పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

13 - అధ్యాయము

సోమశర్మోవాచ –

సోమశర్మ పలికెను. 

బ్రహ్మచర్య లక్షణమును బ్రహ్మచర్యము ఎట్లుండును అనుదానిని నీకు తెలుసున్నచో నాకు విస్తరముగా తెలుపుము.

సుమనోవాచ –

సుమన పలికెను.

ఎల్లపుడు సత్యమునందు ప్రీతికల పుణ్యాత్ముడు తుష్టిని పొందును. తన భార్యను ఋతుకాలమున దోషరహితుడై పొందవలయును. తన కులాచారమును ఎప్పుడు విడువరాదు. ఇదే గృహస్థునకు ఉత్తమ వ్రతముగా చెప్పబడినది. గృహస్థుల కుత్తమమగు బ్రహ్మచర్యమును నేను చెప్పితిని. ఇపుడు నేను యతుల బ్రహ్మచర్యమును చెప్పుచున్నాను. ఇట్లే ఇపుడు నేను తపస్సును వివరించితిని. ఇట్లే సత్యమును కూడా చెప్పుచున్నాను. పరద్రవ్యములందు, పరస్త్రీలయందు ఆశ లేకపోవుట సత్యముగా చెప్పబడినది. సకల మానవులు జీవించు దానమును గూర్చి చెప్పెదను వినుము. ఇహమున, పరమున తన సుఖమును కోరువారు దానమును చేయవలెను. శాశ్వతమగు సుఖమును పొందుటకు అన్నమహాదానమును చేయవలయును. ఆకలిచే పీడింపబడుచున్నవానికి ఒక ముద్ద అన్నము పెట్టినచో గొప్ప పుణ్యమును పొందును. అమృతమును అతను భుజించును.

తన సంపదకు అనుగుణముగా ప్రతిదినము ఈయవలయును. తృణశయ్యను చల్లని ఇంటినీడను, భూమిని, నీరును, అన్నమును చక్కని ప్రియవచనమును, ఆసనమును, కపటములేని మాటను, తన బ్రతుకు కొరకు ప్రతిదినము ఆచరించువాడు, దేవతలను, పితృదేవతలను అర్చించి దానమిచ్చువాడు ఇహమున, పరమున ఆనందించును. మానవుడైనవాడు దానాధ్యయన కర్మలచే దివసమును సఫలము చేసినచో అతను దేవాంశసంభూతుడే. ఈ విషయమున సంశయము లేదు. ఉత్తమము, ధర్మసాధనమగు నియమమును కూడా చెప్పెదను. దేవబ్రాహ్మణులను ప్రీతితో నియమముతో దానములందు వ్రతములందు, పుణ్యకార్యములందు, ఉపకారములందు నిత్యము పూజించుట విధిగా చెప్పబడినది.

ఇక ఇపుడు క్షమాస్వరూపమును తెలుపుచున్నాను. బ్రాహ్మణోత్తమా! వినుము. ఎవరో కొట్టినపుడు దెబ్బలు తిన్నవాడు రోదించుటను విని కోపించరాదు. కొట్టినచో మరల కొట్టరాదు. అతను ధర్మాత్ముడై సహనశీలి కావలయును. దేనిపైననూ కోరిక కలిగిచూడరాదు. ఇట్టివాడు ఇహపరములలోనూ సుఖమును పొందును. ఇట్లు క్షమ చెప్పబడినది. ఇక ఇపుడు శౌచమును చెప్పెదను. బాహ్యాభ్యంతర శుద్దిగలిగి రాగరహితుడై స్నానాచమనాదులతో వ్యవహరించుట శౌచమనబడును. ఇక ఇపుడు అహింసను తెలిపెదను.

తెలియకుండా కూడా (పొరబాటున) ప్రయోజనము లేకుండగా గడ్డిని కూడా కోయరాదు. తన విషయములో వలె ఇతరుల విషయమున కూడా అహింసానిరతుడు కావలయును. ఇక ఇపుడు శాంతిని వివరించెదను. శాంతితోనే సుఖమును పొందును. శాంతినే ఆచరించవలయును. కష్టము కలిగినదని శాంతిని విడువరాదు. అఖిలప్రాణులందు వైరమును విడిచి మనసును ప్రవర్తింపచేయవలయును. ఇట్లు శాంతిని చెప్పితిని. ఇక ఇపుడు అస్తేయమును చెప్పెదను. పరుల ధనమును పరుల భార్యను హరించరాదు. ఈ అస్తేయమును మనోవాక్కాయములతో చేయవలయును. మనసులో మాటతో శరీరముతో అస్తేయమును ఆచరించవలయును. ఇక ఇపుడు దమమును చెప్పుచున్నాను. ఇంద్రియములను వికారము చెందు మనస్సును చిక్కబట్టుటవలన మనలోని ఔద్దత్యము నశించును. అట్టివాడు. చైతన్యము కలవాడు వంశములోనున్నవాడు అగును. ఇక ఇపుడు ధర్మశాస్త్రములోనున్న శుశ్రూషను వివరించెదను. పూర్వాచార్యులు చెప్పిన విధముగా వివరించెదను. మనోవాక్కాయములతో గురుకార్యమును ఆచరించవలయును. గురువు అనుగ్రహమును కలుగచేయునదే శుశ్రూష అనబడును. బ్రాహ్మణోత్తమా! మీ ముందు సాంగధర్మమును వివరించితిని. 

తాము వినగోరినచో ఇతరములను కూడా వివరించెదను. ఇట్టి ధర్మమును ఆచరించినవాడు మరల సంసారములో పుట్టడు. ఆ ధర్మముతో మోక్షమును చెందును. ఇది ముమ్మాటికీ నిజము. ఇట్లు తెలిసి మహాప్రాజ్ఞ! ధర్మమునే ఆచరించుము. ఈ భూమండలమున అసాధ్యమైనదంతయూ ధర్మప్రసాదము వలన కలుగును. కావున తాము నా పలుకును ఆచరించుడు. ఇట్లు పలికిన భార్య మాటలను వినిన సోమశర్మ బుద్ధిమంతుడై ధర్మవాదినియగు భార్య సుమనతో మరల ఇట్లు పలికెను.

ఇది శ్రీ పద్మపురాణమున  55 వేల సంహితలో భూమిఖండమున ఐంద్రసుమనోపాఖ్యానమున పదమూడ - అధ్యాయము.