పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
67 - మనుష్యకృత సుకృత దుష్కృత కర్మవిపాకము
యయాతిరువాచ - యయాతి పలికెను.
మాతలిరువాచ - మాతలి పలికెను.
“మా అదృష్టవశమున మీ దర్శనము నాకు కలిగినది. ఇంద్రునితో కలియు అదృష్టము కలిగినది. ఇది నాకు ఉత్తమ శ్రేయస్సు. మర్త్యలోకమున మానవులు పరమ భయంకరమైన పాపములను చేయుచుందురు. అట్టివారి కర్మవిపాకమును ఇపుడు నాకు చెప్పుడు.” అనగా మాతలి ఇట్లు పలికెను.
‘పాపాచార లక్షణమును చెప్పెదను. వినుడు. ఆ లక్షణమును వినినచో ఈ లోకమున గొప్ప జ్ఞానము కలుగును. వేదములను నిందించెదరు. బ్రాహ్మణాచారమును అసహ్యించుకొనెదరు. సాధువులందరిని పీడించెదరు. ఇంతటి మహాపాతకము ప్రాయశ్చిత్తముతో తొలగును. తమ కులాచారమును విడిచి ఇతరాచారమును ఆశ్రయించుచుందురు. కృత్యములు తెలిసినవారు ఇది ఘోరపాతకమని చెప్పుచున్నారు. తలిదండ్రులను నిందించుట, చెల్లెలు, అక్క మొదలగువారిని కొట్టుట, మేనత్తలను నిందించుట గొప్ప పాపము. ఇది నిశ్చయము. శ్రాద్దకాలము వచ్చినపుడు అయిదు కోశుల దూరములో నున్న జామాతను (అల్లుని), అట్లే దౌహితృని విడిచి అట్లే చెల్లెలు, చెల్లెలు కొడుకును ప్రవర్తించి కామముతో క్రోధముతో భయముతో కాని ఇతరుని భుజింపచేసినచో ఆ శ్రాద్దమున పితరులు భుజించరు. దేవతలు భుజింపరు. అట్లు చేసినచో పితృహత్యతో సమానమైన పాపమిది. దానకాలము సంభవించినపుడు బ్రాహ్మణుడు వచ్చినపుడు భూరిదానమును విడిచి చాలామందికి దానమిత్తురు. వారిలో ఒకరికే ఇచ్చి ఇతరులకీయనిచో ఇది ఘోరపాతకము. ఇచ్చిన దానమును కూడా వ్యర్థము చేయును.
యజమానగృహములో సేవ చేయువాడు అచటనే యున్న తనవారైన బ్రాహ్మణులను విడిచి చేయు దానము దానము కానేరదు. తమను ఆశ్రయించినవానిని ధర్మాచారములు కల బ్రాహ్మణులు అన్ని ఉపాయములతో చాలా చక్కని దానములతో పోషించవలయును. ఆ విద్వాంసుని పూజించిన తరువాత అపుడే వచ్చిన బ్రాహ్మణుని కూడా ఎల్లపుడూ అర్చించవలయును. అతనిని విడిచి ఇతర బ్రాహ్మణునికి దానము చేసినచో ఆ దానము హోమము అంతయూ నిష్పలమగును. ఇందులో సందేహమే లేదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఈ నలువురు అన్ని పుణ్యకాలములలో తమను ఆశ్రయించియున్న బ్రాహ్మణుని పూజించవలయును. అట్టివాడు మూర్ఖుడైనను పండితుడైననూ పూజించవలయును. దాని ఫలితమును వినుము. అశ్వమేధయజ్ఞఫలము అతనికి కలుగును. శక్తి ఉన్నదానిని ఏ కారణముతోనైననూ చేయకుండగా ఉండరాదు. శ్రాద్ధకర్మలో ఆ కాలమునకు ఇతర విప్రులు వచ్చినచో ఆ ఇద్దరిని వచ్చినవారిని అదివరకే ఉన్నవారిని భోజన వస్త్ర తాంబూల దక్షిణలతో పూజించినచో అతని పితృదేవతలు సంతోషింతురు. శ్రాద్ధమున భుజించినవానికి ఎల్లపుడూ దానము దక్షిణ ఈయవలయును. శ్రాద్ధకర్త అట్లేయనిచో అతనికి గోహత్యాపాపము సంభవించును. ఈ ఇద్దరినీ శ్రద్దతో పూజించవలయును. ఒకవేళ ధనము లేనిచో అందులో ఒకరిని పూజించవలయును. వ్యతీపాత్రలో వైధృతిలో అమావాస్యనాడు క్షయదినమున అపరపక్షమున బ్రాహ్మణాది మూడు వర్ణములవారు శ్రాద్ధమును ఆచరించవలయును. యజ్ఞమున ఋత్విక్కులను పూజించవలయును. ఎల్లపుడు శ్రాద్దదానమునకు విప్రులను పూజించవలయును. తెలియని బ్రాహ్మణుని పూజించరాదు. త్రిపురుషపర్యన్తము తెలిసినవానినే శ్రాద్దమున పూజింపవలయును.
అటువంటి విప్రుని నిమగ్రించవలయునని ఆచారము కూడా. కులము తెలియనపుడు ఆచారముతో ఆలోచించవలయును. శ్రాద్దదానము చేయవలసి ఉన్నపుడు విశుద్దుడైననూ మూర్ఖుడైననూ తెలియనివాడైననూ వేదవేదాబ్దపారగుడైననూ శ్రాద్దదానము చేయవలయును గాన తప్పక నిమగ్రించవలయును. అపూర్వుని అనగా ఏమీ తెలియనివానికే ఆతిథ్యమునొసంగవలయును. అట్లు చేయనిచో అతను పాపియగును. నరకమును పొందును. కావున శ్రాద్ధమున దానమున పర్వదినములలో బ్రాహ్మణుని పూజించవలయును. మొదట బ్రాహ్మణుని పరీక్షించి తరువాత శ్రాద్ధమున దానమున ఆహ్వానించవలయును. బ్రాహ్మణుని పూజించని ఇంటిలో పితృదేవతలు భుజించరు. విప్రుడు లేని శ్రాద్ధమునుండి పితరులు శపించి వెళ్ళిపోదురు. అట్టివాడు మహాపాపియగును. బ్రహ్మఘాతకుడందురు. పిత్రాచారమును విడిచి ప్రవర్తించువాడు సర్వధర్మ బహిష్కృతుడై మహాపాపి అనబడును. శివాచారమును గాని భోగమునిచ్చు వైష్ణవాచారమును గాని విడచువాడు, బ్రాహ్మణుని ధర్మమును నిందించువారు పాపమును పెంచువారుగా తెలియవలయును. శివాచారమును విడుచువారు, శివుని భక్తులను ద్వేషించువారు, శ్రీహరిని ద్వేషించువారు, బ్రాహ్మణులను ద్వేషించువారు, ఆచారమును నిందించువారు మహాపాతకములను ఆచరించువారు. పూజ్యులలో మొదటివాడైన శ్రీహరిని పరజ్ఞానమును పుణ్యాత్ముని భాగవతోత్తముని విష్ణుపురాణమును హరివంశమును మత్స్య కూర్మ పురాణములను పాద్మపురాణములను పూజించువారికి కలుగు శ్రేయస్సును చెప్పెదను. అట్టి వారు ప్రత్యక్షముగా శ్రీమన్నారాయణుని పూజించినవారగుదురు. కావున శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైష్ణవజ్ఞానమును పూజించవలయును. దేవస్థానములోనున్న విష్ణు కథలకు సంబంధించిన పుస్తకమును పూజించినచో కమలాపతిని పూజించినవాడగును.
హరిజ్ఞానమును పూజించకనే వ్రాయువాడు, చదువువాడు, ఆ హరి విషయమును తెలియకనే దానము చేయువారు, వినువారు, ఉపచర్యలు చేయువారు, లోభముతో క్రీడించువారు, కుజ్ఞాన నియమముతో సంస్కరించని ప్రదేశములలో యధేష్టముగా స్థాపించువారు నరకమునకు వెళ్ళెదరు. తమకు క్షేమదాయకమైన శ్రీహరి జ్ఞానమును ప్రత్యక్షముగా ప్రకాశించవలయును. అధ్యయనము చేయువాడు సమర్థుడైననూ ప్రమాదమును చేయువాడు, అపవిత్రముగా నుండువాడు, అపవిత్రమైన స్థానమున నుంచువాడు, అట్టిచోట చెప్పువాడు, వినువాడు ఇదంతయూ జ్ఞాననిందతో సమానము. గురువును పూజించకుండగనే శాస్త్రమును వినదలచినవాడు, గురుసేవను చేయనివాడు, ఆజ్ఞాభంగమును ఉద్దేశపూర్వకముగా చేయువాడు, గురువాక్యమును అభినందించనివాడు, ఉత్తరమును చెప్పువాడు, చేయదగిన కార్యమునుపేక్షించువాడు, ఆర్తుడైన గురువును, శక్తి తగ్గిన గురువును, దేశాన్తరమునకు బయలుదేరినవానిని, ప్రసిద్ధుని, శత్రువుల చేత అవమానించబడినవానిని, పురాణమును చదువువానిని విడిచిన పాపాత్మునకు 14 మన్వన్తరకాలములు అనగా నాలుగువేల యుగములు కుంభీపాకనరకము సంభవించును. పురాణమును చదువుచున్న గురువును ఉపేక్షించువాడు చేసిన పాపము కూడా చాలాకాలము వరకు నరకమును లభింపచేయును. భార్యయందు పుత్రులయందు మిత్రులయందు అవమానమును కలుగుచేయువాడు కూడా గురునిందా సమమైన పాపమును పొందును. బ్రహ్మహత్య చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, సురాపానము చేసినవాడు, గురుతల్పమును పొందినవాడు మహాపాపులు అయ్యెదరు. ఇట్టివారితో కలిసి ఉండెడివారు కూడా మహాపాతకియ్యగును. క్రోధముతో కాని, ద్వేషముతో కాని, భయముతో కాని, లోభముతో కాని విశ్లేషించి బ్రాహ్మణుని మర్మములను భేదించునట్లు మాటలాడువాడు కూడా బ్రాహ్మణహంతకుడేయగును.
ఏమీలేనివానిని, యాచించు బ్రాహ్మణుని పిలిచి, తరువాత లేదని చెప్పువాడు బ్రహ్మఘాతకుడు. తన విద్యాభిమానముతో బ్రాహ్మణుని తేజోహీనుని చేయువాడు, ఉదాసీనులు, సభామధ్యలో అవమానించువాడు, కూడా బ్రహ్మఘాతకుడనబడును. అబద్ధముతో తనకు లేని గుణములను ఉన్నట్లుగా చెప్పుకొని తనకు లేని ఉత్కర్షను చెప్పుకొనువాడు గురువును ద్వేషించువాడు బ్రహ్మఘాతకుడగును. ఆకలిదప్పులతో తపించు దేహము కలవారికి అన్నమును, జలమును కోరువానికి విఘ్నమును చేయువాడు బ్రహ్మఘాతకుడగును. కొండెములను చెప్పువాడు లోకుల దోషములను వెతుకుటలో ఆసక్తికలవాడు, ఇతరులను కలతపరచువాడు, క్రూరుడు, బ్రహ్మఘాతకుడగును. దేవతలకు, ద్విజులకు, గోవులకు పూర్వమిచ్చిన భూమిని కాలవశములో నశించినదానిని హరించువాడు బ్రహ్మఘాతకుడగును. బ్రాహ్మణులు దాచమని ఉంచిన బ్రాహ్మణధనమును హరించువానికి బ్రహ్మహత్యాసమమైన పాపము చేరును. అగ్నిహోత్రమును పంచయజ్ఞాదికర్మలను విడిచినవాడు తలిదండ్రుల విషయమున గురువుల విషయమున అబద్ధపు సాక్ష్యమును చెప్పువాడు శివభక్తులకు అప్రియమునాచరించువాడు, తినకూడనివానిని తినువాడు, వనములో ఏ అపరాధములను చేయని ప్రాణులను వధించుట, గోశాలలో అరణ్యములో పురములో గ్రామములో అగ్ని పెట్టి తగులపెట్టుట ఈ పాపములన్నీ సురాపానపాపముతో సమానములుగా తెలియవలయును.
దీనుల ధనమును హరించుట, పరుల స్త్రీలను, పరుల గుఱ్ఱములను, యేనుగులను, గోవులను, భూములను, వెండిని, వస్త్రములను, ఓషధులను, రసములను, చందన అగరు కర్పూర కస్తూరీ పట్టవాసములను, పరులు దాచి ఉంచిన ధనమును హరించుట, బంగారమును దొంగిలించినదానితో సమానము. వరునకు యోగ్యురాలైన కన్యను సదృశవరునకు ఈయకుండుట, పుత్రుల మిత్రుల భార్యలతో రమించుట, సోదరితో రమించుట, కుమారీరమణము అన్యజ స్త్రీని సేవించుట సవర్ణురాలితో రమించుట ఇవి గురుతల్పపాపసమములు. మహాపాతకములతో సమానములుగా చెప్పబడిన పాపములు పాపములనబడును. వాటికంటే తక్కువవాటికి ఉపపాతకమని పేరు.
బ్రాహ్మణునకు దానము చేసెదనని ప్రతిజ్ఞ చేసి తరువాత ఈయనివాడు, ఆ బ్రాహ్మణుడు మరచిపోయిననూ ఆ రెండు ఉపపాతకములు. బ్రాహ్మణుల ద్రవ్యమును హరించుట, మర్యాదను అతిక్రమించుట, అతిమానము, అతికోపము, దాంభికత్వము, కృతఘ్నత ఇతర విషయములయందాసక్తి పిసినారితనము వంచనము మత్సరము పరుల భార్యలతో రమించుట సాధ్వులను కన్యలను చెరచుట ఏ స్తీచే పరివిత్తి లేక పరివేత్త యగునో (అన్న పెళ్ళి కాకుండగా తమ్ముడు చేసుకొనినచో పరివేత్త, అక్క వివాహము కాకుండగా చెల్లెలు చేసుకొనినచో పరివీత్త అనబడును) అట్టివారికి కన్యాదానము చేయుట, అట్టివారితో యజ్ఞము చేయించుట పుత్రమిత్ర కళత్రములు లేని యజమానిని విడుచుట భార్యా పరిత్యాగము తపస్వుల సాధువుల పరిత్యాగము గోవులను, క్షత్రియులను, వైశ్యులను, స్త్రీలను, శూద్రులను చంపుట, శివాలయములను, వృక్షములను, పుష్పారామములను నశింపచేయుట ఆశ్రమములోనుండువారికి కొద్ది పీడనైనా ఆచరించుట, వారి భృత్యులకు పరివర్గమునకు పశుధాన్య ధనములకు హాని చేయుట, వస్త్ర ధాన్య పశువులను దొంగిలించుట, యాగము చేయదగనివారితో చేయించుట, యజ్ఞశాలను, ఆరామములను తటాకములను భార్యాపుత్రులను అమ్ముట, తీర్థయాత్రలను ఉపవాసములను వ్రతములను సత్కర్మలను స్త్రీధనముతో ఆచరించుట, స్త్రీల వలన లభించిన అన్నముతో జీవించుట, తన ధర్మమును నిందించుట, ఇతర ధర్మములను పొగడుట, పరుల దోషములను చెప్పువాడు, పరుల లోపములను వెదకువాడు, పరుల ద్రవ్యమును అభిలషించువాడు, పరుల భార్యలను ఆసక్తితో చూచువాడు, వీరందరు గోవును చంపినవారితో సమానులుగా పరిగణించబడుదురు.
సర్వశాస్త్రములను ఉల్లంఘించువాడు, గోవులను హరించువాడు, గోవులను అమ్మువాడు, దయలేనివాడు, సేవకులను పశువులను ఎక్కువగా శాసించువాడు అబద్దములాడువాడు, ఇతరులు అబద్దములాడుచుండగా వినువాడు, స్వామిద్రోహమును గురుద్రోహమును చేయువాడు మాయావి, చపలుడు శఠుడు, ఆకలిగొన్న భార్యాపుత్రులను మిత్రులను బాలులను వృద్ధులను కృశులను రోగులను భృత్యులను అతిథులను బంధువులను విడిచి తినువాడు, తాను మృష్టాన్నమును భుజించుచు ఇతరులకు సామాన్య అన్నమును కూడా పెట్టనివాడు విడిగా వండుకొనువాడుగా బ్రహ్మతత్త్వము తెలిసినవారిలో నిందించదగినవానిగా తెలియవలయును. తనకు తానుగా నియమముల నేర్పరచుకొని, ఇంద్రియ జయము లేక విడిచినవాడు, మద్యపానము చేసినవారితో కలిసుండువాడు, ప్రవ్రాజ్యగామి క్షయరోగముచే బాధపడుతున్న గోవును ఆకలిదప్పులచే అలమటించు గోవును ప్రయత్నపూర్వకముగా రక్షించనివారు గోహంతకులుగా నరకులుగా తెలియవలయును. సకల పాపములందు ఆసక్తులైనవారు చతుష్పాజ్జంతువుల క్షేత్రములను భేదించువారు, సాధువులను విప్రులను గురువులను గోవులను కొట్టువారు, తప్పు చేయని స్త్రీని కొట్టువారు, సోమరితనముతో నిండిన సర్వావయవములు కలవాడై మాటిమాటికి నిదురించువాడు, బలహీనులను పోషించనివాడు, తప్పిపోయినవారిని వెతుకనివారు, ఎక్కువ బరువుతో పీడించువారు గాయపడినవారిని బరువును మోయించువారు అన్ని పాపములందు ఆసక్తికలవారు, ఆసక్తి కలవారితో కలిసి భుజించువారు, అంగభంగముకలవారిని గాయపడినవారిని రోగార్తులను గోవును ఆకలిగొనినదానిని ప్రయత్నపూర్వకముగా పోషించనివారు నారకులుగా చెప్పబడుచుందురు. పాపులు వృషభముల వృషణములను కొట్టువారు, గోవులను దూడలను బంధించువారు మహానారకులుగా చెప్పబడుచుందురు. ఆకలిదప్పులతో అలసటతో పీడించబడుచు ఆశతో వచ్చినవారిని అతిథిని ఆదరించనివారు నరకమునకు వెళ్ళేదరు. అనాధను వికలుని దీనుని బాలుని వృద్దుని ఎక్కువగా బాధపడువారిని దయచూపనివాడు మూఢులు నరకమును చేరెదరు. మేకలను దున్నపోతులను గేదెలను పోషించువాడు, శూద్రులకు వృషలీపతి శూద్రుడు బ్రాహ్మణుని క్షత్రియుని ఆచారములో నుండువాడు శిల్పులు వడ్రంగి బట్టల నేయువాడు వైద్యులు దేవలకులు భృతకులు అమాత్య కర్మలనాచరించువారు అందరూ నరకమునకు వెళ్ళెదరు. శాస్త్రవిధిని అతిక్రమించి స్వేచ్ఛగా ప్రవర్తించువారు స్వేచ్ఛగా పన్నును తీసుకొనువారు, వ్యర్థముగా దండించువారు నరకములో బాధపడుచుందురు. వంచకులు, జూదరులు, అధికారులు, తస్కరులు మొదలగువారిచే పీడించబడువారు ఎవని రాజ్యములో నుందురో అట్టి రాజు నరకములో పీడించబడును. అన్యాయముగా ప్రవర్తించు రాజునుండి దానము తీసుకొనువారు కూడా ఘోరమైన నరకమును పొందెదరు. ఇందులో సందేహము లేదు. పరదార రతులు చోరులుండు పాపము ఆ రాజునదే. దొంగలనుండి స్త్రీరతులనుండి రక్షించని రాజు నుండి దానము తీసుకొనుట ఘోరపాపము. దొంగ కానివానిని దొంగగా, దొంగను దొంగ కానివానిగా విచారించకనే నిర్ణయించు రాజు కూడా నరకమును పొందును.
నెయ్యి నూనె అన్నము పానీయము మద్యము మాంసము సుర ఆసవమును బెల్లమును, చెరకును, శాకాదులను పెరుగును, మూలమును, తృణమును కాష్టమును పుష్పములను పత్రమును, కాంస్యమును, రజతమును, పాదరక్షలను, ఛత్రమును, కటకమును, పల్లకిని ఆసనమును, రాగి సీసము తగరు, కాంస్య శంఖాధ్యమును, జలమునుండి పుట్టు వస్తువులను, వారిత్రమును, వేణువును, వంశాధ్యమును, గృహోపకరణములను పట్టు, నూలు నార రంగ పదోద్భవ వస్తువులను, పత్తిని సూక్ష్మ వస్త్రములను లోభముతో హరించువారు ఇట్టి వివిధ వస్తువులను హరించువారు త్వరగా నరకములను పొందెదరు. చిన్న వస్తువులను హరించువారు కూడా పరద్రవ్యము ఆవగింజంత హరించిననూ నరకమునకు వెళ్ళును. ఇందులో సందేహము లేదు. ఇట్టి పాపములు చేసినవాడు మరణించిన తరువాత శరీరమునకు పీడ కొరకు మొదటి ఆకారమును పొందును. అట్టి శరీరములో నున్నవారు యమాజ్ఞతో యమలోకమునకు వెళ్ళేదరు. మహాభయంకరులైన యమదూతలచే గొనిపోబడుచున్నవారై దుఃఖించుచుందురు. అధర్మమును నియమముగా నాచరించువారు దేవతార్యజ్ మనుష్యులలో ఎవరైననూ వారిని భయంకరమైన బాధలచే యమధర్మరాజు శిక్షించును. సహజముగా వినయాచారము గలవారైనను పొరబాటున తప్పుచేసినవారిని గురువు శాసించును. అట్టివారిని యముడు చూడడు. పరదారలతో రమించువారిని, దొంగతనము చేయువారిని అన్యాయముగా వ్యవహరించువారిని రాజు శిక్షించును. దాగియుండువారిని యమధర్మరాజు శిక్షించును. కావున చేసిన పాపమునకు తప్పక ప్రాయశ్చిత్తమును ఆచరించవలయును. అనుభవించకుండా పాపము కోటి కల్పములకైననూ నశించదు. కాయముతో మనస్సుతో వాక్కుతో కర్మ తాను చేసిననూ చేయించిననూ ఆమోదించిననూ అట్టివానికి అధోగతి తప్పదు. ఇట్లు మూడురకముల పాపములను సంక్షేపముగా చెప్పియుంటిమి. పాపకర్మలైన నరులుగా వాటి చిత్రవిచిత్రములని చెప్పబడుచున్నవి. రాజా! ఇట్లు నీకు విస్తరముగా అధర్మ ఫలములను చెప్పితిని. ఇంకా ఏమి చెప్పవలయునో నాకు తెలుపుము. అధర్మ ఫలమును చెప్పితిని. ఇక ఇపుడు ధర్మఫలమును కూడా చెప్పెదను. ఇట్లు సర్వవత్సలుడైన రాజుతో మాతలి చెప్పెను. ఇది ధర్మప్రసంగములో మాతలి మహానుభావుడు ఇదంతయూ వివరించెను.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున పితృతీర్థవర్ణనమున యయాతి చరిత్రలో అరువది ఏడ - అధ్యాయము.
