పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
45 - - అధ్యాయము
సుకలోవాచ - సుకల పలికెను.
అంతట ఆ వేటగాళ్ళు సూకరివైపు వెడలిరి. వారు శూరులు, భయంకరులు, పాశహస్తులు, భయపెట్టువారు ఆ శూకరి వెంటపడిరి. ఆ సూకరి కూడా తన నలుగురు పుత్రులను చుట్టుముట్టి నిలబడి తన కుటుంబములో మహాయుద్దమున తన ప్రియుడు వధింపబడుటను చూచి నా భర్త తలచినది జరిగినది. ఋషులు, దేవతలు పూజించిరి. ఈ మహానుభావుడు తన పరాక్రమకర్మతో స్వర్గమునకు వెడలెను. నా భర్త ఉన్న స్వర్గమునకు నేను కూడా ఈ మార్గములోనే వెళ్ళేదను అని తలచెను. ఇట్లు దృఢముగా నిశ్చయించుకొని పుత్రులను గూర్చి ఆలోచించెను. వంశధారకులైన నా నలుగురు పుత్రులు జీవించియున్నచో మహావీరుడైన సూకరరాజు కూడా సంతోషించును. ఇపుడు నేనే ఉపాయముతో నా నలుగురు పుత్రులకు రక్ష కల్పించెదను. ఇట్లు చింతాపరురాలై పర్వతసంధిని చూచి ఈ మార్గము చాలా విస్తీర్ణముగా నున్నది. సులభముగా వెడలుటకు అవకాశమున్నది. ఇట్లు పుత్రులను గూర్చి ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చి ఆ పుత్రులతో ప్రేమమోహముతో నేను ఇక్కడ ఉండునంతవరకు మీరు అతిశీఘ్రముగా ఇటనుండి వెడలుడు అని పలికెను.
ఆ నలుగురిలో పెద్ద కుమారుడు ఇట్లు పలికెను. తల్లీ! ప్రాణముల మీది లోభముతో తల్లిని విడిచి ఎట్లు వెళ్ళేదను. అట్టి నా బ్రతుకు వ్యర్థము కదా! తండ్రిని వధించిన వానిమీద పగ తీర్చుకొనెదను. యుద్ధమున శత్రువులను సాధించెదను. తల్లీ! నీవు నా ముగ్గురి సోదరులను తీసుకొని దుర్గకందరమునకు వెళ్ళుము. తండ్రిని, తల్లిని విడిచివెళ్ళువాడు పాపబుద్ది కలవాడు. కోటికృములతో నిండియున్న నరకమునకు అట్టివాడు తప్పక వెడలును.” అంతట దుఃఖముచే పీడితురాలైన తల్లి అతనితో “నిన్ను విడిచి నేనెట్లు వెడలెదను. అట్లు చేసిన నేను పాపాత్మురాలనయ్యెదను. కావున మిగిలిన నా మువ్వురు పుత్రులు వెళ్ళుడు” అని పలికెను. తల్లి మాటతో ఆ చిన్నవారు మువ్వురు పుత్రులు వనాన్తరముననున్న పర్వతమునకు వెడలిరి. ఆ మువ్వురు చూచుచుండగనే ఆ తల్లీ కొడుకులిర్వురు రణభూమికి వెడలిరి. ఆ ఇరువురు తేజస్సుతో చక్కని బలముతో గర్జించుచుండిరి. అంతట ఆ శూరులైన వేటగాళ్ళు వాయువేగముతో అచటికి వచ్చిరి. ఆ పెద్దకుమారుడు ముగ్గురు తమ్ముళ్ళను దూరముగా పంపెను. వారివైపు మరొకముగ్గురు వేటగాళ్ళు బయలుదేరిరి. వారు వెళ్ళు మార్గమును అడ్డగించి తల్లీకొడుకులు నిలబడిరి. ఆ వేటగాళ్ళు కూడా ధనుర్బాణములను ధరించి అచటికి చేరిరి. తీక్షణములైన చక్రములతో, తోమరములతో, ముసలములతో కొట్టసాగిరి.
ఆ పుత్రుడు తల్లిని తన వెనుకకు నిలిపి వారితో తాను యుద్ధము చేయుచుండెను. కొందరిని కోరతో చంపెను. మరికొందరిని తుండముతో చంపెను. గిట్టలతో కొందరిని చంపెను. యుద్ధమున చాలామంది శూరులు పడిపోయిరి. ఆ సూకరము యుద్ధము చేయుచుండగా మహానుభావుడైన రాజు చూచెను. ఎదురుగానున్న ఆ రాజు ఈ శూకరము తండ్రిని మించిన శూరుడు అని తెలిసి ప్రతాపవంతుడు మనుపుత్రుడు బాణమును చేతధరించి, అర్థచంద్రుని అనుకరించు నిశితమైన బాణముతో రాజు ఆ సూకరవక్షస్థలమును కొట్టగా భూమిపై పడెను. ఆ శూరుడు వెంటనే మరణించెను. భూమిపై పడెను. పెద్దదైన పుత్రమోహముతో ఆ సూకరి పుత్రునిపై పడెను. పుత్రశోకముతో శత్రువులపై క్రోధముతో తుండఘాతములతో చాలామంది శూరులను చంపెను. ఎంతోమంది వేటగాళ్ళు శూరులు మరణించి క్రిందపడిపోయిరి. ఆ సూకరి అంత పెద్ద సైన్యమును తన దంష్ఠతో పరుగెత్తించుచు, మంత్రశక్తితో ఆవిర్భవించిన మహాకృత్య అందరికి మహాభయమును కలిగించునట్లు అందరికీ మహాభయమును కలిగించుచుండెను. అంతట మహారాణి దేవరాజసుతుని వంటి రాజుతో ఇట్లు పలికెను. ‘మహారాజా! ఈ సూకరి నీ గొప్ప సైన్యమును చంపుచున్నది. మీరెందుకుపేక్షించుచున్నారు? నాకు కారణమును చెప్పుడు.’ అంతట ఆ మహారాజు 'నేనీ స్త్రీని చంపను' అని పలికెను.
‘స్త్రీని వధించినచో దేవతలు మహాదోషమును చెప్పియున్నారు. కావున స్త్రీని చంపరాదు. చంపుటకు నేనెవరిని పంపజాలను కూడా.’ ఇంతలో ఘర్షరుడను వేటగాడు గొప్పగా యుద్దము చేయుచున్న గొప్ప భటులచే సహింపజాలని ఆ సూకరిని చూచెను. అపుడు సుతీక్షమైన చాలా వేగముగల బాణముతో కొట్టెను. లోతుగా తగిలిన బాణముతో రక్తము స్రవించుచున్నదై వీరశ్రీతో శోభించుచు త్వరను పొంది తన తుండముతో ఆ రరరుడు చంపబడెను. పడుచున్న ఆ రరరుడు కూడా నిశితమైన ఖడ్గముతో చీల్చి క్రిందబడిపోయెను. యుద్ధము వలన కలిగిన ఆయాసముతో నిట్టూర్చుచు మూర్ఛను పొంది బ్రతికి ఉండి భూమిపై పడి దుఃఖించుచున్నది.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున నలుబదియైద - అధ్యాయము.
