పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
23 - అధ్యాయము
ఋషులు పలికిరి
చెప్పువారలలో నేర్పరీ! ఈ కథ చాలా విచిత్రమైనది, పరమపావనమైనది. ధన్యమైనది. కీర్తిని కలిగించునది. సర్వపాపములను బోనాడునదిగా తాము చెప్పియుంటిరి. కావున ఈ సృష్టిసంబంధమును నాకు తాము విస్తరముగా తెలుపుము. ఈ సృష్టి పూర్వమువలె ఎట్లు జరిగినదో వివరించుము.
సూతమహర్షి పలికెను.
ఇపుడు సృష్టిసంహార కారణమును విస్తరముగా చెప్పెదను. దీనిని వినినంతనే సర్వజ్ఞత్వము లభించును. హిరణ్యకశ్యపుడు మూడు లోకములను ఆక్రమించెను. తపమాచరించి బ్రహ్మను ప్రసన్నుని చేసుకొని దుర్లభములగు వరములను పొందెను. ఆ బ్రహ్మ వలన అమరత్వమును కూడా పొందెను. దేవలోకములను ఆక్రమించి తాను ప్రభుత్వమును కూడా సంపాదించెను. తరువాత దేవతలు గంధర్వులు వేదపారగులగు మునులు, నాగులు, కిన్నరులు, సిద్ధులు, యక్షులు ఇంకా ఇతరులు కూడా బ్రహ్మను ముందడుకొని శ్రీమన్నారాయణుని శరణువేడిరి. అపుడు శ్రీమన్నారాయణుడు క్షీరసాగరమున యోగనిద్రాగతుడాయెను. దేవతలందరు శ్రీహరిని మేలుకొలిపి చేతులు జోడించి స్తోత్రములతో స్తుతించిరి. శ్రీమన్నారాయణుడు మేలుకొనగానే హిరణ్యకశ్యపుని దుశ్చరితమును నివేదించిరి. జగన్నాధుడు దానినంతయూ వినిన శ్రీహరీ నృసింహరూపమును దాల్చి హిరణ్యకశ్యపుని చంపెను. మరల వరాహరూపమును దాల్చి మహాసురుడగు హిరణ్యాక్షుని సంహరించి భూమిని జలమునుండి ఉద్దరించెను. ఇట్లు భయంకరులగు ఇతర రాక్షసులను కూడా సంహరించెను. ఇట్లు గొప్ప గొప్ప రాక్షసులందరు చంపబడగా అట్లే దితిపుత్రులు కొందరు గొప్పవారు కూడా చంపబడగా దేవతలు తమ తమ స్థానములను మరల పొందిరి. అన్ని యజ్ఞములు ధర్మకార్యములు చక్కగా ప్రవర్తించబడినవి. అన్ని లోకములు స్వస్థములుగా నుండెను. అపుడు దితి దుఃఖపీడితురాలై పుత్రశోకసంతపురాలై హాహాకారములు చేయుచు మూర్చనొందినదై సూర్యతేజసన్నిభుడైనవాడు, తపము తేజస్సులు కలవారు మహామతియగు కశ్యపునితో ఇట్లు పలికెను.
స్వామీ! శ్రీహరి నా పుత్రులను సంహరించెను. దితిపుత్రులు దనుపుత్రులు అందరూ దేవతలచే సంహరించబడిరి. మునిశ్రేష్టా! నేను పుత్రశోకాగ్నిచే కాలిపోవుచున్నాను. కావున నాకు ఆనందమును కలిగించువానిని, అందరి తేజస్సులను హరించువానిని, గొప్ప బలవంతుని, అందమైన శరీరము కలవానిని, ఇంద్రునివంటి తేజస్సు కలవానిని, బుద్ధిమంతుని సర్వజ్ఞుని, విశేషజ్ఞానము కలవానిని, సర్వశాస్త్రపండితుని, తపస్సుతో తేజస్సుతోనున్నవానిని, బలవంతుని, మంచిలక్షణములు కలవానిని, బ్రాహ్మణప్రియుని, జ్ఞానమునెరిగినవానిని, దేవబ్రాహ్మణ పూజకుని, సర్వలోకములను జయించువానిని, నాకానందమును కలిగించువానిని అన్ని లక్షణములు కలవానిని పుత్రుని నాకు ప్రసాదించుము. ఇట్లు పలికిన దితి మాటలను వినిన కశ్యపప్రజాపతి దుఃఖితురాలగు దితియెడ కృపకలవాడై ఉత్తమవాక్యమును ఇట్లు పలికెను. దీనురాలగు దితి శిరస్సున హస్తమునుంచి భావావేశముతో నీవు కోరిన లక్షణములు కల పుత్రుడు నీకు కలుగును అని పలికి పర్వతరాజమగు మేరువును చేరెను. అచట పరమవ్రతమును స్వీకరించి నిరాధారుడై తపము చేయనారంభించెను. ఇంతలో దితి ఉత్తమగర్భమును ధరించెను.
అంతట అన్ని ధర్మములను తెలిసిన ఆ దితి శుభకర్మలను పుణ్యకర్మలను ఆచరించుచు నూరు సంవత్సరములు పరిశుద్దమగు మనస్సుతో గర్భమును ధరించియుండెను. అంతట బ్రహ్మతేజస్సుకల పుత్రుని దితి ప్రసవించెను. అంతట మహానందముతో కశ్యపమహర్షి వచ్చెను. ఆ పుత్రునికి తగిన విధముగా బలుడని నామకరణము గావించెను. పేరుకు తగిన బలవంతుడాతడు. ఇట్లు పేరు పెట్టి ఉపనయనముగావించి బ్రహ్మచర్యమును సాధించుము అని పలికెను.
పుత్రుడు పలికెను.
బ్రాహ్మణోత్తమా! తాము చెప్పినట్లుగానే చేసెదను. బ్రహ్మచర్యముతో వేదాధ్యయనము కూడా చేయగలను.
సూతమహర్షి పలికెను.
ఇట్లు బలుడు తపమాచరించుచుండగా నూరువత్సరములు గడిచినవి. అంత తపముతో నార్జించిన తేజస్సుతో తల్లి వద్దకు చేరెను. అట్లు తపోబలముతో బ్రహ్మచర్యముతో కూడియున్న తన పుత్రుని గొప్ప సంతోషముతో దితి చూచినది. అట్లు మహానుభావుడు తపస్వి మేధావి ప్రజ్ఞాజ్ఞానవిశారదుడు అగు పుత్రునితో దితి ఇట్లు పలికెను. నీవు బ్రతికున్నంతవరకు ఇదివరకు చక్రపాణి సంహరించబడిన హిరణ్యకశిప్వాది నా పుత్రులందరూ బ్రతికియేయుందురు. పగను సాధించుము. శత్రువులగు దేవతలను సంహరించుము. అంతట దనువు కూడా మహాబలియగు బలునితో ఇట్లు పలికెను. మొదట దేవాధిపతియగు ఇంద్రుని త్వరగా సంహరించుము. తరువాత దేవతలను ఆ తరువాత శ్రీహరిని సంహరించవలయును. ఇట్లు పలికిన ఆ ఇద్దరు తల్లుల మాటలను వినిన అదితి పతివ్రత మహా దుః ఖముతో పుత్రుడగు ఇంద్రునితో ఇట్లు పలికెను.
మహాకాయుడు మహాబలుడు అగు తిపుత్రుడు బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుచున్నాడు. దేవతలను వధించుటకు తపమాచరించెను. ఈ విషయమును నీవు క్షేమమును కోరినచో తెలియుము. ఇట్లు చెప్పిన తల్లి మాటలను వినిన పాకశాసనుడు దుఃఖముతో గొప్ప చింతను పొందెను. గొప్ప భయముతో వణుకుచు ఆలోచించసాగెను. దేవధర్మములను దూషింపచేయు ఇతనిని ఎట్లు వధించగలను అని ఆలోచించి మహాబలుని వధించుటలో ఒక విధానమును నిశ్చయించుకొనెను. ఒకసారి బలుడు సంధ్యావందనము కొరకు సముద్రమును చేరెను. దివ్యమగు కృష్ణాజినముతో దండముతో విరాజిల్లుచుండెను. పరిశుద్ధమగు పుణ్యరూపమగు బ్రహ్మచర్యముతో సాగరతీరమున సంధ్యావందనముకై ఉత్తమాసనమున కూర్చొనెను. ఇట్లు సంధ్యాసనమున కూర్చునియున్నవానిని ఇంద్రుడు వజ్రాయుధముతో కొట్టెను. దానితో బలుడు ప్రాణములు విడిచిపడిపోయెను. దానితో ఇంద్రుడు గొప్ప ఆనందమును పొందెను. ఇట్లు బలుని సంహరించి ఇంద్రుడు ధర్మాత్ముడు సుఖముగా రాజ్యమును పాలించెను.
ఇది శ్రీపద్మపురాణమున పంచపంచాశత్సంహితలో రెండవదగు భూమిఖండమున బలదైత్యవధయను 23 - అధ్యాయము.
