పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
10 - అధ్యాయము
ఋషులు పలికిరి.
బ్రాహ్మణోత్తమా! అంతట హిరణ్యకశిపుడు మున్నగు దానవులందరు యుద్ధమున ఓడిన తరువాత ఏమి ప్రయత్నమును గావించిరో తెలుపుడు. మాకు వారి చరితమును విస్తరముగా తెలుపుడు. మేము దానినంతయూ వినగోరుచున్నాము.
సూతమహర్షి పలికెను.
అట్లు యుద్ధమున ఓడి గర్వము తొలగి బలహీనులై దుఃఖించుచు తండ్రియగు కశ్యపప్రజాపతివద్దకు వెడలి భక్తితో నమస్కరించి తండ్రితో ఇట్లు పలికిరి.
దానవులు పలికిరి.
ఓ బ్రాహ్మణోత్తమా! మేము దేవతలు నీ వీర్యమునుండి పుట్టినవారమే. కాని దానవులమైన మేము బలవీర్య పరాక్రమములు గలవారము. ఉపాయములను తెలిసినవారము. ధైర్యవంతులము. ఉద్యమశీలులము. మేము చాలమందిమి. దేవతలు కొద్దిమంది మాత్రమే. అయిననూ యుద్ధమున దేవతలెట్లు గెలుచుచున్నారు? మేమెందుకు ఓడుచున్నాము? ఒక్కొక్క దానవునికి మదించిన వేయి ఏనుగుల బలమున్నది. దేవతలకంత బలము లేదు. బలము తేజస్సులు కూడా మాకేఅధికముగా కలవు. అయిననూ దేవతలే గెలుచుచున్నారు. కావున కారణమును వివరించి మా సంశయమును తొలగించుడు.
కశ్యపమహర్షి పలికిరి.
పుత్రులారా! దేవతలందరు యుద్ధమున గెలుచుటకు కారణమును వినుడు. వీర్యమునుంచువాడు తండ్రి. తల్లి క్షేత్రము. ధరించుటలో రక్షించుటలో పోషించుటలో తల్లియే ప్రధానపాత్ర వహించును. పుత్రుడు విషమస్వభావుడైనపుడు తండ్రి ఏమి చేయగలుగును? ఈ విషయమున ముఖ్యమైనది కర్మయేయని నా అభిప్రాయము.
పాపసంబంధము, పుణ్యసంబంధము అని కర్మవలన కలుగు ఫలము రెండు విధములు. ఉత్తమ ధర్మము సత్యము నాశ్రయించియే యుండును. ఈ ధర్మము తపోధ్యానాదులతో కూడియుండును. ఇది తరించుటకు సాధనము. అన్నివేళలా పాపము పతనమునకే చెప్పబడినది. బలముపరివారము ఉత్తమ. వంశము ఇవన్నియున్ననూ పుణ్యము లేనిచో అట్టి బలము వ్యర్థమగును. పర్వత దుర్గములందున్న ఉన్నతవృక్షములు కూడా వాయువేగముతో కూకటివేళ్ళతో కూలిపోవును కదా! అట్లే సత్యధర్మములు లేనివారు నరకమును చేరెదరు. ఇది సకలప్రాణులకు సాధారణము. ఇహపరములలో తరింపచేయు ధర్మముతో కూడిన సత్యమును మీరు విడిచితిరి.
సత్యమును విడిచిన మీరు అధర్మమునాశ్రయించితిరి. సత్యము, ధర్మము, తపస్సులనుండి భ్రష్టులై దుఃఖసాగరమున పడుదురు. దేవతలు సత్యముతో కూడియున్నారు. శ్రేయస్సును పొందుచున్నారు. దేవతలు తపస్సుతో శాంతితో ఇంద్రియనిగ్రహముతో కూడియున్నారు. మంచి పుణ్యము కలిగియున్నారు. పాపరహితులుగానున్నారు. సత్యము, ధర్మము, తపస్సు, పుణ్యము ఉన్నచోట ఇంద్రియాధిపతియగు శ్రీమహావిష్ణువున్నచోట జయము కలుగును. సనాతనుడగు వాసుదేవుడు దేవతలకు సహాయముగా నున్నాడు. కావున సత్యధర్మములు కల దేవతలు జయించుచున్నారు.
పుత్రులారా! మీకు సాయము బలము, పౌరుషము, తపస్సు, సత్యము లేవు. విష్ణుసాయము కలిగి తపస్సు, బలము కలిగినవానికే జయము కలుగును అని ధర్మము తెలిసినవారు చెప్పెదరు. మీరు ధర్మహీనులు. తపస్సు, సత్యము లేనివారు. బలముతోనే ఇంద్రపదవిని పూర్వము పొందియున్నారు. మహాప్రాజ్ఞులారా! తపస్సు, ధర్మము, యశస్సు లేకుడా బలదర్పగుణములతో మాత్రమే ఇంద్రపదవి లభించజాలదు. ఒకవేళ ఇంద్రపదవిని పొందిననూ ఆ పదవినుండి భ్రష్టులగుదురు. కావున పుత్రులారా! మీరందరూ కలిసి తపస్సు చేయుడు. విరోధమును వీడి జ్ఞానము, ధ్యానము కలిగియుండుడు. శ్రీమహావిష్ణువుతో వైరము చేయకుడు. మీరిట్లు ఉండగలిగినచో మీరు ధన్యులగుదురు. అపుడు మీరందరూ పరమగు సిద్ధిని పొందగలుగుదురు. ఇట్లు కశ్యపుడు బోధించగా తండ్రి మాటలను వినిన దానవులందరూ కశ్యపునికి నమస్కరించి లేచి త్వరగా అందరూ కలిసి చక్కగా ఆలోచన కొనసాగించిరి.
అంతట ఆ దానవులతో హిరణ్యకశ్యపుడు ఇట్లు పలికెను. అన్ని కోరికలను తీర్చునది కష్టసాధ్యమగు తపమును చేయుదము. అపుడు హిరణ్యాక్షుడు ఇట్లు పలికెను. దారుణమగు తపమును గావించెదను. ఆ తపోబలముతో మూడులోకములను ఆక్రమించగలను. పాపబుద్దిగల గోవిందుని యుద్ధమున గెలిచి దేవతలందరిని వధించి ఇంద్రపదవిని చేరుకొందును.
బలి పలికెను.
దైత్యాధిపులారా! మీరిట్లు చేయుట తగదు. విష్ణువుతో వైరము నాశకారణము. దానములతో, ధర్మములతో, పుణ్యములతో, తపస్సులతో, యజ్ఞములనాచరించుటతో శ్రీహరిని పూజించి మానవులు సుఖమును పొందగలరు.
హిరణ్యకశిపురువాచ –
హిరణ్యకశిపుడు పలికెను.
నేనెప్పుడూ శ్రీహరిని ఆరాధించను. నా స్వభావమును విడిచి శత్రు సేవ చేయుట మరణముకంటే అధికమని పండితులు అంగీకరింతురు. నేను కాని, ఇతర దానవులు కాని విష్ణు సేవ చేయజాలరు. అట్లు పలికిన మహానుభావుడు, పితామహుడు అగు హిరణ్యకశ్యపునితో బలి ఇట్లు పలికెను. తత్త్వవేత్తలగు మునులు ధర్మశాస్త్రమున నిశ్చయించినది రాజనీతితో కూడియున్నది, శత్రువునకు సంబంధించిన ప్రధానముగా తెలియవలయును. తనను హీనునిగా శత్రువును బలవంతునిగా తెలిసి అతని ప్రక్కకే చేరి గెలుచు సమయము కొరకు ఎదురుచూచుచుండవలయును. ఎపుడు చీకటి దీపపు నీడలోనే నిలిచియుండును. నూనె తరిగిపోవుటను దీపబలము తరుగుటను చూచుచుండును. ఆ సమయమున వెలుగు తగ్గును చీకటి హెచ్చు. అట్లే దాగియుండి స్నేహమును చూపి శత్రువును ప్రసన్నుని గావించుకొనవలయును. దేవశత్రువులారా! ధర్మబుద్ధిగల దేవతలతో స్నేహము గావించవలయునని మొదట కశ్యపమహాముని చెప్పియున్నారు. కావున ఇంద్రియనిగ్రహముతో ఆ సలహాతో కార్యమునాచరించుము.
ఇట్లు బలి పలికిన ఆ మాటలను వినిన మహాప్రతాపవంతుడగు హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. 'పౌత్రుడా! నేనిట్లు నాకు అవమానమును చేసుకొనజాలను.' ఇతర బాంధవులు కూడా నయకోవిదుడగు బలితో ఇట్లు పలికిరి. బలి చెప్పినది పుణ్యకార్యమే కాని దేవతలకు మాత్రమే ప్రీతికరము. ఇంద్రునికి గౌరవప్రదము. దానవులకు భయంకరము. కావున మనము గొప్ప తపమునే ఆచరించెదము. తపముతో దేవతలను గెలిచి మన స్థానములను మనము తిరిగి గొనెదము. ఇట్లు అందరూ ఆలోచించుకొని బలిని నిరాకరించి మహారాక్షసులందరూ శ్రీమహావిష్ణువుతో వైరమును హృదయమున చేసి గిరిదుర్గములలో శిఖరములలో వారదరూ తపమును చేయసాగిరి. ఇట్లు ఆ రాక్షసులందరూ ప్రేమను విడిచి దృఢసంకల్పముతో కామక్రోధములను విడిచి ఆహారమును, అలసటను బోనాడి తపమునాచరించసాగిరి.
ఇది శ్రీపద్మమహాపురాణమున భూమిఖండమున దైత్యతపశ్చర్యా వర్ణనమనునది పదియ - అధ్యాయము.
