పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

33 - అధ్యాయము

ఋషయ ఊచుః-

ఋషులు పలికిరి.

గంధర్వపుత్రుడు మహాత్ముడగు సుశంఖునిచే శపించబడిన సునీధ ఏమాయెను. అతని శాపమువలన ఏమి జరిగెను. ఆమె ఏమేమి చేసెను. అతని శాపమువలన ఎటువంటి పుత్రుని పొందెను. సునీధ చరితమును నాకు విస్తరముగా వివరించుము.

సూత ఉవాచ: -

సూతమహర్షి పలికెను.

ఆ సునీధ సుశంఖునిచే శపించబడి దుఃఖపీడితురాలై తండ్రివద్దకు వెళ్ళెను. తండ్రికి తన చరితమునంతయూ తెలిపెను. సత్యవంతులలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడగు మృత్యువు చెప్పినదంతయూ వినెను. తరువాత మహానుభావునిచే శపించబడిన పుత్రికతో ఇట్లు పలికెను.

“నీవు ధర్మమును తేజమును నశింపచేయు పాపమును చేసితివి. పరమశాంతుని ఎందుకు కొట్టితివి. సర్వలోకవిరుద్దమును నీవు ఆచరించితివి. ఆ సుశంఖుడు కామక్రోధరహితుడు, పరమశాంతుడు, ధర్మవత్సలుడు తపోమార్గముననున్నవాడు, పరబ్రహ్మలో నివసించువాడు. అట్టివానిని కొట్టినవారికికలుగు పాపమును వినుము. వారికి పరమపాపియగు పుత్రుడు కలుగును. చాలా ఘోరమగు పాపము పొందును. కొట్టినవానిని కొట్టువారు తిట్టినవానిని తిట్టువారు పాపములను పొందజాలరు. మొదట కొట్టినవాడే ఆ పాపమును పొందును. కాని ఆ సుశంఖుడు శాంతుడు, జితేంద్రియుడు, తనను కొట్టినవానిని కూడా కొట్టడు. ఇట్లు నిర్దోషుని ఎవరేని కొట్టినచో, పాపముతో మోహంతో నిర్దోషుని కొట్టిననూ మనస్సును బాధించిననూ ఆ పాపి పాపమును పొందును. అది కూడా నిర్దోషుడు చేసిన పాపమును పొందును. తనను కొట్టినవానిని తరువాత మోహముతో పాపముతో నిర్దోషి కొట్టినచో పాపము చేసినవాని పాపము నిర్దోషికి చేరును. కావున దోషియైననూ కొట్టరాదు. కావున ఓ పుత్రీ! నీవు చాలా గొప్ప పాపమును చేసితివి. అతను కూడా శపించెను. కావున నీ పాపము సగము తొలగినది. మిగిలిన సగము తొలగుటకు పుణ్యము నాచరింపుము. సజ్జనసంగతితో పాపమును మరలించుము. యోగధ్యానములో, జ్ఞానములో పాపమును మరలించుము. సజ్జన సంగము మహాపుణ్యప్రదము. చాలా శ్రేయములను ప్రసాదించును. అట్టి సత్సంగతికి దృష్టాంతమును చూడుము. పుణ్యతీర్థముల జలమును స్పృశించుటవలన, త్రాగుటవలన, స్నానమువలన మహా జ్ఞానులగు మునులు బాహ్యాభ్యంతరశుద్దిని పొంది సిద్ధిని పొందెదరు. సకల చరాచరలోకములు జలసేవనము వలన ఆయుష్మంతములగును. జలములు శాంతములు చల్లనివి, స్పర్శసుఖమును కలిగించునవి, ప్రియమును ఆచరించునవి. పరిశుద్దములు, మలమును తొలగించునవి, రసము కలవి. పవిత్ర ప్రభావము కలవి. సజ్జనులు కూడా ఇటువంటివారని తెలియవలయును. యత్నపూర్వకముగా సేవించవలయును. అగ్ని సంసర్గము వలన బంగారము తన మలమును విడుచునట్లు సజ్జనసంసర్గమువలన మానవుడు పాపమును తొలగించుకొనును. పుణ్యతేజస్సుతో సత్యవహ్ని ప్రజ్వలించును. సత్యముతో తేజము ప్రజ్వరిల్లినపుడు జ్ఞానముతో కూడా నిర్మలుడగును. ధ్యానభావముతో అత్యుష్ణమైన సత్యవహ్నిని పాపులు తాకజాలరు. సత్యవహ్ని సంసర్గము వలన పాపమంతయూ నశించును. కావున నీవు పూర్తిగా సత్యసంసర్గమును చేయవలయును. పాపపు బరువును విడిచి పుణ్యమును మాత్రమే ఆశ్రయించుము.

సూత ఉవాచ - సూతమహర్షి పలికెను.

ఇట్లు దుఃఖించుచున్న సునీధకును తండ్రి జ్ఞానబోధ కావించెను. ఆమె తండ్రి పాదములకు నమస్కరించి నిర్జన వనమునకు వెడలెను. సునీధ తపోదీక్షను స్వీకరించి కామమును క్రోధమును విడిచి బాలభావమును కూడా విడిచి మోహమును ద్రోహమును మాయను విడిచి ఏకాన్తప్రదేశమును ఆశ్రయించెను. తపస్వినులగు రంభాది చెలులు కూడా సునీధవద్దకు చేరి దుఃఖానుభవము కల సునీధను చూచిరి. ధ్యానముతో చింతతో నున్న సునీధను చింతాపరాయణులగు రంభాది సఖులు ఇట్లు పలికిరి. ‘మాకు కూడా చింతను దుఃఖమును కలిగించు నీచింతాదుఃఖములకు కారణమును మాకు తెలుపుము. ధర్మము కొరకు చేయు చింత మాత్రమే సార్థకమగును. యోగులను ధర్మమును సంతసింపచేయగలమరియొక చింత వలన ప్రయోజనం యుండును. మూడవది నిరర్థకము. నిరర్థక చింతను కలిగియుండరాదు. చింత శరీరమును బలమును తేజమును నశింపచేయును. సర్వసౌఖ్యములను నశింపచేసి రూపమునకు కూడా హానిని కలిగించును. చింతవలన ఆశ మోహము లోభము కలుగును. ప్రతిదినము చింతించుచున్నచో పాపమును కలిగించును. చింత వ్యాధిని కలిగించును. నరకమును కల్పించును. కావున చింతను విడిచి మమ్ములను అనుసరించుము. మానవుడు పూర్వము ఆచరించిన కర్మతో సంపాదించిన ఫలమునే అనుభవించును. కావున జ్ఞాని చింతించడు.కావున చింతను విడిచి నీకు కలిగిన సుఖదుఃఖములను తెలుపుము.’ ఇట్లు పలికిన చెలుల మాటలను వినిన సునీధ ఇట్లు పలికెను.

ఇది పద్మపురాణమున పంచపంచాశత్సంహితలో రెండవదీయగు భూమిఖండమున వేనోపాఖ్యానమున సునీధ చరితమను 33 - అధ్యాయము.