పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
60 - ధర్మోపదేశమువలన పత్నీహస్తముతో అన్నమును వండించి శ్రాద్దమును చేయుటవలన అతని పితరుల ముక్తిని వర్ణించుట
కృకల ఉవాచ - కృకలుడు పలికెను.
ధర్మ ఉవాచ - ధర్ముడు పలికెను.
“నాకెట్లు సిద్ది కలుగును? నా పితరులకు విముక్తి ఎట్లు లభించును. ధర్మరాజా! నాకిపుడు ఈ విషయమును విస్తరముగా తెలుపుము.” అనగా ధర్మరాజిట్లు పలికెను. “మహానుభావా! ఇంటికి వెళ్ళుము. నీవు లేనందున దుఃఖించుచున్న భార్యను ఓదార్చుము. ఆమె ధర్మచారిణి. ఇంటికి వెళ్ళి నీ భార్య చేతితో వంటచేయించి శ్రాద్దమును చేయుము. నీవు సంచరించిన పుణ్యతీర్థములను స్మరించుచు దేవతా ప్రముఖులను పూజింపుము. అపుడు నీవు చేసిన తీర్థయాత్ర సిద్ధించును. లోకమున భార్య లేకుండగా ధర్మమును సాధించదలచినచో అట్టివారు గృహస్థ ధర్మమును లోపింపచేసి ఒంటరిగా అడవిలో తిరుగవలయును. అతను లోకమున విఫలుడగును. అతనిని దేవతలు మన్నించరు. ఇంటిలో గృహిణి ఉన్నపుడే యజ్ఞములు సిద్దించును. ధర్మార్థములను ఒంటరిగా సాధించజాలడు.
విష్ణురువాచ - విష్ణువు పలికెను.
ఇట్లు ధర్మరాజు ఆ వైశ్యునితో తెలిపి వచ్చిన చోటికే వెడలెను. ధర్మాత్ముడైన కృకలుడు కూడా తన ఇంటికి బయలుదేరెను. మేధావి అయిన కృకలుడు తన ఇల్లును చేరి ఆ పతివ్రతను చూచి తన సేవకునితో తన ఇంటికి బుద్ధిమంతుడు చేరెను. భర్త రాకను చూచి సకల పుణ్యమంగల కార్యమును ఆచరించెను. ధర్మాత్ముడైన కృకలుడు ధర్మరాజు చెప్పినదంతయూ తెలిపెను. సంతోషమును కలిగించు భర్త మాటలను వినిన సుకల ధర్మరాజు వాక్యమును ప్రశంసించి ఆమోదించెను. అంత ఆ కృకలుడు ఆమెతో కలిసి పరమ పవిత్రమైన శ్రాద్దమును ఆచరించెను. పితరులు, దేవతలు, గంధర్వులు విమానములలో అచటికి వచ్చిరి. మునులు అందరూ ఆ దంపతులను స్తుతించిరి. నేను బ్రహ్మ పార్వతీదేవితో పరమేశ్వరుడు దేవతలందరూ గంధర్వులు విమానములలో అచటికి వచ్చితిమి. నేను బ్రహ్మ పార్వతీదేవితో పరమేశ్వరుడు దేవతలు, గంధర్వులు ఆమె సత్యవ్రతముతో సంతోషించితిమి. సత్యపండితులు ధర్మజ్ఞులు మహానుభావులైన ఆ దంపతులతో ఇట్లు పలికిరి. నీకు శుభమగుగాక! సువ్రతా! వరమును కోరుకొనుము.
కృకల ఉవాచ - కృకలుడు పలికెను.
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను.
‘దేవోత్తములారా! ఏ పుణ్యముతో, ఏ తపస్సుతో భార్యతో కూడిన నాకు వరమునిచ్చుటకు తామిచటికి దయచేసితిరి” అని కృకలుడు అడుగగా ఇంద్రుడిట్లు పలికెను. 'ఈ నీ భార్య మహానుభావురాలు. పరమపతివ్రత. సుందరి. శుభంకరురాలు. ఈమె సత్యముతో సంతోషించితిని. వరమునీయ సంకల్పించితిని' అని తెలిపి ఇంతకుముందు జరిగినదానిని సంగ్రహముగా వివరించెను. ఆ సుకల చరితమును, మహిమను వినిన భర్త గొప్ప సంతోషమును పొందెను. ఆమెతో కలిసి ఆ ధర్మాత్ముడు సంతోషముతో ఆనందబాష్పములు నిండిన కనులుగలవాడై దేవతలందరికీ నమస్కరించెను. ఇట్లు పలికెను కూడా. 'త్రిమూర్తులు మహానుభావులైన తాము మాయెడ సంతోషించినచో అట్లే ఇతర ఈ ఋషులు పావనులు నాయందు దయచేసి అన్ని జన్మలలో త్రిమూర్తుల భక్తినే కలిగియుండునట్లుగా ధర్మమునందు, సత్యమునందు ప్రీతి మీ అనుగ్రహమువలన నాకు కలుగవలయును. ఆ తరువాత పితామహులతో భార్యతో శ్రీమహావిష్ణు లోకమును వెళ్ళగోరుచున్నాను. మహాతేజోవంతులు నాయెడ సంతోషించినచో ఈ వరము నిండు.’
దేవా ఊచు - దేవతలు పలికిరి.
విష్ణురువాచ - విష్ణువు పలికెను.
‘మహానుభావా! ఇట్లే అగుగాక. నీవడిగినదంతయూ జరుగగలదు. నీ భార్యయగు సుకల యశస్సు కలది. మహాపుణ్యాత్మురాలు' అని పలికిరి. అంతట ఆ దంపతులమీద పుష్పవృష్టిని దేవతలు కురిపించిరి. గీతతత్వము తెలిసిన గంధర్వులు లలితముగా సుస్వరముగా మహాపుణ్యమైన గానము చేసిరి. అప్సరసలు నాట్యమును చేసిరి. రాజా! అంతట దేవతలు గంధర్వులతో కలిసి తమ తమ నెలవులకు పతివ్రతను స్తుతించుచు వారికి వరములనిచ్చి వెడలిరి. ఇట్లు ఇపుడు నీకు నారీతీర్థమును చెప్పితిని. ఇంకను ఇతరమును ఏమి చెప్పవలయును. సాటిలేని ఈ పుణ్యాఖ్యానమునంతయూ నీకు తెలిపితిని. శ్రద్దగా వినినవాడు అన్ని పాపములనుండి విముక్తుడగును. స్త్రీ శ్రద్దగా ఉత్తమమైన సుకలాచరితమును వినినచో సత్యముతో సౌభాగ్యముతో పుత్రపౌత్రులతో ఎపుడూ విడిపోదు. భర్తతో సుఖించును. ధనధాన్యములతో ఆనందించును. ఆ స్త్రీ ప్రతిజన్మలోనూ పతివ్రతయే యగును. బ్రాహ్మణుడు వినినచో వేదవిద్వాంసుడగును. క్షత్రియుడు వినినచో విజయమును పొందును. వైశ్యుని ఇంటిలో ధనధాన్య సమృద్ధి కలుగును. ధర్మజుడగును. సదాచారపరాయణుడగును. సుఖమును పొందును. శూద్రుడు సుఖమును పొందును. పుత్రులతో, పౌత్రులతో వృద్ధిచెందును. అతనికి ధనధాన్యములచే అలంకరించబడిన లక్ష్మి విస్తరించును.
ఇది శ్రీ పాద్మపురాణమున 55 వేల సంహితలో రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున అరువద - అధ్యాయము.
