉద్భవించెను. ఆ యజ్ఞమునందే ప్రాజ్ఞుడగు మాగధుడు కూడా జన్మించెను. పృథువును స్తుతించుటకు మహర్షులు ఆ సూత మాగధులను అచటికి పిలిచిరి.
బ్రాహ్మణోత్తములారా! పరమపావనమగు సూతుని లక్షణమును చెప్పెదను. శిఖా యజ్ఞోపవీతములు కలిగి వేదాధ్యయన తత్పరుడై, సర్వశాస్త్రార్థములు చక్కగా తెలిసియుండి అగ్నిహోత్రమునుపాసించువాడు, దానాధ్యయన సంపన్నుడు బ్రహ్మాచారపరాయణుడు, దేవబ్రాహ్మణుల పూజయందు ఆసక్తి కలవాడు పవిత్రులగు స్తుతిపరులలో వేదమంత్రములలో ఎప్పుడు యజ్ఞము చేయుచుండువాడు, సదాచారపరాయణుడు ఎపుడూ బ్రాహ్మణులతో సంబంధము కలిగియుండువాడుగా నుండవలయును. ఒక్క వేదాధ్యయనము తప్ప ఇతర లక్షణములన్నియూ మాగధునకుండవలయును. వందులు చారణులు అందరూ బ్రహ్మాచారవర్షితులుగా నుందురు. వారు స్తుతించువారుగా నుందురు. కాని వారందరూ మహానుభావులనియే తెలియవలయును.
రాజును స్తుతించుటకు నిపుణులగు సూతమాగధులను సృజించిరి. అంతట ఆ ఋషులు వారిని రాజును స్తుతించమని చెప్పిరి. ఈ రాజు ఎలాంటివాడో వివరించుడు. అంతట ఆ సూతమాగధులు ఋషులతో ఇట్లు పలికిరి. మేము మా పనులతో దేవతలను ఋషులను ప్రీతులను చేతుము. కాని మేము ఈ రాజు చేసిన పనులను తెలియవు. అట్లే వీరి లక్షణమును కూడా తెలియవు. కీర్తిని తెలియవు. ఇతని కర్మతోనే స్తోత్రమును చేయవలయును. మహాకీర్తిమంతుడైన పృథుచక్రవర్తికి కలుగబోవు గుణములతో పవిత్రములతో స్తోత్రమును చేయవలయును. పృథుచక్రవర్తి చేయు పనులను ఆ మునులందరు అతని గుణములను తెలియజేసిరి. ఇతను సత్యవంతుడు, జ్ఞానసంపన్నుడు, బుద్ధిమంతుడు, ప్రసిద్దిపొందిన పరాక్రమము కలవాడు. ఎపుడూ శూరుడు, గుణములను గ్రహించువాడు, పుణ్యవంతుడు, త్యాగి, ధార్మికుడు, సత్యమును చెప్పువాడు, యజ్ఞములను చేయువాడు, ప్రియముగా మాటలాడువాడు, సత్యమును పలుకువాడు, ధనధాన్యములు కలవాడు, గుణవంతుడు, గుణములను తెలిసినవాడు, ధర్మజ్ఞుడు, సత్యముయందు ప్రీతి కలవాడు. అంతట వెళ్ళువాడు, అన్నీ తెలిసినవాడు, బ్రాహ్మణప్రియుడు, వేదములను తెలిసినవాడు, పండితుడు, ప్రజ్ఞ కలవాడు, సుస్వరము కలవాడు, వేదములందు వేదాంగములందు పరిపూర్ణజ్ఞానము కలవాడు, ప్రజలను పోషించువాడు, పాలించువాడు, జయమును పొందువాడు, రాజసూయాది యజ్ఞములను చేయువాడు, రాజులలో శ్రేష్ఠుడు, భూమిలోకల ఉత్తమ వస్తువులను తెచ్చువాడు, సర్వధర్మములు కలవాడు. ఈగుణములు ఇతనికి ముందుండగలవు అని తెలిపిరి.
ఇట్లు ఋషులచే నియోగించబడిన ఆ సూతమాగధులు మహానుభావుడగు పృధుమహారాజునకు కలుగబోవు సుగుణములను స్తుతించిరి. అప్పటినుండి లోకులు స్తుతులతో సంతోషించుచుండిరి. స్తుతించబడు గుణములతో దాతలు ముందుందురు, అప్పటినుండి ఈ లోకమున బ్రాహ్మణులు స్తోత్రములను ఆశీర్వాదములను ఇచ్చుచుండిరి. పృథుచక్రవర్తి సూతమాగధవందులకు ఉత్తమ ధనమునిచ్చెను. చారణునకు ఉత్తమమగు కళింగదేశమునిచ్చెను. తరువాత పృథుమహారాజు హైహయదేశమున రేవానదీతీరమున తన పేరుతో ఒక నగరమును నిర్మించి పరిపాలించుచుండెను. యజ్ఞములనాచరించుచు బ్రాహ్మణులకు దానము చేయుచుండెను. ఇట్లు సర్వజ్ఞుడు, సర్వదాత, ధర్మవీరుడగు ఉత్తమ రాజును ప్రజలు, మునులు దర్శించి తమలో తాము ఇట్లు సంభాషించుకొనిరి. ఈ రాజు మహాబుద్ధికుశలుడు, దేవతలకు యజ్ఞములతో మనకు భోజనాదులతో వృత్తిని (బ్రతుకును) ఈ రాజు ఇచ్చును. ప్రజలను పాలించును. బ్రతుకునిచ్చును. చాలా తెలివిగల ఈ భూమి పూర్వము తమ బ్రతుకుకొరకు వేసిన బీజములను మ్రింగి స్థిరముగా నుండెను. అంతట ప్రజలందరు రాజువద్దకు చేరిరి. మాకు చక్కని బ్రతుకును కల్పించుడు అని అడిగిరి. మునులు కూడా అట్లే పలికిరి.
ఇట్లు భూమి ప్రజల జీవికయగు ధాన్యబీజములను భుజించి నిశ్చలముగా ఉండుటను, ప్రజలకు సంభవించిన భయమును చూచి మహర్షి వచనములను విని ధనుర్బాణములను ధరించి కోపముతో భూమిపైకి పరుగిడెను. పృథుచక్రవర్తికి భయపడిన భూమి యేనుగురూపము ధరించి అరణ్యములో రహస్య ప్రదేశములలో దాగుచు సంచరించుచుండెను. పృథుచక్రవర్తి యేనుగు రూపమును చూడజాలనందున బ్రాహ్మణులు భూమి గజరూపమును ధరించినదని తెలిపిరి. అంతట గజరూపధారియగు భూమివెంట బడి తీక్ష బాణములతో కొట్టెను. తరువాత భూమి హరిరూపమును (సింహ) ధరించి పరుగెత్తెను. పృథుచక్రవర్తి అతికోపముతో ఎర్రబారిన నేత్రములతో తీక్షణములు, దృఢములగు బాణములతో భూమిని కొట్టెను. అట్లు బాణములతో కొట్టబడిన భూమి శారీరకముగా మానసికముగా కలత చెంది, గేదెరూపును ధరించి పలాయనము చేసెను. అయిననూ బాణపాణియగు రాజు వెంట పరుగెత్తెను. అంతట భూమి గోరూపధారిణియై స్వర్గమునకు వెళ్ళెను. బ్రహ్మ విష్ణు మహేశులను శరణు పొందిననూ రక్షణ లభించక చివరికి పృథు చక్రవర్తి సమీపమునకే చేరెను.
భూమి చేతులు జోడించి ఆ పృథు మహారాజుతో ‘రక్షించుడు’ ‘రక్షించుడు’ అనుచు ఇట్లు పలికెను. నేను ధాత్రిని. అందరికి ఆధారమును నేనే. నేనే వసుంధరను (అందరి ధనమును భద్రపరచుదానను). నేను చనిపోయినచో లోకములేడును నశించును. చేతులు జోడించుకొని నిలుచున్న భూమి నేనెప్పుడు మూడు లోకములకు పూజ్యురాలను. స్త్రీ ఎప్పుడు చంపదగనిది అని రాజుతో పలికెను. స్త్రీలను గోవులను వధించుటలో మహాపాతకములు కలుగునని బ్రాహ్మణోత్తములు చెప్పియున్నారు. నేను లేకుండగా ప్రజలను ఎట్లు నిలిపెదవు. నేను స్థిరముగా నున్నపుడు మాత్రమే సకల చరాచరములు స్థిరముగా నుండును. నేను లేనిచో ఈ లోకములు నశించును. కావున నా నాశనమున ప్రజా నాశము తప్పదు. ప్రజలను నేను లేకుండగా ఎట్లు ధరించెదవు? లోకములు నాయందు స్థిరముగా నుండును. లోకములను నేనే ధరింతును. నా నాశమున ప్రజానాశము తప్పదు. నీవు ఈ లోకములకు మేలు చేయదలచినచో నన్ను చంపదగదు. నా మాటను వినుము. ఉపాయముతో ప్రారంభించిన కార్యములు చక్కగా నెరవేరును. కావున నేను లేకుండగా ప్రజలను ధరించు ఉపాయమును ఆలోచించి తరువాత నా వధకు సిద్దము కమ్ము. ప్రజలను ధరించుట రక్షించుట పోషించుట నేను లేకుండగా ఎటుల చేయగలవు? కావున నీవు నీ కోపమును నిగ్రహించుకొనుము. నేను అన్నమయనుగా నుందును. ప్రజలను ధరించెదను. నేను స్త్రీని చంపతగనిదానను. పశుపక్ష్యాదులలో కూడా స్త్రీని చంపరాదని చెప్పుదురు. దీనినంతయూ చక్కగా ఆలోచించి ధర్మమును విడువతగదు. మొదట క్రూరమగు ఈ కోపమును విడువుము. నీవు ప్రసన్నత చెందినచో నా మనసు కుదుటపడును. ఇట్లు పలు విధములుగా భూమి పలుకగా వేనపుత్రుడగు పృథుచక్రవర్తి ఆ భూమితో ఇట్లు పలికెను.
ఇది శ్రీ పాద్మపురాణమున ద్వితీయమగు భూమిఖండమున పృధూపాఖ్యానమున ఇరువది ఎనిమిద - అధ్యాయము.
