పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
51 - పద్మావత్యాః పతిగృహం ప్రేషణమ్
బ్రాహ్మణ్యువాచ - బ్రాహ్మణి పలికెను.
దురాచారుడు, పాపాత్ముడైన గోభిలుడు వెళ్ళిన తరువాత పద్మావతీదేవి గొప్ప దుఃఖముతో రోదించెను. పద్మావతీ రోదనమును వినిన చెలులందరు ఆ రాజకన్యను అడిగిరి. నీకు శుభమగుగాక! ఎందుకు రోదించుచున్నావు? జరిగినదానిని తెలుపుము. మధురాధిపతి మహారాజు నిన్ను ప్రియా రమ్ము అని పిలిచినవాడు ఎక్కడికి వెళ్ళినాడు? మాకు చెప్పుము. అంతట పద్మావతి మాటిమాటికి రోదించుచు వారితో దోషమువలన జరిగినదంతా తెలిపెను. అట్లు చెప్పి దుఃఖముతో వణుకుచున్న పద్మావతిని వారు తండ్రి ఇంటికి గొనిపోయిరి. ఆ చెలులందరూ తల్లిముందు జరిగినదంతా తెలిపిరి. తల్లి అంతా విని భర్తవద్దకు వెళ్ళినది. కూతురు వృత్తాంతమునంతయు భర్తకు నివేదించినది. దానిని వినిన మహారాజు మహాదుఃఖము కలవాడాయెను. వాహనములను, వస్త్రములను ఇచ్చి పరివారముతో పాటు మధురానగరమునకు పంపెను. పద్మావతి భర్తృమందిరమునకు వెడలెను. పద్మావతి తల్లిదండ్రులు సుతాదోషమును కప్పిపుచ్చిరి. ధర్మాత్ముడైన ఉగ్రసేనుడు వచ్చిన పద్మావతిని చూచి సంతోషించెను. ఇట్లు పలికెను. “వరాననా! నీవు లేనిదే బ్రతుకజాలను. నీ గుణములతో, శీలముతో, అన్నివేళలా సత్యమైన భక్తితో పతి దేవతగా భావించు స్వభావముతో నాకు బాగా నచ్చినావు.” ఇట్లు మాటలాడి ఆ ప్రియురాలితో రాజశ్రేష్ఠుడైన ఆ ఉగ్రసేనుడు ఆమెతో రమించెను.
సర్వలోక భయంకరమైన గర్భము పద్మావతీ ఉదరములో పెరుగసాగెను. ఆ గర్భమునకు కారణము పద్మావతికి తెలియును. తన ఉదరములో పెరుగుచున్న గర్భమును గురించి రాత్రింబవళ్ళు విచారించుచు లోకనాశకరమైన ఈ గర్భములోని శిశువు పుట్టినందున నాకేమి ప్రయోజనము? ఇపుడు ఈ దుష్టపుత్రుని పుట్టుకవలన నాకేమి ప్రయోజనము లేదు. అని ఆలోచించి గర్భపాతమునకు కావలసిన ఓషధిని అడుగుచుండెను. ప్రతిదినము గర్భపాతమునకు మహౌషధిని అన్వేషించుచుండెను. గర్భపాతమునకు చాలా ఉపాయములు చేసినది. అయిననూ సర్వలోకభయజ్కరమైన దారుణ గర్భము పెరుగుచునేయుండెను. అంతలో ఆ గర్భము తల్లియైన పద్మావతితో ఇట్లు మాటలాడెను. “తల్లీ! నీవు ప్రతిదినము ఓషధులతో ఎందుకు కష్టపడుచున్నావు, ఆయువు పుణ్యముతో పెరుగును. పాపముతో అల్పాయువు అగును. ఆత్మకర్మవిపాకముతో బ్రతుకుచుందురు. మరణింతురు. ఈ భూమండలమున వేరే ఆమగర్భములు అపక్వములుగానే గతించిపోవును. ఎన్నో గర్బములు పుట్టినవెంటనే నశించును. మరికొన్ని యౌవనమువరకుండి గతించును. బాలులు, వృద్ధులు, యువకులు ఆయుర్వశముననుందురు. అందరూ కర్మవిపాకముతో బ్రతుకుచుందురు. మరణించుచుందురు. ఆ ఫలితమునకు ఓషధులు, మన్తములు, దేవతలు నిమిత్తములగును. ఇందులో సందేహము లేదు. నీవు నేనెటువంటివాడినో తెలియనే తెలియవు. పూర్వము మహాబలవంతుడైన కాలనేమిని నీవు చూసి లేదా వినియుందువు. దానవులందరిలో మహాపరాక్రమము కలవాడను, మూడు లోకములకు భయమును కలిగించువాడను. నేను పూర్వము దేవాసురుల గొప్ప యుద్ధములో విష్ణువుచేత చంపబడితిని. ఆ వైరమును సాధించుటకు ఇపుడు నీ ఉదరమున ప్రవేశించితిని. మాతా! ప్రతిదినము ఇట్లు సాహసమును, శ్రమను చేయకుము.
ఇట్లు తల్లితో పలికి ఆ గర్భము విరమించెను. పద్మావతి గర్భపాతోద్యమమును విడిచి గొప్ప దుఃఖమును అనుభవించెను. కొన్ని దశాబ్దములవరకు ఆ గర్భము వృద్ధిపొందెను. ఆ తరువాత అతను పుట్టెను. అతనే మహాతేజోవంతుడైన మహాబలవంతుడైన కంసుడాయెను. అతను లోకములలోని ప్రజలను భయపెట్టెను. తరువాత వాసుదేవునిచే వధించబడి మోక్షమును పొందెను. ఇందులో సంశయము లేదు. ప్రియా ఇట్లు నేను వింటిని. జరుగవలసినది జరుగును. అన్ని పురాణములలో నిశ్చయించబడినదే నీకు చెప్పితిని. తండ్రి ఇంటిలోనున్న ఇట్లు నాశమును పొందును. కన్యయందు మోహముతో గృహావాసమును చేయించరాదు. ఈ మహాపాపురాలు, దుష్టురాలైన కన్యను విడిచిపెట్టే స్థిరముగానుందుము. భయంకరుడైన మహాపాపరూప దుఃఖమును పొందవలసి వచ్చినది. ప్రియా! ఈ లోకమున శ్రేయస్కరమైనదానిని నాతో కలిసి అనుభవించుము.
శూకర్యువాచ - శూకరి పలికెను.
చక్కని ఆలోచనతో కూడియున్న ఈ మాటను వినిన ఆ బ్రాహ్మణోత్తముడు నన్ను పరిత్యజించతలచెను. అపుడు నన్ను పిలిచెను. సకలాభరణములు, వస్త్రములు నాకిచ్చెను. 'నీ పాపపు పనుల వలననే ద్విజోత్తముడైన శివశర్మ వెడలిపోయెను. నీవు దుష్టురాలవు, కులదోషకరురాలవు. నీ భర్త ఉన్నచోటికి వెళ్ళుము. ఇందులో సందేహము వలదు. లేదా నీకు నచ్చిన ప్రదేశమునకు వెళ్ళుము.' ఇట్లు నా తల్లి తండ్రి కుటుంబమువారు చెప్పి నన్ను విడిచిపెట్టిరి. నేను కూడా సిగ్గువిడిచి త్వరగా వెళ్ళితిని. శుభకరురాలా! నేనెక్కడా సుఖవాసస్థానమును పొందజాలకపోతిని. నన్ను లోకులు ఈ పుంశ్చలి వచ్చినది అని నిందించసాగిరి. కులమానమును విడిచిన నేను తిరుగుచు ఆ దేశమును విడిచి ఇంకొక దేశమును చేరితిని. ఘూర్జరక దేశమున సౌరాష్ట్రమున శివమందిరమున వనస్థలమను ప్రసిద్ధికల నగరము వృద్ధితో కూడినది కలదు. దేవీ! నేను ఆకలితో మిక్కిలి పీడించబడి చిప్పను చేతిలో పట్టుకొని భిక్షకొరకు బయలుదేరితిని. బాగా దుఃఖించుచు గృహస్థుల ద్వారములలో ప్రవేశించుచుంటిని. నా రూపమును చూచిన లోకులు నన్ను ఈమె పాపురాలు ఇచటికి వచ్చినది అని తూలనాడసాగిరి. నాకు భిక్షము నీయుటలేదు. ఇట్లు దుఃఖరాశిలో మునిగి దారిద్ర్య దుఃఖపరిపీడితురాలనై తిరుగుచూ నేను ఒక ఉత్తమమైన ఇంటిని చూచితిని. ఆ ఇల్లు ఉన్నతమైన ప్రాకారములతో కూడియున్నది. వేదశాలతో కూడియున్నది.
ఆ భవనము వేదధ్వని నిండియున్నది. చాలామంది బ్రాహ్మణులతో కూడియున్నది. ధనధాన్యములు దాసదాసీజనములతో అలంకరించబడియున్నది. లక్ష్మీదేవిచే ఆనందించబడిన ఆ గృహమును నేను ప్రవేశించితిని. సర్వతోభద్రమైన ఆ గృహము ఆ శివశర్మదే. దుఃఖపీడితురాలైన సుదేవ ‘భిక్షనిమ్ము' అని పలికెను. బ్రాహ్మణోత్తముడైన శివశర్మ భిక్షా శబ్దమును వినెను. లక్ష్మీదేవి వంటి సురూపముగలది, వరానన అయిన తన భార్యను, మంగలను మహాబుద్ధిమంతుడైన, ధర్మాత్ముడైన శివశర్మ నవ్వుతూ ఇట్లు పలికెను. ఈమె ఒక బలహీనురాలు, భిక్షకొరకు ద్వారమున చేరినది. శుభురాలా! ప్రియురాలా! ఈమెను పిలిచి భోజనము పెట్టుము. అతని భార్య కూడా పరమకృప కలదై నేను వచ్చినది తెలుసుకొని భర్తతో మంగళ ప్రియ భోజనమును ఇచ్చెదనని పలికెను. ఇట్లు భర్తతో పలికి శుభకరురాలైన మంగళ మిష్టాన్నముతో చక్కగా భోజనము చేయించెను. అంతలో ధర్మాత్ముడైన మహామునియైన శివశర్మ నీవెవరవు? ఇక్కడికెట్లు వచ్చితివి? ఎవరిదానవు? ఈ సంసారములో ఎందుకు తిరుగుచున్నావు? ఏ పనిమీద అంతట తిరుగుచున్నావు? నా ముందు అంతయూ చెప్పుము. ఇట్లు మహానుభావుడైన నా భర్త మాటలను విని పాపురాలనైన నేను స్వరముతో అతను నా భర్తయని గుర్తించితిని. నేను భర్తను చూచిన వెంటనే సిగ్గుపడితిని. అందమైన సర్వావయములు కల మంగళ భర్తతో ఇట్లు పలికెను. 'ఈమె ఎవ్వరు? నిన్ను చూచి ఎందుకు సిగ్గుపడుచున్నది? నా మీది అనుగ్రహముతో ఈమె ఎవ్వరో చెప్పుడు' అని.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబదిఒకట - అధ్యాయము.
