పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

44 - శూకర మనుపుత్ర యుద్ధమ్

సుకలోవాచ - సుకల పలికెను.

ధరింపశక్యముకాని తన సైన్యము ధరింపశక్యముకాని వరాహముచే ఓడింపబడుట జూచిన ఇక్ష్వాకు మహారాజు ఆ సూకర విషయమున కోపించెను. వేగముగా ధనువును కాలానలోపమమైన ధనువును తీసుకొని గుఱ్ఱముతో ఆ సూకరమునకు అభిముఖముగా వెడలెను. అట్లు శత్రువులను సంహరించువాడు, ఉత్తమ పౌరుషము కలవాడు అయిన రాజును గుర్రముమీద వచ్చినవానిని సూకరయూధపతి చూచుచున్నాడు. యుద్దభూమిలో అతనికి ఎదురుగా వెడలెను. ఇక్ష్వాకుమహారాజు ఆ వరాహమును నిశితమైన శరముతో కొట్టెను. ఆ వరాహము గుర్రము పాదముల ముందు పడెను. వెంటనే ఆ వరాహము ఆ గుర్రముపై లంఘించి వేగముతో తన గిట్టలతో కొట్టెను. ఆ దెబ్బకు బాధనందిన గుఱ్ఱము గమనము కుంటుపడి భూమిపై పడెను. వరాహతుండముతో కొట్టబడి, ఆ గుఱ్ఱము పడిపోగా రాజు చిన్న రథమునెక్కెను. ఆ వరాహము సూకర జాతి ధ్వనులతో గర్జించుచున్నది. చిన్న రధములోనున్న కోశలాధిపతి వేగముగా గదతో కొట్టెను. రణరంగమధ్యలో నున్న ఆ యూధపతి సూకరము తన శరీరమును విడిచి అత్యుత్తమమైన శ్రీహరినివాసమునకే చేరెను. ఆ సూకరరాజరాజు ఆ కోశలరాజుతో ఘోరమైన యుద్ధమును చేసి ప్రాణములను విడిచి భూమిమీద పడిన వెంటనే దేవోత్తములు పుష్పవర్పమును కురిపించిరి.

సూకరరాజుపైన పడిన పుష్పసమూహము సంతానపుష్పముల సుగంధమును వెదజల్లెను. సంతోషించిన దేవతలు కుంకుమ చందన వర్షమును కురిపించిరి. వింతను ఇక్ష్వాకుమహారాజు ఆశ్చర్యముగా చూచుచుండగనే సూకర రాజరాజు నాలుగు భుజములు కలవాడు, దివ్యామ్బరములను, దివ్యవస్త్రములను, దివ్యరూపమును ధరించి తనదైన దివ్యతేజస్సుతో సూర్యునివలె ప్రకాశించుచుండెను. ఇట్లు సురరాజుచే, దేవతలతో చక్కగా పూజించబడుచు దివ్యవిమానముతో స్వర్గమునకు వెళ్ళగానే పూర్వము తనకున్న దేహమును విడిచి మరల గంధర్వరాజాయెను.

ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబదినాలుగ - అధ్యాయము.