పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
65 - శరీరదోషవర్ణనమ్
యయాతిరువాచ - యయాతి పలికెను.
మాతలిరువాచ - మాతలి పలికెను.
‘ధర్మమును రక్షించు శరీరము మాతలీ! ఆత్మతో కలిసి స్వర్గమునకు ఎందుకు వెళ్ళదు? నాకు నీవా కారణమును తెలుపుము' అని అడగగా మాతలి ఇట్లు చెప్పుచున్నాడు. “మహారాజా! అయిదు "భూతములు ఆత్మతో ఉండును. కాని పంచభూతములు కలిసి ఉండవు. అన్ని భూతముల సముదాయము శరీరసంఘాతమున ప్రవర్తించును. వార్ధక్యముచే పీడించబడి తమ తమ స్థానమును చేరును. భూమి రసాధికముగా కల్పింపబడి రసములచే తడుపబడి మృదుత్వమును పొందును. అట్లు మృదుత్వమును పొందిన భూమిని చీమలు, ఎలుకలు రంధ్రములను చేయును. పుట్టలను చేయును. అట్లే రసముతో మృదుత్వమును పొందిన కాయమున క్రిములు కురుపులను, గడ్డలను రంధ్రములను చేయును. ఇట్లు కృములచే భక్షించబడిన కాయమున గుల్మములు ఏర్పడును. ఇవి వెంటనే పీడించును. నహుషాత్మజా! ఈ దోషములతో కూడియున్న శరీరము ప్రాణములతో కలిసినంత మాత్రమున ఎట్లు స్వర్గమునకు చేరును. ఈ శరీరమున పృథివీభాగము పృథివిలోనే చేరును కాని స్వర్గమునకు ఎట్టి పరిస్థితులలోనూ చేరజాలదు. ఇట్లు కాయము దోషభూయిష్టమెట్లో నీకు అంతయూ వివరించితిని.”
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృమాహాత్యమున అరువది అయిద - అధ్యాయము.
