పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

57 - క్రీడ సుకల ఇంటికి వచ్చి సుకలను మోహింపచేసి ఆమెతో కలిసి ఉపవనమునకు ప్రవేశించుట

విష్ణురువాచ - శ్రీమహావిష్ణువు పలికెను.

అంతట మన్మధుని దూతియైన క్రీడ సతీరూపమును ధరించి చక్కని పతివ్రతయైన సుకలా ఇంటికి వెళ్ళేను. అట్లు వచ్చిన క్రీడను సత్యస్వరూపము కల సుకల ఆదరముగా పలికెను. ధన్యురాలైన సుకలా వాక్యములచే పుణ్యములచే పూజింపబడిన క్రీడ సుకలతో నవ్వుచూ ఇట్లు పలికెను. ఆమె పలుకు మాయను అనుసరించునది. ప్రపంచమును మోహింపచేయునది. సత్యప్రమేయములు కలదిగా ప్రత్యుత్తరమును పలికెను. 'నా భర్త కూడా బలవంతుడు, గుణములను తెలియువాడు, ధీరుడు, విద్యావంతుడు, గొప్ప మహిమకలవాడు. పరమ పుణ్యాత్ముడు. పుణ్యకీర్తి కల నానాధుడు పాపురాలనైన నన్ను విడిచివెళ్ళెను.” క్రీడ పలికిన పవిత్రమైన వాక్యములతో స్త్రీ స్వభావముతో వినిన సుకల అంతయూ నిజమే అని ఎట్టి సందేహము లేకుండగా క్రీడ కూడా పరిశుద్ధ స్వభావురాలుగా భావించి 'సుందరి! నీ భర్త ఎందువలన నిన్ను విడిచివెళ్ళెను? నీవు చక్కని సౌందర్యవతివి. ఇంతటి నీ రూపమును విడిచి ఎందుకు వెళ్ళెను. అంతయూ నిజమునే తెలుపుము. ఆమె నాకు స్నేహితురాలుగా నా ఇంటికి వచ్చినది. అన్నీ ధర్మములనే చేయును. భర్తృధ్యానమున నున్నది” అని తలచెను. అంతట క్రీడ ఇట్లు పలికెను. ఆమె నా భర్తయొక్క సత్యచరితమును వినుము. నా భర్త దేనిని కోరిననూ దానిని అందించుచున్నాను. నిరంతరము నా భర్తకు ప్రియమును చేయుటకు ప్రయత్నించుచున్నాను. నా చక్కని భర్తయొక్క పవిత్రమైన మాటను వినిన వెంటనే ధ్యానముతో అతను చెప్పినదంతయూ చేయుచుందును. ఏకాన్తముననుండు స్వభావము కలదానను. భర్త గుణములకు అనురూపమైన గుణములు కలదానను. నిరంతరము అతని సేవతోనే జీవించుదానను. నా పూర్వజన్మ కర్మ పరిపాకము ఇపుడు ఇట్లు ప్రవర్తించుచున్నది. కావుననే దురదృష్టవంతురాలినైన నన్ను విడిచి నా భర్త వెడలెను. అయిననూ అతికష్టముతో బ్రతుకును శరీరమును నిలుపుకొనుచున్నాను. భర్త లేని స్త్రీలు జాలి విడిచి ఎట్లు బ్రతికెదరు? రూపము, శృంగారము, సౌభాగ్యము, సుఖము, సంపదలు అన్నీ స్త్రీలకు భర్తీ అని శాస్త్రములుద్ధోషించుచున్నవి.

క్రీడ పలికినదంతయూ వినిన సుకల మహానుభావురాలు అదంతయూ నిజమని నమ్మి తన స్వభావానుగుణముగా ఆ క్రీడతో ఇట్లు పలికెను. అట్లే తన పూర్వవృతాన్తమును సంగ్రహముగా వివరించినది. తన భర్త పుణ్యమును సాధించతలచి యాత్రలకు వెళ్ళిన విధమును వివరించెను. అంతట క్రీడ కూడా తన దుఃఖమును, సత్యమును, తపమును వివరించి ఆమెను ఓదార్చెను.

 ఒకసారి క్రీడ సుకలతో ఇట్లు పలికెను. “స్నేహితురాలా! ఈ వనమును చూడుము. పరమసౌమ్యము, దివ్య వృక్షములతో అలంకరించబడియున్నది. అచట పరమపావనమైనవి, పాపములను నశింపచేయు పుణ్యతీర్థమొకటున్నది. చక్కని పూలు కల చాలా తీగలతో శోభించబడియున్నది. వరాననా! మనము కూడా పుణ్యమును సంపాదించుకొనుటకు అచటికి వెళ్ళవలయును.” ఈ మాటలను వినిన సుకల మాయక్రీడలతో కలిసి ఆ వనమును ప్రవేశించెను. ఆ వనము దివ్యమైనది, నందనవనము వంటిది. అన్ని ఋతువుల పుష్పములు కలది. వందల కోకిలల కూతలతో ధ్వనించుచున్నది. చక్కని మధురమైన నాదములతో తుమ్మెదలు గానము చేయుచున్నవి. పుణ్యకరములైన పక్షులు పవిత్ర నాదములతో కూయుచున్నవి. సుగంధమును వెదజల్లు చందనాది వృక్షములతో కూడియున్నది. సకల భోగములతో నిండియున్నది. వసంతుడు వసంతశోభచే సుకలను మోహింపచేయుటకే నిర్మించబడినది. ఆ వనమును సకల క్రీడతో కలిసి సర్వభావములుకల వనమును ప్రవేశించెను.

కామ ఉవాచ - కాముడు పలికెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను.

ఆ సుకల మాయ అభిప్రాయము తెలియనిది. సంతోషమును కలిగించు పావనమైన ఆ వనమును చూచుచుండెను. ఆ క్రీడతో దివ్యవనమును చూచుచుండగా దివ్యరూపముతో విరాజిల్లు ఇంద్రుడు కూడా తన దూతితో కలిసి అచటికి వచ్చెను. మన్మధుడు కూడా అచటికి వచ్చెను. ఇంద్రుడు సర్వభోగం అయి కామలీలా సమాకులుడై మన్మధునితో 'ఈమె సుకల ఇటకు వచ్చినది. క్రీడ ముందు నిలుచున్నది. క్రీడ తన మాయతో నీవద్దకు తీసుకొని వచ్చినదానిని నీ బాణముతో కొట్టుము అని పలికెను. ఒకవేళ నీలో పౌరుషమున్నచో చూపుము. ఒక నిశ్చయమును చేయుము.' అనగా మన్మధుడు ఇట్లు పలికెను. 'ఇంద్రా! విలాసముతో కూడియున్న చతురమైన నీ రూపమును చూపుము. ఇంద్రా! అపుడు నా అయిదు బాణములతో కొట్టెదను.” అనగా మరల ఇంద్రుడు ఇట్లు పలుకుచున్నాడు. “మూఢా! అసలు నీకు పౌరుషమెక్కడున్నది? లోకమును వృధాగా మోసగించుచున్నావు. ఇపుడు నన్నాధారము చేసుకొని యుద్ధము చేయ సంకల్పించుచున్నావు.” అనగా మన్మధుడిట్లు పలికెను.

దేవదేవుడు మహాదేవుడు త్రిశూలధారియైన శంకరుడు పూర్వమే నా కాయమును హరించెను. గాన నాకు శరీరము లేదు. దేవేంద్రా! నా మాట ఇపుడు వినుము. నేను వారిని వివశురాలను చేయవలయునని తలచినచో పురుషుని శరీరమును ఆశ్రయించి నా రూపమును చూపెదను. సహస్రాక్షా! పురుషుని మోహింపచేయదలిచినచో స్త్రీ దేహమునాశ్రయించి నా రూపమును చూపెదను. స్త్రీ తాను మొదట చూచిన పురుషునే ఆలోచించుచుండును. ఇట్లే పురుషుడు మాటిమాటికి నారీరూపమును తలచును. అతను ఇదివరకు చూచిన దానిని మరల చూడనపుడు ఆ చూడని రూపమును ఆశ్రయించి పురుషుని మోహింపచేతును. అట్లే నారిని కూడా ఆ చూడని పురుషరూపమును ఆశ్రయించి మోహింపచేతును. ఇట్లు స్మరించుటచే మోహింపచేతును. గాన నన్ను స్మరుడందురు. ఆ సుకలను చూచి ఆమె ఇదివరకు చూచిన పురుషరూపమును ఆశ్రయించుము. తమ తమ తేజః ప్రభావముతో బాధించబడుట, బాధించుట అను స్థితిని పొందును. నారీరూపమును ఆశ్రయించి ధీరుడైన పురుషుని మోహింపచేయును. పురుష రూపమునాశ్రయించి స్త్రీని మోహింపచేతును. నేను రూపహీనుడను గాన ఇంకొక రూపమును ఆశ్రయించవలసియుండును. కావున నీ రూపము నాశ్రయించి నీవు కోరిన ఆ సుకలను సాధింతును. ఇట్లు పలికి మన్మధుడు దేవేంద్రుని శరీరమును వసంతుని శరీరముగా వసంతుని శరీరమును ఆశ్రయించి పూలబాణముతో పరమసాధ్వి పరమ పావనురాలు, కృకలుని భార్య అయిన సుకలను కొట్టుటకు ఉవ్విళ్ళూరుచు ఆ సుకల శరీరమును తన బాణమునకు గురిగా కనులతో చూచుచు నిలుచుండెను.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబది యేడ - అధ్యాయము.