పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
58 - ఇంద్ర సుకలా సంవాదమున సుకల ఇంద్రుని నిరాశపరచుట
విష్ణురువాచ - శ్రీమహావిష్ణువు పలికెను.
క్రీడోవాచ - క్రీడ పలికెను.
క్రీడచే ప్రేరేపించబడిన సుతన్వి సుకల ఆ వనమును ప్రవేశించినదై ఆ వనమును అతిరమణీయమును చూచినదై ఆ స్నేహితురాలైన క్రీడనే ఇట్లు అడిగెను. “సఖీ! ఈ అరణ్యము శ్రేష్టమైనది. పరమపావనమైనది, దివ్యమైనది. ఇది అందరి మనసునకు నచ్చునది ఎవరిది? ఉత్తమములైన కోరికలతో నిండియున్నది” అని సంతోషముతో క్రీడను అడిగెను. అంతట క్రీడ ఇట్లు పలికెను.
'ఈ వనము దివ్యమైన గుణములతో కూడియున్నది, సిద్దస్వభావభావనలతో చేరియున్నది. చక్కని పూలు, కామఫలములు నిండియున్నది. ఇది మన్మధసామ్రాజ్యముగానున్నది. అంతటా చూడుము.' ఇట్లు సుకల క్రీడా వాక్యములను విని గొప్పగా సంతోషించినదై దురాత్ముడైన మన్మధుని గొప్ప ప్రవర్తనను చూచి వాయువు తీసుకొని వచ్చు సుగంధమును వాసన చూచుట లేదు. స్వభావసిద్దముగా వాయువు సుగంధముగానే వీచుచున్నది. కాని ఆ సుగంధము ఆమె నాసికలో ప్రవేశించుట లేదు. ఆ పూలవాసనను ఆ వరానన స్వీకరించుట లేదు. ఆ మహాసాధ్వి అచటి రసములను కూడా ఆస్వాదించుట లేదు. ఆమె రమించు మన్మధమిత్రుడైన వసంతుని ఓడించినది. అట్లు సిగ్గుపడి ముఖమును తిప్పుకొనిన వసంతుడు ఇంద్రుని మాటల నెపముతో చక్కగా పండిన ఫలములనుండి పూల గుత్తులలో సంస్కరించబడినదై బిందురూపముగా భూమిపై పడెను. ఆ రసమును ఆ సుకల గెలిచినది. ఇట్లు దీనమైన మకరందము కూడా పండునుండి భూమిపై పడెను. యుద్దమున మరణించి భూమిపై పడిన వీరుని గృధ్రాదులు భక్షించునట్లు తేనెటీగలచే ఆస్వాదించబడు మకరందము ప్రవాహరూపముగా పారుచుండెను.
సూత ఉవాచ - సూతుడు పలికెను.
అట్లు వసంతుడు మెలమెల్లగా వెళ్ళుచుండెను. అతనిని పక్షులు అపహసించుచున్నవి. అచటి పక్షులన్నీ వనమధ్యములోనున్నవై ప్రీతితో సుకల ఈ వసంతుని ఓడించినది. ఓడిన వసంతుడు క్రిందిదారిని పట్టినాడని పలుకుచున్నట్లుండెను. అంతట ప్రీతితో కూడిన మన్మధుని భార్య రతీదేవి అచటికి వెళ్ళి నవ్వుచూ సుకలతో ఇట్లు పలికెను. “మంగళకరురాలా! నీకు స్వాగతము. శుభమగుగాక! కంటికి నచ్చినదానిని అనుభవించి ఆనందించుము. మహానుభావుడైన ఇంద్రునికి నీ రూపమిష్టమైనది. నీకేదిష్టమో తెలుపుము. దానిని తెచ్చెదను. ఇందులో సందేహము లేదు. ఇట్లు కథను చెప్పుచూ సూతుడిట్లు పలికెను.
సుకలతో ఇట్లు పలుకగా ఆ ఇద్దరు స్త్రీలను చూచి సుకల ఆ రతితో ఇట్లు పలికెను. “నన్ను తీసుకొని మహాబుద్ధిమంతుడైన నా భర్త యాత్రలకు వెడలెను. నా భర్త ఉన్నచోటనే నేను భర్తతో కూడియున్నాను. నా ప్రీతి, కోరిక రేండూ అచటనే. నా ఈ శరీరము ఆశ్రయము లేనిదిగా తెలియుము.' ఆమె మాటలను వినిన రతి ప్రీతులు ఇద్దరూ సిగ్గుపడినవారై మహాబలుడైన మన్మధుడున్నచోటికి వెళ్ళిరి. ఇంద్రుని శరీరమునాశ్రయించి యున్నవాడు, కంటితో గురిచూచుచు ధనువును లాగుచున్న మహాబలుని కామునితో ఇట్లు పలికిరి. మహాప్రాజ్ఞా! ఈమె గెలువరానిది. నీ పౌరుషమును విడిచిపెట్టుము. ఈ సకల భర్తనే కోరుచున్నది. ఎపుడూ ఈమె పతివ్రతయే.
కామ ఉవాచ - మన్మధుడు పలికెను.
సుకలోవాచ - సుకల పలికెను.
‘దేవి! ఈ సకల మహానుభావుడైన ఇంద్రుని రూపమును చూచినపుడు నేను నా బాణముతో కొట్టెదను. సందేహము లేదు.” అంతట చక్కని వేషమును ధరించిన సురాధిపుడు మహాసౌందర్యవంతుడు ఆ దూతితో రతితో అనుసరించబడినవాడై గొప్ప విలాసముతో సకల భోగములు కలవాడై సర్వాభరణభూషితుడై దివ్య అంబరములను, మాల్యములను ధరించినవాడై దివ్యగంధానులేపనుడై రతీదేవితో కలిసి పతివ్రత అయిన సుకల ఉన్నచోటికి వచ్చెను. సత్యచారిణి మహానుభావురాలైన సుకలతో ఇట్లు పలికెను. 'నేను దూతి ముందర నీమీది ప్రీతితో నేను దూతను పంపితిని. నిన్ను సేవించుచు ఇక్కడికి వచ్చిన నన్ను ఎందుకు మన్నించుట లేదు?' ఇట్లు అడుగగా సుకల ఇట్లు పలికెను. 'మహానుభావా! నీకు శుభమగుగాక! నేను నా భర్త, పుత్రులైన మహానుభావులతో నిరంతరము రక్షింపబడుచున్నాను. నేను ఒంటరినే కాని సహాయులతో నున్నాను. నా కెవరి భయమూ లేదు. పూరుషాకారులు అయిన శూరులు నన్ను అంతటా రక్షించుచున్నారు. నేను నా పతి సేవలో మునిగియున్నాను గాన ఎక్కువగా మాటలాడదలచలేదు. నా కనులు నా భర్త కన్నులు ప్రసరించువరకు అన్ని వేళలా నా పతి సేవ చేయుచుందును. నాతో రమించుటకు నీవేల సిగ్గుపడుట లేదు. మరణమంటే కూడా భయపడకుండా వచ్చిన నీవెవరవు?'
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను.
సుకలోవాచ - సుకల పలికెను.
“ఈ వనమధ్యమునకు వచ్చిన నిన్ను మాత్రమే చూచుచున్నాను. నీవు మాత్రము నీ భర్త పుత్రులు శూరులున్నారని చెప్పుచున్నావు. నేను వారినెట్లు చూతును. వారిని నా ముందు చూపుము” అని ఇంద్రుడు పలుకగా సుకల ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను.
‘నా భర్త తన సకలవర్గమునకు ధైర్యము, బుద్ధి, జ్ఞానము, ప్రజ్ఞ అను వాటితో కూడిన సత్యమును అధిపతినిగా చేసి సకల ధర్మములనుండి చలించక నిత్యము వాటితో కూడియుండి ధర్మాత్ముడైన నా భర్త నన్నెపుడూ కాపాడుచున్నాడు. ధర్మము నన్ను ఎపుడూ ఇంద్రియ నిగ్రహ గుణములతో, శౌచములతో రక్షించుచున్నది. శాంతిక్షమలతో కూడిన సత్యము నా ముందుకు వచ్చియున్నది చూడుము. ఇక నా జ్ఞానము చాలా గొప్ప బలము కలది. గొప్ప కీర్తి కలది. నన్నెపుడూ విడిచిపెట్టదు. నేను దృఢమైన బంధములతో కట్టుబడియున్నాను. తన గుణములతో నా భర్త నా సమీపములోనే యున్నాడు. సత్యాదులందరూ నాకు చక్కని రక్షణను కల్పించియున్నారు. వారికి ధర్మము, లాభము, దమబుద్ధి, పరాక్రమములు నన్నెపుడూ రక్షించుచునే యున్నవి. అట్టి నన్ను బలముతో నీవేల ప్రార్ధించుచున్నావు. అసలు నీవెవరు? భయము లేకుండగా దూతతో కలిసి వచ్చియున్నావు. సత్యము, ధర్మము అట్లే పుణ్యము, జ్ఞానాదులు అతి బలవంతులు, నా భర్తకు సహాయకులు. నన్నెపుడూ నా ఇంటిలో రక్షించుచున్నారు. నేనిట్లు రక్షకలదానను. దమము, శాస్త్రి నా గుణములు. సాక్షాత్తుగా ఇంద్రుడు కూడా నన్ను గెలువజాలడు. అతిపరాక్రమము కలిగిన మన్మధుడు కూడా స్వయముగా వచ్చిననూ నేను ఎల్లపుడూ సత్యపాశబద్ధురాలను. సత్యమే నన్ను కాపాడుచున్నది. ఇంకొక రక్షణతో నాకు పనిలేదు. ఆ మన్మధుని బాణములు నాయెడ వ్యర్థములగును. ఇందులో సంశయముతో పనిలేదు. నా ధర్మాది భటులు నిన్ను వధించెదరు. నీవు దూరముగా వెళ్ళుము. పారిపొమ్ము. ఇక్కడ ఎక్కువసేపు ఉండకుము. నేను వారించిననూ ఇట్లే ఉన్నచో భస్మమయ్యెదవు.
నీవు ఒకవేళ నా భర్త లేకుండగా నా రూపమును చూచినచో అగ్ని కట్టెలను కాల్చినట్లు నిన్ను దహింపచేతును. ఇది వేరు కాదు. ఇట్లు సుకలా వాక్యములను విన్న ఇంద్రుడు మన్మధుని ఎదురుగా 'ఈమె పౌరుషమును చూడుము. నీ పౌరుషములతో యుద్దము చేయుము' అని పలికెను. వారందరూ ఎట్లు వచ్చిరో అట్లే మహాశాపభయార్డులై ఇంద్రాదులు తమ తమ స్థానములకు వెళ్ళిరి. అట్లు వారందరూ వెళ్ళిన తరువాత పతివ్రత అయిన ఆ సుకల పతిని ధ్యానించుచు పుణ్యభావముతో పుణ్యముతో కూడియున్న తన ఇంటికి సర్వతీర్థ స్వరూపమునకు సర్వయజ్ఞమయమైన ఇంటికి పతివ్రత అయిన సుకల చేరినది.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబది యెనిమిద - అధ్యాయము.
