పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

72 - యయాతినా స్వశరీర ప్రశంసాపూర్వకం స్వర్గగమనాస్వీకరణమ్

పిప్పల ఉవాచ - పిప్పలుడు చెప్పుచున్నాడు.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

‘నహుషుని పుత్రుడైన ఆ యయాతి మహారాజు మాతలి మాటలను విని ఏమి చేసెను? నాకా విషయమును విస్తరముగా చేప్పుము. ఈ కథ సర్వపుణ్యమయి. పాపనాశిని. ఈ కథను నేను వినగోరుచున్నాను. ఎపుడూ నాకు తృప్తియే కలుగుట లేదు.' అనగా సుకర్మ ఇట్లు పలికేను.

 “సకల ధర్మధారకులలో శ్రేష్ఠుడైన రాజసత్తముడు యయాతి. అట్లు వచ్చిన ఇంద్రుని దూతయైన మాతలిని ఇంద్ర సారథిని ఇట్లు పలికెను నేనీ శరీరమును విడిచిపెట్టను. స్వర్గమునకు వెళ్ళను. ఈ పార్థివశరీరము లేకుండగా స్వర్గమునకు వెళ్ళజాలను. ఈ శరీరమునకు మహాదోషములను తాము చెప్పియున్ననూ ఇంతకుముందు కూడా శరీరగుణాగుణములను తాము చెప్పియున్నారు. అయిననూ నేనీ శరీరమును విడువను. స్వర్గమునకు రాను. ఈ మాటను దేవదేవుడైన ఇంద్రునకు చెప్పుము. ఒంటరిగా జీవుడు కాని శరీరము కాని సాంసారిక సిద్ధిని పొందజాలడు. ప్రాణము లేకుండగా శరీరము, కాయము లేకుండగా జీవుడు ఉండజాలరు. ఆ ఇద్దరికీ ఉన్న మిత్రత్వము నేను నశింపచేయజాలను. ఈ శరీరానుగ్రహముచేతనే సుఖమును అనుభవించును. ఆ శరీరము సకల భోగసాధనము ప్రాణమే. ప్రాణములున్నపుడే మనసునకు నచ్చిన భోగములను అనుభవించగలడు. దేవదూతా! శరీరమిట్లు సర్వభోగ్యమని తెలిసి కూడా అనుభవించకుండగా ఎట్లుండగలను. ఈ శరీరమునకు మహాదుష్టములైన దుఃఖమును కలిగించు వ్యాధులు సంభవించును. ఆ వ్యాధులు పాపమువలన వృద్ధాప్య దోషము వలన కలుగుచున్నవి. మాతలీ! నా శరీరము పుణ్యము కలిగియున్నది. 16 సంవత్సరముల వయసులో నున్నట్లున్నది. నా పుట్టుకనుండి 150 యేండ్లు గడిచినవి. అయిననూ ఇంకా ఈ శరీరము కొత్తగానే అనిపించుచున్నది. నాకు నూరు సంవత్సరములు గడిచినవి. 16 యేండ్ల పురుషుని శరీరము శోభించునట్లు నా శరీరము బలవీర్య సమన్వితముగా శోభించుచున్నది. నాకు అలసట లేదు. హాని లేదు. వ్యాధులు లేవు. వృద్ధాప్యము లేదు. నా శరీరము కూడా ధర్మోత్సాహముతో వృద్ధిచెందుచున్నది. ఈ  దేహము సర్వామృతమయమైన  దివ్యౌషధము. ఇదియే పరమౌషధము కూడా.

పాపములు, వ్యాధులు నశించుటకొరకు నేను పూర్వము ధర్మమును చేసితిని ఆ ధర్మముచే శుద్ధిచేయబడిన నా దేహము సకల దోషములు తొలగిపోయినదిగా ఉన్నది. హృషీకేశుని నామానుసంధానము సర్వోత్తమము దూతా! నేనీ రసాయనమును నిత్యమూ చేయుచున్నాను. ఆ నామానుసంధానముచే నా వ్యాధులు, పాపాది దోషములు నశించినవి. ఈ సంసారమున కృష్ణనామమను మహౌషధముండగా కూడా మానవులు పాపవ్యాధులచే పీడింపబడుచు మరణమును పొందుచున్నారు. మహామూర్భులు

కృష్ణనామరసాయనమును త్రాగుచు లేరు. మాతలీ! ఆ ధ్యానముచే జ్ఞానముతో పూజాభావముతో సత్యము దానపుణ్యములతో నా శరీరము వ్యాధిరహితముగా నున్నది. పాపము బుద్ది పొందినచో దేహి దేహమునకు వ్యాధులు పీడలు కలుగును. ప్రాణులకు పీడలవలన మృత్యువు కలుగును. ఇందులో సందేహము లేదు. కావున పుణ్యమును, సత్యమును ఆశ్రయించిన నరులు ధర్మమును ఆచరించవలయును. ఈ శరీరము పంచభూతాత్మకము. నాడులు, కీళ్ళతో జీర్ణించునది. హేమకారి టంకములతో వలె సంధానము చేయబడిన మానవునిలో ధాతుమయముగా సంచరించుచుండగా అందులో అగ్ని ప్రజ్వరిల్లును. శతఖండమయమైన ఈ దేహములో దివ్యమైన సౌభాగ్యప్రదమైన హరినామముతో సంధానము చేయువాడు బుద్ధిమంతుడు. పంచాత్మకమైన ఖండములు శతసంధి విజర్జరములు. అట్టివాటితో సంధానము చేయబడినవన్నిటితో కూడిన కాయము ధాతుమయమగును. ధాతుసమమగును.

సుకర్మోవాచ - సుకర్మ పలికెను.

 శ్రీహరి పూజలచే ఉపచారములచే ధ్యానముచే నియమముతో సత్యభావముతో దానముతో నూతన కాయము శోభించుచున్నది. మాతలీ! శరీరదోషములు నశించును. వినుము. బాహ్యాభ్యన్తరములలో శౌచమేర్పడును. దుర్గడ్గము కలుగదు. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహముతో దేహము పరిశుద్దమగును. నేను స్వర్గమునకు వెళ్ళను. ఇచటనే స్వర్గమును ఏర్పరచెదను. తపస్సుతో శుద్దభావముతో స్వధర్మముతో శ్రీహరి అనుగ్రహమువలన ఈ భూమండలమునే స్వర్గమును చేసెదను. ఈ విషయమును తెలుసుకొని నీవు వెళ్ళి ఇంద్రునకు చెప్పుము అని. ఆ రాజు మాటలను వినిన మాతలి ఆశీస్సులతో అభినందించి రాజుకు చెప్పి స్వర్గమునకు వెడలి మహానుభావుడైన ఇంద్రునికి అంతయూ నివేదించెను. ఇంద్రుడు కూడా మహానుభావుడైన యయాతి చెప్పినదానిని విని యయాతి మహారాజును ఎట్లు స్వర్గమునకు తీసుకొని రావలయును అని ఆలోచించసాగెను.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదియగు భూమిఖండమున వేనోపాఖ్యానమున మాతాపితృతీర్థమున యయాతి చరితమున డెబ్బది రెండ - అధ్యాయము.