పద్మ మహా పురాణము లోని భూమి ఖండము
56 - మదనేంద్రచరితమును చూచి సత్యధర్మాదుల సంవాదము
విష్ణురువాచ - విష్ణువు పలికెను.
ఇంద్రునితో కూడిన మన్మధుడు సుకలా సత్యమును నశింపచేయుటకు సుకల గృహమునకు బయలుదేరగా సత్యము ధర్మముతో ఇట్లు పలికెను. 'మహాప్రాజ్ఞా! ధర్మా! మన్మధుని పనిని చూడుము. నీకొరకు నా కొరకు మహానుభావుడైన పుణ్యుని కొరకు సుఖమును కలిగించునది, వాస్తురూపమైనది సత్యమను పేరుగల ఆ సుదేవుని ఉత్తమ గృహమును నేను విడుచుచున్నాను. మదించిన బుద్దిగల ఈ మన్మధుడు ఆ గృహమునే నశింపచేయును. ఆ దుర్మార్గుడైన మన్మధుడు మనకు శత్రురూపుడే. ఇందులో ఎట్టి సందియము లేదు. బ్రాహ్మణుడు తపోధనుడైన భర్త చక్కని సతి పతివ్రతగానుండు భార్య, సత్యవ్రతుడైన మహారాజు వీరు నాకు నివాసస్థానములు. ఇందులో సందేహము లేదు. నేను వృద్ధితో పుష్టితో ఉన్నచోట నీవు నివసింతువు. అక్కడే పుణ్యమూ వచ్చి చేరును. శ్రద్దతో ఆడుకొనును. క్షమశాన్తితో నా మందిరమునకు వచ్చును. అట్లే సత్యము దమము దయ సౌహృదము ప్రజ్ఞాతో కూడియున్న నిర్లోభములున్న చోట నేనుందును. పరిశుద్ధ స్వభావము కూడా అచటనే ఉండును. వీరే నాకు బంధువులు. దొంగిలించకుండుట, హింసించకుండుట, సహనము బుద్దిగా ఇంటికి వచ్చియున్నారు. ధర్మరాజా! ఆ విషయమును వినుము, గురువులను సేవించుట లక్ష్మితో కూడియున్న విష్ణువు, అగ్ని మొదలగు దేవతలు నా ఇంటికి వచ్చెదరు.
మోక్షమార్గమును ప్రకాశింపచేయు జ్ఞాని దీప్తి కలవాడు, ధర్మమునాచరించు పతివ్రతలయందు నేను నివసింతును. ఈ సాధువులందరు నా నివాసములు. పైన చెప్పిన నా కుటుంబములో నీతో కలిసి ఇచట ఉందును. సత్వము కలవారు సాధురూపులు బ్రహ్మ నా గృహములుగా ఏర్పరచెను. ఈ గృహములలో మహానుభావా! యధేష్టముగా లీలతో సంచరించుచుందును. సకల జగన్నాధుడు వృషవాహనుడు త్రినేత్రుడు అయిన ఈశ్వరుడు పార్వతితో కలిసి నా ఇంట ప్రత్యక్షస్వరూపముతో నుండును. మహేశ్వర గృహరూపమైనది ఇది సంసృతిసారము. ఇదియే శంకరసదనము. దీనిని మన్మధుడు నశింపచేసినాడు. ఇట్లే ఉత్తమ తపమును చేయుచున్న విశ్వామిత్ర మహర్షిని మేనకను ఆశ్రయించి ఈ మన్మధుడు జయించెను. గౌతమమహర్షి ప్రియురాలు, సతీమతల్లి, పరమ పతివ్రత అయిన అహల్యను దుర్మార్గుడైన మన్మధుడు సత్యమునుండి తప్పించెను. సత్యమును, ధర్మమును తెలిసిన మునులు, పతివ్రతలైన ఎందరో స్త్రీలు వీరంతా నా నివాసములు. కామాగ్నిచే దహింపచేయబడినవి. ఈ మన్మధుడు ధరింపశక్యము కానివాడు, సహింపశక్యము కానివాడు. అంతటా వ్యాపించియున్నవాడు. నిత్య సత్యవ్రతులందు అతిక్రూరుడు. ఎపుడూ నన్నే చూచుచున్నారు. ఇక సత్యమెక్కడ ఉండును. ఆ మన్మధుడు నన్ను తెలుసుకొని ధనుర్బాణములను ధరించి వచ్చును. అగ్నిహోత్రములతో నా ఇంటిని దహింపచేయును.
క్రూరములైన పాపలేశములు ఇతర పాషండాశ్రయులు వారందరు. బుద్ధిపూర్వకముగా సత్యగృహమును ప్రవేశింతురు. అసత్య సేనాధ్యక్షులతో కపటముతో సాధింతురు. నా గృహమును పడవేతురు. పీడింపచేతురు. పాపము దురాత్ములను శాస్త్రములచే బాధింతురు. మహాబలుడు పాపియైన మన్మధుడు నన్ను కొట్టును. ఇతని నివాసములో నేను దహించబడితిని. ఇక శూన్యత్వమును పొందెదను. పతియే పాలకునిగా ఉండు స్త్రీరూపమైన కొత్త ఇంటిని చేరదలుచుకున్నాను. ఈ శివమంగళ కృకలుని ప్రియురాలు. ఆ సుకలాఖ్యమైన ఆ నా గృహమును పాపప్రయత్నములో ఇంద్రుడు మన్మధునితో కూడి బలవంతుడై వచ్చుచున్నాడు. కాముని కారణమువలన పూర్వము జరిగినదానిని తెలియడు ఈ ఇంద్రుడు. అహల్యా ప్రసంగముతో మేషవృషణుడాయెను. సతియైన అహల్యను మోసగించినందున ముని పౌరుషమును చూచి కాముని దోషముతో అక్కడున్న ఇంద్రుడు నశించెను. దారుణమైన శాపమును పొందెను. మహాదుఃఖమును అనుభవించెను. కృకలుని ప్రియురాలు పుణ్యచరిత అయిన సుకలను ఈ ఇంద్రుడు మన్మధునితో కలిసి నశింపచేయ సమకట్టినారు. ఈ కాముడు ఇంద్రునితో కలిసి రాకుండగా చేయుము. మహాజ్ఞానీ! ధర్మరాజా! నీవు బుద్దిమంతులలో శ్రేష్ఠుడవు.
ధర్మోవాచ - ధర్మరాజు పలికెను.
కాముని తేజోవిహీనుని చేతును. కామునికి మృతి సంభవింపచేతును. నేనొక ఉపాయమును కనుగొంటిని. నీవు కూడా చూడుము. గొప్ప బుద్ధి కుశలతకల ప్రాప్తజ్ఞ శకునరూపమును ధరించి, ఆకాశమున సంచరించుచు పవిత్రమై భర్త రాకను మాటలతో తెలుపును. శకున ప్రభావముతో భర్త రాకతో ఈ సకల స్వస్థచిత్తురాలై దుష్టులచే నశింపచేయబడదు. అట్లు ప్రజ్ఞను ధర్ముడు పం పెను. ఆ ప్రజ్ఞ సుకల ఇంటికి వెడలెను. గొప్ప శబ్దమును చేయుచు దేవుని చూచినట్లుగా భాసించెను. అంతట ఆ ప్రజ్ఞ ధూపదీపాదులతో పూజింపబడి సమ్మానింపబడెను. అంతట సుకల ఈ శకుని ఏమి చెప్పుచున్నది అని బ్రాహ్మణుని అడిగెను.
బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడు పలికెను.
సౌభాగ్యవతీ! నీ భర్త రాకను ఈ పక్షి పలుకుచున్నది. ఏడు దినముల మధ్యలో నీ భర్త రాగలడు. ఇంకొకటి కాదు. ఇట్లు శుభకరమైన మాటలను వినిన సుకల పరమానన్దము కలదాయెను. ధర్మజ్ఞుడు, గుణవంతుడైన భర్త వచ్చునట్లు పక్షివలన తెలిపెను.
ఇది శ్రీ పాద్మపురాణమున రెండవదైన భూమిఖండమున వేనోపాఖ్యానమున సుకలాచరితమున యాబది యార - అధ్యాయము.
