పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

17 - అధ్యాయము

సోమశర్మ పలికెను.

దేవీ! ఉత్తమమగు ధర్మసాధనమంతటిని చక్కగా తెలిపితివి. సర్వజ్ఞుడు గుణవంతుడగు పుత్రుని ఎట్లు పొందగలిగెదను? నీకు తెలిసినచో నాకు ఇహపరములలో శ్రేయమును కలిగించు దానధర్మాదికములను తెలుపుము.

సుమన పలికెను.

ధర్మజ్ఞుడగు వసిష్ఠ మహర్షిని ఆశ్రయించుము. అతని అనుగ్రహమువలన ధర్మవత్సలుడు ధర్మజుడగు పుత్రుని పొందగలిగెదవు.

సూత ఉవాచ - సూతమహర్షి పలికెను.

ఇట్లు సుమన పలుకగా ద్విజోత్తముడగు సోమశర్మ సుమనతో నీవు చెప్పిన విధముగనే చేసెదను. ఇందులో సందియము లేదు అని పలికి తపస్వులలో శ్రేష్ఠుడు దివ్యుడు సర్వజ్ఞుడగు వసిష్ఠ మహర్షి వద్దకు త్వరగా వెళ్ళెను. అచట గంగాతీరమున నున్నవాడు, పరమపావనుడు ఆశ్రమములోనున్నవాడు ద్విజోత్తముడు తేజోజ్వాలలతో చుట్టుముట్టియున్నవాడు రెండవ సూర్యునివలె భాసించుచున్నవాడు మహానుభావుడు బ్రాహ్మణప్రియుడు అగు వసిష్టమహర్షినిచూచి భక్తితో దండవత్రణామములాచరించెను.

అంత మహాతేజోవంతుడగు బ్రహ్మపుత్రుడు వసిష్ఠుడు పరమపావనుడు సోమశర్మతో ఇట్లు పలికెను.ఓ మహామతీ! పావనమగు ఆశ్రమమున సుఖముగా కూర్చొనుము. నీ ఇంటిలో భార్యాపుత్రాదులు సేవకులు క్షేమముగా నున్నారా? సకల పుణ్యకార్యములు అగ్నులు కుశలమేనా? శరీరము ఆరోగ్యముగా నున్నదా? అన్నివేళలా ధర్మమును పాలించుచుంటివా?” ఇట్లు అడిగి మరల ఇట్లు పలికెను. నాయనా! బ్రాహ్మణోత్తమా! నీకు ఏమి ప్రియము నాచరించవలయును. ఇట్లు పలికి ఊరకుండెను. అంతట మహాప్రాజ్ఞుడగు సోమశర్మ మహానుభావుడగు వసిష్ఠునితో ఇట్లు పలికెను.

సోమశర్మ పలికెను.

పూజ్యుడా! సుప్రసన్నమగు మనస్సుతో నా మాటను వినుము. నాకు ప్రియము చేయ సంకల్పించితిరేని నా ప్రశ్నలోని సందేహమును తీర్చుడు. నాకు ఏ పాపమువలన దారిద్ర్యము కలుగుచున్నది. నాకు పుత్రసౌఖ్యమెందుకు కలుగుట లేదు. నాకే దుఃఖము ఏ పాపమువలన కలుగుచున్నది? ఈ సందేహమును తొలగించుము. నేను చాలా మోహముతో నుండగా ఆ ప్రియురాలు నాకు ఈ విషయమును బోధించినది. ఆమెయే నన్ను నీ వద్దకు పంపినది. నేను ఆర్తితో వచ్చితిని. కావున నా సకల సందేహములను నశింపచేయు విషయమంతయూ తెలుపుము. అట్లే నాకు సంసారబంధమునుండి ముక్తిని ప్రసాదించుము.

వసిష్ఠ మహర్షి పలికెను.

పుత్రులు మిత్రులు, సోదరులు, భార్య, స్వజనము, బంధువులు ఈ అయిదు భేదములు సంబంధము వలన పురుషునికి కలుగును. ఇవన్నియూ నీకు ఇదివరకే సుమన తెలిపినది. ద్విజోత్తమా! నీకు అందరకు పుత్రులు ఋణసంబంధులుగానే తెలియుము. ఇపుడు పవిత్రమగు పుత్రుని లక్షణమును నీముందు చెప్పెదను. ఎవని మనసు పుణ్యమునందు లగ్నమగునో సత్యధర్మరతుడగునో శుద్ధ విజ్ఞానసంపన్నుడు, తపస్వి, వాగ్విదులలో శ్రేష్ఠుడు, అన్ని కర్మలను చక్కగా తెలిసినవాడు, ధీరుడు, వేదాధ్యయనతత్పరుడు, సర్వశాస్త్రవేత్త, దేవబ్రాహ్మణ పూజకుడు, అన్ని యజ్ఞములను ఆచరించువాడు, దాత, త్యాగి, ప్రియముగా మాటలాడువాడు విష్ణుధ్యానపరాయణుడు, ఎల్లపుడు శాంతుడు, దాంతుడు, సర్వదా జపము చేయువాడు, ఎల్లపుడూ తల్లిదండ్రులను పూజించువాడు, తనవారియందందరియందు ప్రీతి కలవాడు, కులమును తరింపచేయువాడు, విద్వాంసుడు, కులమును చక్కగా పోషించువాడు ఈ గుణములు కలవాడు సుపుత్రుడు సుఖమునిచ్చును. ఇతరులందరు పుత్రులు కేవలము సంబంధము కలవారు మాత్రమే. శోకమును, సంతాపమును కలిగించెదరు. ఇట్టి దుష్పత్రులవలన ఏమి ప్రయోజనముండదు. వారందరూ వచ్చి భయంకరమగు సంతాపమును కలిగించి వెళ్ళుచుందురు. వారందరూ పుత్రరూపముతో సంతాపమునిచ్చువారు మాత్రమే. నీవు పూర్వజన్మమున ఆచరించిన పుణ్యమునంతయూ తెలిపెదను. ఆ అద్భుతమును వినుము. 

మహాప్రాజ్ఞా! నీవు పూర్వజన్మలో శూద్రుడవు. వ్యవసాయము చేసెడివాడవు. జ్ఞానహీనుడవు. మహాలోభము కలవాడివి. ఒకే భార్య కలిగియుంటివి. ఎపుడు ద్వేషము కలవాడివి. బహుపుత్రుడవు. దానము చేయనివాడవు. ధర్మమును తెలియవు. సత్యమును వినలేదు.దానమును చేయలేదు. శాస్త్రమును అధ్యయనము చేయలేదు. తీర్థయాత్రలను చేయలేదు. ఇట్లు ఎపుడూ వ్యవసాయమును మాత్రమే చేసితివి. అన్ని పశువులను ఆవులను పాలించితివి. ఋషుల అశ్వములను కాపాడితివి. లోభముతో చాలా ధనమును కూడబెట్టితివి. కాని ఆ ధనమును పుణ్యకార్యములకు వ్యయము చేయలేదు. యోగ్యునకు దానమును చేయలేదు. దుర్భలుని చూచి దయతో దానము చేయలేదు. ఆవులను గేదెలను చాలా సంపాదించి వాటిని అమ్మి ధనమును సంపాదించితివి. పాలు పెరుగు చల్ల నేయి అన్నిటిని అమ్మి ధనమును కూడబెట్టితివి. విష్ణుమాయలో మోహించబడి చెడు సమయమున చెడుగా ఆలోచించితివి. అన్నమును కూడా చాలా వెలకు అమ్మితివి. దయాహీనుడవై దానమును చేయకపోతివి. దేవతలును పూజించలేదు. పర్వకాలమున బ్రాహ్మణులకు దానము గావించలేదు.

శ్రాద్ధ సమయమున నీవు శ్రద్దగా నాచరించలేదు. నీ భార్య నీతో ఇది శ్రాద్ధ దినమొచ్చినదని తెలిపినది. ఇది మామగారి శ్రాద్దకాలము, ఇది అత్తగారి శ్రాద్ధకాలము అని ఆమె చెప్పిన మాటను విని ఇంటిని విడిచి పారిపోతివి. నీవు ధర్మమార్గమును చూడలేదు. వినలేదు. నీకు లోభమే మాత. లోభమే పిత. లోభమే భ్రాత. లోభమే స్వజనము. లోభమే బంధువులు. ఇట్లు నీవు ధర్మమును విడిచి అన్నివేళలా ఒక లోభమును మాత్రమే పాలించితివి. కావున నీవు దారిద్ర్యముతో ఇట్లు పీడించబడుచు దుఃఖించుచుంటివి. రోజురోజుకు నీ హృదయములో పెద్ద ఆశ పెరుగుచుండెను. నీ ఇంటిలో ధనము పెరుగుచున్న కొద్దీ నీవు అగ్నివలె పెరుగుచున్న ఆశతో రాత్రి నిద్రించిననూ చింతాక్రాంతుడవైయుంటివి. పగలు కూడా ఎపుడూ మహామోహములతో నిండియుంటివి. నాకు వేయి, లక్ష, కోటి, పదికోట్లు, నూరుకోట్లు, వేయి కోట్లు, లక్షకోట్లు ఎపుడు లభించును అని. నీవాశించినంతగా లక్షలు కోట్లు లభించిననూ నీ ఆశ మాత్రము తగ్గలేదు. నీ శరీరమును కూడా కాదని ఆశ పెరుగుచుండెను. బ్రాహ్మణా! నీవు దానము చేయలేదు. హోమము చేయలేదు. అనుభవించలేదు. భూమిని త్రవ్వి లోపల పాతిపెట్టితివి. ఆ విషయము నీ పుత్రులకు తెలియదు. ఇట్లే ఇంకా ద్రవ్యమును సంపాదించు ఉపాయములను ఆచరించుచుంటివి. ఇతరలను అడుగుచుంటివి. గడ్డపార, పార, అంజనము, ధాతువిద్య ఇట్లు ఇతరోపాయములను అడుగుచు ఆశతో మోహితుడవై ఒంటిగా తిరుగుచుంటివి. స్పర్శవేదిని, సిద్దిప్రదములగు కల్పములను, ఇతర మార్గ ప్రవేశోపాయములను ఆలోచించుచుంటివి.

ఇట్లు ఆశాగ్నితో తపించబడుచు సుఖమును పొందజాలకపోతివి. ఇట్లు ఆశాగ్నితో కాల్చబడుచు హాహాకారములను చేయుచు స్పృహను జ్ఞానమును కోల్పోయి మోహితుడవై కాలవశుడవైతివి. భార్యాపుత్రులు నీవు దాచిన ధనమును గూర్చి అడిగిననూ వారికి తెలుపకుండగనే ప్రాణములను విడిచి యమపురికి వెడలితివి. ఇట్లు నీ పూర్వవృత్తాంతమునంతయూ చెప్పితిని. ఈ పనితోటే ఇపుడు నీవు ధనహీనునిగా దరిద్రునిగా అయితివి. శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగుచో అతని ఇంటిలో ఎపుడు భక్తిమంతులు, సుశీలులు, జ్ఞానులు, సత్యధర్మరతులు అగు పుత్రులు కలుగుదురు. శ్రీమహావిష్ణువు అనుగ్రహమును పొందియున్నచో ధనము ధాన్యము కలత్రము పుత్రపౌత్రులు అనంత భోగములను అనుభవించ కలుగును. శ్రీమహావిష్ణువు అనుగ్రహము లేనిచో భార్యను, పుత్రులను, మంచి కాలమున జన్మను పరమపదమును పొందజాలవు.

ఇది శ్రీ పద్మపురాణమున ద్వితీయమగు భూమిఖండమున ఐంద్రసుమనోపాఖ్యానమున 17 - అధ్యాయము.