పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
55 - సుకలా సాధనే శక్రమదనయోః వివాద వర్ణనమ్
విష్ణురువాచ - విష్ణువు పలికెను.
దేవరాజైన ఇంద్రుడు సుకలా అభిప్రాయమును తెలుసుకొనినవాడై తనముందురనున్న మన్మధునితో ఇట్లు పలికెను. “ఈ సతి సత్యధ్యాననిష్ఠురాలు. ఈమెతో యుద్దమున నీవు గెలువజాలవు. ఈ సకల ధర్మమను ధనువును శ్రేష్ఠమైన ధర్మమను బాణమును తన చేతిలో ధరించి తన బలముతో గర్వించియున్న వీరునివలె యుద్ధరంగమున యుద్దము చేయుటకు నిలిచియున్నది. ఈమె కామపురుషార్థమును గెలుచుటకు సంకల్పించియున్నది. నీవు కూడా నీ పౌరుషమును చేయబూనుచున్నావు. ఈ సుకలాసతి ఈ రోజు నిన్ను గెలువజాలినది. ఇక ఇప్పుడు జరుగవలసినదానిని ఆలోచించవలయును. ఇదివరకు మహానుభావుడైన శంకరభగవానునిచే విరోధమును కల్పించుకొని ఇచటనే శంకరునిచే దగ్ధము చేయబడితివి. అట్టి నీ అకార్యమునకు ఫలముగా అనంగుడవైతివి. ఆ సత్యమును ఒకసారి స్మరించుకొనుము. నీవు ఆచరించిన వికర్మకు తగిన తీవ్రమైన ఫలమే నీకు లభించినది. ఇక ఇపుడు ఈ సాధ్వితో విరోధమును పెట్టుకొనినచో కుత్సితయోనిలో పుట్టెదవు. ఇది నిశ్చయము. ఈ మూడులోకములలో జ్ఞానులతో, మహాత్ములతో విరోధము పెట్టుకొనివారు ఆ కర్మఫలముగా దుష్కృతమునే అనుభవించెదరు. దుఃఖముతో పాటు రూపవినాశమును కూడా పొందెదరు. మనము చక్కగా ఆలోచించుకొని ఈ సాధ్విని విడిచి వెళ్ళెదము, సాధ్వి విషయక అపచారముతో పూర్వము నేను పాపమయము, అసహ్యమైన ఫలమును అనుభవించితిని. ఈ విషయము నీకు కూడా బాగుగా తెలుసును. గౌతమమహర్షితో శపించబడితిని. మేషవృషణుడనైతిని. అపుడు అక్కడ నీవు నన్ను విడిచివెళ్ళితివి. పతివ్రతల తేజఃప్రభావము సాటిలేనిది. ఆ ప్రభావమును బ్రహ్మ, సూర్యుడు కూడా సహించజాలరు. పూర్వము అనసూయాదేవి కూడా శపించినది. దాని ఫలితమే ఈ కుత్సితరూపము, దానినైనా కాపాడుకొనవలయును కదా! మాండవ్యశాపమువలన కౌండిన్య మహర్షికి ప్రాప్తించిన మృత్యువును అతని భార్య ఉదయించి మహావేగముగా సంచరించు సూర్యునే నిరోధించి ఆపివేసినది.
అత్రిమహర్షి భార్య సత్య పతివ్రత అయిన అనసూయాదేవి త్రిమూర్తులనే తన పుత్రులనుగా చేసుకొనెను. మన్మధా! ఈ విషయమును ఇంతకుమునుపు నీవు వినలేదా! సతీమతల్లులు సంస్కారముతో ఉందురు. ద్యుమత్సేన పుత్రి అయిన సావిత్రి మహాపతివ్రత యముడు గొనిపోయిన తన భర్తను అశ్వపతి పుత్రుని సత్యవంతుని యమునినుండి మరల గొనివచ్చినది. ఇట్లు తన పాతివ్రత్యమును ప్రసిద్దిని పొందించినది. అగ్నిశిఖను ఎవడు స్పృశించగలడు? ఏ మూర్ఖుడైనా పెద్దరాతిబండను మెడకు కట్టుకొని భుజములతో సముద్రమును దాటగలడా? అట్లే పరమపతివ్రతను ఎవ్వడు తన వశములోనికి గొనితేగలడు? కామునికి చక్కగా నీతిని బోధించుటకు ఇంద్రుడు పలికిన మాటలను వినిన మన్మధుడు దేవేన్దునితో ఇట్లు పలికెను.
‘ఇంద్రా! నీ ఆజ్ఞవలననేనిచటికి వచ్చితిని. ఇపుడు మీరు ధైర్యమును, మైత్రిని, పురుషార్థమును విడిచిపెట్టి మీరు తలపెట్టిన కార్యమును కూడా విడిచిపెట్టి, సత్యము లేకుండగా భయముతో ఇపుడు నాతో మాటలాడుచున్నారు. సురేశా! మీ మాటతో ఇపుడు ఈ పనిని మధ్యలో విడిచి వెళ్ళినచో ఈ లోకములో నా కీర్తి నశించునని తెలియుము. నేను మానవిహీనుడనని, వ్యర్థ ప్రతిజ్ఞలు చేయువాడనని ఈ స్త్రీతో ఓడినవాడని, నన్ను అందరూ అందురు. ఇంద్రా! నేను పూర్వము దేవతలను, దానవులను, తపస్సుతో కూడిన మునీన్తులను ఓడించితిని. ఇపుడు వారందరు భయంకరుడైన ఈ మన్మధుడు ఒక స్త్రీతో ఓడిపోయెనని నన్ను అపహాస్యము చేతురు. ఇంద్రుడు అందరికంటే గౌరవించదగినవాడు. కావున ఇంద్రా! తమతో కలిసి వెళ్ళేదను. ఈమె బలమును, తేజస్సును, ధైర్యమును నశింపచేతును. ఇంద్రా! మీరెందుకు భయపడుతున్నారు?' ఇట్లు ఇంద్రుని బోధించి చక్కని పుష్పశరమును, ధనువును మన్మధుడు తీసుకొనెను. తన ముందున్న క్రీడతో మాయను ఏర్పరచి నీవు ముందు వెడలుము. వైశ్యుని భార్యను సుకలను పరమపవిత్రురాలను సత్యముననుండుదానను ధర్మమును, గుణములను తెలిసినదానను ఇక్కడినుండి వెళ్ళి నేను చెప్పిన సాయమును చేయుము. ఇట్లు మన్మధుడు క్రీడతో మాటలాడి దగ్గరలోనున్న ప్రీతిని పిలిచెను. నీవు నా ఉత్తమ కార్యమును చేయవలయును. ఈ సుకలను చక్కని స్నేహముతో ముంచివేయుము. ఈ సుకలను ఇంద్రుని చూచి స్నేహము కలదిగా అందమైన కన్నులు గలది ప్రేమతో మెలగవలయును. ఆయా ప్రభావములు, గుణములుకల వాక్యములతో ప్రియసఖులారా! ఈమెను వశము చేసుకొనుము. ఓ మిత్రమా! త్వరగా వెళ్ళుము. కార్యమును సాధించుము." మాయతో ఆనందకరమైన రూపమును ఏర్పరచుకొని పూలు పండ్లు కోకిలల జాతులు తుమ్మెదల ఝంకారములు కలిగి వెళ్ళుము. ఇట్లు వీరుని పిలిచి చక్కని రూపగుణము కలది, రసాయనమైన మకరందమును వసంతాది ఋతువులలో తమ తమ పనులలో ముందరకి పంపి మరల మన్మధుడు ఇట్లు మూడులోకములను మోహింపచేయు గొప్ప సైన్యములను పంపి, ఇంద్రునితో కలిసి మహాసతియైన సుకలను సంమోహింపచేయుటకు బయలుదేరెను.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబది యైద - అధ్యాయము.
