పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

16 - అధ్యాయము

సుమన పలికెను.

నిప్పులు పరిచిన దారిలో లాగికొనిపోబడుచుండును. దుర్మార్గుడు కాలుచు ఇటునటు పొర్లుచుండును. 12 మంది సూర్యుల ఎండవేడిమితో సూర్యకిరణములచే తపించబడుచు ఆ దారిలో గొనిపోబడును. పర్వతదుర్గములలో నీడలేని చోట్లనుండి ఆ దుర్బుద్ధి ఆకలి దప్పులచే పీడింపబడుచు గొనిపోబడును. ఆ పాపిని దూతలు గదలతో ఖడ్గములతో, గొడ్డళ్ళతో కొరడాలతో కొట్టుచుందురు. కొందరు యమదూతలు నిందించుచుందురు. తరువాత చల్లనిదారిలో చల్లని గాలి వీచుచుండగా ఆ చల్లదనముతో బాధించబడుచు ఆ దారిలో వెళ్ళుచుండును. ఇట్లు చాలా దుర్గమ మార్గములనుండి దూతలు లాగుకొని పోవుచుందురు. ఇట్లు దేవతలను బ్రాహ్మణులను నిందించిన ఆ పాపి ఇతరములగు సకల విధ పాపములనాచరించిన ఆ పాపిని యమకింకరులు గొనిపోవుదురు. అంతట అచట నల్లని కాటుక కొండలా ఉన్న యముని చూచును. ఆ యముడు మహాభయంకరుడు, క్రూరుడు, దారుణుడు భయంకరములగు దూతలతో కూడియున్నవాడు సర్వవ్యాధులు చుట్టుముట్టి యుండగా చిత్రగుప్తునితో కూడియున్నవానిని, మహిషవాహనము నధిరోహించియున్నవానిని, దంష్ట్రాకరాలుని, కాలసన్నిభమగు నోరు కలవానిని అతి భయంకరుని, పీతాంబరమును ధరించినవానిని గదాహస్తుని రక్తగంధమును బూనుకొనినవానిని రక్తమాల్యములతో అలంకరించుకొనినవానిని భయంకరుడగు యముని ఆ పాపి చూచును.

ఇట్లు సర్వధర్మ బహిష్కృతుడగు ఆ పాపిని ధర్మకంటకుని యమధర్మరాజు చూచును. మహాదుఃఖములను పీడలను అనుభవించమని శాసించును. దారుముద్గరములతో (ఆయుధవిశేషములు) వేయియుగములు నరకానుభవమును పొందును. ఇంకా చాలా విధములగు నరకములనుభవించును. మరల మరల పాపజాతిలో పుట్టును. కృమికీటకములలో పాపి పుట్టుచుండును. మలమునందు పడి హాహాకారములను చేయుచు స్పృహతప్పి పడియుండును. ఆ పాపి ఇంతటి బాధతోనే మరణమును కూడా పొందును. ఇట్లు పాపఫలమును అనుభవించుచుండును.

ఆ పాపి మరల ఏయే జాతులలో పుట్టునో చెప్పెదను. నూరు శునకజన్మలను పొంది పాపమును అనుభవించును. తరువాత పెద్ద పులిగా, గాడిదగా, పిల్లిగా, వరాహముగా పాముగా పుట్టును. ఇంకా పలు పశుపక్ష్యాదులలో మాటిమాటికి పుట్టుచుండును. పాపపక్షులలో, ఇతర సంకర జాతులలో పుట్టును. చండాల జాతిలో ఆటవిక జాతిలో పులింద జాతిలో పుట్టును. ఇట్లు ప్రియతమా! పాపుల జనన మరణముల గురించి అంతయూ చెప్పితిని వారి బాధలు పనులు అన్ని వివరించితిని. ఇట్లు పాపపుణ్య సమాచారమంతయూ తెలిపితిని. ఇంకా ఏదేని అడిగినచో తెలిపెదను.

ఇది శ్రీ పద్మపురాణమున పంచపంచాశత్సహస్రసంహితలో ఇంద్రసుమనోపాఖ్యానమున పాపపుణ్యవివక్షయను పదునార - అధ్యాయము.