పద్మ మహా పురాణము లోని భూమి ఖండము

Table of Contents

18 - అధ్యాయము

సోమశర్మ పలికెను.

ఓ మహామునీ! నేను పూర్వజన్మలో చేసిన పాపమును తాము చెప్పితిరి. నేను శూద్రజన్మను విడిచితిని. కాని ఇపుడు నేను బ్రాహ్మణజన్మను ఎట్లు పొందితినో? ఆ కారణమునంతయూ తెలుపుము. తాము జ్ఞానవిజ్ఞానములతో పరిపూర్ణులు.

వసిష్ఠమహర్షి పలికెను.

ఓ బ్రాహ్మణా! నీవు పూర్వము ఆచరించిన ధర్మకార్యమును నేను చెప్పెదను. వినదలిచినచో వినుము.

ఒక బ్రాహ్మణుడు పాపరహితుడు, సదాచారపరాయణుడు, చక్కని పండితుడు, విష్ణుభక్తుడు, ధర్మాత్ముడు సర్వదా విష్ణు సేవానిరతుడు ఒకసారి ఒంటిగా యాత్రకై బయలుదేరి తీర్ధములను పర్యటించుచుండెను. అట్లు తిరుగుచు అతను నీ ఇంటికి వచ్చెను. అతను నివాసమునకు స్థానమును కోరెను. అపుడు నీవు నీ భార్య పుత్రులు కలిసి అతనికి గోశాలలో వసతిని ఏర్పరిచితిరి. బ్రాహ్మణోత్తమా! రండు! రండు! నా ఇంటిలో సుఖముగా నుండుడు అని విష్ణుభక్తుడగు ఆ బ్రాహ్మణునితో పలికితిరి. నేనిపుడు ధన్యుడనైతిని. నేను తీర్థయాత్రాఫలమును పొందితిని. తీర్థమును చేరితిని. నీ పాదదర్శనమున తీర్థఫలము లభించినది. ఇట్లు పలికి శరీరమును అలసట తీరునట్లు వత్తి పాదములను కూడా వత్తి చక్కగా కడిగి ఆ పాదతీర్థముతో స్నానము చేసితివి. వెంటనే నేయి, పెరుగు, చల్ల, పాలు అన్నమును పెట్టితివి. ఇట్లు ఆ బ్రాహ్మణునికి నీవు మనస్సంతోషముతో సపర్యలు గావించి పుత్రులు భార్యతో కలిసి నీవు ఆ బ్రాహ్మణోత్తముని సంతోషింపచేసితివి.

అంతట తెల్లవారినది. ఆ దినము పుణ్యప్రదము పరమభాగ్యప్రదము. అది ఆషాఢ శుద్ధ ఏకాదశి. పాపనాశిని. ఈ దినముననే శ్రీమన్నారాయణుడు యోగనిద్రను చెందినాడు. ఆరోజు జ్ఞానులు, పండితులు అన్ని ఇంటిపనులు విడిచి విష్ణుధ్యానరతులైరి. అంతట ఆ దినమున గీతమంగలవాద్యములతో పరమోత్సవమును చేసిరి. వేదములలో మంగలప్రదమగు స్తోత్రములతో బ్రాహ్మణులందరు స్తోత్రము చేయుచుండిరి. ఇంతటి మహోత్సవమును పొంది బ్రాహ్మణోత్తముడు ఆ దినమున అక్కడే ఉండి ఆ దినమున ఉపవసించెను. ఆ బ్రాహ్మణోత్తముడు ఏకాదశీమాహాత్మ్యమును చదివి వినిపించెను. భార్యాపుత్రులతో నీవు దానిని చక్కగా వింటివి. ఇట్లు ఆ మాహాత్మ్యమును వినిన నీవు భార్యాపుత్రులతో ఈ బ్రాహ్మణునితో కలిసి ఈ వ్రతమును ఆచరించుము అని ప్రేరేపించబడితివి. ఇట్లు సర్వపుణ్యప్రదాయకమగు మహావాక్యమును విని ఈ వ్రతమును చేసెదనని నిశ్చయించుకొనినవాడవై భార్యాపుత్రులతో కలిసి నదీస్నానమును చేసితివి.

సంతోషాంతరంగుడవై శ్రీహరిని పూజించితివి. పవిత్రములగు పూజాద్రవ్యములతో గంధధూపాదులతో పూజించితివి. రాత్రిపూట జాగరణలు చేసితివి. నృత్యగీతాదులతో స్వామిని ఆరాధించితివి. బ్రాహ్మణులతో కలిసి నదీస్నానమును చేసితివి. దేవదేవేశుడగు శ్రీహరిని పుష్పధూపములతో పూజించితివి. భక్తితో గోవిందునికి నమస్కరించి మాటిమాటికి స్నానాదులను చేయించి ఆ మహానుభావుడగు బ్రాహ్మణునికి సంతృప్తిని కలిగించితివి. ఇట్లు పరిపూర్ణభక్తితో సద్భావముతో ఆ బ్రాహ్మణోత్తముని సాగనంపితివి. ఇట్లు నీవు వ్రతమును గావించితివి.

ఇట్లు బ్రాహ్మణ సంగముచే శ్రీమహావిష్ణువు అనుగ్రహముతో నీవు సత్యధర్మ సమన్వితుడగు బ్రాహ్మణునిగా పుట్టితివి. ఆ వ్రతప్రభావముతో నీవు గొప్ప కులములో పుట్టితివి. ఇది సత్యధర్మసమన్వితమగు బ్రాహ్మణ కులము. విష్ణుభక్తుడు మహానుభావుడగు ఆ బ్రాహ్మణునికి శ్రద్ధతో చిత్తశుద్దితో సత్యభావముతో సత్కారపూర్వకముగా అన్నము పెట్టితివి. ఆ అన్నదాన ప్రభావముతో నీకు ఇపుడు మిష్టాన్నము లభించును. నీవు మహామోహములో మునిగి ఆశతో మనసును నింపితివి. నీవు పూర్వజన్మలో ధనమును మాత్రమే సంపాదించితివి. బ్రాహ్మణులకు కాని ఇతరులగు దీనులకు కాని అన్నమునీయలేదు. పుత్రలోభముతో మరణించుచు భార్యకు కూడా ధనమునీయలేదు. ఆ పాపప్రభావముతో నీకు దారిద్ర్యము ప్రాప్తించినది. పుత్రుల విషయమున భార్యావిషయమున స్నేహమును ప్రీతిని విడిచినందున ఆ పాపప్రభావముతో నీవు పుత్రహీనుడవైతివి. ఇది ఆ పాపఫలము. మంచి పుత్రుడు మంచికులము ధనధాన్యములు, భూమి మంచి భార్య, మంచి జన్మ మంచి మరణము, చక్కని భోగములు, సుఖములు, రాజ్యము, స్వర్గము, మోక్షము ఇంకా దుర్లభములైన ఇతరములన్నీ శ్రీమహావిష్ణుప్రసాదము (అనుగ్రహము) వలననే లభించును. కావున శ్రీమన్నారాయణుని చక్కగా పూజించినచో శ్రీమహావిష్ణువు పరమపదమును పొందగలవు. మంచిపుత్రుడు, ధనధాన్యములు, మంచిభోగములు, సుఖము ఇవన్నీ లభించును. ఇట్లు నీవు పూర్వజన్మలో ఆచరించినదానినంతనూ చెప్పితిని. ఇట్లు నిజము తెలిసి శ్రీమన్నారాయణుని భక్తునివి కమ్ము.

ఇట్లు ఆ సోమశర్మయను బ్రాహ్మణోత్తముడు బ్రహ్మపుత్రుడగు వసిష్ఠమహర్షిచే ప్రబోధించబడి సంతుష్టాంతరంగుడై భక్తితో వసిష్ఠ మహర్షికి నమస్కరించి వసిష్ఠ మహర్షి ఆజ్ఞ తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యయగు సుమనను చేరి సంతోషించినవాడై ఇట్లు పలికెను. నీ అనుగ్రహముతో వసిష్ఠమహర్షి నా పూర్వజన్మవృత్తాంతమునంతయూ తెలిపెను. ఇపుడు నా మోహము నశించినది. మధుసూదనుని ఆరాధించి పరమపదమును పొందెదను. అని ఇట్లు పరమపావనము మంగళప్రదమగు అతని వాక్యమును వినిన సుమన సంతోషించినదై ప్రియునితో ప్రియా! పుణ్యాత్ముడవైతివి. వసిష్ఠమహర్షిచే బోధించబడితివి.

ఇది శ్రీపద్మపురాణమున పంచపంచాశత్సంహితలో రెండవదగు భూమిఖండమున ఐంద్రసుమనోపాఖ్యానమున 18 - అధ్యాయము.