పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

47 - సూకరీ పూర్వజన్మ చరితమ్

సుకలోవాచ - సుకల పలికెను.

అంతట సర్వాజ్ఞసౌందర్యము కల సుదేవ ఆ సూకరితో ఇట్లు పలికెను. ‘నీవు పశుజాతిలో ఉండి కూడా సంస్కృతములో ఎట్లు మాట్లాడుచున్నావు? ఇంతటి గొప్ప జ్ఞానము ఎట్లు కలిగినది? నాకు చెప్పుము. నీ చరితము, భర్త చరితము ఎట్లు నీకు తెలియును?’ తెలుపుము అని.

సూకరువాచ - సూకరి పలికెను

‘వరవర్ణినీ! నేను పశుభావముతో మోహముతో ఆక్రమించబడితిని. ఖడ్గముతో, బాణములతో కొట్టబడి యుద్దములో పడిపోతిని. పూర్తిగా అలసిపోయి మూర్ఛపోతిని. జ్ఞానహీనురాలినిగా ఉంటిని. సుందరి పవిత్రమైన హస్తముతో నీవు నన్ను అభిషేకించితివి. చల్లనివి, పవిత్రములైన జలముతో నీ చేతిలోనివాటితో అభిషేకించగానే నన్ను నా మోహము విడిచి వెళ్ళినది. తేజస్సుతో అంధకారము నశించినట్లు నీ అభిషేకముతో నా పాపము నశించినది. సుందరమైన సర్వావయవములు కలదానా! నీ అనుగ్రహముచే పూర్వజన్మజ్ఞానము నాకు లభించినది. పుణ్యలోకములకు వెళ్ళేదను అని తెలుసుకొంటిని. మంగళకరురాలా! నా పూర్వవృత్తాస్త్రమును చెప్పెదను వినుము. పాపురాలనైన నేను పూర్వజన్మలో చేసిన పాపములను తెలిపెదను.

కలింగమను పేరుగల మహాదేశమున శ్రీపురమను పత్తనము కలదు. ఆ పత్తనము సర్వసిద్ధులతో కూడియున్నది. బ్రాహ్మణ క్షత్రియాది చతుర్వర్ణములతో సేవించబడుచున్నది. ఆ పత్తనమున వసుదత్తుడను ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను. వేదాచారపరాయణుడు. సత్యధర్మపరాయణుడు. వేదవేత్త జ్ఞానము కలవాడు. పరిశుద్దుడు, గుణవంతుడు, ధనవంతుడు, ధనధాన్యసమాకీర్ణుడు, పుత్రపౌత్రులతో కూడియున్నవాడు. నేను ఆ బ్రాహ్మణోత్తమునికి పుత్రికను. సోదరులతో, స్వజనబంధువులతో శృంగారమును పెంపొందించు అలంకారములతో అలంకరించబడియుంటిని. నాకు మానాన్న 'సుదేవ' అను పేరు పెట్టెను. ఆ తండ్రికి నేను అత్యంత ప్రీతిపాత్రురాలను. రూపములో నాకు సాటెవ్వరూ ఈ ప్రపంచమున లేరు. రూపయౌవన గర్వముతో నేను మదించియుంటిని. నేను కన్యను. చక్కని రూపవతిని. సర్వాలంకారశోభితను. నన్ను చూచిన జనులందరూ స్వజనవర్గమంతయూ వివాహము చేసుకొనుటకు నన్నే యాచించుచుండిరి. అందరూ ద్విజులు నన్ను యాచించుచుండిరి. కాని మా నాన్నగారు ఎవ్వరినీ ఇచ్చుట లేదు. నా మీది స్నేహముతో మా తండ్రి మోహమును పొందియుండెను. అట్లు మా తండ్రి నన్ను ఎవ్వరికీ ఈయలేదు. అంతలో నాకు భావోదయముతో కూడిన యౌవనము ప్రాప్తించినది. నా ఈ సౌందర్యమును చూచి నా తల్లి దుఃఖితురాలాయెను.

మా తల్లి తండ్రితో ‘నీవు కన్యను ఎందుకు చక్కని బ్రాహ్మణునికి మహానుభావునకు ఇచ్చుటలేదు. ఈమెకు యౌవనము వచ్చినది. మహానుభావా! కన్యాదానము చేయుము.' అనగా మా తండ్రి మరల ఇటుల బదులు పలికెను. “మహాభాగ్యవంతురాలా! నా మాట వినుము. నేను పుత్రికావ్యామోహముతో మూఢుడనైతిని. శుభురాలా! గృహస్థుడు చక్కని బ్రాహ్మణుడు లభించినచో ఆ జామాతకు నా బిడ్డను ఇత్తును. ఇందులో సంశయములేదు. సుదేవ నాకు ప్రాణాధిక ప్రియురాలు. ఇందులో సందేహము లేదు. ఇట్లు నా తండ్రి వసుదత్తుడు నా తల్లితో పలికెను. కౌశికకులములో పుట్టినవాడు, సర్వవిద్యా విశారదుడు, బ్రాహ్మణగుణము కలవాడు, శీలవంతుడు, గుణవంతుడు, పరిశుద్దుడు, వేదాధ్యయన సంపన్నుడు, సుస్వరముతో వేదమును చదువుచున్నవానిని, భిక్షకొరకు ద్వారమునకు వచ్చినవానిని తల్లిదండ్రులు లేనివానిని చూచి, అతని రూపమును చూచి మహాబుద్ధిమంతుడైన మా తండ్రి నీవెవరు, నీ పేరేమిటి, కులమేమిటి, గోత్రమేమిటి, ఆచారమేమిటి నాకు చెప్పుము’ అని అడుగగా మా తండ్రి మాటను విని వసుదత్తునితో ఇట్లు పలికెను.

‘నేను కౌశిక కులమున పుట్టితిని. నాపేరు శివశర్మ. వేదవేదాంగపారగుడను. తలిదండ్రులు లేనివాడను. నాకు నలుగురు సోదరులు వేదపారగులు కలరు.’ ఇట్లు అతను తన కులమును, ఆచారమును వివరించెను. ఇట్లు తండ్రికి అంతయూ వివరించెను. అంతట మా తండ్రి శుభలగ్నమున శుభతిథిలో ఉత్తరానక్షత్రములో ఆ బ్రాహ్మణునికి నన్నిచ్చి వివాహము చేసెను. నేను నా భర్తతో కలిసి తండ్రి ఇంటిలోనే నివసించుచున్నాను. నేను పాపురాలనై నా భర్తను సేవించుట లేదు. తల్లిదండ్రులధీనములో గర్వముతో మోహించబడితిని. నేను ఎప్పుడూ నా భర్తకు అంగసంవాహనము చేయలేదు. రతిభావముతో, స్నేహముతో ప్రవర్తించలేదు. పాపురాలనైన నేను క్రూరబుద్ధితోనే చూచితిని. పుంశ్చలుల (వేశ్యల) ప్రసంగమును విని విని నేను పుంశ్చలీభావమును పొందితిని. తల్లితండ్రులకు, భర్తకు, సోదరులకు హితమునాచరించుట లేదు. నేను వెళ్ళిన ప్రతిచోట నా ఇచ్చానుసారముగా ప్రవర్తించుచుంటిని. నా ఈ దురాచారమును చూచిన నా భర్త శివశర్మ అత్తమామలయందలి ప్రేమతో నన్నేమీ అనుటలేదు. నా దుష్కృతమును క్షమించుచుండెను. నన్ను నా కుటుంబము వారించుచున్ననూ నేను పాపురాలనై ఇట్లు ఆచరించుచుంటిని. నా తల్లిదండ్రులు నా స్వభావమును, శివశర్మ మంచితనమును తెలుసుకొని నా పాపాచారముతో దుఃఖించుచుండిరి.

నా భర్త నా దురాచారమును చూచి నా ఇంటినుండి బయలువెడలెను. ఈ గ్రామమును ఈ దేశమును విడిచివెళ్ళెను. నా భర్త బయటికి వెళ్ళగానే నా తండ్రి చింతాక్రాంతుడాయెను. రోగముచే పీడించబడునట్లు నా దుఃఖముతో దుఃఖించుచుండెను. అంతట నా తల్లి దుఃఖపీడితుడైన భర్తతో ఇట్లు పలికెను. “ప్రియా! ఎందుకు దుఃఖించుచున్నావు? నాకు దుఃఖకారణమును తెలుపుము.” అంతట నా తండ్రి వసుదత్తుడు నా తల్లితో ఇట్లు చెప్పెను. “అల్లుడు నా కూతురును విడిచివెళ్ళెను. ఈ సుదేవ పాపాచారపరాయణురాలు. సిగ్గులేనిది. పాపమునే ఆచరించుచున్నది. ఈ సుదేవ మహాబుద్ధిమంతుడైన శివశర్మను విడిచిపెట్టినది. మమ కుటుంబముమీది గౌరవముతో మహామతి శివశర్మ సుదేవతో మాటలాడుటలేదు. సౌమ్యభావముతో ఉంటున్నాడు. నిందించుట లేదు. దూషించుట లేదు. అతను పండిత బుద్ది కలవాడు గావున ఏమీ అనుటలేదు. ఈ సుదేవ దుష్టురాలాయెను. కులమును నశింపచేయుచున్నది. నేనీ సుదేవను విడిచి పెట్టి ఎటైనా వెళ్ళేదను.”

 బ్రాహ్మణ్యువాచ - బ్రాహ్మణి పలికెను.

‘కాంతా! పుత్రిక గుణదోషములు ఈరోజు మీకు తెలిసినవా? ఇపుడు నేను చెప్పుచున్నాను. వినుము. నీ ప్రేమతో వ్యామోహముతో ఈ పుత్రిక చెడిపోయినది. 5 సంవత్సరముల వయసు వరకు పుత్రుని లాలించవలయును. అదికూడా నేర్పుట కొరకు. తరువాత ప్రేమతో పోషించవలయును. స్నానముతో, వస్త్రముతో, భక్ష్యభోజ్యపేయములతో చక్కగా పోషించవలయును. ఇందులో సందేహము లేదు. పుత్రునికి గుణములను సద్విద్యలను అలవర్చవలయును. గుణములను నేర్పుటకు తండ్రి ప్రేమలేనివాడగును. పాలించుటలో, పోషించుటలో ప్రేమ ఉండవలయును. కుమారునితో అతని గుణములను చెప్పరాదు. అతని దోషములను చూపుచుండవలయును. కఠినముగా మాటలాడవలయును. మాటలతో పీడించవలయును. జ్ఞానమునందు ఆసక్తితో ప్రతినిత్యము సద్విద్యను సాధించునటుల అభిమానముతో కపటముతో, పాపమును దూరముగా విడిచిపెట్టి ప్రవర్తించవలయును. అట్లు చేసినచో విద్యలలో, గుణములలో ఎల్లపుడు నైపుణ్యము కలుగును. తల్లి పుత్రికను, అత్త కోడలును శిక్షించవలయును. గురువు శిష్యుని శిక్షించినపుడే అన్నీ సిద్దించును. శిక్షించనినాడు రావు. భార్యను భర్త, అమాత్యుని రాజు, గుఱ్ఱమును రౌతు, గజమును మావటి ప్రతిదినము శిక్షాబుద్ధితో నేర్పవలయును. ఇట్లు తాడనముతో పాలనముతో అన్నీ సిద్దించును. నాధా! నీ పుత్రికను నీవే నశింపచేసితివి. ఇందులో సంశయము లేదు. నీతోపాటు శివశర్మ కూడా వ్యామోహముతో చెడగొట్టితిరి.

ఇంటిలో ఈ పుత్రిక అడ్డులేకుండగా చేయబడినది. కావున ఇట్లు చెడిపోయినది. కాంతా! ఎనిమిది సంవత్సరముల వయసు వరకే ఇంటిలో కన్యను ధరించవలయును. ఆ తరువాత ధరించరాదు. తండ్రి ఇంటిలో నున్న పుత్రిక చేసిన పాపము తల్లిదండ్రులచే అనుభవింపబడును. కావున కన్య సమర్గురాలైన తరువాత తలిదండ్రులు తన ఇంటిలోనుంచుకొనరాదు. ఏ వరునికిచ్చెదరో ఆ భర్త ఇంటిలోనే పోషింపబడవలయును. భర్త ఇంటిలో ఉండి భర్తను భక్తితో సేవించవలయును. అటైనచో కులమునకు కీర్తి కలుగును. తండ్రి సుఖముగా జీవించును. అక్కడే ఉండి చేసిన పాపమును భర్త అనుభవించును. అక్కడ ఉండి నిత్యము పుత్రులతో, పౌత్రులతో వృద్ధిపొందుచుండును. ప్రియుడా! పుత్రిక మంచిగుణములతో తండ్రి కీర్తిని పొందును. కావున కాంతా! భర్తతో పాటు పుత్రికను ఇంట్లో ఉంచుకొని పోషించరాదు. ఈ విషయమున చక్కని ఇతిహాసము రాబోవుచున్నది. 28వ ద్వాపరయుగమున యదుజ్యేష్ఠుడైన వీరుడైన ఉగ్రసేనుని కథను నీకు చెప్పెదను. సావధానముగా వినుము.

            ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబదియేడ - అధ్యాయము.