పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

22 - అధ్యాయము

వ్యాసమహర్షి పలికెను.

మహానుభావా! ఇపుడు తమనొక ప్రశ్ననడుగుచున్నాను. ఇపుడు సమాధానము చెప్పుము. సువ్రతుని గూర్చి తామే పూర్వము చెప్పితిని. సువ్రతుడు పూర్వజన్మసంస్కారముతో నిర్వికారుడగు నారాయణుని ధ్యానించుచు పూర్వజన్మలో ఏ జాతిలో పుట్టెనో తెలుపుడు. అతడు ఆ జన్మలో శ్రీహరినెట్లు ఆరాధించెను. ఇతనికి ఎప్పుడు ఇలాంటి పుణ్యముల రాశి ఎట్లు ప్రాప్తించినదో కూడా తెలుపుడు.

బ్రహ్మ పలికెను.

 సకల సంపత్సమృద్ధమగు విదిశానగరమున ఋతధ్వజ సుతుడు మహాతేజస్వి, బలశాలి ఉండెను. అతని పుత్రుడు అమిత ప్రజ్ఞాశాలియగు రుక్మాంగద మహారాజు ఉండెడివాడు. అతని భార్య సహధర్మచారిణి కీర్తిమంతురాలు సంధ్యావళీదేవి. రుక్మాంగదునికి సంధ్యావలియందు తనంతటి పుత్రుడు కలిగెను. అతనికి ధర్మాంగదుడని నామకరణము చేసెను. ఆ ధర్మాంగదుడు సర్వలక్షణ సంపన్నుడు, పితృభక్తిపరాయణుడు. ఇతను భక్తాగ్రేసరుడు. తండ్రి సుఖసంతోషముల కొరకు మోహినికి తన శిరమునిచ్చెను. ఇట్లు విష్ణుధర్మముతో అతని పితృభక్తితో శ్రీహరి ప్రసన్నుడై అతనిని విష్ణుపదమునకు గొనిపోయెను. ఇట్లు ప్రజ్ఞాజ్ఞాన విశారదుడగు ధర్మాంగదుడు అచట తనకు నచ్చిన దివ్యభోగములననుభవించి వేయియుగముల తరువాత అచటినుండి దిగి శ్రీమహావిష్ణువు అనుగ్రహమువలన సోమశర్మ, సుమనలకు పుత్రునిగా పుట్టును. ఇతను శ్రేష్ఠుడు. పరమభాగవతోత్తముడు. విష్ణుధ్యానపరుడై తపమునాచరించెను. ఈ సువ్రతుడు కామక్రోధాదిదోషములను విడిచి ఇంద్రియములను వశపరుచుకొని ఎల్లపుడు తపమునాచరించుచుండెను. ఇతడు సిద్దేశ్వరుని సన్నిధిలో పర్వతోత్తమమగు వైడూర్యపర్వతమున మనస్సును ఏకాగ్రము కావించి విష్ణువునందు నిలిపి తపము చేయసాగెను.

ఇట్లు నూరు సంవత్సరములు తపమాచరించి శ్రీహరిని ధ్యానించగా ఈ మహానుభావుని ధ్యానముతో శంఖచక్రగదాధరుడగు జగన్నాధుడు సుప్రసన్నుడై లక్ష్మీదేవితో కలిసి అచటికి వచ్చి సువ్రతునికి వరములనిచ్చెను. ఓ ధర్మాత్మా పండితశ్రేష్ఠుడా! ఈ విషయమును తెలియుము. నేను శ్రీకృష్ణుడను వచ్చితిని. నీకు కావలసిన వరమును కోరుకొనుము అని పలికెను. ఆ మేధావియగు సువ్రతుడు ఈ మాటలను విని సాటిలేని శ్రీహరి మాటకు మురిసి జనార్ధనుని సాక్షాత్కరించుకొని చేతులు జోడించి ప్రణామములనాచరించెను.

సువ్రతుడు పలికెను.

ఈ సంసారమనునది మహాసముద్రము. ఇందు గొప్ప దుఃఖములు, మోహములు అనునవి మహాతరంగములతో నిండియున్నవి. ఈ సముద్రమున నేనాచరించిన తప్పులవలన ఒప్పులవలన చేరితిని. ఓ జనార్ధనా! దీనుడనగు నన్నా సముద్రమునుండి త్వరగా ఉద్దరించుము. కర్మలను మేఘములు వర్షించబోవుచున్నట్లు మెరయుచున్నవి. నా పాతకసమూహములతో విద్యుల్లత మెరయుచున్నది. మోహాంధకారముల సమూహములు నన్ను చుట్టుముట్టినవి. కావున నేను చూడజాలను. అట్టి దీనుడనగు నాకు ఓ మధుసూదనా! నీ చేయూత నిమ్ము! ఈ సంసారమను కారడవి చాలా దుఃఖములను వృక్షములతో నిండియున్నది. ఈ అడవిలో మోహములను సింహములు సంచరించుచున్నవి. కామాగ్ని ఈ అడవిని దహింపచేయుచున్నది. ఆ మంటలలో ఎపుడూ కాలుచున్న నన్ను దయతో కాపాడుము. ఈ సంసారవృక్షము బాగా జీర్ణమైననూ చాలా ఎత్తుగానున్నందున మాయయను మూలము దుఃఖములను కొమ్మలు భార్యాదుల సంగతియను బెరడు కలిగియున్నది. మోహముతో ఆ చెట్టునెక్కి పడిన నన్ను కాపాడుము. దుఃఖాగ్నులలో మోహధూమములతో వియోగము మరణము మరణమంతటి మూర్ఛా శోకములతో ఎల్లపుడూ కాలుచున్నాను. అట్టి నన్ను జ్ఞానమేఘములతో వర్షించుము. నాకు మోక్షమును ప్రసాదించుము. కామ చీకట్లు కమ్ముకొనిన గొప్ప సంసారమను గోతిలో పడి ఎపుడూ అలమటించుచున్న నన్ను దీనుని భయాతురుని దయానిధివగు నీవు సంసారమునుండి విరక్తుని గావించుము. నిన్ను శరణువేడుచున్నాను. ఏకాగ్రమగు మనస్సుతో నిశ్చల భావముతో జ్ఞానపూర్ణమగు సంకల్పముతో నిన్నే ధ్యానించువారు నీ పదమును పొందెదరు. పరమపావనమగు నీ పాదపద్మములను దేవకిన్నరాదిగణము సేవించుచుండును. ఇతరమును పలుకను, సేవించను. ఆలోచించను. ఎపుడూ నీ పాదపద్మయుగలమును మాత్రమే నమస్కరించెదను. నా కోరికను ఇపుడే నీవే తీర్చుము. నా పాతకములన్నియూ నన్ను విడిచి దూరముగా పోవలయును. నేను ఎన్ని జన్మలలోనైననూ నీకు దాసునిగానేయుందును. నీ పాదపద్మయుగలమును ఎపుడూ స్మరించుచుందును. నాయెడ ప్రసన్నుడవైనచో నాకీ వరమునిమ్ము. నాతోపాటుగా నా తలిదండ్రులను దేహముతో నీ నివాసమునకు చేర్చుము. ఈవిషయమున సంశయించవద్దు.

శ్రీకృష్ణభగవానుడు పలికెను.

ఇట్లే నీ పని పూర్తియగును. సంశయము లేదు.

బ్రహ్మ పలికెను.

సుపుత్రుని విషయమున సంతోషించిన హృషీకేశుడు సువ్రతుని భక్తితో సంతోషింపచేయబడెను. సువ్రతునితో కలిసి సుమనాసోమశర్మలు మరణము దహనము లేనివారై దేహముతో విష్ణులోకమునకు వెడలిరి. రెండుకల్పములవరకు సువ్రతుడు దివ్యలోకములను అనుభవించెను. ఇపుడు దేవకార్యములను నెరవేర్చుటకు శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో కశ్యపుని ఇంటిలో అవతరించెను. ఇతనే శ్రీమహావిష్ణు అనుగ్రహమువలన ఇంద్రపదవిని కూడా అనుభవించును. ఇతను వసుదత్తుడను నామముతో సర్వదేవతలచే నమస్కరించబడును ఇపుడు స్వర్గమున ఇంద్రపదవిని అనుభవించును. ఇట్లు నీకు సృష్టిసంబంధకారణమగు సర్వవృత్తాంతమును తెలిపితిని. నీవడిగినపుడు ఇతర విషయములను కూడా తెలిపెదను.

వ్యాసమహర్షి పలికెను.

రుక్మాంగద సుతుడగు ధర్మాంగదుడు సృష్టికాలమున మొదటి కృతయుగమున పుట్టెను కదా. ఇపుడు ఇంద్రునిగానున్న ఈ ధర్మాంగదుడు ఇతని తండ్రియగు రుక్మాంగదుడు ఈ యిరువురూ వేరా? వారేనా? నాకు కలిగిన ఈ సంశయమును తాము తొలగించ ప్రార్ధన.

బ్రహ్మ పలికెను.

అన్ని సందేహములు తొలగు రీతిని నీకు నేను తెలిపెదను. శ్రీమన్నారాయణుని లీలాసృష్టిలో వారములు, పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, మనువులు మరల మరల వచ్చి పోవునట్లు యుగములు కూడా అట్లే మరల మరల వచ్చిపోవుచుండును. తరువాత కల్పము వచ్చును. అపుడు నేను శ్రీహరిని చేరెదను. చరాచరములన్నీ నన్ను చేరును. ఆ యోగేశ్వరుడు మరల యధాపూర్వముగా అన్నిటిని సృజించును. ప్రపంచమును సృజించును. మరల నేను, మరల వేదములు, దేవతలు, ద్విజులు, అట్లే రాజులందరు తమ తమ చరిత్రలతో పుట్టెదరు. జ్ఞాని ఈ విషయమున మోహమును చెందడు. పూర్వకల్పమున రుక్మాంగదుని వలె ధర్మాంగదుడుకూడా ఖ్యాతి కలవానిగా మరల పుట్టెను. రామాదులు, యయాతి నహుషులు, మనువాదులు ఇట్టి మహానుభావులు పుట్టుచుందురు. గిట్టుచుందురు కూడా. వారిలో ధర్మతత్పరులుగానుండు రాజులు ఇంద్రపదవిని అనుభవించెదరు. ధర్మాంగదుడు ఇంద్రపదవిని అనుభవించినట్లు ధర్మాత్ములు అనుభవింతురు. ఇట్లే వేదములు, దేవతలు, స్మృతులు పురాణములు మరల మరల వచ్చుచుండును. ఇట్లు నీకంతయూ తెలిపితిని. సువ్రతుని పరమపావనమగు చరితమునంతయూ తెలిపితిని. ఇక నీముందు ఇపుడు అవ్యక్తమును గూర్చి తెలిపెదను.

ఇది శ్రీపద్మపురాణమున పంచపంచాశత్సంహితమున రెండవదగు భూమిఖండమున ఇంద్రసువ్రతోపాఖ్యానమను ద్వావింశోధ్యాయ.